సమాపనం (Summoning)
పార్లమెంటులో రెండు సమావేశాలకు మధ్య గరిష్ట కాల పరిమితి 6 నెలలు మించరాదు. సంవత్సరంలో కనీసం రెండు సార్లు పార్లమెంట్ సమావేశం కావాలి. సాధారణంగా ఒక సంవత్సరంలో మూడు (3) రకాల సమావేశాలు ఉంటాయి. ప్రతి సభను రాష్ట్రపతి సమాపనం చేస్తాడు.
- బడ్జెట్ సమావేశం (ఫిబ్రవరి నుండి మే వరకు)
- వర్షాకాల సమావేశం ( జూలై నుండి సెప్టెంబర్)
- శీతాకాల సమావేశం(నవంబర్ నుండి డిసెంబర్)
పార్లమెంట్ లో సమావేశం అనగా మొదటి రోజు నుండి సభవాయిదా పడటం వరకు (లోక్ సభ అయితే రద్దు అయ్యే వరకు) మధ్య ఉన్న కాలవ్యవధి. సమావేశ సమయంలో, సభ తన కార్యక్రమాల కోసం ప్రతి రోజు సమావేశం అవుతుంది. సభ వాయిదా పడ్డ తర్వాత నుండి సభ మళ్లీ కొత్తగా సమావేశమయ్యే మధ్య కాలాన్ని విరామం అంటారు.
వాయిదా (Adjournment)
ఒక సమావేశ కాలంలో పార్లమెంట్ అనేక సార్లు సభలు నిర్వహి స్తుంది. ప్రతి
రోజు సభ రెండు సార్లు జరుగుతుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట
వరకు మొదటగా సభా కార్యకలాపాలు జరుగుతాయి. మధ్యాహ్న భోజనం తర్వాత సభా
కార్యక్రమాలు రెండవసారి 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. ఈ
సభా కార్యక్రమాలు వాయిదా ద్వారా లేక నిరవధిక వాయిదా ద్వారా లేదా రద్దు
(లోక్ సభ) ద్వారా కానీ ముగి యవచ్చును. వాయిదా ద్వారా సభా కార్యక్రమాలు
తాత్కాలికంగా నిలిచి పోతాయి. ఈ నిలుపుదల గంటలు, రోజులు లేదా వారాలు
కావచ్చును.
వాయిదా వల్ల..
- 1. దీని వలన సభా కార్యక్రమం మాత్రమే ముగుస్తుంది. సమావేశం ముగియదు.
- 2. ఈ అధికారం సభాధ్యక్షునికి ఉంటుంది.
- 3. బిల్లులపై గానీ, సభలో విచారణలో ఉన్న ఇతర కార్య క్రమాలపై దీని ప్రభావం ఉండదు.
నిరవధిక వాయిదా (Adjournment Sine Die)
పార్లమెంట్ సమావేశాన్ని ఏ కాలపరిమితి తెలపకుండా నిరవధికంగా వాయిదా వేయడాన్ని నిరవధిక వాయిదా అంటారు. ఇంకోరకంగా చెప్పాలంటే, సభ తిరిగి ఎప్పుడు సమావేశం అవుతుందో పేర్కొన కుండా సభను వాయిదా వేయడాన్ని నిరవధిక వాయిదా అంటారు. సంబంధిత సభాధ్యక్షునికి సభను వాయిదా లేదా నిరవధిక వాయిదా వేసే అధికారం ఉంటుంది. వాయిదా వేసిన తేదీకి లేదా సమయానికి ముందు కూడా అతడు సభను తిరిగి సమావేశ పర్చవచ్చును. సభను నిరవధికంగా వాయిదా వేసినట్లయితే అతడు సభను ఎప్పుడైనా తిరిగి సమావేశపరచవచ్చును.
దీర్ఘకాలిక వాయిదా (Prorogation)
సమావేశాల కార్యక్రమాలు ముగిసిన తర్వాత సభాధ్యక్షుడు (స్పీకర్ లేదా చైర్మన్) సభను నిరవధికంగా వాయిదా వేస్తారు. కొన్ని రోజుల తర్వాత, రాష్ట్రపతి సమావేశాన్ని దీర్ఘకాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తారు. అయితే రాష్ట్రపతి సభ సమావేశంలో ఉన్నప్పుడు కూడా సభను దీర్ఘకాలికంగా వాయిదా వేయవచ్చును.
దీర్ఘకాలిక వాయిదా వల్ల..
- 1. సభా కార్యక్రమం మరియు సమావేశం రెండూ ముగుస్తాయి.
- 2. ఈ అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
- 3. దీని వలన గూడా బిల్లులపై గానీ, సభలో విచారణలో ఉన్న ఇతర కార్యక్రమాలపై గానీ ప్రభావం ఉండదు. అయితే, విచారణలో ఉన్న అన్ని నోటీసులు (బిల్లులను ప్రవేశపెట్టేవి తప్ప) దీర్ఘకాలిక వాయిదాతో రద్దవుతాయి. తదుపరి సమావేశంలో కొత్త నోటీన్లు జారీ చేయవలసి వస్తుంది. బ్రిటన్లో వాయిదా వలన అన్నీ బిల్లులు మరియు సభలో విచారణలో ఉన్న ఇతర కార్య క్రమాలు రద్దు అవుతాయి.
రద్దు (Dissolution)
శాశ్వత సభగా ఉన్న రాజ్యసభ రద్దు కాదు. లోకసభ మాత్రమే రద్దవుతుంది. దీర్ఘకాలిక వాయిదా వలే కాకుండా ‘రద్దు’ వలన ప్రస్తుత సభాజీవితం ముగుస్తుంది. సాధారణ ఎన్నికల తర్వాత కొత్త లోకసభ ఏర్పడుతుంది. లోక్ సభ రద్దు రెండు రకాలుగా ఏర్పడుతుంది. అవి:
- 1. స్వతహాగా రద్దవుతుంది. అనగా దాని కాలపరిమితి ఐదు సంవత్సరాల తర్వాత లేదా జాతీయ అత్యవసర పరిస్థితు లలో దాని కాలపరిమితి పొడగించిన షరతులను బట్టి.
- 2.. తనకున్న అధికారంతో రాష్ట్రపతి సభను రద్దు చేయడానికి ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చును. సాధారణ కాల పరిమితి కన్నా ముందే ఒకసారి లోకసభ రద్దయితే, దానిని ఉపసంహరించడం సాధ్యం కాదు.
లోక్సభ రద్దయినప్పుడు దాని ముందు లేదా దాని కమిటీలలో విచారణలో ఉన్న బిల్లులు, ప్రతిపాదనలు, తీర్మానాలు, నోటీసులు, పిటిషన్లు మొదలగునవి కూడా రద్దవుతాయి. వాటిని క్రొత్త లోక్ సభలో తిరిగి ప్రవేశపెట్టవలసి వస్తుంది. అయితే, ప్రభుత్వ
హామీల కమిటీలో పరిశీలనలో ఉన్న కొన్ని బిల్లులు మరియు హామీలు మాత్రం రద్దు కావు. లోక్ సభ రద్దయినప్పుడు వివిధ బిల్లుల మనుగడ పరిస్థితి ఈ క్రింది విధంగా ఉంటుంది.
- లోక్ సభలో విచారణలో ఉన్న బిల్లు రద్దువుతుంది. (అది లోకసభలో ప్రవేశ పెట్టినా లేదా రాజ్యసభ నుండి లోక్సభకు వచ్చినా)
- లోకసభలో ఆమోదించబడి రాజ్యసభలో విచారణలో ఉన్న బిల్లు కూడా రద్దవుతుంది.
- ఒక బిల్లు విషయంపై ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, దానిని తొలగించడానికి రాష్ట్రపతి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు లోకసభ రద్దయినా బిల్లు రద్దు కాదు.
- రాజ్యసభ పరిగణనలో ఉన్న బిల్లులు లోకసభ ఆమోదానికి రానప్పుడు, ఆ బిల్లు రద్దు కాదు.
- ఉభయ సభలచే ఆమోదింపబడి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లు రద్దు కాదు.
- ఉభయ సభలచే ఆమోదింపబడి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లు, రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్ పున: పరిశీలనకు పంపినప్పుడు కూడా బిల్లు రద్దు కాదు.
కోరం (Quorum)
సభా కార్యక్రమాలు నిర్వహించడానికి సభలో ఉండవలసిన కనీస సభ్యుల సంఖ్యని కోరం అంటారు. సభాధ్యక్షుడితో సహా మొత్తం సభలోని సభ్యులలో 10శాతం సభ్యులు సభకు హాజరైతే, దానిని కోరం అంటారు. దీనిని బట్టి లోక్ సభలో కోరం ఏర్పడటానికి కనీసం 55 మంది సభ్యులు ఉండాలి. అదే విధంగా రాజ్యసభలో 25 మంది సభ్యులు ఉండాలి. సభా సమావేశంలో కోరం లేకపోతే, అవి ఏర్పడే దాకా, సభా అధ్యక్షుడు సభని రద్దు చేయ వచ్చును లేదా సస్పెండ్ చేయవచ్చును.
సభలో ఓటింగ్
లోకసభలో కానీ లేదా రాజ్యసభలో కానీ, లేదా ఉభయసభల ఉ మ్మడి సమావేశాలలో కానీ జరిగే ఓటింగ్ ప్రక్రియ ప్రకారం సభలో హాజరై మరియు ఓటింగ్ లో పాల్గొన్న మెజారరిటీ ఓట్లను బట్టి (సభాధ్యక్షుడి మినహా) వ్యవహారాలు నిర్ణయింబడతాయి. రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొన్న కొన్ని అంశాలకి, అనగా రాష్ట్రపతిని తొలగించడం, రాజ్యాంగాన్ని సవరించడం, పార్లమెంట్ సభాధ్యక్షులను తొలగించడం వంటి అంశాలను మాత్రం సాధారణ మెజారిటీ కాకుండా ప్రత్యేక మెజారిటీ ఉండాలి.
సభాధ్యక్షుడు మొదటిసారి ఓటు వేయడు. కానీ, సభలో ఓట్లు సమానంగా ఏర్పడ్డప్పుడు అతను తన నిర్ణయాత్మక ఓటు వేస్తారు. సభలో ఏదైనా ఖాళీలు ఉన్న సభాకార్యక్రమాల నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయి.
పార్లమెంటులో భాష
సభా కార్యక్రమాలలో హిందీ మరియు ఇంగ్లీష్ ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అయితే, సభాధ్యక్షుని అనుమతితో సభ్యుడు తన మాతృభాషలో ప్రసంగించవచ్చును. దీని అనువాదానికి సభలో ఏర్పాటు ఉంటాయి. రాజ్యాంగం అమలు లోనికి వచ్చిన పదిహేను సంవత్సరాల తర్వాత (1965 తర్వాత) ఇంగ్లీష్ ని సభలో కొనసాగించరాదని భావించినప్పటికీ, అధికార భాషా చట్టం (1963) హిందీతో ఇంగ్లీష్ ని కొనసాగించాలని నిర్ణయించింది.
మంత్రులకు మరియు అటార్నీ జనరలకు గల హక్కులు
సభలోని సభ్యులే కాక, ప్రతి మంత్రికి మరియు అటార్నీ జనరల్‌కు పార్లమెంట్ లో ఏ సభలోనైనా లేదా ఉమ్మడి సమావేశంలోనైనా లేదా ఏ కమిటీలోనైనా పాల్గొనే హక్కు మరియు ప్రసంగించే హక్కు ఉన్నాయి. రాజ్యాంగ అంశాల ప్రకారం;
- 1. ఒక సభలో సభ్యుడు కాకపోయినా ఒక మంత్రి ఆ సభా కార్యక్రమాలలో పాల్గొని ప్రసంగించవచ్చును. అనగా, లోక్ సభకు చెందిన మంత్రి రాజ్యసభలో లేదా ఇతరత్రా పాల్గొనవచ్చును.
- 2. ఏ సభలో సభ్యుడు కాని మంత్రి కూడా రెండు సభలలో కార్యక్రమాల్లో పాల్గొనవచ్చును. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ఏ సభలో సభ్యత్వం లేకున్నా మంత్రిగా ఉండవచ్చును.
కుంఠిత సమావేశం (Lame duck Session)
కొత్త లోకసభ ఏర్పడిన తర్వాత ప్రస్తుత లోకసభ యొక్క చివరి సమావేశం ఇది. కొత్త లోకసభకు ఎన్నిక కాలేని ప్రస్తుత లోకసభ సభ్యులను లేమ్ డక్స్ అంటారు.
No comments:
Post a Comment