జాతీయ మహిళా కమిషన్ జనవరి 31, 1992న ''జాతీయ మహిళా కమిషన్
చట్టం - 1990'' ప్రకారం ఏర్పడింది. ఇది శాసనబద్ధమైన సంస్థ,
రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. రాజ్యాంగ పరంగా మహిళలకు కల్పించిన రక్షణల
అమలును పర్యవేక్షించడం దీని ప్రధాన లక్ష్యం. భారత ప్రభుత్వానికి మహిళా
సంక్షేమానికి చేయాల్సిన శాసనాలకు సంబంధించి సూచనలు ఇస్తుంది. జాతీయ మహిళా
కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
నిర్మాణం : జాతీయ మహిళా కమిషన్ బహుళ సభ్య సంఘం. ఇందులో
ఒక ఛైర్‌పర్సన్, ఐదుగురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు.
ఛైర్‌పర్సన్, సభ్యులకు మహిళా సమస్యలపై, న్యాయశాస్త్రంలోగాని, కార్మిక
సామర్థ్య నిర్వహణలోగాని, మహిళా సాధికారికతపై గాని పూర్తిగా అవగాహన ఉండాలి.
కమిషన్‌లో ఒకరు షెడ్యూల్డ్ కులాలకు, మరొకరు షెడ్యూల్డ్ తెగలకు చెందిన
వారు ఉండాలి. వీరందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుత జాతీయ
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ .
పదవీకాలం : ఛైర్‌పర్సన్, సభ్యుల పదవీకాలం మూడు
సంవత్సరాలు. వీరు పదవీకాలం కంటే ముందే రాజీనామా చేయదలిస్తే రాజీనామా
పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికే ఇవ్వాలి. ఒకవేళ వీరు విధుల పట్ల
నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు లేదా అసమర్థులుగా ఉన్నప్పుడు కేంద్ర
ప్రభుత్వం వీరిని తొలగిస్తుంది.
అధికారాలు - విధులు : జాతీయ మహిళా కమిషన్ చట్టం ఈ కమిషన్‌కు విస్తృతమైన అధికారాలు కల్పించింది. అవి...
ఎ. రాజ్యాంగపరంగా, చట్టపరంగా, ప్రభుత్వ పరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పరీక్షించి పర్యవేక్షించడం.
బి. మహిళల అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా వారికి సంబంధించిన రాజ్యాంగ రక్షణలు సమర్థవంతంగా అమలయ్యే విధంగా సూచనలు, సలహాలు ఇవ్వడం.
సి. రాజ్యాంగపరంగా మహిళా సంక్షేమ సంబంధిత అంశాలను సమీక్షించి, చేయవలసిన సంవరణను సూచించడం.
డి. మహిళల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, మహిళల అభివృద్ధికి సంబంధించిన
చట్టాలు అమలుకాని సందర్భంలో మహిళా సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ఈ
కమిషన్ తనంత తానుగా (సుమోటో) జోక్యం చేసుకుని కేసును స్వీకరించి
పరిష్కరిస్తుంది.
ఇ. మహిళల సాంఘిక ఆర్థిక అభివృద్ధికి చేయాల్సిన ప్రణాళికలకు సంబంధించి సలహాలిస్తుంది.
ఎఫ్. పరివారిక్ మహిళా లోక్ అదాలత్‌ల ద్వారా బాల్య వివాహాల నిరోధానికి
కృషి చేయడం. వరకట్న నిషేధ చట్టం- 1961ను సమీక్షించి వివాహ, ఆస్తి తగాదాల
కేసులను పరిష్కరించడం. సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించి మహిళా సమస్యల
పట్ల సమాజంలో అవగాహన కల్పించడం.
జి. జైళ్లను లేదా ఇతర నిర్బంధ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ నిర్బంధంలో ఉన్న
వారికి కనీస సౌకర్యాలు కల్పన గురించి అధికారులకు అవసరమైన మార్గదర్శకాలను
ఇస్తుంది.
జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్లు
- 1. జయంతీ పట్నాయక్ - 1992 - 1995
- 2. మోహినీగిరి - 1995 - 1998
- 3. విభాపార్థసారథి - 1998 - 2002
- 4. పూర్ణిమా అద్వానీ - 2002 - 2005
- 5. గిరిజా వ్యాస్ - 2005 - 2011
- 6. మమతా శర్మ - 2011 - 2014
- 7. లలితా కుమార మంగళం - 2014 - 2017
- 8. ప్రస్తుతం ఆగష్టు 7,2018 నుండి రేఖా శర్మ కొనసాగుతున్నారు .
No comments:
Post a Comment