కేంద్రంలో పార్లమెంట్ శాసనపరమైన అంగం. వెస్ట్ మినిస్టర్ తరహా ప్రభుత్వంగా పేర్కొనబడిన పార్లమెంటరీ వ్యవస్థను స్వీకరించిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కీలక స్థానాన్ని పొందింది. ఈ పార్లమెంట్ నిర్మాణం, కాలపరిమితి, అధికారులు, పద్ధతులు, ప్రత్యేక అధికారాలు, విధుల గురించి రాజ్యాంగంలోని 5వ భాగంలో 79 నుండి 122 ఆర్టికల్స్ వివరిస్తాయి.
పార్లమెంట్ నిర్మాణం
రాజ్యాంగం ప్రకారం మన పార్లమెంటులో 3 భాగాలు ఉన్నాయి. అవి రాష్ట్రపతి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (రాష్ట్రాల సభ) మరియు హౌస్ ఆఫ్ పీపుల్ (లోక్‌సభ).1954లో వీటికి హిందీ పేర్లు రాజ్యసభ, లోక్ సభ పెట్టారు. రాజ్యసభ ఎగువ సభ (రెండవ సభ లేదా పెద్దల సభ). లోక్ సభ దిగువ సభ (మొదటి సభ లేదా ప్రజల సభ).
రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజ్యాసభ ప్రాతినిథ్యం వహిస్తుంది. దేశప్రజలకు లోకసభ ప్రాతినిధ్యం వహిస్తుంది.
రాష్ట్రపతి పార్లమెంట్ లో ఏ సభలోనూ సభ్యుడు కాడు. ఏ సమావేశాల్లోనూ పాల్గొనడు. అయినా ఆయన పార్లమెంట్ లో భాగం. ఎందుకంటే పార్లమెంటులో ఆమోదించిన బిల్లు అతడు ఆమోదించకపోతే చట్టం కాలేదు. అలాగే పార్లమెంట్ కి సంబంధించిన కొన్ని విధులు కూడా ఆయనకు ఉన్నాయి. రెండు సభలను సమావేశపరచడం, సమాపనం చేయడం, లోక్‌సభను రద్దు చేయడం, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం మరియు పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్సులు జారీ చేయడం లాంటివి.
పార్లమెంటు విషయంలో మన రాజ్యంగ నిర్మాతలు అమెరికా పద్ధతి కాకుండా బ్రిటిష్ పద్ధతిని ఆమోదించారు. బ్రిటన్‌లో పార్లమెంట్ లో చక్రవర్తి (రాజు లేక రాణి), ప్రభువుల సభ (ఎగువ సభ) మరియు సామాన్యుల సభ (దిగువ సభ) ఉంటాయి. అమెరికాలో అధ్యక్షుడు శాసనసభలో భాగం కాదు. అమెరికన్ శాసనసభను కాంగ్రెస్ అంటారు. ఇందులో రెండు సభలు ఉంటాయి. అవి సెనేట్ (ఎగువ సభ), ప్రతినిధుల సభ (దిగువ సభ).
శాసనసభ మరియు కార్య నిర్వాహక వర్గం మధ్య పరస్పర సంబంధాలకు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రాధాన్యం నిస్తుంది. అందుకే మన పార్లమెంట్ లో రాష్ట్రపతి మరియు బ్రిటిష్ పార్లమెంట్ లో చక్రవర్తి ఉంటారు. కానీ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కాంగ్రెస్ లో అమెరికా అధ్యక్షుడు భాగం కాదు. ఈ వ్యవస్థలో అధికార వేర్పాటు సిద్ధాంతం ఉన్నది.
రాజ్యసభ నిర్మాణం
రాజ్యసభలో మొత్తం సభ్యుల గరిష్ట సంఖ్య 250. ఇందులో 238 మంది ప్రతినిధులు రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరు పరోక్షంగా ఎన్నుకోబడతారు. 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. 229 మంది సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తుండగా నలుగురు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తారు. రాజ్యాంగంలోని 4వ షెడ్యూల్ లో రాజ్యసభలో రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల సంఖ్యను పొందుపరచడమైనది.
రాష్ట్రాల ప్రాతినిథ్యం: రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించే రాజ్యసభ సభ్యులను రాష్ట్ర విధానసభలలోని సభ్యులు ఎన్నుకుంటారు. దామాషా పద్ధతిలో సింగిల్ ట్రాన్స్ ఫరబుల్ ఓటు పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది. రాష్ట్రంలోని జనాభా ప్రాతిపదికపై రాజ్యసభ సభ్యుల సంఖ్య నిర్ణయమవుతుంది. కనుక రాష్ట్రాల ప్రాతినిథ్యంలో తేడాలొస్తాయి. ఉత్తరప్రదేశ్ నుండి 31 మంది సభ్యులు ఉండగా త్రిపుర నుండి ఒకే సభ్యుడు ఉంటారు. అమెరికాలో మాత్రం జనాభాతో పని లేకుండా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిథ్యం ఉంటుంది. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రం నుండి ఇద్దరు సభ్యులు సెనేట్ లో ఉంటారు. కనుక సెనేట్ లో సభ్యుల సంఖ్య 100.
కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాతినిథ్యం: ప్రత్యేకంగా నిర్దేశించబడిన ఒక ఎన్నికల గణం ద్వారా పరోక్షంగా కేంద్ర పాలిత ప్రాంతాల నుండి రాజ్యసభకు సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నిక కూడా దామాషా పద్ధతిలో సింగిల్ ట్రాన్స్ ఫరబుల్ ఓటు పద్ధతిలో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 9 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుండే (ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూకాశ్మీర్) రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మిగిలిన 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జనాభా చాలా తక్కువ కావడం వలన ఆ ప్రాంతాల నుండి రాజ్యసభలో సభ్యులు లేరు.
నామినేటెడ్ సభ్యులు: కళలు, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం మరియు సామాజిక సేవలో నిష్ణాతులైన లేదా అనుభవం ఉన్న రాష్ట్రపతి రాజ్యసభకు సభ్యులుగా నామినేట్ చేస్తారు. ఎన్నికల్లేకుండా నిష్ణాతులకు రాజ్యసభలో స్థానం కలిగించడం దీని ఉద్దేశం. అమెరికా సెనేట్ లో నామినేటెడ్ సభ్యులు ఉండరు.
లోక్‌సభ నిర్మాణం
లోక్ సభలో గరిష్ట సభ్యుల సంఖ్య 552. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుండి ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రస్తుతం 104వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసేశారు. ప్రస్తుతం లోక్‌సభలో 545 మంది సభ్యులు ఉన్నారు.
రాష్ట్రాల ప్రాతినిథ్యం: లోక్‌సభలో రాష్ట్రాల నుండి ఎన్నికయ్యే సభ్యులను ప్రజలు తమ నియోజక వర్గాల నుండి ఎన్నుకుంటారు. సార్వజనీన వయోజన ఓటింగ్ పద్ధతి ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. రాజ్యాంగ సూత్రాల ద్వారా కానీ లేదా ఏదైనా శాసనం ద్వారా కానీ అనర్హతకు గురికాని 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరునికి ఓటు వేసే హక్కు ఉంది. 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుండి 18 సంవ్సరాలకు తగ్గించడం జరిగింది.
కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాతినిథ్యం: కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధుల ఎంపిక విధానాన్ని పార్లమెంట్ ప్రత్యేక శాసనం ద్వారా నిర్ణయిస్తుందని రాజ్యాంగం పేర్కొన్నది. కాబట్టి యూనియన్ టెరిటరీస్ (డైరెక్ట్ ఎలక్షన్ టు ద హౌస్ ఆఫ్ ది పీపుల్) చట్టం 1965 ఆమోదించింది. దీని ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాల నుండి లోక్‌సభ సభ్యులు ఎన్నికవుతారు.
నామినేటెడ్ సభ్యులు: లోక్ సభలో సరిపోనంత ప్రాతినిధ్యం ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి లేదని రాష్ట్రపతి భావించి నప్పుడు, ఆయన ఈ కమ్యూనిటీ నుండి ఇద్దరు సభ్యులను నామినేట్ చేయవచ్చును. మొట్టమొదట 1960 వరకే దీనిని పొందు పరచడం జరిగింది. కానీ 96వ రాజజ్యాంగ సవరణ చట్టం, 2009 ద్వారా దీనిని 2020 వరకు పొడగించడం జరిగింది. తాజాగా 104వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించారు.
లోక్‌సభకు ఎన్నికల విధానం
భౌగోళిక నియోజకవర్గాలు
లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతి రాష్ట్రాన్ని భౌగోళిక నియోజకవర్గాలు విభజిస్తారు. ఈ విషయంలో రాజ్యాంగం రెండు అంశాలను ప్రస్తావిస్తుంది.
- ప్రతి రాష్ట్రం నుండి లోక్‌సభకు ఎంతమంది ఎన్నిక కావాలో ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. జనాభాకు, లోక్ సభ సభ్యుల సంఖ్యకు గల నిష్పత్తి సాధ్యమైనంత వరకు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండాలి. ఒక రాష్ట్ర జనాభా 6 మిలియన్ల కన్నా తక్కువ ఉంటే ఈ సూత్రం వర్తించదు.
- ప్రతి రాష్ట్రాన్ని భౌగోళిక నియోజక వర్గాలుగా విభజిస్తారు. భౌగోళిక నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గ జనాభాకి ఉండే నిష్పత్తి కూడా రాష్ట్రం మొత్తానికి ఒకేలా ఉండాలి.
అంటే రాజ్యాంగం రెండు విషయాల్లో ఒకే పద్ధతిని కోరుకుంటోంది. అవి రాష్ట్రాల మధ్య మరియు ఒకే రాష్ట్రంలో వివిధ నియోజక వర్గాల మధ్య
ప్రతి జనాభా లెక్కల సేకరణ తర్వాత సర్దుబాటు
ప్రతి జనాభా లెక్కల తర్వాత రాష్ట్రాలకు లోక్ సభలో సీట్ల కేటాయింపు మరియు భౌగోళిక నియోజకవర్గాలుగా ప్రతి రాష్ట్రం విభజన సర్దుబాటు జరగాలి. పార్లమెంట్‌కు ఈ విషయంలో అధికారం ఉంది. దీని కోసం పార్లమెంట్ 1952, 1962, 1972 మరియు 2002లో డిలిమిటేషన్ కమీషన్లను నియమించింది.
42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో లోక్ సభ స్థానాల సంఖ్యను స్థిరీకరించారు. దీని ప్రకారం 2000 సంవత్సరం వరకు లోక్ సభ స్థానాల సంఖ్యను 1971 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించడం జరిగింది. 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా ఈ నిషేధాన్ని మరొక 25 సంవత్సరాల పాటు 2026 వరకు పొడిగించారు.
84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ప్రకారం ప్రభుత్వం 1991 జనాభా లెక్కల ప్రాతిపదికపై రాష్ట్రాలలో భౌగోళిక (ప్రాదేశిక) నియోజకవర్గాలను హేతుబద్ధంగా తిరిగి సర్దుబాటు చేయాలి. కానీ 87వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ఈ విషయంలో కొత్త సవరణ తెచ్చింది. 1991 జనాభా పరంగా కాకుండా 2001లో ఉన్న జనాభా లెక్కల మేరకు ఈ ఫుసర్ విభజన (మళ్లీ సర్దుబాటు) జరగాలి అని పేర్కొన్నది. అయితే ప్రతి రాష్ట్రంలో లోక్‌సభకు కేటాయించిన సీట్లలో మార్పు ఉండొద్దు.
షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకి సీట్ల రిజర్వేషన్లు
మతపరమైన ప్రాతినిధ్యాన్ని రాజ్యాంగం నిషేధించినా ఎస్సీ మరియు ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన పై సీట్ల రిజర్వేషన్లు పొందుపరిచింది.
మొదట్లో రిజర్వేషన్లను పది సంవత్సరాల (1960) వరకు పొందుపరిచారు. తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు వాటిని పెంచడం జరిగింది. 95వ రాజ్యాంగ సవరణ చట్టం (2009) ప్రకారం వీటిని 2020 వరకు పొడిగించగా తాజాగా 104వ సవరణ ద్వారా 2030 వరకు పొడిగించారు.
షెడ్యూల్డ్ కులాలకి మరియు షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లు కేటాయించినా వారిని నియోజకవర్గాల్లో ఓటర్లందరూ ఎన్నుకుంటారు. ప్రత్యేకమైన ఓటర్లు ఉండరు. ఎస్సీ మరియు ఎస్టీలకు చెందిన సభ్యుడు జనరల్ సీటుకి పోటీ చేయడంలో నిషేధం లేదు.
84వ రాజ్యాంగ సవరణ చట్టం(2001) ప్రకారం 1991 జనాభా లెక్కల ప్రకారం రిజర్వుడ్ సీట్లని హేతుబద్ధంగా తిరిగి సర్దుబాటు చేయాలి. కానీ 87వ రాజ్యాంగ సవరణ చట్టం (2003), 1991ని 2001గా మార్చింది.
నైష్పత్తిక ప్రాతినిధ్యాన్ని ఆమోదించలేదు
నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతిని రాజ్యసభ ఎన్నికల్లో రాజ్యాంగం పొందుపరిచినా లోక్ సభ ఎన్నికల్లో దాన్ని ఆమోదించలేదు. దీనికి బదులుగా లోక్ సభ ఎన్నికలలో భోగోళిక ప్రాతినిధ్య పద్ధతిని ఆమోదించారు.
భౌగోళిక ప్రాతినిథ్య పద్ధతి ప్రకారం ప్రతి శాసనసభ్యుడు ఒక ప్రాదేశిక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. దీన్ని నియోజకవర్గం అంటారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక సభ్యుడు ఎన్నికవుతాడు. కనుక దీన్ని ఏకసభ్య నియోజకవర్గం అంటారు. ఈ పద్ధతిలో మెజారిటీ ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించడం జరుగుతుంది. ఈ సాధారణ మెజారిటీ పద్ధతిలో ఓటర్లందరికీ ప్రాతినిధ్యం ఉండదు. అనగా మైనారిటీలకు (చిన్న గ్రూపులకు) సరైన ప్రాతినిధ్యం ఉండదు.
నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా భౌగోళిక ప్రాతినిధ్య పద్ధతి లోపాలని తొలగించవచ్చును. ఈ పద్ధతిలో ప్రజలందరికీ వారి వారి సంఖ్యను బట్టి ప్రాతినిధ్యం లభిస్తుంది. జనాభాలో అతి చిన్న వర్గానికి కూడా ప్రాతినిధ్యం కలుగుతుంది.
ప్రాతినిథ్య పద్ధతిలో రెండు రకాలు ఉంటాయి. అవి ఏక బదిలీ ఓటు పద్ధతి మరియు జాబితా పద్ధతి. రాజ్యసభ మరియు రాష్ట్ర విధాన మండలి సభ్యుల ఎన్నికలలో మరియు రాష్ట్రపతి , ఉప రాష్ట్రపతి ఎన్నికలలో మొదటి పద్ధతి అమలులో ఉంది.
రాజ్యాంగ నిర్మాణసభలో కొంతమంది సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని లోక్ సభ ఎన్నికలకు సిఫార్సు చేసినా రాజ్యాంగంలో దీన్ని పొందుపరచక పోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. అవి:
- దేశంలో అక్షరాస్యత తక్కువగా ఉండటం వల్ల క్లిష్టమైన ఈ పద్ధతిని ఓటర్లు అర్ధం చేసుకోలేని అవకాశం ఉండటం.
- పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతికి అనుగుణంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉండవచ్చు. ఈ వ్యవస్థలో పెక్కు రాజకీయ పార్టీలు ఏర్పడి అస్థిర ప్రభుత్వాలకి ఈ పద్ధతి ఎక్కువగా దోహదం చేయవచ్చును.
ఈ పద్ధతి ద్వారా కొన్ని లోపాలూ ఉన్నాయి.
- ఎంతో ఖర్చుతో కూడుకున్నది.
- ఉప ఎన్నికలు నిర్వహించటానికి అవకాశం ఉండదు. అర్హతలు
- ఓటర్లకు, ప్రతినిధులకు మధ్య చక్కటి అనుబంధాన్ని ఇది దూరం చేస్తుంది.
- అల్ప సంఖ్యాక భావనలకు మరియు గ్రూపు ప్రయోజనాలని ఇది దోహదం చేస్తుంది.
- ఓటర్ల కన్నా పార్టీ వ్యవస్థకి ప్రాధాన్యతనిస్తుంది.
No comments:
Post a Comment