జీవరాశుల వర్గీకరణ

 

           వర్గీకరణ విధానాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది ఎ.పి.డి. కండోల్. జీవరాశులను వాటి మధ్య ఉన్న పోలికలు, తేడాలను బట్టి సమూహాలుగా చేయడాన్నే 'వర్గీకరణం' అంటారు. దీని గురించి తెలిపే శాస్త్రమే 'వర్గీకరణ శాస్త్రం'. వర్గీకరణ విధానం చెట్టును పోలి ఉంటుంది (కాండం - శాఖలు - కొమ్మలు - చిన్న కొమ్మలు - ఆకులు). ఇందులో మూల ప్రమాణం 'జాతి'. దీన్ని చెట్టులోని 'ఆకులతో'' పోల్చవచ్చు. వర్గీకరణ జాతితో మొదలవుతుంది.
 

జీవరాశుల వర్గీకరణ
             జీవుల వర్గీకరణతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. జీవులను సరళంగా, సులభంగా అధ్యయనం చేయడానికి, ఒక జీవిని సులభంగా గుర్తించడానికి ఇది తోడ్పడుతుంది. వివిధ జీవుల మధ్య సంబంధాలను, తేడాలను తెలుసుకోవడానికి, జీవుల పుట్టుకను, పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడానికి వర్గీకరణ ఉపయోగపడుతుంది.
 

వర్గీకరణంలోని ప్రమాణాలు
* జాతితో మొదలైన వర్గీకరణ ఆరోహణ పద్ధతిలో ఉంటుంది.
* రాజ్యంతో మొదలైన వర్గీకరణ అవరోహణ పద్ధతిలో ఉంటుంది.
* వర్గీకరణలో పై నుంచి కిందికి జీవుల మధ్య పోలికలు పెరుగుతాయి.
* వర్గీకరణలో కింది నుంచి పైకి వెళ్లేకొద్దీ జీవుల మధ్య పోలికలు తగ్గుతాయి.
* వర్గీకరణలో అతి చిన్న ప్రమాణం - జాతి.
* వర్గీకరణలో అతిపెద్ద ప్రమాణం - రాజ్యం.
* జీవరాశులను గుర్తించి వర్గీకరించడానికి మొదటిసారిగా ప్రయత్నించిన వ్యక్తి 'అరిస్టాటిల్'. అయితే ఈ వర్గీకరణకు అరిస్టాటిల్ ఉపయోగించిన విధానం సరైంది కాదు.
* 'చరకుడు' అనే భారతీయ వైద్యుడు రెండు వందల రకాల వృక్షాలను, జంతువులను వర్ణించాడు.
* వర్గీకరణలో ప్రాథమిక పరిమాణానికి 'జాతి' అనే పదాన్ని మొదటిసారిగా 'జాన్ రే' ఉపయోగించాడు.
* 'కెరోలస్ లిన్నెయస్' (స్వీడన్) జాతిని రెండు పేర్లతో పిలిచే ప్రస్తుత విధానాన్ని ఏర్పరిచారు. దీన్నే 'ద్వినామీకరణం' అంటారు.
* వర్గీకరణం మీద లిన్నెయస్ రెండు గ్రంథాలు రాశాడు.
1) వృక్షాల గురించి - స్పీషీస్ ప్లాంటారమ్
2) జంతువుల గురించి - సిస్టమా నాచురె
* ఈ ద్వినామీకరణ విధానానికి 'జాతి' ప్రాథమిక పరిమాణం. జాతి అంటే 'దగ్గరి పోలికలు కలిగి ఒకదాంతో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకునే జీవరాశుల సమూహం'.
* ద్వినామీకరణ విధానంలో ప్రతి జాతికి రెండు పదాలుంటాయి. లాటిన్ భాషలో ఉంటాయి. మొదటి పేరు ప్రజాతికి, రెండో పేరు జాతికి చెందింది. ప్రజాతి పేరు నామవాచక రూపంలో ఉండి, పెద్ద అక్షరంతో మొదలవుతుంది. జాతి నామం విశేషణ పదంగా ఉండి, చిన్న అక్షరంతో మొదలవుతుంది.
 

* శాస్త్రీయ నామం: మొదట ప్రజాతి పేరు, తర్వాత జాతి పేరు, చివరగా దాన్ని కనిపెట్టిన శాస్త్రజ్ఞుడి పేరు రాస్తారు. దీన్నే 'శాస్త్రీయ నామం' అంటారు.
ఉదా: హోమో     సెపియన్స్  లిన్నెయస్ - మానవుడి శాస్త్రీయ నామం
          ప్రజాతి         జాతి                     
* శాస్త్రీయ నామాలను ఇటాలిక్స్ రూపంలో గ్రీకు లేదా లాటిన్ భాషల్లో రాస్తారు. ఇందులో ప్రజాతి పేరు తిరిగి వాడరు, కానీ జాతి పేరు తిరిగి వేరొక దానికి ఉపయోగించవచ్చు.
ఉదా: టామరిండస్ ఇండికా; మాంజిఫెరా ఇండికా, అజాడిరక్టా ఇండికా.
* ద్వినామీకరణ విధానాన్ని మొదటిసారిగా 'గాస్పర్డ్ బాహీన్' ప్రవేశపెట్టారు. అయితే ఈ విధానాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత 'కెరోలస్ లిన్నెయస్‌'కు దక్కుతుంది. అందుకే లిన్నెయస్‌ను ద్వినామీకరణ సిద్ధాంత పితామహుడిగా పిలుస్తారు.
 

జీవుల వర్గీకరణ
రాబర్ట్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త కణ సంక్లిష్టత, శరీర నిర్మాణం, పోషణ అనే అంశాల ఆధారంగా జీవులన్నింటిని 5 రాజ్యాలుగా వర్గీకరించారు.
1) మొనీరా 2) ప్రొటిస్టా 3) ఫంజి/ శిలీంద్రాలు 4) ప్లాంటె/ మెటాఫైటా 5) అనిమేలియా/ మెటాజోవా.

రాజ్యం - మొనీరా
* ఈ రాజ్యానికి చెందిన జీవులు అతి పురాతనమైనవి.
* ఈ వర్గ జీవులన్నీ కేంద్రక పూర్వ జీవులు.
* ఇవన్నీ కంటికి కనిపించని ఏక కణజీవులు.
* ఈ వర్గజీవులు అన్ని రకాల వాతావరణాల్లో నివసిస్తాయి. కొన్ని ఆమ్ల మాధ్యమంలో, కొన్ని 80ºC ఉష్ణోగ్రతలో కూడా నివసించగలవు.
* కొన్ని జీవులు స్వయంపోషణను, మరికొన్ని పరాన్న జీవనం, సహజీవనాన్ని ప్రదర్శిస్తాయి.
ఉదా: బ్యాక్టీరియాలు, నీలి ఆకుపచ్చ శైవలాలు (సయనో బ్యాక్టీరియా). భూమి మీద ఉద్భవించిన మొదటి జీవులు - 'నీలి ఆకుపచ్చ శైవలాలు'.
 

రాజ్యం - ప్రొటిస్టా
* ఈ రాజ్యానికి చెందిన జీవులు 'స్పష్టమైన కణ నిర్మాణం కలిగిన, కంటికి కనిపించని ఏకకణ జీవులు'.
* కొన్ని ప్రొటిస్టా జీవుల్లో హరితరేణువులు (క్లోరోప్లాస్టులు) ఉంటాయి. అవి స్వయంపోషకాలుగా జీవిస్తాయి. హరితరేణువులు లేని జీవులు పరపోషణ (ఇతర ప్రొటిస్టా లేదా మొనీరాను ఆహారంగా తీసుకుంటాయి) విధానాన్ని ప్రదర్శిస్తాయి.
* ఈ రాజ్యంలో రెండు వర్గాలు ఉన్నాయి. అవి: 1) క్లోరోఫైటా 2) ప్రోటోజోవా.

వర్గం - క్లోరోఫైటా: ఈ వర్గ జీవుల్లో హరితరేణువులు ఉంటాయి. కాబట్టి ఇవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి.
ఉదా: స్పైరోగైరా, డయాటమ్స్.
* క్లోరోఫైటా జీవుల్లో 'డయాటమ్స్' అతి ముఖ్యమైనవి.
* డయాటమ్స్ జలాశయాల్లోను, సముద్రాల్లోను నివసించే అనేక జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి. అందుకే వీటిని 'సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్లు' అంటారు.
 

వర్గం - ప్రోటోజోవా:
* ఈ వర్గ జీవులు ఏకకణ జీవులు. క్లోరోప్లాస్టులు లేకపోవడంతో ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి.
ఉదా: అమీబా, పారమీషియం, ఎంటమీబా, ప్లాస్మోడియం మొదలైనవి.
* కొన్ని ప్రొటిస్టాల్లో క్లోరోఫైటా, ప్రోటోజోవా రెండింటి లక్షణాలు ఉంటాయి.
ఉదా: యూగ్లీనా
 

రాజ్యం - ఫంజి
* ఈ రాజ్య జీవులు అతి ప్రాథమిక దశలో ఉన్న బహుకణ జీవులు. ఇవి అతి తక్కువ నిర్మాణ ప్రత్యేకత ఉన్న దారపు జీవులు.
* ఈ రాజ్యంలో 'మోల్డులు, మిల్‌డ్యూలు, టోడ్‌స్టూల్స్, స్లైమ్ మోల్డ్స్, రస్టులు, స్మట్స్, పుట్టగొడుగులు' అనే దారాల లాంటి జీవులున్నాయి.
* ఈ రాజ్య జీవులు 'పూతికాహార పోషణ'ను ప్రదర్శిస్తాయి. అంటే చనిపోయిన జంతు, వృక్ష కళేబరాల్లో జీవరసాయన పదార్థాలను కరిగించే రసాయనాలను విడుదల చేసి, వాటిలో కరిగిన పదార్థాలను ఆహారంగా తీసుకోవడం (నిర్జీవ పదార్థాల నుంచి కరిగే సేంద్రియ పదార్థాల శోషణ).
* పై ప్రక్రియ వల్ల వీటిని భూమిపై ఉండే జీవసంబంధిత వ్యర్థాలను శుభ్రపరిచే ముఖ్య జీవులుగా పేర్కొంటారు. అందుకే వీటిని భూమిని శుభ్రపరిచే తోటీలు అంటారు.
* కొన్ని శిలీంద్రాలు మొక్కల్లో వ్యాధులకు కారణమై, అపార నష్టం కలిగిస్తాయి.
ఉదా: చెరకు - ఎర్రకుళ్లు తెగులు; గోధుమ - కుంకుమ తెగులు మొదలైనవి.
* శిలీంద్రాలన్నీ 'సిద్ధబీజాలను' ఉత్పత్తి చేస్తాయి. ఇవి అనుకూల పరిస్థితుల్లో పెరిగి అనేక పోగులున్న 'మైసీలియం' అనే దేహాన్ని ఏర్పరుస్తాయి.
ఉదా: రైజోపస్, మ్యూకార్.
 

రాజ్యం - ప్లాంటె
* ఈ రాజ్యాన్ని 'మెటాఫైటా' అని కూడా అంటారు. బహుకణజీవులైన వృక్షాలన్నీ ఈ రాజ్యానికి చెందుతాయి. (సుమారు 3 లక్షల జాతుల నుంచి
5,50,000 జాతుల వరకు ఉన్నాయి.)  

* ప్లాంటె రాజ్యాన్ని రెండు వర్గాలుగా విభజించారు. 1) బ్రయోఫైటా (మాస్‌లు, లివర్‌వర్ట్స్), 2) ట్రాఖియోఫైటా (టెరిడోఫైటా, వివృత, ఆవృత బీజాలు).

* బ్రయోఫైటా వర్గ మొక్కల్లో ప్రసరణ స్తంభం అభివృద్ధి చెంది ఉండదు. ట్రాఖియోఫైటా (ట్రాఖియా అంటే 'ప్రసరణ స్తంభం') మొక్కల్లో ప్రసరణ స్తంభం బాగా అభివృద్ధి చెంది ఉంటుంది.
* ట్రాఖియోఫైటా వర్గంలో 'ఫెర్న్‌లు/ టెరిడోఫైట్‌లు' ప్రాథమిక జీవులు. వీటి తర్వాత జిమ్నోస్పెర్మ్‌లు (వివృత బీజాలు, ఉదా: సైకస్), ఆంజియోస్పెర్మ్‌లు (ఆవృత బీజాలు, ఉదా: మామిడి, వరి) ఉన్నాయి. భూమిపై 'ప్రసరణ స్తంభం/ ట్రాఖియా' ఉన్న మొదటి జీవులు - టెరిడోఫైట్‌లు.
 

రాజ్యం - అనిమేలియా
* ఈ రాజ్యాన్ని 'మెటోజోవా' అని కూడా అంటారు. బహుకణ జీవులైన జంతువులన్నీ ఈ రాజ్యంలోనే ఉన్నాయి (సుమారు 1 మిలియన్‌కు పైగా జీవులు).
* వీటిలో పత్రపరిహతం ఉండకపోవడంతో ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి (పరపోషణ).
¤ ఈ రాజ్యానికి చెందిన జీవులు ఇతర రాజ్యాల జీవుల కంటే అత్యధిక వైవిధ్యం ప్రదర్శిస్తాయి. ఇవి కండర కణాల వల్ల చలిస్తాయి (స్పంజికలు చలనం చూపవు).
* ఈ జీవుల్లో వాతావరణంలోని మార్పులను గ్రహించడానికి నాడీ కణాలు ఉంటాయి. ఈ రాజ్యంలో 10 వర్గాలు ఉన్నాయి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...