పార్లమెంట్ లో ప్రతి సభకూ ఒక అధ్యక్షుడు ఉంటారు. లోక్ సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఉంటారు. లోక్ సభకు ఒక చైర్ పర్సన్ల ప్యానల్ మరియు రాజ్యసభకు వైస్ చైర్ పర్సన్ల ప్యానల్ కూడా ఉంటాయి.
లోక్ సభ స్పీకర్
ఎన్నిక, పదవీకాలం
లోక్ సభ ఏర్పాటైన వెంటనే వీలైనంత త్వరగా లోక్ సభ సభ్యులు తమలో ఒకరిని సభాపతిగా (స్పీకర్ గా) ఎన్నుకుంటారు. స్పీకర్ పదవి ఖాళీ అయితే సభలోని సభ్యులు ఇంకొకరిని ఎన్నుకుంటారు. స్పీకర్ ఎన్నిక తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు.
సాధారణంగా, లోక్ సభ ఉన్నంత కాలం స్పీకర్ పదవిలో ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల పదవి నుండి తొలగవలసి వస్తుంది. అవేంటంటే..
- అతడు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయినప్పుడు,
- ఉప సభాపతికి (డిప్యూటీ స్పీకర్ కి) లిఖిత పూర్వకంగా తన రాజీనామా పత్రం ఇచ్చినప్పుడు
- లోక్ సభలోని మెజారిటీ సభ్యులు అతడిని ఒక తీర్మానం ద్వారా తొలగించినప్పుడు. ఈ తీర్మానం చేయాలంటే 14 రోజుల ముందుగా స్పీకర్ కు నోటీసు ఇవ్వాలి.
సభలో తనని తొలగించే తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు, స్పీకర్ సభలో ఉన్నా సభను నిర్వహించొద్దు. అయితే అతడు సభలో మాట్లాడొచ్చు. తీర్మానంపై జరుగు చర్చలో పాల్గొనవచ్చు. తొలుత ఓటింగ్ జరిగినప్పుడు మొదటి దఫా మాత్రమే ఓటు వేయొచ్చు. సమాన సంఖ్యలో ఓట్లు వస్తే ఓటేసే హక్కు ఉండదు.
లోక్ సభ రద్దయినా స్పీకర్ పదవిలో ఉంటారు. తిరిగి కొత్త లోక్ సభ ఏర్పడి అది తొలిసారి సమావేశమయ్యే వరకు స్పీకర్ తన పదవిలో కొనసాగవచ్చు.
పాత్ర, అధికారాలు మరియు విధులు
స్పీకర్ లోక్ సభకు అధినేతగా, ప్రతినిధిగా ఉంటారు. సభ్యుల అధికారాలు, హక్కులకు, సభలోని కమిటీలకు సంరక్షకుడిగా ఉంటాడు. పార్లమెంటరీ వ్యవహారాలలో అతని నిర్ణయం అంతిమం. ఈ విధంగా అతడు సభలో సభాధ్యక్షుడి కన్నా (ప్రధాని) ఎక్కువే. ఈ హోదాలో అతినికి విశేషమైన, ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. సభలో అత్యున్నత హోదాను, గౌరవాన్ని, అధికారాన్ని అతడు కలిగి ఉంటారు.
లోక్ సభ స్పీకర్ తన అధికారాలను, విధులను మూడు మూలాల నుండి గ్రహిస్తారు. అవి భారత రాజ్యాంగం, లోక్ సభ కార్యక్రమాల నిర్వహణలో వివిధ పద్ధతులు, పార్లమెంటరీ సాంప్రదాయాలు. మొత్తం మీద అతనికి ఈ క్రింది అధికారాలు, విధులు ఉంటాయి.
- సభ క్రమశిక్షణను, హెూదాను కాపాడతాడు. ఇది అతని ప్రధాన బాధ్యత. దీని కోసం అతనికి పూర్తి అధికారాలు ఉన్నాయి.
- భారత రాజ్యాంగం, లోక్ సభ కార్యకలాపాల నిర్వహణ, నిబంధనల పద్ధతులు, సభలో పార్లమెంటరీ ప్రమాణాలకు అర్థ వివరణ ఇచ్చే అధికారం ఉంది.
- సభను వాయిదా వేయగలడు. కోరం లేకపోతే సమావేశాన్ని సస్పెండ్ చేయగలడు. సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం పదవ వంతు సభ్యులు హాజరైతే దాన్ని కోరం అంటారు. సమావేశాన్ని నిర్వహించడానికి ఈ కోరం అవసరం.
- సభలో మొదటిసారి అతడు ఓటు వేయడు. టై ఏర్పడ్డప్పుడు తన కాస్టింగ్ ఓటు వేయొచ్చు. సభలో సంక్షోభాన్ని నివారించడమే దీని ధ్యేయం.
- పార్లమెంట్ లో ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఏదైనా బిల్లు విషయంలో రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు రాష్ట్రపతి ఇటువంటి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పరుస్తాడు.
- సభా నాయకుడి విజ్ఞాపనపై స్పీకర్ రహస్య సభా సమావేశాన్ని నిర్వహించవచ్చు. సభ రహస్య సమావేశంలో ఉన్నప్పుడు స్పీకర్ అనుమతి లేకుండా చాంబర్లో కాని, లాబీలో కాని, గ్యాలరీస్ కాని ఎవరూ ఉండొదు.
- ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా నిర్ణయించడంలో స్పీకర్ నిర్ణయమే అంతిమం. ఆర్థిక బిల్లుని రాజ్యసభకు సిఫార్సు కోసం పంపించినప్పుడు, రాష్ట్రపతి ఆమోదానికి దాన్ని సమర్పించినప్పుడు స్పీకర్‌కు ఆర్థిక బిల్లు అని నిర్దేశించి సంతకం చేస్తారు.
- 10వ షెడ్యూల్డ్ అంశాలని బట్టి ఎవరైనా లోక్‌సభ సభ్యడు అనర్హతకు గురి అయినట్టయితే ఆ అనర్హత వివాదాలను స్పీకర్ నిర్ణయిస్తారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్ష కిందకి వస్తుందని 1992లో సుప్రీంకోర్టు ప్రకటించింది.
- ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ యొక్క ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ కి ఇతను ఎక్స్ ఆఫీషియో చైర్మన్‌గా ఉంటారు. దేశంలోని శాసన సంస్థల సభా అధ్యక్షుల అధికారుల సమావేశానికి కూడా ఇతను ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటాడు.
- లోక్ సభలోని అన్ని పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్లను ఇతనే నియమిస్తారు. వారి విధుల నిర్వహణను పర్యవేక్షిస్తాడు. అంతే కాకుండా రూల్స్ కమిటీకి మరియు జనరల్ పర్పస్ కమిటీకి ఇతనే చైర్మన్ గా ఉంటాడు.
స్వతంత్రత మరియు నిష్పాక్షికత
స్పీకర్ పదవికి నిష్పాక్షికతను, స్వతంత్రతను ఈ క్రింది అంశాలు కలుగజేస్తాయి.
- అతని పదవికి రక్షణ ఉంది. లోక్ సభ ప్రత్యేక మెజారిటీ ఒక తీర్మానం ద్వారానే స్పీకర్ ను తొలగిస్తుంది. (అనగా సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ). సాధారణ మెజారిటీతో ఇతను తొలగింపబడడు (సభలో హాజరై ఓటు వేసే సభ్యులలో మెజారిటీ). పైగా ఈ తొలగింపు తీర్మానం పరిశీలించబడాలంటే మరియు చర్చింప బడాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి.
- ఇతని జీతభత్యాలని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వీటిని భారత సంచిత నిధి ద్వారా ఇవ్వబడతాయి. కాబట్టి పార్లమెంట్ వార్షిక ఓటు కిందికి ఇవి రావు.
- ఒక స్థిరమైన , దృఢమైన తీర్మానం పై తప్ప అతని పని తీరు, ప్రవర్తనను లోక్ సభలో చర్చించొద్దు. విమర్శించవద్దు.
- సభా నిర్వహణలో కార్యక్రమాల వ్యవస్థీకరణలో గల అతని అధికారాలు న్యాయస్థానం పరిధిలోకి రావు.
- అతను మొట్టమొదటి సారి ఓటు వేయడు. ఓటింగ్ లో టై అయినప్పుడే అతను కాస్టింగ్ ఓటు అనగా నిర్ణ యాత్మక ఓటు వేస్తాడు. దీని వలన స్పీకర్ నిష్పక్షపాతంగా ఉంటాడు.
- అగ్రత క్రమావళిలో ఇతని హెూదా ఉన్నతమైనది. భారత ప్రధాన న్యాయమూర్తి తర్వాత ఇతను ఏడవ శ్రేణిలో ఉంటాడు. అనగా ప్రధానమంత్రి లేదా డిప్యూటీ ప్రధాన మంత్రిని మినహాయిస్తే క్యాబినెట్ మంత్రులందరి కన్నా ఇతని హెూదానే పెద్దది.
బ్రిటన్ లో స్పీకర్ ఖచ్చితంగా పార్టీ రాహిత్య వ్యక్తి. బ్రిటీష్ సాంప్రదాయం ప్రకారం స్పీకర్ తన పార్టీ నుంచి రాజీనామా చేసి రాజకీయంగా తటస్థంగా ఉండాలి. భారతదేశంలో ఈ సాంప్రదాయం ఇంకా ఏర్పడలేదు. ఈ ఉన్నతమైన పదవిలోకి వచ్చినప్పటికీ భారతదేశంలో స్పీకర్ తన పార్టీకి రాజీనామా చేయరు.
లోక్ సభ డిప్యూటీ స్పీకర్
స్పీకర్ లా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా లోక్ సభ సభ్యుల ద్వారా జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నికల తేదీని స్పీకర్ నిర్ణయిస్తాడు. డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ ఏర్పడితే లోక్ సభ ఇంకొక సభ్యుడ్ని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటుంది.
స్పీకర్ వలె డిప్యూటీ స్పీకర్ కూడా లోక్ సభ ఉన్నంత కాలం ఉంటారు. ఈ క్రింది మూడు కారణాల చేత అతడు పదవి నుండి తొలగవచ్చును.
- లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయినప్పుడు,
- స్పీకర్ కు లిఖిత పూర్వకంగా రాజీనామాను అందజేసినప్పుడు,
- లోక్‌సభలోని అందరి సభ్యుల మెజారిటీతో ఏర్పడిన ప్రత్యేక తీర్మానం ద్వారా తొలగింపబడ్డప్పుడు
ఇటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి అతనికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి.
స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ అతని విధులని నిర్వహిస్తారు. సభలో స్పీకర్ లేనప్పుడు కూడా అతను సభను నిర్వహిస్తారు. ఈ రెండు సందర్భాలలో అతనికి స్పీకర్ కు ఉన్న అన్ని అధికారాలు ఉంటాయి. స్పీకర్ లేనప్పుడు పార్లమెంట్ ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి కూడా ఇతను అధ్యక్షత వహిస్తారు.
డిప్యూటీ స్పీకర్ స్పీకర్ కు సబార్డినేట్ కాడు. అతను సభకు ప్రత్యేకంగా బాధ్యత వహిస్తారు. డిప్యూటీ స్పీకర్ కు ఒక ప్రత్యేకమైన హెూదా ఉంది. ఏదైనా పార్లమెంటరీ కమిటీకి అతడు సభ్యుడైతే వెంటనే దానికి చైర్మన్ అవుతాడు.
స్పీకర్ వలే డిప్యూటీ స్పీకర్ కూడా సభా నిర్వహణలో ఓటు వేయడు. అతను సభలో టై ఏర్పడ్డప్పుడే కాస్టింగ్ ఓటు వేస్తాడు. అతనిని తొలగించే తీర్మానం లోక్ సభ పరిశీలనలో ఉన్నప్పుడు అతడు సమావేశాలని నిర్వహించరాదు. కాని సభకు హాజరు కావచ్చు.
సభలో స్పీకర్ అధ్యక్షత వహించినప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇతర సభ్యులలానే సాధారణ సభ్యుడిగా ఉంటాడు. అతడు సభలో ప్రసంగిం చవచ్చు, సభా కార్యకలాపాలలో పాల్గొనవచ్చును. సభలో ఏ అంశాలపైనా అతను ఓటు వేయవచ్చును.
పార్లమెంట్ నిర్ణయించిన క్రమబద్ధమైన జీతభత్యాలు డిప్యూటీ స్పీకర్ కు ఉంటాయి. ఇవన్నీ భారత సంచిత నిధి నుంచే వస్తాయి.
పదవ (10) లోక్ సభ వరకు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ సాధారణంగా అధికార పార్టీకి చెంది ఉండేవారు. కానీ పదకొండవ (11) లోక్ సభ నుండి ఒక సాధారణ ఒప్పందం ద్వారా అధికార పార్టీ నుండి లేదా అధికార కూటమి నుంచి స్పీకర్ మరియు ప్రధాన ప్రతిపక్షం నుంచి డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కావడం ఒక సాంప్రదాయం అయింది.
తమ పదవులని స్పీకరించేటప్పుడు స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ప్రత్యేకంగా ప్రమాణము, ప్రతిజ్ఞ చేయరు.
భారత ప్రభుత్వ చట్టం (1919) (మాంటెగు-ఫేమ్స్ ఫర్డ్ సంస్కరణలు) కింద 1921లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అనే సంస్థలు ఏర్పడ్డాయి. ఆ రోజుల్లో స్పీకర్ ను, డిప్యూటీ స్పీకర్ ను ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ అనేవారు. ఈ పేర్లు 1941 వరకు కొనసాగాయి. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ప్రెసిడెంట్, డిప్యూటీ ప్రెసిడెంట్ అనే పేర్ల స్థానంలో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఏర్పాడ్డాయి. అయినా 1935 చట్టంలోని సమాఖ్య భాగం అమలులోనికి రాని కారణంగా పాత పేర్లే అమలులో ఉన్నాయి. లోక్ సభకు మొట్టమొదటి స్పీకర్ జి.వి.మౌలంకర్, మొట్టమొదటి డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్. శాసనసభగా పనిచేసిన రాజ్యాంగ నిర్మాణ సభకు, తాత్కాలిక పార్లమెంట్ కు జి.వి.మౌలంకర్ స్పీకర్ గా పనిచేశారు. ఆయన దశాబ్దం కాలం అనగా 1946 నుంచి 1956 వరకు లోక్ సభ స్పీకర్ గా సేవలు అందించారు.
లోక్ సభలోని చైర్ పర్సన్ల జాబితా
లోక్ సభ నిబంధనల ప్రకారం స్పీకర్ లోక్ సభలోని సభ్యుల్లో 10 మందికి మించకుండా లోక్ సభ చైర్ పర్సన్ జాబితాలో నామినేట్ చేస్తారు. స్పీకర్ కాని, డిప్యూటీ స్పీకర్ కాని లేనప్పుడు వీరిలో ఒకరు సభను నిర్వహించవచ్చు. సభ నిర్వహించేటప్పుడు స్పీకర్ కి ఉన్న అధికారాలే ఈ సభా నిర్వాహకుడికి ఉంటాయి. కొత్త జాబితాతో చైర్ పర్సన్లని నామినేట్ చేసే వరకు అతను పదవిని నిర్వహిస్తారు. ఈ జాబితాలో ఉన్న ఏ సభ్యుడు సభలో లేకపోతే సభ నిర్ణయించిన ఏ వ్యక్తి అయినా స్పీకర్‌గా వ్యవహరిం చవచ్చు.
స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు చైర్ పర్సన్ల జాబితాలోని ఏ సభ్యుడు సమావేశాలను నిర్వహించరాదు. ఇటువంటి సమయంలో సభని నిర్వహించడానికి రాష్ట్రపతి నియమించిన సభ్యుడు స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిస్తాడు. సాధ్యమైనంత త్వరగా ఈ ఖాళీ అయిన స్థానాలలో ఎన్నికలు జరగాలి.
తాత్కాలిక స్పీకర్ (Speaker ProTem):
కొత్తగా లోక్ సభ మొదటిసారి సమావేశమైన తక్షణం పాత లోక్ సభ స్పీకర్ తన పదవి నుంచి తప్పుకుంటారు. రాష్ట్రపతి లోక్ సభకు ఒక తాత్కాలిక స్పీకర్ ను ఎంపిక చేస్తారు. ప్రొటెమ్ స్పీకర్ చేత ప్రమాణం చేయించేది రాష్ట్రపతే. స్పీకర్ కు ఉన్న అన్ని అధికారాలు ప్రొటెమ్ స్పీకర్ కు ఉంటాయి. కొత్తగా ఏర్పడిన లోక్ సభ మొదటి సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం ఇతని ప్రధాన బాధ్యత. కొత్త స్పీకర్ ని సభ ఎన్నుకోవడానికి ఆయన తోడ్పడుతారు. సభకి కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత ప్రొటెమ్ స్పీకర్ పదవి ఉండదు. కనుక ప్రొటెమ్ స్పీకర్ పదవి తాత్కాలికమైనది. ఇది కొన్ని రోజుల వరకే ఉంటుంది.
రాజ్యసభ చైర్మన్
రాజ్యసభ సమావేశాలని నిర్వహించే అధికారిని చైర్మన్ అంటారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభలో ఎక్స్ అఫిషీయో చైర్మన్ గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి పదవి నిర్వహించి నప్పుడు ఇతను రాజ్యసభ సమావేశాలను నిర్వహించడు.
ఉపరాష్ట్రపతి పదవి నుండి తొలగింపబడినప్పుడు రాజ్యసభ చైర్మన్ కూడా తొలగించబడినట్టే. లోక్ సభ స్పీకర్ కి ఉన్న అధికారాలే రాజ్యసభ చైర్మన్ కి కూడా ఉంటాయి. అయితే స్పీకర్ కి రెండు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
- ఏదైనా బిల్లు ఆర్థిక బిల్లు అవునా, కాదా అని నిర్ణయించే అధికారం స్పీకర్ కు మాత్రమే ఉంటుంది. అతని నిర్ణయమే అంతిమం.
- పార్లమెంట్ లోని రెండు సభల ఉమ్మడి సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు.
స్పీకర్ సభలో సభ్యుడిగా ఉంటాడు కానీ చైర్మన్ సభలో సభ్యుడు కాదు. అయితే స్పీకర్ లా చైర్మన్ కూడా మొదటిసారి ఓటు వేయడు. ఏదైనా తీర్మానంపై సభలో ఓట్లు సమానంగా వచ్చినప్పుడు కాస్టింగ్ ఓటు వేస్తాడు.
తనని తొలగించే తీర్మానం సభలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభలో చైర్మన్ గా వ్యవహరించడు. కాని అతను సభకి హాజరు కావచ్చు, ప్రసంగిచవచ్చు. సభా కార్యకలాపాల్లో అతడు పాలు పంచుకోవచ్చును. కానీ ఓటు హక్కు ఉండదు.
స్పీకర్, చైర్మన్ జీత భత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అవి భారత సంచిత నిధి నుండి వస్తాయి. అవి పార్లమెంట్ వార్షిక ఓటుకి ఆధీనం కాదు.
ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా విధులను నిర్వహించేటప్పుడు అతడికి రాజ్యసభ చైర్మన్‌గా జీత భత్యాలు ఉండవు. కానీ ఆ సమయంలో అతడికి రాష్ట్రపతికి వచ్చే జీతభత్యాలు వస్తాయి.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ (ఉపాధ్యక్షులు)గా ఎన్నుకుంటారు. ఈ పదవికి ఖాళీ ఏర్పడితే మరొక డిప్యూటీ చైర్మన్ ను ఎన్నుకుంటారు.
డిప్యూటీ చైర్మన్ పదవికి ఖాళీ ఈ క్రింది మూడు కారణాల వలన ఏర్పడుతుంది.
- అతడు రాజ్యాసభ సభ్యునిగా కొనసాగే అర్హత కోల్పోవడం,
- రాజ్యసభ చైర్మన్ కు లిఖిత పూర్వకంగా రాజీనామా ఇచ్చినప్పుడు,
- రాజ్యసభ మెజారిటీ తీర్మానం ద్వారా అతనిని తొలగించడం. అయితే అతడిని తొలగించే తీర్మానం ప్రవేశపెట్టడానికి అతడికి 14 రోజుల ముందుగా నోటీస్ ఇవ్వాలి.
చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నపుడు లేదా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నప్పుడు లేదా రాష్ట్రపతి విధులను నిర్వర్తిస్తున్నప్పుడు డిప్యూటీ చైర్మన్, చైర్మన్ గా విధులను నిర్వర్తిస్తారు. చైర్మన్ సభలో లేనప్పుడు డిప్యూటీ చైర్మన్, చైర్మన్ గా వ్యవహరిస్తారు. అనగా రెండు సందర్భాలలో అతడు చైర్మన్ గా విధులను నిర్వహిస్తాడు.
డిప్యూటీ చైర్మన్ చైర్మన్ కి సబార్డినేట్ కాదు. అతను రాజ్యసభకు ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తాడు. చైర్మన్ లా డిప్యూటీ చైర్మన్ కూడా సమావేశాలకు అధ్యక్షత వహించినప్పుడు మొదటిసారి ఓటు వేయడు. సభలో టై ఏర్పడ్డప్పుడు అతను కాస్టింగ్ ఓటు వేస్తాడు. అయితే తనని తొలగించే తీర్మానం రాజ్యసభలో ఉన్నపుడు అతను సభకు అధ్యక్షత వహించడు. కాని అతడు సభకు హాజరుకావచ్చు.
సభలో చైర్మన్ సమావేశాలని నిర్వహిస్తున్నప్పుడు డిప్యూటీ చైర్మన్ ఇతర సభ్యుల వలె ఉంటాడు. అతడు సభలో ప్రసంగివచ్చ వచ్చును, కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. సభలో ఓటింగ్ లో పాల్గొనవచ్చు.
చైర్మన్ వలె డిప్యూటీ చైర్మన్ కు కూడా పార్లమెంట్ నిర్ణయించిన మేరకు జీతభత్యాలు ఉంటాయి. ఇవి భారత సంచిత నిధి నుండి వస్తాయి.
రాజ్యసభలో వైస్ చైర్ పర్సన్ల జాబితా
రాజ్యసభ నిబంధనల ప్రకారం చైర్మన్ రాజ్యసభలోని సభ్యుల్లో 10 మందిని మించకుండా రాజ్యసభవైస్ చైర్ పర్సన్ల జాబితాలో నామినేట్ చేస్తారు. చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ కాని లేనప్పుడు వీరిలో ఏ ఒక్కరైనా సభను నిర్వహించవచ్చును. సభ నిర్వహించేటప్పుడు చైర్మన్ కి ఉన్న అధికారాలే ఈ సభా నిర్వాహకుడికి కూడా ఉంటాయి. కొత్త జాబితాలో వైస్ చైర్ పర్సన్లని నామినేట్ చేసే వరకు అతను ఈ పదవిని నిర్వహిస్తారు. జాబితాలో ఉన్న ఏ సభ్యుడు సభలో లేకపోతే సభ నిర్ణయించిన ఏ వ్యక్తి అయినా చైర్మన్ గా వ్యవహరించవచ్చు.
చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీగా ఉన్నప్పుడు వైస్ చైర్ పర్సన్ జాబితాలోని ఏ సభ్యుడు సమావేశాలని నిర్వహించరాదు. ఇటువంటి సమయంలో సభని నిర్వహించడానికి రాష్ట్రపతి నియమించిన సభ్యుడు చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తాడు.
పార్లమెంట్ సచివాలయం
పార్లమెంట్ లోని ప్రతి సభకు ప్రత్యేకమైన సచివాలయ సిబ్బంది ఉంటుంది. కొన్ని పదవులు రెండు సభలకు కలిపి ఉంటాయి. వారి ఎంపిక మరియు సర్వీస్ నిబంధనలను పార్లమెంట్ క్రమబద్ధం చేస్తుంది. ప్రతి సభ యొక్క సచివాలయానికి అధినేతగా సెక్రటరీ జనరల్ ఉంటాడు. ఇతన్ని సభలోని అధ్యక్షుడు నియమిస్తారు. ఇతను శాశ్వత ఉద్యోగి.
No comments:
Post a Comment