పార్ల‌మెంట‌రీ క‌మిటీలు

 

  • రోజు రోజుకూ శాసనాల సంఖ్య పెరగడం, శాసనాల రూపకల్పనలో సాంకేతికత పెరగడం, ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యయ పరిమాణం లాంటి అంశాలన్నీ పార్లమెంటుకున్న విలువైన కాలంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఆధునిక కాలంలో శాసనాల రూపకల్పనలో ఈ కమిటీల పాత్ర కీలకమైంది.
  • పార్లమెంటు తరఫున నిపుణులు, సమర్థులైన కొంత మంది సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా పరిపాలనపై నిరంతర నియంత్రణ కొనసాగిస్తారు.
  • భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఏర్పరచలేదు. కానీ ఆర్టికల్ 88, 105లలో వీటి పరోక్ష ప్రస్తావన ఉంది.

వ్యాఖ్యానాలు

  • ‘ఆధునిక కాలంలో శాసన వ్యవస్థకు పార్లమెంటరీ కమిటీలు కళ్లు, చేతులు, చెవులుగా; కొన్నిసార్లు మెదడుగా కూడా పనిచేస్తున్నాయి’ – థామస్ రీడ్
  • ‘శాసనాల సామర్థ్యం, విలువలు పార్లమెంటరీ కమిటీల పనితీరుపై ఆధారపడి ఉంటాయి’. – మారిస్ జోన్స్
  • ‘ఆధునిక కాలంలో శాసన కమిటీలు మినీ శాసన వ్యవస్థలుగా అవతరించాయి’ – ఉడ్రో విల్సన్.

కమిటీల లక్షణాలు

  • పార్లమెంటరీ కమిటీలకు పుట్టినిల్లు బ్రిటన్.
  • మంత్రులు కమిటీల్లో సభ్యులుగా ఉండకూడదు.
  • కమిటీ తన నివేదికను స్పీకర్ లేదా ఛైర్మన్‌కు సమర్పిస్తుంది.
  • స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు ఏ కమిటీలో సభ్యులుగా ఉంటారో వారే ఆ కమిటీలకు ఛైర్మన్‌లుగా వ్యవహరిస్తారు.
  • కమిటీ సమావేశాల నిర్వహణకు కావల్సిన కనీస సభ్యుల సంఖ్య (కోరం) 1/3వ వంతు.
  • సంయుక్త పార్లమెంటరీ కమిటీల ఛైర్మన్లను లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు.
  • కమిటీల్లోని సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరం.
  • సంయుక్త పార్లమెంటరీ కమిటీల్లోని సభ్యుల సంఖ్య లోక్‌సభ, రాజ్యసభల నుంచి 2 : 1 పద్ధతిలో ఉంటుంది.
  • 1997లో రాజ్యసభ నుంచి, 2004లో లోక్‌సభ నుంచి నైతిక విలువల కమిటీలు ఏర్పడి పని చేస్తున్నాయి.

కమిటీలు 2 రకాలు

  • స్థాయి కమిటీలు (Standing Committees)
  • తాత్కాలిక కమిటీలు (Adhoc Committees)

స్థాయి కమిటీలు

  • ఇవి ప్రతి సంవత్సరం లేదా సమయానుకూలంగా ఆయా సభల ద్వారా ఎన్నికై నిరంతరంగా పని చేస్తుంటాయి. ఈ కమిటీల్లో సభ్యులు మాత్రం మారుతూ ఉంటారు.

తాత్కాలిక కమిటీలు

  • అవసరాన్ని బట్టి ఆయా సందర్భాల్లో ఏర్పాటు చేస్తారు. ఆయా సభల తీర్మానాల ద్వారా వీటిని సభాధ్యక్షులు ఏర్పాటు చేస్తారు. ఇవి తమ నివేదికలను సమర్పించగానే రద్దు అవుతాయి.

కీలకమైన పార్లమెంటరీ కమిటీలు

ప్రభుత్వ ఖాతాల సంఘం (Public Accounts Committee)

  • ఇది పార్లమెంటరీ కమిటీల్లో ప్రాచీనమైంది.
  • దీన్ని 1919 మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం సిఫారసుల మేరకు 1921లో ఏర్పాటు చేశారు.
  • దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 22. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • ఈ కమిటీ ఛైర్మన్‌ను స్పీకర్ నియమిస్తారు. కమిటీ తన నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తుంది.
  • 1967 నుంచి ఈ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపక్షాలకు చెందినవారిని నియమించడం ఒక సంప్రదాయంగా మారింది.

ప్రభుత్వ ఖాతాల సంఘం విధులు

  • కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను పరిశీలించడం.
  • పార్లమెంటు ఆమోదించిన ఉపకల్పన బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం ఉందో, లేదో పరిశీలించడం.
  • ఖాతాల్లో చూపిన వ్యయం చట్టబద్ధంగా ఉద్దేశించిన అంశాల కోసం ఖర్చుపెట్టారా లేదా అని పరిశీలించడం.
  • కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రభుత్వ ఖాతాల సంఘంకు మిత్రుడిగా, మార్గదర్శిగా, తాత్వికుడిగాను పనిచేస్తుంది.
  • కాగ్ నివేదికను ప్రభుత్వ ఖాతాల సంఘం పరిశీలించి అవకతవకలుంటే బాధ్యులపై చర్యలకోసం సిఫారసు చేస్తుంది.
  • ప్రభుత్వ ఖాతాల సంఘంను ముఖ్యమైన ఆర్థిక కమిటీగా పేర్కొంటారు.

అంచనాల సంఘం (Estimates Committee)

  • జాన్ ముత్తాయ్ కమిటీ సిఫారసుల మేరకు 1950లో అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
  • ఈ కమిటీలోని మొత్తం 30 మంది సభ్యులను లోక్‌సభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు.
  • ఈ కమిటీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
  • ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో పొదుపు పాటించే పద్ధతులను సూచిస్తుంది.
  • దీన్ని నిరంతర పొదుపు కమిటీ అంటారు.
  • పొదుపును పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం.
  • ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘాలను పార్లమెంటు కవలలుగా పేర్కొంటారు.

ప్రభుత్వరంగ సంస్థల సంఘం (Committee on Public Undertakings)

  • ప్రభుత్వరంగ సంస్థలపై పార్లమెంటులో లంకా సుందరం అనే సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కృష్ణమీనన్ కమిటీని ఏర్పాటు చేసింది.
  • కృష్ణమీనన్ కమిటీ సిఫారసుల మేరకు 1964లో ‘ప్రభుత్వరంగ సంస్థల సంఘాన్ని’ ఏర్పాటు చేశారు.
  • 1974 వరకు ఈ కమిటీలో 15 మంది సభ్యులు ఉండేవారు.
  • 1974 నుంచి దీనిలోని సభ్యుల సంఖ్యను 22కు పెంచారు. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • మన దేశంలో ప్రభుత్వరంగ సంస్థలైన BHEL, BALCO, IOC, LIC లాంటివి సమర్థంగా పనిచేయడానికి అవసరమైన సూచనలు చేస్తుంది.
  • ప్రభుత్వరంగ సంస్థల నివేదికను, ఖాతాలను పరిశీలిస్తుంది.
  • ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (CAG) నివేదికను పరిశీలిస్తుంది.
  • ఇది కూడా కీలకమైన ఆర్థిక కమిటీ.

సాధారణ కమిటీలు

సభా వ్యవహారాల కమిటీ (Business Advisory Committee)

  • లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా ఈ కమిటీలు ఉంటాయి.
  • ఈ కమిటీలకు ఆయా సభాధ్యక్షులే అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
  • లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీలో 15, రాజ్యసభ సభావ్యవహారాల కమిటీలో 11 మంది సభ్యులుంటారు.
  • ఈ కమిటీల్లో సభ్యులుగా అన్ని పార్టీలకు చెందిన సభా నాయకులను సభ్యులుగా ఎంపిక చేస్తారు.
  • సభా వ్యవహారాలను నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి అవసరమైన సలహాలు, సూచనలను అందిస్తూ అందుకు అవసరమైన చర్యలను చేపడుతుంది. ఇది ఎజెండాను తయారు చేస్తుంది.

ప్రభుత్వ హామీల కమిటీ (Committee on Government Assurance)

  • లోక్‌సభ, రాజ్యసభలకు విడివిడిగా ప్రభుత్వ హామీల కమిటీలు ఏర్పాటవుతాయి.
  • లోక్‌సభ కమిటీలో 15, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులుంటారు.
  • ప్రశ్నోత్తరాల సమయంలో బిల్లుల, తీర్మానాల మీద చర్చలు జరిగేటప్పుడు మంత్రులు అనేక రకాల హామీలు ఇస్తుంటారు. ఈ హామీల అమలు లాంటి విషయాలను కమిటీ పరిశీలిస్తుంది.

ప్రైవేట్ అర్జీల బిల్లుల కమిటీ

  • ఇది లోక్‌సభకే ఉద్దేశించిన కమిటీ. ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 15. దీనికి డిప్యూటీ స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
  • పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లులకు సంబంధించిన అంశాలను పరిశీలించి, తగిన సిఫారసులు చేయడం ఈ కమిటీ ప్రధాన విధి.

దత్త శాసనాల కమిటీ (Committee on Delegated Legislation)

  • దీన్నే నియోజిత శాసనాల కమిటీ అంటారు.
  • ఈ కమిటీ ఉభయ సభలకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు.
  • ఈ కమిటీని ‘పార్లమెంటు విధుల రక్షణ కర్త’గా జి.వి.మౌలాంకర్ పేర్కొన్నారు.
  • పార్లమెంటు కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసిన శాసనపరమైన అంశాలను, వాటి నిర్మాణంలో ఉన్న చట్టబద్దతను పరిశీలించడం, గతంలో రూపొందించిన చట్టాల సవరణకు సంబంధించిన ఉత్తర్వులను సభకు సమర్పించేందుకు తగిన అవకాశాలు ఉండేలా చూడటం ఈ కమిటీ ప్రధాన విధి.

సభాహక్కుల కమిటీ (Committee on Privilege of Members)

  • ఈ కమిటీలు లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా ఉంటాయి.
  • లోక్‌సభ కమిటీలో 15 మంది, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు.
  • ఈ కమిటీ పార్లమెంటు సభ్యుల హక్కులు, హోదాలను పరిరక్షిస్తుంది.
  • దీనికి అర్ధన్యాయ సంబంధమైన (Quasi Judicial) విధులు ఉంటాయి.

షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల కమిటీ

  • ఈ కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా, చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన రక్షణలు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తుంది.
  • జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ల నివేదికలను పరిశీలిస్తుంది.

మహిళా సాధికారతా కమిటీ (Committee on Empowerment of Women)

  • దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • మహిళలకు రాజ్యాంగం ద్వారా, చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలు తీరును పర్యవేక్షించి, తన నివేదికను రూపొందిస్తుంది.
  • మహిళల సమగ్ర ప్రగతి కోసం జాతీయ మహిళా కమిషన్ సమర్పించిన నివేదికలను పరిశీలించి, సిఫారసులు చేస్తుంది.
  • మహిళా సాధికారిత, సమానత్వం కోసం చేపట్టే కార్యకలాపాలను పరిశీలిస్తుంది.
  • ఈ కమిటీని 1997లో ఏర్పాటు చేశారు.

ఎథిక్స్ కమిటీ (Committee on Ethics)

  • ఎథిక్స్ కమిటీ రాజ్యసభలో 1997, లోక్‌సభలో 2004లో ఏర్పడింది.
  • సభలో సభ్యుల ప్రవర్తన, పనితీరు, సభా విలువలు లాంటి అంశాలపై సూచనలు ఇస్తుంది.

జీతభత్యాల కమిటీ

  • దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 15. వీరిలో లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • పార్లమెంటు సభ్యుల జీతభత్యాలకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిస్తుంది.

లైబ్రరీ కమిటీ

  • ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 9. వీరిలో లోక్‌సభ నుంచి ఆరుగురు, రాజ్యసభ నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తారు.
  • పార్లమెంటు సభ్యులకు లైబ్రరీ సదుపాయాల కల్పనపై సిఫారసు చేస్తుంది.

సాధారణ అవసరాల కమిటీ

  • దీనిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15 మంది. స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
  • పార్లమెంటు సభ్యులకు సమావేశాల సందర్భంగా కల్పించాల్సిన వసతుల గురించి ఈ కమిటీ సిఫారసు చేస్తుంది.

లాభదాయక పదవుల కమిటీ (Committee on Office of Profit)

  • దీనిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15, వీరిలో లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • లాభదాయక పదవులు, సభ్యుల అనర్హతలు లాంటి అంశాలను పరిశీలిస్తుంది.

డిపార్ట్‌మెంటల్ స్టాండింగ్ కమిటీలు

  • లోక్‌సభ రూల్స్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు 1993లో 17 డిపార్ట్‌మెంటల్ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. 2004లో వీటి సంఖ్యను 24కు పెంచారు. ప్రతి కమిటీలోనూ 31 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 20 మంది లోక్‌సభ, మిగిలిన 11 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు.
  • ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు. ఈ కమిటీల సభ్యులను ఆయా సభాధ్యక్షులు నామినేట్ చేస్తారు. ఈ కమిటీల పదవీ కాలం ఒక సంవత్సరం.
  • 16 కమిటీలు లోక్‌సభ, 8 కమిటీలు రాజ్యసభ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.

జాయింట్ పార్లమెంటరీ కమిటీలు (JPC)

  • సమకాలీన సమస్యలు, ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలను విచారించేందుకు పార్లమెంటు ఉభయసభల సభ్యులతో కూడిన సంయుక్త కమిటీలను ఏర్పాటు చేస్తారు.
  • ఉభయసభల తీర్మానాల ద్వారా లేదా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ల పరస్పర అవగాహన ద్వారా జేపీసీలను ఏర్పాటు చేయవచ్చు.
  • సుమారు 15 నుంచి 30 మందిని సభ్యులుగా తీసుకోవచ్చు. అధికార పక్ష సభ్యుడికి అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం ఆనవాయితీగా ఉంది.

ఇప్పటి వరకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీలు

  • బోఫోర్స్ కుంభకోణంపై అధ్యయనం చేసేందుకు 1987, ఆగస్టు 6న శంకరానంద్ (కాంగ్రెస్) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ, తన నివేదికను 1998, ఏప్రిల్ 26న ఇచ్చింది. ఈ నివేదికను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి.
  • స్టాక్ మార్కెట్ కుంభకోణం (హర్షద్ మెహతా కుంభకోణం)పై అధ్యయనం చేసేందుకు 1992, ఆగస్టు 6న రాంనివాస్ మిర్థా (కాంగ్రెస్) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 1993, డిసెంబరు 21న సమర్పించింది.
  • స్టాక్ మార్కెట్ కుంభకోణం (కేతన్ పరేఖ్ కుంభకోణం)పై అధ్యయనం చేసేందుకు 2001, ఏప్రిల్ 26న ప్రకాష్‌మణి త్రిపాఠీ (బీజేపీ) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 2002 డిసెంబరు 19న సమర్పించింది.
  • శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలపై అధ్యయనం చేసేందుకు శరద్ పవార్ (ఎన్‌సీపీ) అధ్యక్షతన 2003, ఆగస్టు 8న ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 2004, ఫిబ్రవరి 4న సమర్పించింది. శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు ఉండటం నిజమేనని పేర్కొంది. దీని సిఫారసుల మేరకు ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఏర్పడింది.
  • 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై అధ్యయనం చేసేందుకు పి.సి. చాకో (కాంగ్రెస్) అధ్యక్షతన 2011, మార్చి 1న ఏర్పడిన ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 30 మంది.



No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...