యావత్ ప్రపంచం సరికొత్త టెక్నాలజీ
యుగంలోకి ప్రవేశించింది. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ల విప్లవం తర్వాత ఇప్పుడు
కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ రంగాలు శరవేగంగా అభివృద్ధి
చెందుతూ వినియోగంలోకి వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా యంత్ర పరికరాల ఉత్పాదన తొలి
పారిశ్రామిక విప్లవానికి నాంది కాగా.. విద్యుదుత్పత్తి, వినియోగం రెండో
పారిశ్రామిక విప్లవానికి దారి తీసింది. ఆపై 20వ శతాబ్దం మధ్యకాలం నుంచి
కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీలు మూడో విప్లవానికి కారణమయ్యాయి.
నాలుగో పారిశ్రామిక విప్లవం
ప్రస్తుతం సరికొత్త టెక్నాలజీలు
నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని ఆవిష్కరించాయి. రోబోటిక్స్, బిగ్ డేటా అండ్
అనలిటిక్స్, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) తదితర న్యూ టెక్నాలజీల
అభివృద్ధి, వినియోగం ద్వారా ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక ప్రగతి సాధ్యమవుతోంది.
భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ రకమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసి,
వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రపంచ జీడీపీలో తమ వాటాలను వేగంగా
పెంచుకునేందుకు అవకాశముంది. యాక్సెంచర్ నివేదిక ప్రకారం 2035 నాటికి కృత్రిమ మేధ
ద్వారా భారత జీడీపీకి అదనంగా 957 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశముంది. ఫలితంగా దేశ
జీడీపీ 15 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంటుంది. ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ నివేదిక
ప్రకారం కృత్రిమ మేధ ద్వారా 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ అదనంగా 15.7
ట్రిలియన్ డాలర్లు పెరగనుంది. అదే విధంగా రోబోటిక్స్ రంగంలో పెట్టుబడులు, మానవ
వనరుల నైపుణ్యాలను పెంచడం ద్వారా కృత్రిమ మేధ, ఐవోటీ, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ
అభివృద్ధితో భారత్ పూర్తిస్థాయి డిజిటల్ దేశంగా అవతరించేందుకు అవకాశముంది.
దేశంలో తొలిసారిగా ఇటీవల హైదరాబాద్‌లో
జరిగిన ‘ప్రపంచ ఐటీ కాంగ్రెస్’లో అంతర్జాతీయంగా శరవేగంగా అభివృద్ధిలోకి వస్తున్న
కొత్త టెక్నాలజీలు ఆవిష్కృతమయ్యాయి. ఈ క్రమంలో డేవిడ్ హాన్సన్ అభివృద్ధి చేసిన,
కృత్రిమ మేధ ఆధారిత రోబో సోఫియా తన ప్రతిభను ప్రదర్శించింది. కృత్రిమ మేధ లాభాలు,
నష్టాలు, భయాందోళనలు తదితర అంశాలపై సదస్సులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణులు
ప్రసంగించారు.
కృత్రిమ మేధ
మనిషిలా ఆలోచించి, నిర్ణయాలు తీసుకునే
రోబోలు, యంత్రాలు, కంప్యూటర్లను అభివృద్ధి చేసే శాస్త్రసాంకేతిక విజ్ఞానమే కృత్రిమ
మేధ (ఏఐ). జాన్ మెక్‌కార్థి అనే శాస్త్రవేత్త తొలిసారిగా ఈ పదాన్ని ఉపయోగించాడు.
కేవలం సోఫియా వంటి హ్యూమనాయిడ్ రోబోలే కాకుండా కృత్రిమ మేధస్సు ద్వారా వైద్య
రంగంలో డీఎన్‌ఏ విశ్లేషణ రోబోలు, రవాణా రంగంలో డ్రైవర్ రహిత కార్లు వంటివి
ఆవిష్కృతమవుతున్నాయి. పరిశ్రమల్లో కృత్రిమ మేధ ఆధారిత అసెంబ్లీకి డిమాండ్
పెరిగింది. క్రీడారంగంలోనూ ఏఐ కీలకంగా నిలుస్తోంది. 1997లోనే చదరంగంలో గ్యారీ
కాస్పరోవ్‌ను డీప్ బ్లూ అనే కృత్రిమ మేధ యంత్రం ఓడించింది. అదే విధంగా గూగుల్
అభివృద్ధి చేసిన ‘ఆల్ఫాగో’ అనే కంప్యూటర్.. గో ఆటలో ప్రపంచ చాంపియన్ లీ సిడాల్‌ను
ఓడించింది.
కృత్రిమ మేధ.. ఉద్యోగాల కోతకు
కారణమవుతుందన్న ఆందోళన ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. కంప్యూటర్లు వినియోగంలోకి
వచ్చిన ప్రారంభంలో ఇదే రకమైన భయాందోళనలు కలిగాయి. కానీ, కంప్యూటర్ ద్వారా ప్రపంచ
వ్యాప్తంగా ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయి. మెక్‌కిన్సీ నివేదిక ప్రకారం ప్రపంచ
వ్యాప్తంగా కృత్రిమ మేధ, ఆటోమేషన్ వల్ల 2030 నాటికి 40-80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే
అవకాశముంది. అయితే వీరు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా సమస్య నుంచి
బయటపడొచ్చు. మరో అడుగు ముందుకేసి కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా
రంగంలో సరికొత్త కెరీర్ అవకాశాలను కూడా అందిపుచ్చుకోవచ్చు.
బిగ్‌డేటా
బిగ్‌డేటా, డేటా అనలిటిక్స్ రంగం కూడా
అద్భుత ప్రగతి సాధించనుంది. సాధారణ, సంప్రదాయ కంప్యూటింగ్ ప్రక్రియల ద్వారా
ప్రాసెసింగ్ చేయలేని భారీస్థాయి సమాచార వ్యవస్థలను బిగ్‌డేటా అంటారు. ప్రారంభం
నుంచి 2003 వరకు మనిషి 5 బిలియన్ గిగాబైట్ల సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురాగా,
2011లో రెండు రోజులకోసారి ఇంత మొత్తం సమాచారం ఉత్పత్తి అయింది. 2013లో ప్రతి 10
నిమిషాలకు 5 బిలియన్ గిగాబైట్ల సమాచారం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం కొన్ని
సెకన్లకే ఇంత సమాచారం ఉనికిలోకి వస్తోంది. ఇలా రోజురోజుకూ అధిక మొత్తంలో, అధిక
వేగంతో, అధిక వైవిధ్యంతో బిగ్‌డేటా అందుబాటులోకి వస్తోంది. స్టాక్ ఎక్స్ఛేంజీ
డేటా, సోషల్ మీడియా డేటా, బ్లాక్ బాక్స్ డేటా, ప్రభుత్వ డేటా, పవర్ గ్రిడ్ డేటా,
సెర్చ్ ఇంజన్ల డేటా, ఆరోగ్య, క్రీడా రంగాల డేటా- ఇలా భిన్న రూపాల్లో బిగ్‌డేటా
అందుబాటులోకి వస్తోంది. ముడి డేటాను విశ్లేషించి.. దాన్నుంచి అర్థవంతమైన సమాచారం
పొందడాకి వీలు కల్పించే విజ్ఞానమే ‘డేటా అనలిటిక్స్’. ప్రస్తుతం అమల్లో ఉన్న
వ్యూహాల పనితీరును అంచనా వేయడానికి, లోపాలను గుర్తించి భవిష్యత్తులో మరిన్ని
లాభాలు పొందేలా సరికొత్త వ్యూహాల రూపకల్పనకు ‘డేటా అనలిటిక్స్’ ఉపయోగపడుతుంది.
వాణిజ్య సంస్థలు ఇప్పటికే బిగ్‌డేటా ఆధారంగా మనుషుల వ్యక్తిగత ఆసక్తులు, ప్రజలు
ఎలాంటి ఉత్పత్తులను ఎక్కువగా ఇష్టపడుతున్నారు వంటి విషయాలను తెలుసుకుంటున్నాయి.
బిగ్‌డేటా సమాచారం ఆధారంగా
వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రకటనలు రూపొందించొచ్చు. ఆరోగ్య రంగంలో రోగుల పూర్వ
వైద్య చరిత్రను సరైన రీతిలో విశ్లేషించడం ద్వారా అస్పత్రులు త్వరితగతిన,
సమర్థవంతమైన వైద్య సేవలను అందిస్తున్నాయి. జీవుల డీఎన్‌ఏలో అపారంగా ఉన్న
సమాచారాన్ని కొన్ని నిమిషాల వ్యవధిలో అభివృద్ధి చేసేందుకు బిగ్‌డేటా అనలిటిక్స్
తోడ్పడుతుంది.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)
అతిపెద్ద సాంకేతిక విప్లవంగా నిలవనుందని అంచనా. ఇంటర్నెట్ ఆధారంగా ఎలక్ట్రానిక్
గ్యాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను దూరం నుంచే నియత్రించే వ్యవస్థను ఐఓటీ
అంటారు. ఐఓటీ ద్వారా ఆఫీస్‌లో కూర్చొని లేదా ప్రయాణిస్తూ ఇంట్లోని వాషింగ్ మెషీన్‌లను,
ఎయిర్ కండిషనర్‌లను నియంత్రించొచ్చు. ఐఓటీ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో 2025 నాటికి
2.7 నుంచి 6.2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్రగతి సాధ్యమయ్యే అవకాశం ఉంది. భారత్‌లో
ఐఓటీ ద్వారా పెనుమార్పులు జరగనున్నాయి. యాజ్-ఎ-సర్వీస్ రూపంలో ఐఓటీ అనువర్తనాలు
అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా పరిశ్రమలన్నీ వాణిజ్య నమూనాలను మార్చుకోక తప్పని
పరిస్థితి. స్మార్‌ట మీటర్ల ద్వారా విద్యుత్ ఆదా అవడంతోపాటు ప్రజలపై విద్యుత్
బిల్లుల భారం తగ్గుతుంది. వివిధ రకాల యంత్రాలకు ఐఓటీ సెన్సరు అనుసంధానిస్తే వాటి
నిర్వహణ ఖర్చు 25-30 శాతం మేర తగ్గుతుంది. ఆరోగ్య రంగంలో సుదూర ప్రాంతాల్లో వ్యాధి
నిర్ధారణ సులభతరం అవుతుంది. మొబైల్ హెల్త్ వేగంగా విస్తరిస్తుంది.
బ్లాక్ చైన్ టెక్నాలజీ
బ్లాక్ చైన్ టెక్నాలజీ
బ్లాక్ చైన్ టెక్నాలజీపై ప్రస్తుతం
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. నిరంతరం పెరిగే రికార్డు
జాబితా (బ్లాక్స్‌గా పిలుచుకొనే)లను క్రిప్టోగ్రఫీని ఉపయోగించి ఏర్పరిచే.. భద్రతతో
కూడిన అనుసంధాన, ఇంటర్నెట్ వ్యవస్థను బ్లాక్‌చైన్ టెక్నాలజీ అంటారు. ఇదొక
పూర్తిస్థాయి వికేంద్రీకరణ టెక్నాలజీ. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బ్లాక్‌చైన్
టెక్నాలజీ పైనే ఆధారపడుతుందని విశ్లేషకుల అంచనా. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర
బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగించే అవకాశం
ఉంది. దీనిద్వారా భవిష్యత్‌లో సైబర్ నేరాలను నియంత్రించొచ్చు. చిన్న వ్యాపారులు
సైతం ప్రత్యేక ట్రేడింగ్ వేదికలను ఏర్పరచుకొనే అవకాశాన్ని బ్లాక్‌చైన్ టెక్నాలజీ
కల్పిస్తుంది. పరిశ్రమల్లో కొత్త అవకాశాలతోపాటు సామర్థ్య పెంపునకు బ్లాక్‌చైన్
టెక్నాలజీ ఉపయోగపడుతుంది. బ్లాక్‌చైన్ ఆధారిత స్మార్ట్ కాంట్రాక్టుల ద్వారా
లిటిగేషన్ తగ్గి.. పారదర్శకత, నిబద్ధతలు పెరుగుతాయి. భూ లావాదేవీల్లో అవినీతి
తగ్గుతుంది.
అందిపుచ్చుకోవాలి..
అందిపుచ్చుకోవాలి..
కేతిక రంగంలో వస్తున్న పెను మార్పులను
గుర్తించి భారత్ సైతం నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. అయితే దీనికోసం ఆయా
రంగాల్లో నిపుణులైన మానవ వనరులను అభివృద్ధిలోకి తీసుకురావాలి. దేశంలోని ప్రాథమిక
విద్యను సమూలంగా మారిస్తే తప్ప.. తక్కువ సమయంలో ఆయా రంగాల్లో అంతర్జాతీయ స్థాయి
పోటీని తుట్టుకొని..వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలను అందిపుచ్చుకోలేం! ఇందులో
భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో కంప్యూటర్ విద్యను అందుబాటులోకి
తీసుకురావాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత
అభియాన్‌ను మరింత వేగంగా విస్తరించాలి. స్త్రీలలో డిజిటల్ అక్షరాస్యతను పెంచే
కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో అమలుచేయాలి. కేరళ ప్రభుత్వం అమలు చేసిన అక్షయ తరహా
కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు సైతం అమలుచేయాలి. హైస్కూల్ విద్యలో రొబోటిక్స్‌ను
ముఖ్యాంశంగా చేర్చాలి. కేవలం బోధనకే పరిమితం కాకుండా రొబోటిక్స్ యంత్రాల
రూపకల్పనలో సాంకేతికత శిక్షణపై దృష్టిపెట్టాలి. ఈ దిశగా విధ్యాభ్యాసంలో 3డీ,
మల్టీమీడియా విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలి. ఒకేషనల్ విద్యలో మెకానికల్
విద్యతోపాటు రొబోటిక్ విద్యను పెంపొందించాలి.
రోబోటిక్స్, కృత్రిమ మేధ, ఐఓటీ వంటి
అంశాల్లో వేగవంతమైన ప్రగతికి.. పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలి.
ఉన్నత విద్యను అభ్యసించేవారికి విదేశీ శిక్షణ అందించాలి. దేశీయ, విదేశీ
పెట్టుబడులను ఈ రంగాల్లో ప్రోత్సహించాలి. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు
ఇప్పుడిప్పుడే నూతన పారిశ్రామిక విప్లవం వైపు అడుగులేస్తున్నాయి. కాబట్టి మనదేశం
కూడా మానవ, సాంకేతిక వనరులను త్వరితగతిన అభివృద్ధి చే యాల్సిన అవసరం ఉంది. అప్పుడే
భారత్ ఈ నూతన పారిశ్రామిక విప్లవ ఫలాలను అందుకోగలదు.
No comments:
Post a Comment