వృక్షరాజ్య వర్గీకరణ

 

         ఐక్లర్ ప్రతిపాదించిన 'వర్గవికాసానుసార వర్గీకరణ'ను బట్టి వృక్షరాజ్యాన్ని రెండు ఉపరాజ్యాలుగా విభజించారు.

అవి: 1) క్రిప్టోగాములు 2) ఫానిరోగామ్‌లు.
 

I. క్రిప్టోగామె (పుష్పించని మొక్కలు)
ఇవి పుష్పరహిత, విత్తనరహిత, సిద్ధబీజ సహిత మొక్కలు.
* వీటిలో 'పుష్పాలు, ఫలాలు, విత్తనాలు' ఉండవు.
* ఇవి సిద్ధబీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని, సంయోగ బీజాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి.
* దీన్ని 3 విభాగాలుగా విభజించారు. అవి:
1) థాలోఫైటా 2) బ్రయోఫైటా 3) టెరిడోఫైటా
 

థాలోఫైటా

* ఇది క్రిప్టోగాముల్లో అతిపెద్ద విభాగం. థాలోఫైట్‌లు అతి సరళమైన, అతి పురాతనమైన మొక్కలు.
* వీటిలో వేరు, కాండం, పత్రాలుగా విభేదనం చూపని 'థాలస్' దేహం ఉంటుంది.
* వీటిలో నాళికా కణజాలాలు ఉండవు (అట్రాఖియోఫైట్‌లు). పిండం ఏర్పడదు (నాన్ - ఎంబ్రియోఫైట్స్). ఎందుకంటే సంయుక్త బీజం క్షయకరణ విభజన జరుపుకుని సిద్ధబీజాలను ఏర్పరుస్తుంది. సాధారణంగా 'ఏకస్థితిక జీవిత చక్రం' ఉంటుంది (Haplotic)
 

* థాలస్: ''మూలవ్యవస్థగా, ప్రకాండ వ్యవస్థగా విభేదనం చూపని నిజ నాళికా వ్యవస్థ లేని, సాధారణంగా బల్లపరుపుగా ఉండే వృక్ష దేహం".* థాలోఫైటాను రెండు ఉప విభాగాలుగా విభజించారు.
ఎ) శైవలాలు బి) శిలీంద్రాలు
 

* శైవలాలు: హరితసహిత, కాంతి స్వయంపోషక, నీటిలో ఆవాసం చేసే థాలోఫైట్.
* ఇవి అధిక వైవిధ్యాన్ని చూపుతాయి.
* కణకవచం ప్రధానంగా 'సెల్యులోజ్ నిర్మితం. నిల్వ పదార్థాలు పిండి పదార్థ రూపంలో ఉంటాయి.
* వీటి లైంగికత్వంలో పురోగామి పరిణామం కనిపిస్తుంది.
 

* శిలీంద్రాలు: హరితరహిత, పరపోషక థాలోఫైట్స్. ఇవి సేంద్రియ పదార్థాలు లభ్యమయ్యే ఆవాసాల్లో ఉంటాయి. వీటి థాలస్/ దేహాన్ని 'శిలీంద్రజాలం లేదా 'మైసీలియం అంటారు.
* మైసీలియం - శిలీంద్ర తంతువుల (హైపే) నిర్మితం.
* వీటి కణకవచంలో ప్రధానంగా కైటిన్ లేదా శిలీంద్ర సెల్యులోజ్ ఉంటుంది. ఇవి నిర్జీవ సేంద్రియ పదార్థాలపై పూతికాహారులుగానో లేదా ఇతర జీవులపై పరాన్న జీవులుగానో జీవిస్తాయి.
* కొన్ని శిలీంద్రాలు శైవలాలతో సహజీవనం చేసి 'లైకెన్‌లను ఏర్పరుస్తాయి.
* మరికొన్ని శిలీంద్రాలు నాళికా కణజాలయుత మొక్కల వేళ్లతో సామూహికమై శిలీంద్ర మూలాలను (మైకోరైజా) ఏర్పరుస్తాయి.
n

* నిల్వ పదార్థాలు 'గ్లైకోజన్/ నూనె బిందువుల' రూపంలో ఉంటాయి. వీటి లైంగికత్వంలో తిరోగామి పరిణామం కనిపిస్తుంది.
 

బ్రయోఫైటా
          ఇవి నీడ, తేమ ఉన్న ప్రదేశాల్లో పెరిగే పురాతనమైన 'నేల మొక్కలు'. హరితసహిత, స్వయం పోషక శక్తి ఉన్న నాళికా కణజాలరహితమైనవి.
 మొదటి 'ఎంబ్రియోఫైట్స్' (పిండోత్పత్తిని చూపే పుష్పించని మొక్కలు).
* ఇవి భిన్నరూప ఏకాంతర దశలు చూపుతున్న, ఏకద్వయ స్థితిక జీవిత చక్రాన్ని కలిగి ఉన్న 'ఉభయచర పుష్పించని మొక్కలు'.
* వీటి జీవిత దశల్లో ఏకస్థితిక సంయోగ బీజదం ప్రబల దశ. ద్వయస్థితిక 'సిద్ధ బీజదం' భౌతికంగా, పోషణరీత్యా సంయోగ బీజదంపై ఆధారపడుతుంది.
* లైంగికావయవాలు:
                      స్త్రీ సంయోగ బీజాశయం - ఆర్కిగోనియం
                      పురుష సంయోగ బీజాశయం - ఆంథరీడియమ్
* ఆర్కిగోనియమ్‌లోని స్త్రీ బీజకణం ఫలదీకరణానంతరం (ఫలదీకరణకు నీరు అవసరం) పిండంగా, సిద్ధబీజదంగా అభివృద్ధి చెందుతుంది.


 

* గుళిక - క్షయకరణ విభజన చెంది సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది (సమ సిద్ధ బీజత Homospory)
* సిద్ధబీజం సంయోగ బీజద దశకు ప్రథమ కణం. (సమసిద్ధ బీజత  : ఒకే రకమైన సిద్ధబీజాల ఉత్పత్తి.)
* సిద్ధబీజం మొలకెత్తి నేరుగా లేదా 'ప్రథమ తంతువు' అనే తంతురూప దశ ద్వారా సంయోగ బీజద మొక్కను ఏర్పరుస్తుంది.
 

టెరిడోఫైటా
        వృక్ష రాజ్య పరిణామంలో టెరిడోఫైట్‌లు 'ప్రథమ నిజమైన నేల మొక్కలు'.
* హరితసహిత, స్వయం పోషకశక్తి ఉన్న నాళికా కణజాలయుతాలు (ట్రాఖియోఫైట్).
* వీటి జీవిత చక్రంలో 'ద్వయస్థితిక' సిద్ధబీజద దశ ప్రబలమైన దశ.
* ఇవి (సిద్ధ బీజదం) మొదటగా నిజమైన వేర్లు (అబ్బురపు వేర్లు), కాండం, పత్రాలు (ఫ్రాండ్స్) కలిగి ఉన్నాయి.
* ఇవి వృక్షరాజ్య పరిణామంలో 'ప్రప్రథమ ట్రాఖియోఫైట్స్'.
* పుష్పించని మొక్కల్లో ఇవి మాత్రమే నాళికా కణజాలయుతాలు (Vascular Cryptogams).
* సిద్ధబీజదం ఫలవంతమైన సిద్ధ బీజాశయ పత్రాల కింది తలంపై లేదా గ్రీవాల్లో 'సిద్ధ బీజాశయాలను' (సోరై) ఏర్పరుస్తుంది.
* సిద్ధ బీజాశయాల్లో క్షయకరణ విభజన ద్వారా సమసిద్ధ బీజత  ,చిన్న సిద్ధ బీజద విధానాల్లో సిద్ధబీజాల ఉత్పత్తి జరుగుతుంది.
* సిద్ధబీజం మొలకెత్తి ప్రథమాంకురం (హృదయాకారం) (Prothallus) అనే ఏకస్థితిక సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తుంది.
* సంయోగ బీజదంలోని లైంగికావయవాలు - ఆంథరీడియం, ఆర్కిగోనియం. ఆర్కిగోనియం ఉదరంలో ఫలదీకరణ జరిగి సంయుక్తబీజం ఏర్పడుతుంది (ఫలదీకరణకు నీరు అవసరం).
* సంయోగ బీజదం 'జూయిడోగమి' రకానికి చెందిన అండ సంయోగం ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. ద్వయస్థితిక సంయుక్త బీజం పిండంగా మారి, సిద్ధబీజదంగా వృద్ధి చెందుతుంది.
* సిద్ధ బీజదం, సంయోగ బీజదం ఒకదానిపై ఒకటి ఆధారపడకుండా స్వతంత్రంగా జీవిస్తాయి.
* వీటిలో భిన్నరూప ఏకాంతర జీవిత దశలతో 'ద్వయస్థితిక జీవిత చక్రం' ఉంటుంది.

II. ఫానిరోగామ్‌లు (పుష్పించే మొక్కలు)
      ఇవి ప్రత్యుత్పత్తి కోసం పుష్పాలను లేదా పుష్పాలకు క్రియాసామ్యమైన శంకువులను ఏర్పరుస్తాయి.
* ఇవి విత్తనాలను ఉత్పత్తి చేసే ట్రాఖియోఫైట్స్ (పిండ సహిత బహుకణయుత విత్త)
* వీటిలో భిన్నరూప ఏకాంతర దశలుంటాయి. సిద్ధ బీజదం ప్రబలమైన దశ. సంయోగబీజదం క్షీణించి ఉంటుంది. దాంతో పోషణ కోసం సిద్ధ బీజదంపై ఆధారపడుతుంది.
* ఇవి సంక్లిష్ట నాళికా కణజాలాలతో కూడిన 'సిద్ధ బీజదాన్ని కలిగిన నిజమైన మొక్కలు.
 

* భూమిపై ఫానిరోగామ్‌ల ఆధిక్యతకు కారణాలు:
* దారు, పోషక కణజాలయుత వేర్లు, కాండం అభివృద్ధి చెందడం.
* ఫలదీకరణకు నీటి ఆవశ్యకత లేకపోవడం.
* విత్తన ధారణ స్వభావం.
* ఫానిరోగామ్స్‌లో ఉన్న ఒకే విభాగం 'స్పెర్మటోఫైటా'.
* స్పెర్మటోఫైటా (బీజయుత మొక్కలు): దీనిలో 2 ఉప విభాగాలు ఉన్నాయి.
1) వివృత బీజాలు 2) ఆవృత బీజాలు

వివృత బీజమొక్కలు 
* వివృత బీజాలు 'అండాశయం, ఫలం లేని పుష్పించే మొక్కలు/ స్పెర్మటోఫైట్స్'.
* వీటీ విత్తనాలను కప్పుతూ ఫలకవచం లేకపోవడంతో విత్తనాలు నగ్నంగా ఉంటాయి.
* వివృత బీజ మొక్క సిద్ధబీజదం.
* వీటి నాళికా కణజాలాల్లోని దారువులో దారు నాళాలు, పోషక కణజాలంలో సహకణాలు ఉండవు.
* సిద్ధ బీజాశయ పత్రాలు శంకువులుగా (పుష్పాల అమరిక) సంకలితం చెందుతాయి.
* సూక్ష్మ, స్థూల సిద్ధబీజాలు ఏర్పడతాయి (భిన్న సిద్ధ బీజత ).
* స్థూల సిద్ధ బీజాశయ పత్రాలు కవచయుత స్థూల సిద్ధ బీజాశయాలను (అండాలు), సూక్ష్మ సిద్ధ బీజాశయ పత్రాలు సూక్ష్మ సిద్ధబీజాలను (పరాగ రేణువులు) ఉత్పత్తి చేస్తాయి.
* వాయు పరాగ సంపర్కం ప్రత్యక్షంగా జరుగుతుంది (గాలి ద్వారా).
* ఏకస్థితిక స్థూల సిద్ధబీజం - 'అంకురచ్ఛదాన్ని ఏర్పరుస్తుంది (పిండపోషణకు తోడ్పడుతుంది).
* అంకురచ్ఛదం ఫలదీకరణకు పూర్వ ఉత్పన్నం. కాబట్టి ఏకస్థితికం. లైంగిక ప్రత్యుత్పత్తి సనాళ సంయోగ (సైఫనోగమీ) రకానికి చెందిన అండసంయోగం వల్ల జరుగుతుంది (సైకస్‌లో మాత్రం జుయిడోగమీ, సైఫనోగమీ రెండూ ఉంటాయి.)

ఆవృత బీజాలు
ఇవి అండాశయాలు, ఫలాలు ఉండే 'బీజయుత మొక్కలు. విత్తనాలను ఆవరించి 'ఫలకవచం ఉంటుంది.
* ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు.
* ఇవి సాధారణంగా 'ఆకర్షణీయమైన పరిపత్రావళి ఉన్న పుష్పాలను ఉత్పత్తి చేస్తాయి.
* పరోక్ష పరాగ సంపర్కం
* సనాళ సంయోగ (సైఫనోగమీ) రకమైన 'అండ సంయోగం కనిపిస్తుంది.


 
 

* 'ద్విఫలదీకరణ వీటిలో మాత్రమే కనిపిస్తుంది.
 
* ఆవృత బీజాల్లో అంకురచ్ఛదం 'త్రయస్థితికం (3n)
* ఫలదీకరణానంతరం: అండాశయం - ఫలంగా, అండాలు - విత్తనాలుగా మారతాయి.
* విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది.
* విత్తనం లోపల పిండంలో ఒకటే బీజదళం ఉంటే ఏకదళ బీజమొక్కలు, రెండు బీజదళాలుంటే ద్విదళ బీజ మొక్కలు.
 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...