2018 - 19 కేంద్ర బడ్జెట్ - ముఖ్యాంశాలు

         కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీరూ.24.42 లక్షల కోట్ల అంచనాలతో  లోక్సభలో 2018-19 ఆర్థిక సంవత్సర బడ్జెట్టును తేదీ: 01-02-2018 ప్రవేశపెట్టారు. గ్రామీణ భారతికి నరేంద్రమోదీ సర్కారు హారతి పట్టింది. ప్రపంచంలో అతిపెద్దదిగా నిలిచిపోయాలా... దేశంలో 50 కోట్ల మంది పేదలకు ఆరోగ్య రక్షా కవచాన్ని ప్రకటించింది. గ్రామీణ, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూ మధ్య తరగతిపై మాత్రం అంతగా దృష్టి సారించలేదు. తదుపరి సార్వత్రిక ఎన్నికల్లోగా వచ్చే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే.

        ‘వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, ఉపాధి, సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), మౌలిక సదుపాయాల రంగాలకు పెద్దపీట వేయడమే ఈ ఏడాది బడ్జెట్ దార్శనికత.’ - అరుణ్ జైట్లీ
         వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చాక రూపొందించిన బడ్జెట్లో గ్రామీణ, నగర ప్రాంతాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ కేటాయింపులను ఆయన ప్రతిపాదించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పన్నులను తగ్గించారు. ఐశ్వర్యవంతులపై సర్ఛార్జి కొనసాగుతుందని చెప్పారు. విద్యా సెస్సును పెంచుతున్నట్లు తెలిపారు. జైట్లీ ఆయా ప్రతిపాదనలను చదువుతున్నప్పుడు ప్రధాని నరేంద్రమోదీ సహా అధికార పక్ష సభ్యులంతా ఉత్సాహంగా బల్లలు చరిచారు. నవ భారతాన్ని సాకారం చేసే వాహకంగా ఈ బడ్జెట్ నిలిచిపోతుందని మోదీ ఆ తర్వాత వ్యాఖ్యానించారు.

 



         మనదేశం ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అయిదో స్థానంలో నిలిచేందుకు స్థిరంగా అడుగులు వేస్తోందని జైట్లీ చెప్పారు. ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నామని చెప్పారు. కొనుగోలుశక్తి పరంగా చూస్తే మనం ఇప్పటికే మూడో స్థానంలో ఉన్నామని చెప్పారు. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లలో సగటు వృద్ధి 7.5% ఉందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జులై-సెప్టెంబరు త్రైమాసిక గణాంకాలను పరిశీలిస్తే జీడీపీలో వృద్ధి 6.3% ఉందనీ, ఆర్థిక వ్యవస్థ మారుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయనీ చెప్పారు. జైట్లీ ప్రసంగం ఆంగ్లం, హిందీ భాషల్లో 110 నిమిషాల పాటు కొనసాగింది. వ్యవసాయం, గ్రామీణ గృహ నిర్మాణం, సేంద్రియ వ్యవసాయం తదితర రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మూడు సాధారణ బీమా సంస్థలను ఒకేసంస్థగా చేస్తామన్నారు.

         ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో దేశం 7.2 నుంచి 7.5% వృద్ధిని సాధించనుంది. తయారీ రంగం మంచి పురోగమన పథంలో పరుగులు తీస్తోంది. కీలకమైన సేవల రంగం కూడా 8% మించిన వృద్ధి శాతంతో ఉరకలెత్తుతోంది. 17-18లో ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేయనున్నాయి.’




బడ్జెట్ విశేషాలు

  • రూ.1.69 లక్షల కోట్లకు చేరనున్న ఆహార రాయితీ.
  •   అన్ని రంగాల్లో కొత్త ఉద్యోగుల తరఫున ఉద్యోగ భవిష్య నిధికి వేతనంలో 12% మొత్తాన్ని చెల్లించనున్న ప్రభుత్వం.
  • రైతులకు మరింత ఆదాయం వచ్చేలా చర్యలు.
  • డిజిటల్ భారత్కు రూ.3073 కోట్లు.
  • రూ.5.97 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి.
  • పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.80,000 కోట్లు.
  • వ్యక్తగత ఆదాయపు పన్ను శ్లాబులు, పన్ను రేట్లు యథాతథం.
  • రవాణా భత్యం, వైద్య ఖర్చులకు బదులుగా రూ.40,000 ప్రామాణిక తగ్గింపు.
  • విద్యా సెస్సు 4%.
  • మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకం 20%.
  • వ్యవసాయ రుణాల లక్ష్యం మరో రూ.లక్ష కోట్లు పెంపు.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థిక వృద్ధి 7.2 - 7.5% ఉంటుందని అంచనా. గత మూడేళ్లలో సగటు వృద్ధి 7.5%.
  • చేపల పెంపకం, పాడిపరిశ్రమ రైతులకూ కిసాన్ క్రెడిట్ కార్డులు.
  • రక్షణ రంగ బడ్జెట్ రూ.2.82 లక్షల కోట్లు.
  • 600 ప్రధాన రైల్వే స్టేషన్ల పునరభివృద్ధి.
  • పెట్టుబడి సాధనంగా బంగారాన్ని పరిగణించడానికి కొత్త విధానం.
         కేంద్రబడ్జెట్లో అత్యంత ప్రధానమైన అంశంగా ‘జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం’ నిలిచిపోనుంది. పేదలకు వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని జైట్లీ ప్రకటించారు. ఈ సరికొత్త పథకం అమలు వల్ల ద్రవ్యలోటు మాత్రం కొంత పెరగనుందని చెప్పారు. ఆరోగ్యం, విద్య, సామాజిక రక్షణ రంగాల్లో భారీగా ఖర్చు చేయనున్నట్లు ప్రతిపాదించారు. పార్టీ ఎన్నికల వాగ్దానానుసారం ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు రైతుల పెట్టుబడికి మించి కనీస మద్దతుధర లభించేలా చూస్తామన్నారు. వ్యవసాయ రుణాలు ఇంకా పెంచడంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డుల్ని- వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందినవారికీ వర్తింపజేస్తామని చెప్పారు.
         ఆదాయపు పన్ను శాతాలు, శ్లాబులను మార్చడం లేదని ఆర్థిక మంత్రి చెప్పారు. ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రస్తుతం కల్పిస్తున్న రవాణా, వైద్య ఖర్చుల మినహాయింపు బదులు ప్రామాణిక తగ్గింపు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. వయోధికులు బ్యాంకుల్లో దాచుకునే మొత్తాలపై వడ్డీకి పన్ను మినహాయింపును, ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తాలపై పన్ను ఊరటను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లు, సౌందర్య సాధనాలు సహా వివిధ వస్తువులపై సుంకాలను పెంచుతున్నట్లు తెలిపారు. రెవెన్యూ నష్టాలను భర్తీ చేసుకునేందుకు వీలుగా షేర్ల అమ్మకం ద్వారా కలిగే లాభంపై పన్నును 14 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.


         దేశ రక్షణ రంగం బడ్జెట్టును 7.81% పెంచి రూ.2.95 లక్షల కోట్లు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పొరుగుదేశాలు విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో సైనిక బలగాల అంచనాలకు తగ్గట్టుగా కేటాయింపుల్ని పెంచారు. కార్పొరేట్ పన్నును నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గిస్తామని 2015లో వాగ్దానం చేసిన మంత్రి... దానికి తగ్గట్టుగా 16-17 సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవరును నమోదు చేసిన కంపెనీలకు పన్నును 25% చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 6.5% నుంచి 6.75 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ దిగుబడిదారులు నెలకొల్పే కంపెనీలకు పన్ను మినహాయింపు వర్తింపజేస్తామని చెప్పారు.


వివిధ రంగాలు - కేటాయింపులు - ముఖ్యాంశాలు

రైల్వే
         ప్రతిచోటా సాంకేతిక వినియోగంపై దృష్టి పెట్టాం. ప్రయాణికులకు భద్రత అందిస్తాం. రైల్వేశాఖలో నిధులు అనేది సమస్యే కాదు. అన్ని రైళ్లలోని అన్ని పెట్టెల్లో సీసీటీవీ కెమేరాలు, వైఫై ఏర్పాటు చేయాలన్నదే నా లక్ష్యం. - పీయూష్ గోయల్, రైల్వే మంత్రి
          రైల్వేల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలంటే ఎస్కలేటర్లు, వైఫై, సీసీటీవీ కెమేరాలు వంటివి చాలా కీలకం. ప్రపంచ స్థాయి సిగ్నలింగ్ వ్యవస్థ, ఆధునికత, మౌలిక వసతుల స్థాయిపెంపు వంటివి ఇప్పటికప్పుడు అత్యవసరం. - భరత్ సల్హోత్రా, వైస్ ప్రెసిడెంట్, అల్స్టోమ్ ఆసియా పసిఫిక్


  • రైల్వేల వ్యవస్థాగత సామర్థ్యం పెంపు, ప్రయాణికుల భద్రతకు కేంద్రం పెద్దపీట వేసింది. 2018-19 బడ్జెట్లో ఆ శాఖకు మూలధన వ్యయంగా రూ.1,46,500 కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్లో సవరించిన అంచనాలకంటే ఇది 22% ఎక్కువ. కేటాయింపుల్లో సింహభాగాన్ని సామర్థ్య పెంపు కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. ముఖ్యంగా 18 వేల కిలోమీటర్ల మేర రెండు, మూడు, నాలుగు లైన్ల మార్గాలను ఏర్పాటుచేస్తారు. 5 వేల కిలోమీటర్ల మేర గేజ్ మార్పు చేపడతారు. ఇది పూర్తయితే, రైల్వే నెట్వర్క్ మొత్తం దాదాపు బ్రాడ్గేజ్గా రూపాంతరం చెందినట్లవుతుంది.
  • భద్రతా చర్యల్లో భాగంగా అన్ని స్టేషన్లు, రైళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేస్తారు.
  • ఆయా చోట్ల క్రమంగా వై-ఫై సదుపాయాన్నీ అందుబాటులోకి తెస్తారు.
  • భారతీయ రైల్వేస్టేషన్ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యాన 600 ప్రధాన స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తారు.
  • నిత్యం 25 వేల మంది రాకపోకలు సాగించే స్టేషన్లన్నింటిలో ఎస్కలేటర్లను అందుబాటులోకి తెస్తారు.
  • పెరంబూర్లోని కోచ్ల తయారీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యాధునిక, ప్రపంచ స్థాయి వసతులతో కూడిన బోగీలు సిద్ధమవుతున్నాయి. వీటిని 2018-19లో పట్టాలెక్కిస్తారు.
  • 2017-18లో లక్షించిన 4,000 కిలోమీటర్ల రైల్వేమార్గం విద్యుదీకరణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని జైట్లీ పేర్కొన్నారు. ఇది పూర్తయితే ఏటా రూ.10 వేల కోట్లు ఆదా అవుతాయి.
  • తూర్పు, పశ్చిమ సరకు రవాణా కారిడార్లలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2018-19లో 12,000 వ్యాగన్లు, 5,160 కోచ్లు, రమారమి 700 ఇంజిన్లను ఉత్పత్తి చేస్తారు. ప్రైవేటు సంస్థల తోడ్పాటుతో గూడ్స్షెడ్ల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కార్యాచరణ అమలవుతోంది.
  • రైల్వే కేటాయింపుల్లో రూ.53,060 కోట్లను కేంద్రం బడ్జెట్ ద్వారా సమకూర్చుతుంది.
  • అంతర్గత వనరుల రూపంలో రూ.11,500 కోట్లు, ఐఆర్ఎఫ్సీ ద్వారా రూ.25,500 కోట్లు, ఎల్ఐసీ నుంచి రూ.26,440 కోట్లు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పెట్టుబడుల రూపేణా రూ.27,000 కోట్లు సమీకరిస్తుంది.
  • ప్రస్తుత కేటాయింపులు... యూపీఏ సర్కారు చివరిసారిగా 2013-14లో కేటాయించిన రైల్వేబడ్జెట్ కంటే రూ.92,511 కోట్లు అధికం!
  • సిబ్బంది నిర్లక్ష్యం వల్లే 60% రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి.
  • మనదేశంలో ఏటేటా రైలు ప్రమాదాలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ, రైల్వే భద్రత మనదేశంలో ఇంకా పెద్ద సమస్యేనని ప్రపంచ బ్యాంకు కొంతకాలం క్రితం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదాల నివారణకు కొన్ని సూచనలూ ఇచ్చింది.
  • 2012 నుంచి ఇప్పటివరకూ జరిగిన ప్రతి 10 రైలు ప్రమాదాల్లో ఆరింటికి ప్రధాన కారణం... రైల్వే సిబ్బంది నిర్లక్ష్యమేనని నీతి ఆయోగ్ అధ్యయనంలో తేలింది.
  • 2016-17 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 104 ప్రమాదాల్లో 66 సంఘటనలకు రైల్వే సిబ్బంది అశ్రద్ధ కారణమని భారతీయ రైల్వే గణాంకాలు పేర్కొంటున్నాయి.
  • మనదేశంలో 66,030 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గముంది. 10,773 లోకోలు, 63,046 కోచ్లు, 2.45 లక్షల గూడ్సు వ్యాగన్లు ఉన్నాయి. రైల్వే సిబ్బంది సంఖ్య 7 లక్షలు. రోజూ 2.3 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. గూడ్సు రైళ్లు సరేసరి. ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న తప్పు జరిగినా... భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఇటీవల భద్రతపై రైల్వే బోర్డు అధికంగా దృష్టి సారించింది.
  • 2017-18 బడ్జెట్లో ‘రాష్ట్రీయ రైల్ సుంరక్షా కోష్’ పేరుతో లక్ష కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ సొమ్ముతో ఐదేళ్లపాటు రైలు భద్రతకు అవసరమైన చర్యలు చేపడతారు.
  • రైల్వే మూలధన వ్యయం రూ.1.48లక్షల కోట్లు.
  • ముంబయిలో అర్బన్ రైల్వే వ్యవస్థ ఆధునికీకరణకు రూ.లక్ష కోట్లు.
  • దేశవ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి.
  • 18వేల కిలోమీటర్ల మేర రైల్వేలైన్ డబ్లింగ్.
  • గతంలో ఎన్నడూ లేనంతగా ట్రాక్ ఆధునికీకరణకు కేటాయింపులు జరిపింది. ఈమేరకు రెండేళ్లలో బ్రాడ్గేజి మార్గాల్లో ఉన్న 4,267 కాపాలాదారుల్లేని లెవెల్ క్రాసింగ్లన్నింటినీ తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే భద్రత రీత్యా ఎల్హెచ్బీ కోచ్లకు మళ్లనున్నారు. ప్రపంచస్థాయి సిగ్నలింగ్, రైలు రక్షణ - హెచ్చరిక వంటి ఆధునిక సాంకేతిక విధానాలను విస్తరించేందుకు చర్యలు చేపడతారు.
  • సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ సమగ్ర పరిశీలనకు ప్రభుత్వం రూ. 2,025 కోట్లు కేటాయించింది.
  • * భద్రతకు సంబంధించి ‘రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ (ఆర్ఆర్ఎస్కే)’ నిధి సహా 2018-19లో రూ. 73,065 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. 2017-18 సవరించిన అంచనాల్లో ఇది రూ. 68,725 కోట్లుగా ఉంది. ఇందులో ఆర్ఆర్ఎస్కేకు వివిధ మార్గాల్లో రూ. 20 వేల కోట్లు సమకూరుస్తారు.
  • * 2017-18లో 3,600 కిలో మీటర్ల ట్రాక్ ఆధునీకరణకు రూ. 9,305 కోట్లు ఖర్చుపెట్టగా ఈసారి రూ. 11,450 కోట్లతో 3,900 కి.మీ.ల పునరుద్ధరణ లక్ష్యం.
  • * బడ్జెట్ ముంబయి, బెంగళూరు నగరాలకు ఆనందం పంచింది. ముంబయి సబర్బన్ ప్రాంతంలో రైల్వేసేవల విస్తరణలో భాగంగా 90 కిలోమీటర్ల మేర మార్గాన్ని రూ. 11 వేల కోట్లతో జంటగా (డబ్లింగ్) చేస్తారు. ముంబయిలో లోకల్ రైల్వే నెట్వర్క్ విస్తరణలో భాగంగా రూ. 40 వేల కోట్లతో 150 కిలోమీటర్ల కొత్త సబర్బన్ వ్యవస్థను నిర్మిస్తారు. దీంతో ‘ముంబయికి సంబరాలు’ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ ట్వీట్ చేశారు. అలాగే బెంగళూరులో రూ. 17 వేల కోట్లతో 160 కిలోమీటర్ల సబర్బన్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తారు. దీంతో నగర వాసుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
  • గత ఏడాది ముంబయి-అహ్మదాబాద్ల మధ్య భారత తొలి అత్యంత వేగవంతమైన రైలు ప్రాజెక్టు (బుల్లెట్ ట్రైన్)కు ప్రధాని శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు వేగవంతమైన రైలు ప్రాజెక్టులకు అవసరమయ్యే నిపుణుల తయారీ కోసం గుజరాత్లోని వడోదరలో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు.
  • 2018-19లో రైల్వే ఆదాయం రూ. 2,01,090 కోట్లకు చేరుతుందని లెక్కించారు. ఇది గతేడాది కంటే 7% అధికం.
  • 2017-18లో 96%గా ఉన్న నిర్వహణ నిష్పత్తి (ఆపరేటింగ్ రేషియో)ని ఈసారి 92.8%కి తగ్గించాలన్నది లక్ష్యం. దీనివల్ల రూ. 12,990 కోట్లు ఆదా అవుతుందని అంచనా.
  • సరకు రవాణా లక్ష్యం 51 మిలియన్ టన్నులు. ప్రయాణికుల రవాణా ద్వారా రూ. 52 వేల కోట్లు, సరకు రవాణా ద్వారా రూ. 1,21,950 కోట్ల ఆదాయం ఆర్జించాలన్నది లక్ష్యం.
  • 2017-18లో సవరించిన అంచనాల మేరకు వ్యాగన్ల ఉత్పత్తి 7,120 కాగా ఈసారి 68.5 శాతం వృద్ధితో 12,000 వ్యాగన్లకు లక్ష్యం నిర్దేశించారు.
  • మొత్తం రెవెన్యూ వ్యయం 2018-19లో రూ. 1,88,100 కోట్లకు చేరనుంది. ఇది గతం కంటే 4% అధికం. ఇందులో అత్యధికంగా రూ. 1,38,000 కోట్లు సాధారణ పనుల కోసమే ఖర్చు కానుంది. పింఛను ఫండ్కు రూ. 47,500 కోట్లు వెళ్లనుంది.
  • ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు కేంద్రం 50% మేర నిధులను పెంచింది. 2017-18లో రూ.1,100.90 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.1,657 కోట్లను ఇందుకు కేటాయించింది. రైలు ప్రయాణాన్ని, సేవలను మెరుగుపరిచే క్రతువూ ఆశాజనకంగానే కనిపిస్తోంది. ప్రపంచస్థాయి అత్యాధునిక వసతులతో మెరుగులద్దుకుని... గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ‘ట్రైన్-18’ ఈ ఏడాదే పట్టాలకెక్కనుంది. జర్మనీకి చెందిన లింకే హాఫ్మన్ బష్ సంస్థ దీనిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారుచేస్తోంది. దీని తర్వాతి తరం రైలుగా చెబుతున్న ‘ట్రైన్-20’ కూడా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది.
  • 2020 నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇలాంటివి కనీసం వంద రైళ్లనైనా దేశీయంగా ఉత్పత్తి చేయడమే తన లక్ష్యమనీ, శతాబ్ది, రాజధాని ఎక్స్ప్రెస్ల స్థానంలో ఇవి త్వరలోనే పరుగులు పెడతాయని ఆశాభావం వ్యక్తంచేశారు... రైల్వే మంత్రి పీయూష్ గోయల్! ఏడాదిలోగా 600 ప్రధాన రైల్వేస్టేషన్లను పునరాభివృద్ధి చేయాలనీ సర్కారు నిర్దేశించుకుంది. పరిశుభ్రమైన తాగునీరు, వైఫై, ఆధునికీకరించిన నిరీక్షణ గదులు, టీవీలు, ప్రయాణికుల సమాచార కియోస్క్లు వంటి సదుపాయాలతో వాటిని ప్రపంచస్థాయి స్టేషన్లుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం.


తెలుగు రాష్ట్రాలు - రైల్వే
  • ఆంధ్రప్రదేశ్కు కొత్త రైల్వే జోన్ విషయంలో మరోసారి నిరాశే ఎదురైంది. రెండు, మూడేళ్లుగా కొత్త జోన్ ఏర్పాటుపై ఊరిస్తూనే ఉన్నారు. 2018-19లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కొత్త లైన్లు, రెండో(డబ్లింగ్) లైన్లు, విద్యుదీకరణ పనుల్లోనూ ఏపీకి ప్రాధాన్యం లభించలేదు. ఓబుళవారిపల్లి- వెంకటాచలం 95 కిలోమీటర్ల కొత్త లైను మార్గాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం ఒక్కటే ఊరట. కొత్త రైళ్లను ప్రకటించడం, ఇప్పుడున్న రైళ్లను ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు పొడిగించకపోవడం అసంతృప్తికి కారణమవుతోంది. కొత్త రైళ్ల ప్రారంభ అంశం బడ్జెట్తో నిమిత్తం లేదని, అవసరాలకు తగినట్లు, సమయానుకూలంగా ప్రవేశపెడుతున్నామని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. రాజధాని అమరావతికి వేగంగా రాకపోకల కోసం రాయలసీమ నుంచి, విశాఖపట్నం నుంచి శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం రెండేళ్లుగా కోరుతోంది. సమీప భవిష్యత్తులో కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితులు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  • కొత్త లైన్లు.. డబ్లింగ్, త్రిబ్లింగ్ ప్రాజెక్టుల మంజూరు, నిర్మాణంలో ఉన్నవాటికి నిధుల కేటాయింపుపై ఐదో తేదీన పూర్తి వివరాలతో స్పష్టత వస్తుందని దక్షిణమధ్య రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ బడ్జెట్లో రైల్వే కేటాయింపులకు సంబంధించిన స్వరూపమే వెల్లడైందని వివరిస్తున్నాయి. బడ్జెట్లో ప్రకటించిన అంశాల్లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పూర్తిచేయనున్న కొత్త రైలు మార్గాలు, డబ్లింగ్, విద్యుదీకరణ పనులను పేర్కొన్నారు. వాటిని పరిశీలిస్తే.. కొత్త లైన్లలో వేయి కిలోమీటర్లలోపు పనులను పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 13 ప్రాజెక్టులు ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది ఓబుళవారిపల్లి-వెంకటాచలం (95 కిమీ) ఒక్కటే కావడం గమనార్హం. గేజ్ మార్పిడి(1,000 కిమీ) 12 ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి సంబంధించినవి లేవు. డబ్లింగ్ పనుల్లో 32 ప్రాజెక్టులుంటే రాష్ట్రం నుంచి దేవరపల్లి- పెనుగొండ ఒక్కటే ఉంది. విద్యుదీకరణ పనులు పూర్తయ్యే మార్గాల్లో దేశవ్యాప్తంగా 74 ఉంటే రాష్ట్రం నుంచి రెండింటికి చోటు లభించింది. గుంతకల్లు- కల్లూరు మధ్య విద్యుదీకరణ పనులు ఏడాదిలో పూర్తవుతాయి.
  • నడికుడి-శ్రీకాళహస్తి కొత్త రైల్వేలైను ప్రాజెక్టులో 28.04 కి.మీ.మేర పిడుగురాళ్ల నుంచి రొంపిచర్ల వరకు 2017-18లోనే పూర్తిచేయాల్సి ఉన్నా పనులు ఆలస్యమవుతున్నాయి. రొంపిచర్ల- శావల్యపురం 17.19 కి.మీ. 2018-19లో పూర్తి చేయాలని గతంలోనే దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. 2018-19 నాటికి పూర్తిచేసే జాబితాలో వీటికి చోటు దక్కలేదు.
  • విజయవాడ-గుడివాడ-మచిలీపట్నం-భీమవరం/నరసాపురం-నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనుల్లో గుడివాడ-భీమవరం 55 కి.మీ. మార్గాన్ని 2018-19లో పూర్తిచేయాల్సి ఉన్నా తాజా జాబితాలో చోటు దక్కలేదు.
  • తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు ఈసారీ ప్రాధాన్యం లభించలేదు. విద్యుద్ధీకరణలో మాత్రం రెండింటికి చోటు లభించింది. కొత్త రైళ్లకు బడ్జెట్తో నిమిత్తం లేదని, ప్రయాణికుల అవసరాలను బట్టి ప్రారంభిస్తామని రైల్వేవర్గాలు చెబుతున్నప్పటికీ సమీప భవిష్యత్తులో తెలంగాణ నుంచి కొత్త రైళ్లు ప్రారంభించే పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త ప్రాజెక్టుల మంజూరు, నిర్మాణంలో ఉన్నవాటికి నిధులపై జోన్ల వారీగా పూర్తి వివరాలు 5వ తేదీన స్పష్టత వస్తుందని రైల్వేవర్గాలు పేర్కొన్నాయి.
  • పూర్తిచేసే అవకాశం ఉన్నా..: 2012-13లో అక్కన్నపేట-మెదక్ కొత్తలైన్ మంజూరైంది. దూరం 17.20 కిలోమీటర్లే. రూ.117.75 కోట్లు ఖర్చుచేస్తే సరిపోతుంది. ఈ ఏడాది పూర్తిచేసే ప్రాజెక్టుల జాబితాలో దీనికి చోటు దక్కలేదు. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రెండోదశ ప్రాజెక్టు ప్రస్తావన కూడా లేదు.
  • హైదరాబాద్పైనా చిన్నచూపు!: బెంగళూరు, ముంబయి మహానగరాల్లో మెట్రో ఇతర రైల్వే లైన్ల విస్తరణ కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంపై మాత్రం మమకారం చూపించలేకపోయింది. నగరానికి ఎంతో ముఖ్యమైన చర్లపల్లి, నాగులపల్లి రైల్వే టెర్మినల్ పనులు ఈ ఏడాది పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఎంఎంటీఎస్ రెండోదశకు కూడా చోటు దక్కలేదు.
  • సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయడానికి భారీ ప్రణాళికలు సిద్ధం చేసినా ఈ ఏడాదైనా కేటాయింపులుంటాయా అనేది అంతుపట్టని అంశంగా ఉంది.
  • నాగులాపురం దగ్గర మరో రైల్వే టెర్మినల్ కట్టాలని నిర్ణయించారు. ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు.
  • హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు రైల్వే లైను నిర్మాణాన్ని కూడా రైల్వే పట్టించుకోవడంలేదు.
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్టేషన్గా మారుస్తామని ఏడేళ్ల కిందటే ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు.

వ్యవసాయం


  • ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. రైతులను ఆదుకునే ప్రయత్నం చేశారు. 2018-19లో వ్యవసాయ రుణాలకు రూ.11 లక్షల కోట్లు కేటాయించారు. గతంలో రుణాల కేటాయింపు రూ.10లక్షల కోట్లు కాగా ఈసారి మరో లక్ష కోట్లు పెంచారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఆశయంతో ఉన్నామనీ, ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నామని జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పటికీ రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఖరీఫ్ పంటలకు ఉత్పత్తి ధరకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇస్తామన్నారు.
  • గ్రామీణ వ్యవసాయ మార్కెట్లకు రూ.2000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సుమారు 22వేల చిన్న చిన్న మార్కెట్లను గ్రామీణ వ్యవసాయ మార్కెట్లుగా అభివృద్ధి చేసేందుకు ఈ నిధులను ఉపయోగిస్తారు. ఈ-నామ్ (ఎలక్ట్రానికల్లీ లింక్డ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) కార్యక్రమం కింద 585 హోల్సేల్ మార్కెట్లలో 470 మార్కెట్లను ఈ-నామ్కు అనుసంధానం చేశామని... 2018 మార్చి నాటికి మిగతా వాటిని అనుసంధానం చేస్తామని జైట్లీ వెల్లడించారు.
  • మత్స్య, పశు సంవర్థక శాఖలకు రూ.10 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేశారు. రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. ఇక నుంచి చేపలు, పశు పెంపకం దారులకూ కిసాన్ క్రెడిట్ కార్డులు విస్తరిస్తామని జైట్లీ తెలిపారు. జాతీయ వెదురు పరిశ్రమల కోసం రూ.1290 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. వెదురును ‘గ్రీన్ గోల్డ్’గా పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయేతర ఆదాయం పెంచేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న, నైపుణ్యం లేని యువతకు ఉపాధి అవకాశాల కోసం వెదురు పరిశ్రమ అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
  • ఆహార శుద్ధి రంగానికి ఈ బడ్జెట్లో రూ.1400 కోట్లను కేటాయించారు. 42 మెగా ఫుడ్ పార్కులను పటిష్ఠం చేస్తామని చెప్పారు. ఆహార శుద్ధి, వాణిజ్య శాఖలతో కలిసి వ్యవసాయ ఉత్పత్తుల క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రీన్ క్లస్టర్ల కోసం రూ.500 కోట్లను కేటాయించారు. దీని ద్వారా త్వరగా పాడైపోయే టమాట, ఉల్లి తరహా ఉత్పత్తుల ధరల్లో భారీ హెచ్చు తగ్గులు రాకుండా చర్యలు తీసుకుంటారు. దీని వల్ల వినియోగదారులకు, ఉత్పత్తిదారులకు లాభం కలుగుతుంది. క్లస్టర్ విధానంలో భాగంగా వ్యవసాయాభివృద్ధికి చర్యలు చేపడతామని జైట్లీ హామీ ఇచ్చారు. హార్టీ కల్చర్కూ తగిన ప్రాధాన్యమిస్తామన్నారు. వైద్య పరమైన, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కల సేద్యానికి రూ.200కోట్లు కేటాయించారు. సేంద్రీయ వ్యవసాయంతో మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు. స్వయం సహకార సంఘాలను సేంద్రీయ వ్యవసాయం దిశగా ప్రోత్సహిస్తామని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానాన్ని సరళీకరిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు.

వ్యవసాయ శాఖలో పథకాలు...

* సుస్థిర వ్యవసాయ జాతీయ మిషన్
* రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
* ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
* జాతీయ ఆహార భద్రత మిషన్
* వ్యవసాయ విస్తరణ, సాంకేతిక మిషన్
* నూనెగింజలు, ఆయిల్పామ్ మిషన్
* పరంపరాగత కృషి వికాస్ యోజన
* ప్రధానమంత్రి కృషి సించాయి యోజన
 ఉద్యాన శాఖలో పథకాలు...
* ఉద్యానాభివృద్ధి మిషన్
* నూనె గింజలు, ఆయిల్పామ్ మిషన్
* రాష్ట్రీయ కృషి వికాస యోజన
* ప్రధానమంత్రి కృషి వికాస యోజన

రైతులకు మద్దతు ధర
  • రైతులకు భారీ భరోసా లభించింది. వ్యవసాయ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం పరిష్కారం దిశగా ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది. గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్న రైతులకు ఉపశమనం కలిగించే చర్య చేపట్టింది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను సాగు వ్యయం కన్నా కనీసం ఒకటిన్నర రెట్లు అధికంగా స్థిరపర్చనున్నట్లు వెల్లడించింది. రబీ పంటలకు ఇప్పటికే వర్తింప చేసిన ఈ సూత్రాన్ని తాజాగా ఖరీఫ్ పంటలకూ ప్రకటించడంతో దాదాపు పంటలన్నింటికీ గిట్టుబాటు ధర కల్పించినట్లయింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇది కీలక ముందడుగు. వరి, జొన్న, సోయాబీన్, కంది వంటి పంటలు ఖరీఫ్ సాగులోకి వస్తాయి. కనీస మద్దతు ధర పెంపు సరిపోదని చెప్పిన ఆర్థిక మంత్రి జైట్లీ.. రైతుల పంటలకు తగిన ధర లభించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో నీతిఆయోగ్ సంప్రదించి ఒక పకడ్బందీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సమస్యల సుడి నుంచి వ్యవసాయ రంగాన్ని ఒడ్డున పడేయడానికి ఇంకా పలు చర్యలను ప్రభుత్వం ప్రకటించింది.
  • వ్యవసాయ రుణాల లక్ష్యం వచ్చే ఆర్థిక సంవత్సరానికి పదిశాతానికి అంటే రూ.11లక్షల కోట్లకు పెంపు.
  • త్వరగా పాడయిపోయే బంగాళదుంప (ఆలూ), టమాటా, ఉల్లి వంటి పంటల ధరల్లో అనూహ్య హెచ్చు తగ్గుల సమస్య పరిష్కారానికి ‘ఆపరేషన్ గ్రీన్స్’ పేరుతో రూ.500 కోట్ల కేటాయింపు.
  • కౌలు రైతులకు రుణ సౌకర్యం లభించేందుకు వీలుగా తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్న నీతి ఆయోగ్.
  • ఔషధ, సుగంధ మొక్కల వ్యవస్థీకృత సాగుకు, సంబంధిత పరిశ్రమకు రూ.200 కోట్ల కేటాయింపు.
  • వినియోగదారులకు రైతులు నేరుగా విక్రయించుకోవడానికి, టోకు కొనుగోళ్లకు వీలుగా 22వేల గ్రామీణ సంతలు.. గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు(గ్రామ్స్)గా అభివృద్ధి.
  • గ్రామ్స్, 585 మార్కెట్ కమిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.2000 కోట్లతో నిధి ఏర్పాటు. మార్కెట్ కమిటీల నిబంధనల నుంచి గ్రామ్స్కు మినహాయింపు.
  • మత్స్య, పశుపాలన రైతుల పెట్టుబడి అవసరాలు తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డుల సౌకర్యం. వీరికీ వడ్డీ రాయితీ ప్రయోజనం. ఈ రెండు రంగాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10వేల కోట్లు.
  • ఆకుపచ్చ బంగారమైన వెదురు రంగాన్ని సమగ్రంగా ప్రోత్సహించేందుకు రూ.1290 కోట్లతో పునర్వ్యవస్థీకరించిన జాతీయ వెదురు కార్యక్రమం ప్రారంభం. అటవీయేతర భూముల్లో పెంచే వెదురుకు చెట్ల నిర్వచనం నుంచి మినహాయింపు.
  • పెద్ద క్లస్టర్లలో సేంద్రియ సాగు చేసే ఫార్మర్ ప్రొడ్యూసర్ సంస్థ(ఎఫ్పీఓ)లు, గ్రామీణ ప్రొడ్యూసర్ సంస్థ(వీపీఓ)లకు ప్రోత్సాహం.
  • జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద మహిళా స్వయం సహాయక సంఘాలు కూడా సేంద్రియసాగు చేసేలా ప్రోత్సాహం.
  • పరిమళ ద్రవ్యాలు, సుగంధ నూనెలు, సంబంధిత ఇతర ఉత్పత్తులు తయారు చేసే చిన్న, కుటీర పరిశ్రమలకు సహాయం.
  • వాయు కాలుష్యంతో సతమతమవుతున్న హరియాణ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, దిల్లీకి తోడ్పాటునందించడానికి, పంట వ్యర్థాల సమస్య పరిష్కారం కోసం అవసరమయ్యే యంత్రాలను రాయితీపై అందించడానికి ప్రత్యేక పథకం.
  • ఖరీఫ్ పంటలకూ మద్దతు ధర పెంపు, రైతుల ఆదాయం రెట్టింపు దిశగా కీలక ముందడుగు, సాగు రుణాలు రూ.11లక్షల కోట్లు.
  • గ్రామీణ వ్యవసాయ మార్కెట్లుగా 22వేల సంతలు, పాడి రైతులకూ కిసాన్ క్రెడిట్ కార్డులు, వెదురు పరిశ్రమ ప్రోత్సాహానికి రూ.1290 కోట్లు, పరిమళ పరిశ్రమలకు ఊతం.
  • సేంద్రియ బాటలో స్వయం సహాయక సంఘాలు, పెద్ద క్లస్టర్లలో సేంద్రియ సాగుకు ప్రోత్సాహం, పంట వ్యర్థాల సమస్య పరిష్కారానికి రాయితీపై యంత్రాలు.
  • పంట ధరలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుంటాయి. చెమటోడ్చి పండించిన పంట- అమ్మటానికి వచ్చేసరికి ధర పలక్కపోతే రైతు కుంగిపోతాడు. అందుకే ఏటా రైతుల ఉత్పత్తులకు ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తుంది.
  • పంటలను మద్దతు ధరకు కొంటారా లేదా.. కొంటే ఎంతమేరకు కొంటారనే అంశాలపై కేంద్ర బడ్జెట్లో స్పష్టత రాలేదు. ‘మార్కెట్ జోక్యం పథకం-మద్దతు ధర పథకం’(ఎంఐఎస్-పీఎస్ఎస్) అనే రెండు రకాల పథకాల పేరుతో ఇప్పటివరకూ కేంద్రం పంటలను కొంటోంది. వీటికి 2018-19కి రూ.200 కోట్లనే కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.950 కోట్లకన్నా బాగా తగ్గించింది. రెండు పథకాలను కలిపి వచ్చే ఏడాదినుంచి ‘మార్కెట్ హామీ పథకం’(ఎంఏఎస్) పేరుతో కొత్తదాన్ని తెస్తామని ఇటీవల రాష్ట్రాల మార్కెటింగ్ శాఖల అధికారులతో కేంద్ర వ్యవసాయశాఖ చర్చలు జరిపింది. ఇది అమల్లోకి వస్తే మద్దతు ధర జాబితాలో ఉండే 23 రకాల పంటలను రాష్ట్రాలే సొంత నిధులతో తొలుత కొనాలి. వాటిని తిరిగి అమ్ముకున్నపుడు నష్టమొస్తే, ఆసొమ్ములో 40 శాతం ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది.
            అంగీకరించని తెలుగు రాష్ట్రాలు: ఈపథకానికి తెలుగు రాష్ట్రాలు అంగీకరించడం లేదు. పంటలు తిరిగి అమ్మినపుడు పెద్దగా నష్టాలు రావన్న ఉద్దేశంతోనే బడ్జెట్లో రూ.200 కోట్లనే కేటాయించి ఉండవచ్చని తెలుగు రాష్ట్రాల మార్కెటింగ్ అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నష్టపోయిన సొమ్ములో 55శాతం ఇస్తే సిద్ధమని పలు రాష్ట్రాలు తెలిపాయి. కేంద్రం దీనికింకా అంగీకరించలేదు. మరోవైపు వ్యవసాయ మార్కెట్లను ఆన్లైన్ వేదికలోకి తెచ్చి ఆన్లైన్ కొనుగోళ్లను పెంచేందుకు రూ.1050 కోట్లను కేంద్రం కేటాయించింది. వీటితో దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లను ఆధునికీకరించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంది.
         హరియాణ పథకం.. ఇక దేశమంతా!: వచ్చే ఏడాది నుంచి ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, టమాటాలకు కనీసధర ఇచ్చేలా కొత్తగా ‘ఆపరేషన్ గ్రీన్స్’ అనే కొత్త పథకాన్ని అమలు చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. జనవరి ఒకటోతేదీ నుంచి 4 రకాల పంటలకు హరియాణలో ఇలాంటి పథకాన్నే అక్కడి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అందులో ఒక పంటను తగ్గించి 3పంటలను కేంద్రం ‘ఆపరేషన్ గ్రీన్స్’ను ప్రకటించింది. కేంద్రం ప్రకటించే మద్దతు ధరల జాబితాలో లేని ఇతర పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు హరియాణ ప్రభుత్వం ‘భవంతర్ బర్పయి యోజన’(బీబీవై) పథకాన్ని గతనెల 1నుంచి అమలు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్టు కింద టమాటా, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, క్యాలీఫ్లవర్ పంటలను దీని అమలుకు ఎంపిక చేశారు.

  • మద్దతు ధర అంటే: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కన్నా మార్కెట్ ధరలు పడిపోయినప్పుడు సేకరణ సంస్థలు బరిలో దిగి తామే పంటల్ని సేకరిస్తాయి. ఖరీఫ్, రబీ, చెరకు, ముడి జనుము, కొబ్బరి.. ఇలా మొత్తం పంటలన్నింటినీ 5 విభాగాలుగా వర్గీకరించి మద్దతు ధర ప్రకటిస్తారు.

  • సేకరణ: భారత ఆహార సంస్థ, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్. వరి, గోధుమ సేకరిస్తారు. మిగతా పంటలు అంతగా పట్టించుకోవు.

  • అమలు: పంటలను ప్రభుత్వానికి అమ్ముతున్న రైతులు 5.8%

  • నిధుల కొరత వల్ల కొన్ని రాష్ట్రాలు పంటలను మద్దతు ధరకు సేకరించటం లేదు. ప్రైవేటులో అమ్మే వారికి గిట్టుబాటు ధర లభించడం లేదు.

పంటలబీమా పథకాలు

  • పంటలబీమా పథకాల అమలుకు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు పెద్దగా లేదు. 2018-19కి రూ.13 వేల కోట్లు కేటాయించింది. ప్రధాన మంత్రి పంటల బీమా పథకం(పీఎంఎఫ్బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా(డబ్ల్యుబీసీఐ) పథకం పేరుతో 2రకాలుగా అమలు చేస్తున్నారు. కేంద్రం విధించిన లక్ష్యాలకు తెలుగు రాష్ట్రాలు దూరంగా ఉండటంతో తక్కువగా నిధులు రానున్నాయి.
  • పీఎంఎఫ్బీవై కింద వరి ఎకరానికి తెలంగాణలో రూ.25 వేలు విలువగా నిర్ణయించి బీమా చేయించాలి. పీఎంఎఫ్బీవై పథకంలో ఖరీఫ్లో 2, రబీలో 1.5 శాతమే రైతు చెల్లిస్తారు. అంతకన్నా ఎక్కువున్న సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి. ఇందుకు 2018-19కి కేంద్రం వాటాగా పీఎంఎఫ్బీవై పథకానికి రూ.13 వేల కోట్లు అవసరం కావచ్చని కేటాయించారు.
  • 2016-17 బడ్జెట్లో పీఎంఎఫ్బీవై పథకానికి రూ.5500 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ సొమ్ముతో దేశవ్యాప్తంగా 30 శాతం విస్తీర్ణానికి బీమా చేయించాలన్నది లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో 22, తెలంగాణలో 10శాతం విస్తీర్ణానికే రైతులు బీమా ప్రీమియం కట్టారు. దేశమొత్తమ్మీద 30 శాతం విస్తీర్ణానికి రైతులు ప్రీమియం కట్టారని ఇందుకోసం చివరికి రూ.13,240 కోట్లు సవరించిన 2016-17 బడ్జెట్లో ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. దీన్నిబట్టి 30 శాతం విస్తీర్ణానికి రైతులు ప్రీమియం కట్టి బీమా చేయిస్తేనే రూ.13,240కోట్లు అవసరమని తేలింది. 2018-19లో 50శాతం విస్తీర్ణం పంటలకు రైతులు ప్రీమియం చెల్లించేలా చూసి బీమా పరిధిలోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

బిందుసేద్యానికి రూ.4 వేల కోట్లు: 
          సాగునీటిని పొదుపుగా వాడుతూ పంటల ఉత్పాదకత పెంచేందుకు రూ.4 వేల కోట్లను కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో బిందుసేద్యం పరికరాల ఏర్పాటుకు నిధులు వెచ్చిస్తారు. ప్రధానమంత్రి కృషి సంచయి యోజన(పీఎంకేఎస్వై) పథకంలో ఈ నిధులు కేటాయించింది.
         వీటినుంచి తెలుగు రాష్ట్రాలకు తగినంగా వచ్చే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి రూ.250 కోట్లు బిందుసేద్యానికి వస్తాయని తెలంగాణ ఉద్యానశాఖ తెలిపింది. ఏపీకి ఇలాగే రావచ్చని భావిస్తున్నారు.
  • గతంలో పంట నష్టంలో రైతును ఆదుకునేందుకు 1999లోనే జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్ఏఐఎస్) తెచ్చారు. 2011లో దాన్ని కొంత సవరించారు కూడా. కానీ వాటి వల్ల రైతుకు ఒరిగింది లేదు. ‘రిస్క్ కవరేజీ’ తక్కువుండటం వల్ల రైతులు దీనివైపు పెద్దగా మొగ్గుచూపలేదు.
  • ఇప్పుడు కష్టనష్టాల్లో ఉన్న రైతును సమర్థవంతమైన బీమాతో ఆదుకునేందుకు మోదీ సర్కారు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) తెచ్చింది. ప్రత్యేకతలు: ప్రీమియంపై పరిమితి ఎత్తేశారు, రైతు బీమా చేసిన మొత్తంపై ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, ఉద్యాన, వాణిజ్య పంటలకు 5% ప్రీమియం చెల్లిస్తారు. ప్రీమియం అంతకన్నా ఎక్కువుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. దీంతో ఈ బీమాకు ఆదరణ బాగా పెరిగింది.
  • తెలంగాణలో నిధుల కేటాయింపు, ఖర్చు తీరు (రూ.కోట్లలో) ‘వ్యవసాయ యంత్రాల రాయితీ’ పథకానికి మొత్తం నిధులు రూ.114 కోట్లు.
  • ఇందులో కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.68.40(60%) కోట్లు కేటాయించింది. ఇప్పటిదాకా రూ.40.20 కోట్లు విడుదల చేసింది. మిగతా 40% వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.26.80 కోట్లను ఇచ్చేసింది.
  • కేంద్రం ఇచ్చిన నిధులను వ్యవసాయ శాఖ ద్వారా జిల్లాలకు పంపారు. మిగతా వాటి కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి నెలాఖరుకు వస్తాయని భావిస్తున్నారు.
రక్షణ రంగం
          రక్షణ రంగంలో స్వావలంబన సాధించడంపై.. ఈసారి బడ్జెట్లో కేంద్రం దృష్టి పెట్టింది. దేశీయంగా రక్షణ ఉత్పతుల తయారీని ప్రోత్సహించేందుకు.. ప్రభుత్వ, ప్రైవేటు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అనుకూలంగా ఉండే ‘రక్షణ ఉత్పత్తి విధానా’న్ని ఈ ఏడాది తీసుకురానున్నట్లు ప్రకటించింది. దేశంలో రెండు రక్షణ పారిశ్రామిక ఉత్పత్తి నడవాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. వీటిలో మొదటి నడవాను చెన్నై, బెంగళూరులను కలుపుతూ తమిళనాడులో ఏర్పాటు చేయనున్నట్లు రక్షణమంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఇటు సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్లతో సవాళ్లు పెరుగుతున్న తరుణంలో.. రక్షణ బడ్జెట్లో గణనీయ పెరుగుదల ఉంటుందన్న అంచనాలు నెరవేరలేదు. నామమాత్రపు పెంపుతోనే కేంద్రం సరిపెట్టింది.
  • 2018-19కు గానూ రక్షణ రంగానికి రూ.2.95 లక్షల కోట్ల బడ్జెట్ను కేంద్రం కేటాయించింది. మొత్తం బడ్జెట్లో ఇది 12.1%. గతేడాది (రూ.2.74 లక్షల కోట్లు) కన్నా ఈసారి రక్షణ బడ్జెట్ను కేవలం 7.81% పెంచారు. సవరించిన అంచనాలతో (రూ.2.79 లక్షల కోట్లు) పోలిస్తే ఈ పెంపు 5.91% మాత్రమే.
  • తాజా రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయం రూ.99.9 వేల కోట్లు. కేంద్ర బడ్జెట్లోని మొత్తం మూలధన వ్యయంలో దీని వాటా 33.1%. నూతన ఆయుధాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర సైనిక సామగ్రి కొనుగోలుతో పాటు.. ఆధునికీకరణ చర్యల కోసం దీన్ని ఖర్చు చేస్తారు. గతేడాది రక్షణ బడ్జెట్లో మూలధన వ్యయంగా రూ.86.5వేల కోట్లు కేటాయించారు. అయితే తాజా కేటాయింపులు సైన్యం ఆధునీకరణకు సరిపోవని రక్షణ నిపుణులు అభిప్రాయపడ్డారు.
  • రెవెన్యూ వ్యయంగా రూ.1.96 లక్షల కోట్లను ఈసారి కేటాయించారు. వేతనాలు, సైనిక వ్యవస్థల నిర్వహణ తదితర చెల్లింపులకు దీన్ని ఖర్చు చేస్తారు.
  • ఇవి కాకుండా రూ.1.08 లక్షల కోట్లను రక్షణ రంగంలో పింఛన్ల కోసమే కేటాయించారు. వీటిని బడ్జెట్లో కలపలేదు. గతేడాది అంచనాలతో పోలిస్తే ఇవి 26.6% పెరిగాయి.
  • సరిహద్దు ప్రాంతాలకు అనుసంధానతను పెంచడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అరుణాచల్ప్రదేశ్లోని సెలా పర్వతమార్గం కింద సొరంగ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించింది. జమ్ముకశ్మీర్లోని లద్దాఖ్ ప్రాంతానికి అన్ని కాలాల్లోనూ చేరుకునేలా.. రోహ్తాంగ్ సొరంగం నిర్మాణం ఇప్పటికే పూర్తైంది. 14 కి.మీ.ల పొడవైన జోజిలా సొరంగ నిర్మాణ కాంట్రాక్టుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.
  • పాకిస్థాన్, చైనా సహా చాలా దేశాలు దేశ జీడీపీలో కనీసం 2% రక్షణరంగానికి కేటాయిస్తున్నాయి. అయితే భారత్ మాత్రం 1.58% మాత్రమే కేటాయించింది. 1962 తర్వాత.. రక్షణకు జీడీపీలో అత్యల్ప వాటాను భారత్ ఇప్పుడే ఇచ్చింది.
ఆరోగ్య రంగం
  • ఆరోగ్య రంగానికి బడ్జెట్లో మంచి ప్రాధాన్యం లభించింది. పేదల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 10 కోట్ల కుటుంబాలకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. ఆసుపత్రుల్లో చికిత్సల కోసం ఆస్తులను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితిని నివారించడమే దీని ఉద్దేశం. ఆరోగ్య భారత్తోనే సుభిక్ష భారత్ సాధ్యమన్న స్ఫూర్తికి అనుగుణంగా ఈ రంగానికి కేటాయింపులను ప్రభుత్వంలో పెంచింది.
  • ఆయుష్మాన్ భారత్’ కింద రెండు ప్రధాన పథకాల ప్రకటన. ఇందులో మొదటిది.. జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఎన్హెచ్పీఎస్). దీని కింద మధ్యస్థాయి, ఉన్నతస్థాయి ఆసుపత్రిల్లో చేరి, చికిత్స పొందడానికి కుటుంబానికి ఏడాదికి రూ.5లక్షల వరకూ కవరేజీ లభిస్తుంది. 50 కోట్ల మంది లబ్ధి పొందుతారని అంచనా. ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో నడిచే ఆరోగ్య పథకాల్లో ఇదే అతిపెద్దది. ప్రస్తుత ‘రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన’ కింద పేద కుటుంబాలకు వార్షిక కవరేజీ రూ.30వేల మేర మాత్రమే లభిస్తోంది.
  • ఇక రెండో పథకం.. ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు. భారత ఆరోగ్య వ్యవస్థకు ఈ కేంద్రాలే పునాది అని జాతీయ ఆరోగ్య విధానం-2017 చెబుతోంది. అందువల్ల ఈ విధానానికి రూ.1200 కోట్ల కేటాయింపు. ఈ సొమ్ము.. 1.5 లక్షల ఆరోగ్య, వెల్నెస్ కేంద్రాలకు అందుతుంది.
  • ఈ కేంద్రాలు అంటువ్యాధులు కాని రోగాలు, ప్రసూతి, శిశు ఆరోగ్య పరిరక్షణ సేవలు సహా సమగ్ర ఆరోగ్య పరిరక్షణను అందిస్తాయి. అవసరమైన ఔషధాలు, రోగ నిర్ధారణ సేవలనూ అక్కడ పొందొచ్చు.
  • కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఈ కేంద్రాలను దత్తత తీసుకోవాలని ప్రైవేటు సంస్థలు, దాతృత్వ సంస్థలకు విజ్ఞప్తి.
  • ప్రాథమిక, మధ్యస్థాయి, ఉన్నతస్థాయి ఆరోగ్య పరిరక్షణలో సమూల చర్యలు తీసుకోవడం ఈ రెండు పథకాల ఉద్దేశం. వీటి వల్ల ‘నవీన భారత్-2022’ ఆవిష్కృతమవుతుంది. ఉత్పాదకత, స్వస్థతను ఇవి పెంచుతాయి. వేతన నష్టాన్ని నివారిస్తాయి. పేదరికంలోకి జారిపోకుండా చూస్తాయి. లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాయి. మొత్తం మీద సార్వత్రిక ఆరోగ్య కవరేజీ లక్ష్యం దిశగా ప్రభుత్వం క్రమంగా అడుగులు వేస్తోంది.
  • నాణ్యమైన వైద్య విద్య, ఆరోగ్య పరిరక్షణ లభ్యతను పెంచేందుకు.. దేశంలో ప్రస్తుతమున్న జిల్లా ఆసుపత్రుల స్థాయిని పెంచడం ద్వారా కొత్తగా 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులను ఏర్పాటు చేస్తారు.
  • దీనివల్ల ప్రతి రాష్ట్రంలోనూ మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు కనీసం ఒక్కటి చొప్పున్నైనా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పడుతుంది.
  • ఇతర అంటువ్యాధుల కన్నా క్షయతో ఏటా ఎక్కువ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. పేదలు, పోషకాహార లోపం ఉన్నవారే దీనికి ఎక్కువగా బాధితులవుతున్నారు. అందువల్ల క్షయ వ్యాధిగ్రస్థులందరికీ.. చికిత్స కాలంలో నెలకు రూ.500 చొప్పున అందిస్తారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయింపు.
  • నగదు రహిత పథకం ‘మోదీకేర్’గా వ్యవహరిస్తున్న ఎన్హెచ్పీఎస్ గురించి కేంద్ర వ్యయశాఖ కార్యదర్శి ఎ.ఎన్.ఝా విలేఖరులకు వివరించారు. 2018-19లో ఈ పథకం కోసం తాత్కాలికంగా రూ.2వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
  • కేంద్రం తాజాగా ‘జాతీయ ఆరోగ్య భద్రత పథకం’ ప్రకటించడంతో తెలంగాణలోనూ ఆరోగ్యశ్రీ చికిత్సల పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెరగనుందా అనే చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఈ పథకం కింద సుమారు 77.19 లక్షల నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. వైద్య చికిత్సకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల గరిష్ఠ పరిమితి ఉంది. దీన్ని రూ.5 లక్షలకు పెంచితే నిరుపేదలకు ప్రయోజనమే. అయితే ఆరోగ్యశ్రీ ప్రారంభమైన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో రూ.2 లక్షల పరిమితి సరిపోక అదనపు నిధులకు అనుమతులివ్వాలని కోరిన కేసులు 100 కూడా ఉండవని ఆరోగ్యశ్రీ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పరిమితి పెంచితే ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు అనుకూలంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరైన నియంత్రణ లేకపోతే అడ్డగోలు చికిత్సల పేరిట దోచుకోవడానికి ఆసుపత్రులకు అవకాశమిచ్చినట్లు అవుతుందని కొందరు అధికారులు చెబుతున్నారు.
రహదారుల అభివృద్ధికి రూ.71 వేల కోట్లు
  • గతేడాది బడ్జెట్ కేటాయింపులు : రూ.64,900 కోట్లు
  • ప్రగతి రథం ప్రధాన చక్రాల్లో ఒకటిగా పరిగణించే రహదారుల అభివృద్ధి రంగం మనదేశంలో మరింత ఊపందుకోనుంది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్ల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. 2017-18లోనే 9 వేల కిలోమీటర్లకుపైగా పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది.
  • ‘భారతమాల పరియోజన’ పథకం తొలిదశలో భాగంగా రూ.5.35 లక్షల కోట్లతో 35 వేల కిలోమీటర్ల పొడవైన రహదారులను నిర్మించనున్నారు.
  • ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్వై) పథకం మూడో దశ కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి రూ.19 వేల కోట్లు కేటాయించారు. దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ మార్కెట్లు, పాఠశాలలు, ఆస్పత్రులతో అనుసంధానించే రోడ్లను నిర్మిస్తారు.
  • రుసుము చెల్లింపునకుగాను టోల్ప్లాజాల వద్ద అధిక సమయం ఎదురుచూసే పరిస్థితి మారనుంది. నగదు రూపంలో టోల్ చెల్లింపులకూ తెరపడనుంది. ప్లాజాల వద్ద వాహనాన్ని నిలిపే అవసరం లేకుండానే ఎలక్ట్రానిక్ విధానంలో రుసుము చెల్లించేందుకు వీలు కల్పించే ‘ఫాస్టాగ్’లు విస్తృతంగా వినియోగంలోకి రానున్నాయి. ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ చెల్లించేందుకు వీలుగా కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. మరోవైపు, రోడ్డుమార్గాల ఆస్తులను ‘ప్రత్యేక ప్రయోజన సంస్థ(ఎస్పీవీ)’లుగా మార్చడంతోపాటు ఆదాయ సముపార్జనకుగాను ‘టోల్, ఆపరేట్, ట్రాన్స్ఫర్(టీవోటీ)’, ‘మౌలిక వసతుల పెట్టుబడుల నిధి’ వంటి వినూత్న పద్ధతులను ఉపయోగించే అవకాశాలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) పరిశీలించనుంది.
విద్యా రంగం
  • దేశంలో ప్రతి చిన్నారికీ విద్యావకాశాలను చేరువచేయటంతో పాటు వారి చదువులు నాణ్యమైనవిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యించింది. అదే సమయంలో ఆధునిక వసతుల కల్పన, ఉన్నత విద్యలో సంస్కరణలు, డిజిటలీకరణకు ప్రాధాన్యమిచ్చింది. ఉన్నత విద్యా సంస్థల నిధుల కొరత సమస్యను అధిగమించేందుకు కొత్త మార్గాన్ని ప్రతిపాదించింది. పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల శిక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ఏకీకృత బీఎడ్ కార్యక్రమాన్ని ముందుకుతెచ్చింది. విద్యా బోధనలో ఆధునిక సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించనుంది. తరగతి గదుల్లో నల్లబల్లల స్థానంలో డిజిటల్ బోర్డులు రానున్నాయి.
  • అశిక్షుతులైన 13 లక్షల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు విద్యాహక్కు చట్టానికి చేసిన సవరణను ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను వారి నివాస ప్రాంతాలకు సమీపంలోనే అందించేందుకు ఏకలవ్య గురుకుల పాఠశాలలను రాష్ట్రాల భాగస్వామ్యంతో నెలకొల్పనున్నారు. ఈ లక్ష్యాన్ని 2022కల్లా పూర్తి చేయాలని నిర్దేశించారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పరిశోధనలకు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన భారీ నిధులు సమకూర్చేందుకు ‘‘విద్యా వ్యవస్థల మౌలికసదుపాయాల పునరుత్తేజం’’ (రైజ్) కార్యక్రమాన్ని ప్రతిపాదించారు. వచ్చే నాలుగేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించారు. దీనికోసం ఉన్నత విద్య పెట్టుబడుల సంస్థ (హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ-హెచ్ఈఎఫ్ఏ) ఆవిర్భవించనుంది.
  • కొత్తగా రెండు పూర్తిస్థాయి స్పా (స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్)ల స్థాపన. స్వయంప్రతిపత్తి గల మరో 18 స్పాలను ఐఐటీలు, ఎన్ఐటీల ప్రాంగణాల్లో నెలకొల్పటం.
  • దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో బీటెక్ చదివే వెయ్యి మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రధాన మంత్రి విశిష్ట సభ్యత్వ (ఫెలోషిప్) పథకం కింద ఐఐటీలు, ఐఐఎస్సీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ సైన్సెస్)లలో పీహెచ్డీలు చేసే అవకాశం. పరిశోధకత్వానికి ఆకర్షణీయమైన ఉపకారవేతనాలు అందజేస్తారు.
  • వైద్యులు, రోగుల నిష్పత్తి మధ్య అంతరాన్ని తగ్గించేందుకు కనీసంగా ప్రతి మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ఒక వైద్య కళాశాల ఏర్పాటు.
  • ఉన్నత విద్యలో పెద్ద ఎత్తున సంస్కరణలను ప్రవేశపెట్టే దిశగా ఈ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులను సమకూర్చేందుకు సరికొత్త నమూనాను అనుసరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు తమకు అవసరమైన మొత్తం నిధుల్లో 25శాతం వరకూ ఆ విధానంలో సేకరిస్తారు.
  • జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)కు రూ.10 కోట్ల కేటాయింపు
 
పర్యావరణ మంత్రిత్వ శాఖకు రూ.2,675.42 కోట్లు
  • దిల్లీలో కాలుష్యం నియంత్రణకు ప్రత్యేక పథకం తీసుకురానున్నారు.కాలుష్యానికి కారణమవుతున్న హర్యానా, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్లలోని పంటల వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించేందుకు అవసరమైన యంత్రాలను ఆయా రాష్ట్రాలకు రాయితీపై ఇవ్వనున్నారు. ఈ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్లు కేటాయించారు.
  • ‘ప్రాజెక్ట్ టైగర్’కు రూ.350 కోట్లు; ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’కు రూ.30కోట్లు కేటాయించారు.
  • జాతీయ అటవీకరణ పథకానికి రూ.160 కోట్లు కేటాయించారు.

సాంఘిక సంక్షేమం
  • నవోదయ విద్యాసంస్థలతో సమానంగా ‘ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల’(ఇ.ఎం.ఆర్.ఎస్.)లను అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందుబాటులోకి రానుంది. గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతాల్లో వీటిని నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022నాటికి గిరిజనులందర్నీ అక్షరాస్యులుగా చేయాలని భావిస్తోంది. మండల జనాభాలో సగానికిపైగా లేదా కనీసం 20 వేలమంది గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ రూపొందించిన ఇ.ఎం.ఆర్.ఎస్. పథకం అమలు బాధ్యత పూర్తిగా రాష్ట్రాలదే. 2018లో ఆంధ్రప్రదేశ్లో ఐదు నుంచి ఏడు పాఠశాలలను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇటీవల రూ.120 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రాంభించింది. డిసెంబరు 26 నుంచి జనవరి 4 మధ్య పది పాఠశాలలు ప్రారంభించింది. తెలంగాణకు అదనంగా మరో 20 వరకు ఏకలవ్య పాఠశాలలు వచ్చే అవకాశముంది. తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే పది పాఠశాలలు నడుస్తున్నాయి.
  • ఎస్సీల పోస్టుమెట్రిక్ ఉపకారవేతనాల నిధులు కేంద్ర బడ్జెట్లో తగ్గాయి. 2017-18లో రూ.3,347 కోట్లు కేటాయించగా, తెలంగాణకు రూ.110 కోట్లు వచ్చాయి. తాజా బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ.మూడువేల కోట్లకు పరిమితం చేయడంతో తెలంగాణకు వచ్చే నిధులూ తగ్గనున్నాయి.
ఎస్సీ, ఎస్టీలకు పెరిగిన కేటాయింపులు రూ.10,527 కోట్లు
  • గత ఏడాదితో పోలిస్తే 2018-19 బడ్జెట్లో ఎస్సీ, ఎస్సీలకు కేటాయింపులు రూ.10,527 కోట్లు పెరిగాయి. ఎస్సీలకు రూ.3900 కోట్లు, ఎస్టీలకు రూ.6627 కోట్లు చొప్పున పెంచారు. 2017-18లో ఎస్సీలకు రూ.52,719 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. తాజా బడ్జెట్లో రూ.56,619 కోట్లు కేటాయించింది. 2016-17లో ఈ కేటాయింపులు రూ.34,334 కోట్లు మాత్రమే. మరోవైపు ఎస్టీలకు 2017-18లో రూ.32,508 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.39,135 కోట్లుకు పెంచింది. 2016-17లో ఈ కేటాయింపులు రూ.21,811 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ఎస్సీలకు 279 పథకాలు, ఎస్టీలకు 305 పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందుతున్నాయి.
మైనార్టీ శాఖకు రూ. 4,700 కోట్లు
  • మైనార్టీల వ్యవహారాల శాఖకు ఈసారి కేంద్రం రికార్డు స్థాయిలో కేటాయింపులను పెంచినట్లు ఆ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. 2017-18లో రూ.4,197 కోట్లుగా ఉన్న కేటాయింపులను.. ఈసారి రూ.4,700 కోట్లు చేసినట్లు వివరించారు. మైనార్టీల ఆర్థిక, విద్య, సామాజిక అభివృద్ధికి ఈ నిధులు తోడ్పడతాయని ఆయన అన్నారు. కేంద్రం ఈ శాఖకు 2015-16లో రూ.3,713 కోట్లు.. 2016-17లో రూ.3,800 కోట్లు కేటాయించింది.
మహిళా సంక్షేమం
  • మహిళా సంక్షేమం, ప్రగతే లక్ష్యంగా ఉద్దేశించిన పథకాలకు కేటాయింపులు నాలుగు శాతం పెరిగాయి. రానున్న ఆర్ధిక సంవత్సరానికి సంబంధిత పధకాలకు చేసిన కేటాయింపుల మొత్తం 1,21,961.32 కోట్లు కాగా.... 2017-18లో సవరించిన బడ్జెట్ అంచనాల మొత్తం 1,17,221.47 కోట్లుగా ఉంది.

  • మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని జాతీయ పౌష్టికత మిషన్(ఎన్ఎన్ఎం)కు కేటాయింపులు ఏకంగా మూడు రెట్లు పెంపు.రూ.3వేల కోట్ల నిధుల కేటాయింపు. గతేడాది ఈ మొత్తం రూ.950 కోట్లే.
  • రక్తహీనత, శిశువుల్లో బరువు లోపం, పోషకాహారలోపాల తగ్గింపునకు ఎన్ఎన్ఎం కృషి.
  • ‘బేటీ బచావో-బేటీ పఢావో’ పథకానికి రూ.280 కోట్లు. 2017-18కి సవరించిన బడ్జెట్ అంచనాల మొత్తం రూ.186.04 కోట్లు.
  • మహిళా హెల్ప్లైన్కు 2017-18లో రూ.10కోట్లు కేటాయించగా..ఈ దఫా రూ.28.8 కోట్ల కేటాయింపు.
  • జాతీయ మహిళా కమిషన్కు 2018-19కి రూ.24 కోట్ల కేటాయింపు. గతేడాది కంటే ఈ దఫా నిధుల తగ్గింపు.
  • ఆడపిలల్ల అక్రమ రవాణా నిరోధానికి ఉద్దేశించిన పధకానికి రూ.60 కోట్లు. గతేడాది ఈ మొత్తం రూ.35 కోట్లు.
  • ‘నిర్భయ నిధి’కి పెరిగిన నిధుల మొత్తం. ఈ ఏడాదికి రూ.19.75 కోట్లు. 2017-18కి సవరించిన అంచనాల ప్రకారం రూ.11.20 కోట్లు. అయితే, 2018-19కి నిర్భయ నిధి నుంచి సంబంధిత ఇతర పధకాలకు కేటాయింపుల మొత్తం తగ్గింది. రూ.359.09 కోట్ల కేటాయింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం రూ.4 వందల కోట్లు.
  • ‘ప్రధానమంత్రి మాతృవందన యోజన’కు 2018-19కి కేటాయింపులు రూ.2400 కోట్లు. గతేడాది ఈ మొత్తం రూ.2,594.55 కోట్లు.
  • ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద మహిళలకిచ్చే ఉచిత గ్యాస్ కనెక్షన్ల సంఖ్య లక్ష్యం మరో మూడుకోట్లు పెరిగింది. ఇదివరకటి లక్ష్యం అయిదుకోట్ల కనెక్షన్లుగా ఉన్న విషయం గమనార్హం. మొత్తం కలిపితే నిరుపేద ఇల్లాలికి ఇచ్చే ఉచిత వంటగ్యాసు కనెక్షన్ల సంఖ్య లక్ష్యం 8 కోట్లకు చేరింది.
  • మహిళా స్వయం సహాయక బృందాల(ఎస్హెచ్జీ)కు ఇచ్చే రుణాల మొత్తం 2019 నాటికల్లా రూ.75 వేల కోట్లకు పెంపు. సేంద్రియ సాగు దిశగా వారికి ప్రోత్సాహం. జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద చేపట్టేందుకు చేయూత.
ఆకర్షణీయ నగరాలకు రూ.6,169 కోట్లు
  • 2017-18 బడ్జెట్ కేటాయింపు: రూ.4 వేల కోట్లు. అధికం: 54%
  • ఎంపిక చేసిన 99 నగరాల్లో మొత్తం రూ.2.04 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నారు.
  • ఇప్పటివరకూ రూ.2,350 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తిచేశారు.
  • రూ.20,852 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి.
  • ఈ నగరాల్లో స్మార్ట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం, స్మార్ట్ రహదారులు, సోలార్ పైకప్పులు, అధునాతన రవాణా వ్యవస్థ, స్మార్ట్ ఉద్యానవనాల నిర్మాణాలు ప్రారంభించారు.
  • గృహ, పట్టణ వ్యవహారాల (హెచ్యూఏ) మంత్రిత్వశాఖకు కేటాయింపులు: రూ.41,765 కోట్లు (నగరాభివృద్ధి, గృహ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖలను కలిపి.. హెచ్యూఏగా ఏర్పాటు చేశారు. ఈ శాఖ కు 2017-18లో 40,618కోట్లు కేటాయించారు)
  • నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015, జూన్ 25న ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ఆకర్షణీయ నగరాలు(స్మార్ట్సిటీస్). దేశంలో 100 నగరాలను ఐదేళ్లలో (2017-2022) పౌర అనుకూల, సుస్థిర అభివృద్ధి కేంద్రాలుగా మార్చడం దీని లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆకర్షణీయ నగరాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2018 జనవరి నాటికి 99 నగరాలు ఆకర్షణీయ నగరాల కార్యక్రమానికి ఎంపికయ్యాయి.
  • ప్రస్తుతo ఆకర్షణీయ నగరాల అభివృద్ధి కార్యక్రమం నత్త నడకన నడుస్తోంది. కేంద్రం విడుదల చేసిన నిధులను కనీసం ఖర్చు చేసిన పరిస్థితి లేదు. 2015-16 నుంచి ఇప్పటి వరకూ కేంద్రం 60 ఆకర్షణీయ నగరాల కోసం రూ.9,860 కోట్లను కేటాయించింది. రూ.645 కోట్లను మాత్రమే ఇప్పటి వరకూ ఖర్చు చేశారు.
  • ఒక్కో నగరానికి రూ.196 కోట్లను కేటాయించగా అహ్మదాబాద్ మాత్రం రూ.80 కోట్లు పైగా ఖర్చు చేసి నిధుల వినియోగంలో ముందుంది. ఇండోర్(రూ.70.69కోట్లు), సూరత్(రూ.43.41కోట్లు), భోపాల్(42.86 కోట్లు) తరువాత స్థానాల్లో ఉన్నాయి.
  • ఆకర్షణీయ నగరాల్లో అభివృద్ధి పనులకు చాలా రాష్ట్రాలు తమ వంతు వాటా నిధులను కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి.
  • ఇదే పరిస్థితి కొనసాగితే 2022 నాటికి దేశంలో 100 ఆకర్షణీయ నగరాలను రూపొందించే లక్ష్యం నెరవేరడం కష్టసాధ్యమే.
  • తెలంగాణ రాష్ట్రంలో ఆకర్షనీయ నగరంగా వరంగల్ ఎంపికైంది. 2017-18 సంవత్సరానికి కేంద్రం రూ.100 కోట్లు కేటాయించి..మంజూరు చేసింది. పనులు టెండర్ల దశలో ఉన్నాయి.
గ్రామీణ భారతానికి 14.34 లక్షల కోట్లు
  • గ్రామీణ భారతంపై వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.14.34 లక్షల కోట్లను కేంద్రం వెచ్చించనుంది. దీంతో గ్రామీణులకు 321 కోట్ల పని దినాల ఉపాధి లభించనుంది. మొత్తంగా 3.17 లక్షల కి.మీ. రహదారులు, 51 లక్షల కొత్త ఇళ్లు, 1.88 కోట్ల మరుగుదొడ్లు, 1.75 కోట్ల ఇళ్లకు విద్యుత్ సరఫరా అందించేందుకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధంచేసింది. వ్యవసాయ రంగాన్ని పటిష్ఠం చేయడం, గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ ఏడాది లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు నొక్కిచెప్పింది. గ్రామీణులకు అవకాశాలను మెరుగు పరచడం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతం లాంటి అంశాలపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపింది.
  • జాతీయ గ్రామీణ జీవనోపాధి కల్పన పథకం (ఎన్ఆర్ఎల్ఎం)కూ కేటాయింపులను పెంచింది. 2017-18లో రూ.4,500 కోట్లుగా ఉన్న వీటిని ప్రస్తుతం రూ.5,750 కోట్లు చేసింది.
  • మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలు వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.75,000 కోట్లకు చేరుకుంటాయని తెలిపింది. 14.34 లక్షల కోట్లకు చేరుకుంటాయని తెలిపింది.
డిజిటల్ ఇండియా కార్యక్రమానికి రూ.3073 కోట్లు
  • భారత్ను సాంకేతిక విజ్ఞాన సమాజంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కృత్రిమ మేధ, పరిశోధన, అభివృద్ధికి చర్యలు తీసకుంటున్నట్లు ప్రకటించింది. 2015 జులై 1న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాశ్వత వసతుల కల్పన; డిజిటల్ రూపంలో ప్రభుత్వ సేవల అందజేత; వాటిని ఉపయోగించుకునేలా ప్రజల్లో సాంకేతిక అక్షరాస్యతను పెంచడం- ఈ క్రతువులో మూడు కీలకాంశాలు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది.
  • ‘డిజిటల్ ఇండియా’నిధులు రెట్టింపు చేస్తూ రూ.3073 కోట్లు కేటాయించింది.
  • అత్యున్నత విద్యా కేంద్రాల ఏర్పాటుకు చేయూతనిచ్చే సైబర్ ఫిజికల్ వ్యవస్థ(సీపీఎస్)లు ఏర్పాటు చేస్తామని తెలిపింది.
  • గ్రామాల్లో 5 లక్షల వైఫై హాట్స్పాట్ కేంద్రాలు ఏర్పాటుకు నిర్ణయం. దీంతో 5 కోట్ల మంది గ్రామీణులకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
  • టెలికాం రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.పది వేల కోట్లు కేటాయింపు.
  • మద్రాస్ ఐఐటీలో దేశీయ 5జి ప్రయోగకేంద్రం ఏర్పాటుకు నిర్ణయం.
  • బ్లాక్ చైన్ టెక్నాలజీకి ప్రోత్సాహం.
  • సాంకేతిక భారత్ దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉద్యోగాల కల్పనకు, గ్రామీణుల జీవనం మెరుగుపరిచేందుకు, నాణ్యమైన విద్యకు, ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేస్తాయని పారిశ్రామిక వర్గాల నిపుణులు పేర్కొన్నారు. నాస్కామ్ సహవ్యవస్థాపకుడు, ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ డైరెక్టర్ సౌరభ్ శ్రీవాత్సవ స్పందిస్తూ..డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేటాయింపులు రెట్టింపు చేయడం ఓ మంచి నిర్ణయమని పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థికవ్యవస్థ దిశగా అడుగులు వేసేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. డెలాయిట్ సంస్థకు చెందిన హేమంత్ జోషి మాట్లాడుతూ ఐఐటీ మద్రాస్తో కలిసి 5జి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం కొత్త టెలికం రంగం అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
  • 2018 డిసెంబర్ నాటికి 6,25,000 గ్రామాలను ఫైబర్ తీగల ద్వారా అనుసంధానించే బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ ‘భారత్నెట్’కు అప్పగించారు. మొత్తం అనుసంధానించాల్సిన దూరం 7 లక్షల కిమీ
  • తొలిదశలో లక్ష గ్రామ పంచాయతీలు ‘హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్కు’తో అనుసంధానం పూర్తి. దీంతో 20 కోట్ల మందికి పైగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
  • డిజిటల్ లాకర్, ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్, ఈ-సైన్, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందించేందుకు నేషనల్ ‘ఈ-గవర్నెన్స్ ప్లాన్’ను రూపొందించింది. పౌరులు తమ సూచనలను సలహాలను ప్రభుత్వానికి అందించేందుకు ‘మైగవ్.ఇన్’ వేదికను ఏర్పాటుచేసింది. అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ‘ఉమంగ్’ పేరున ఉచిత యాప్ను అందుబాటులోకి తెచ్చింది. నల్లధనాన్ని అరికట్టేందుకు 11 రకాల సాంకేతిక కార్యక్రమాలు చేపట్టింది.
  • సాంకేతిక వసతులు, ప్రభుత్వం అందించే డిజిటల్ సేవలను ప్రజలు విరివిగా వాడుకుంటేనే ‘డిజిటల్ ఇండియా’ సాకారమవుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరతా అభియాన్’ను చేపట్టింది. 2019 మార్చి నాటికి 6 కోట్ల మంది గ్రామీణులను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ఈ పథకం లక్ష్యం. ఇందుకు రూ.2,351.38 కోట్లు వెచ్చించనుంది.
  • ఈ అక్షరాస్యత పెంపునకు 606 సంస్థలు భాగస్వామ్యమయ్యాయి.
  • వీటిల్లో చేరి 1,05,20,154 మంది సాంకేతిక శిక్షణ పొందారు.
పౌర విమానయాన శాఖకు రూ.6,602 కోట్లు
  • పౌర విమానయాన శాఖకు గత బడ్జెట్లో రూ.2,710.31 కోట్లు కేటాయించగా, 2018-19 బడ్జెట్లో 3 రెట్లు అధికంగా రూ.6,602.86 కోట్లు చూపించారు. అయితే ఇందులో అత్యంత ప్రాధాన్యతా వ్యక్తుల (వీవీఐపీ) కోసం 2 కొత్త విమానాల కొనుగోలుకే రూ.4,469.50 కోట్లు కేటాయించడం గమనార్హం. బోయింగ్ 777-300 ఈఆర్ విమానాలు రెండింటిని వీవీఐపీల కోసం కొనుగోలు చేయబోతున్నారు.
  • ప్రాంతీయ విమానయానం కోసం గత బడ్జెట్లో రూ.200.11 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్లో ఈ మొత్తాన్ని రూ.1,014.09 కోట్లకు పెంచారు.
  • పునరుద్ధరణ ప్రణాళిక కింద ఎయిరిండియాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,800 కోట్లు కేటాయించగా, 2018-19లో ఈ మొత్తం రూ.650 కోట్లు మాత్రమే. అంతర్గతంగా, బడ్జెట్ కేటాయింపులకు అదనంగా రూ.506 కోట్లు సంస్థకు లభిస్తాయని పేర్కొన్నారు.
  • విమానాశ్రయాల ప్రాథికార సంస్థ (ఏఏఐ)కు కేటాయింపులు రూ.149.93 కోట్ల నుంచి రూ.73.31 కోట్లకు తగ్గిపోయింది.
  • జాతీయ విమానయాన విశ్వవిద్యాలయం, ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీకి రూ.50 కోట్లు కేటాయించారు.
  • చిన్న నగరాలకు విమానాలు నిర్వహించేందుకు అమలు చేస్తున్న ప్రాంతీయ విమానయాన పథకం (ఉడాన్) కింద 56 విమానాశ్రయాలను, 31 హెలిప్యాడ్లను వినియోగంలోకి తేనున్నట్లు ప్రకటించారు. వీటిల్లో 16 విమానాశ్రయాల్లో ఇప్పటికే రాకపోకలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
  • విమానాశ్రయాల సామర్థ్యాన్ని 5 రెట్లు పెంచి, ఏడాదికి 100 కోట్ల మంది రాకపోకలు సాగించేలా తీర్చిదిద్దుతామన్నారు. విమానాశ్రయాల ప్రాథికార సంస్థ (ఏఏఐ) 124 విమానాశ్రయాలను నిర్వహిస్తోందని తెలిపారు.
  • గత మూడేళ్లుగా విమాన ప్రయాణికుల సంఖ్యలో 18 శాతం వార్షిక వృద్ధి లభిస్తోందని, దేశీయ విమానయాన సంస్థలు కొత్తగా 900 విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని తెలిపారు.
ఆహార తయారీ శాఖకు రూ.1,400 కోట్లు
        వ్యవసాయ దిగుబడులు వృథా అవ్వకుండా పరిరక్షించడంతో పాటు రైతు ఆదాయం పెంచాలంటే ఆహార తయారీ (ఫుడ్ ప్రాసెసింగ్) రంగాన్ని బలోపేతం చేయడం ప్రధాన మార్గం. ఇందుకోసమే 2018-19కి ఈ శాఖకు రూ.1,400 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వీటిల్లో రూ.1,313.08 కోట్లను మెగాఫుడ్ పార్కులు, వ్యవసాయ ప్రాసెసింగ్ ప్రాంతాలు, శీతల గిడ్డంగుల వంటి విలువ జతచేసే మౌలిక వసతుల వంటి వాటికి ఉద్దేశించారు. ప్రతి జిల్లా పరిధిలో నిర్దేశించిన పంటలు పండించేలా ప్రోత్సహిస్తామన్నారు. 2017-18లో ఆహార తయారీకి కేటాయింపులు రూ.715 కోట్లు మాత్రమే.
        గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, ఉపరితల పరిశుభ్రతకు రూ.16,713 కోట్లు

  • గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కీలక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రకటించారు. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చేందుకు ప్రాధాన్యతనిచ్చారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి గోబార్-ధన్(గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-అగ్రో రిసోర్స్ ధన్) అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు.
  • ఈ పథకంలో భాగంగా బయోగ్యాస్, నేచరల్ గ్యాస్ తయారీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంటే గ్రామీణులు తమ ఇళ్లలో ఉన్న పశువుల పేడను, పంటపొలాల్లో వృథాగా ఉన్న ఘనవ్యర్థాలను కంపోస్ట్ చేసుకుంటారు. దీని ద్వారా బయోగ్యాస్, నేచరల్ గ్యాస్ తయారై గ్రామీణులు వంట అవసరాలకు దోహదపడతాయి.

సాగునీటి ప్రాజెక్టులకు

  • సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నామమాత్రంగానే సాయం అందనుంది. అవసరమైతే నాబార్డు నుంచి రుణంగా తీసుకోవడం తప్ప, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కావలసిన నిధులు కేంద్రం నుంచి నేరుగా రాష్ట్రాలకు అందే అవకాశం తక్కువే. దీనికి కారణం ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులే. సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద అమల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు, వినియోగంలో ఉండి పూర్తిగా ఆయకట్టుకు నీరందని ప్రాజెక్టుల కింద పలు కార్యక్రమాలు చేపట్టడం, చిన్న నీటి వనరులు, భూగర్బజల వనరుల అభివృద్ధి ఇలా పలు కార్యక్రమాలను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఏఐబీపీతో సహా అన్ని నీటివనరులకు సంబంధించిన అన్ని పథకాలనూ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) పరిధిలో చేర్చింది. సత్వరసాగునీటి ప్రయోజన పథకం కింద గుర్తించి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు తెలంగాణలో ఐదు ఉండగా, ఆంధ్రప్రదేశ్లో మూడు ఉన్నాయి.
  • రెండు రాష్ట్రాలకు కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రవాటాగా సుమారు రూ.500 కోట్లకు పైగా రావల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు కేవలం రూ.13 కోట్లు మాత్రమే వచ్చాయి. దేశవ్యాప్తంగా 99 ప్రాజెక్టుల కింద గ్యాప్ ఆయకట్టు తగ్గించడానికి, నీటి వినియోగ సామర్థ్యం పెంచడానికి, రైతుల్లో అవగాహన పెంచడానికి కేంద్రజలవనరుల మంత్రిత్వశాఖ మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో తెలంగాణ నుంచి 28 ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిని చేపట్టడానికి జలవనరుల మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. కేంద్రవాటాగా రెండు రాష్ట్రాలకు సుమారు రూ.1,700 కోట్లు అవసరమవుతాయి. దేశ మొత్తం మీద కనీసం రూ.ఆరేడువేల కోట్లు అవసరం. కానీ ఈ పథకాలకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించలేదు. రూ.ఆరువేల కోట్లు నాబార్డుకు కేటాయించింది.
  • ఈ మొత్తాన్ని నాబార్డు ఆరుశాతం వడ్డీకి రాష్ట్రాలకు రుణంగా ఇస్తుంది తప్ప గ్రాంటు కాదు. రూ.2,600 కోట్లు ఏఐబీపీ కింద కేటాయించింది. ఇందులో రూ.2,300 కోట్లు నాబార్డుకు అసలు, వడ్డీ కింద చెల్లించడానికి కేటాయించింది. పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపు చేయలేదు. నాబార్డు ద్వారా పోలవరం ప్రాజెక్టుకు ఇస్తే, కేంద్రం ఈ రూ.2,300 కోట్ల నుంచి నాబార్డుకు వడ్డీతో సహా చెల్లిస్తుంది. ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలనుకొన్న 48 ప్రాజెక్టులకు, గ్యాప్ ఆయకట్టు తగ్గించే ప్రాజెక్టులకు, చిన్ననీటి వనరుల పథకాలకు ఇలా అన్నింటికి ఈ రూ.2,300 కోట్ల నుంచి వడ్డీ, అసలు చెల్లించాల్సిందే. మరో 50 ఉపరితల నీటి అభివృద్ధి పథకాలు కూడా పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్క ఫరక్కా బ్యారేజి నిర్వహణకు మాత్రమే కేంద్రం ప్రత్యేకంగా రూ.195 కోట్లు కేటాయించింది తప్ప జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరానికి కూడా ఇవ్వలేదు.
  • పోలవరం ప్రాజెక్టుకు 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,297.58 కోట్లు మంజూరుచేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది బడ్జెట్లో చెప్పిన అంశాల అమలు గురించి వివరిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. సత్వర సాగునీటి ప్రయోజన పథకం కింద నాబార్డు ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు రూ.1,720.68 కోట్లు మంజూరుచేయగా, ఒక్క ఆంధ్రప్రదేశ్కే రూ.1,297.58 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. ఏపీ రాజధాని నిర్మాణం కోసం వినూత్న పద్ధతిలో చేపట్టిన భూసమీకరణ పద్ధతిని ప్రోత్సహిస్తూ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రాయితీని అమలుచేసినట్లు పేర్కొంది. 2014 జూన్ 2 నాటికి భూములున్న వారందరికీ ఈ ప్రయోజనం వర్తింపజేసినట్లు తెలిపింది.
  • తెలంగాణకు రక్షిత తాగునీటికోసం తెలంగాణకు గత ఏడాది రూ.440.51 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.
  • కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్వై) కింద నిధులు సమకూరుస్తోంది. మరికొన్నింటిని తానే స్వయంగా చేపడుతోంది. పీఎంకేఎస్వైలో భాగమైన ఏఐబీపీ కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 99 ప్రాజెక్టులకు నిధులు అందిస్తోంది. ఈ 99 ప్రాజెక్టులకు కేంద్రం 25% నిధులు సమకూరుస్తుంది. మిగతా 75 శాతాన్ని రాష్ట్రాలే భరించాలి. గిరిజన ప్రాంతాలు, రైతు ఆత్మహత్యల జిల్లాల్లో అమలయ్యే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గతంలో 90% నిధులు అందించేది. ఇప్పుడు దానిని 60 శాతానికి కుదించింది.
పీఎంకేఎస్వై కింద అమలవుతున్న పథకాలు
* సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)
* వాటర్షెడ్ కార్యక్రమం
* పర్ డ్రాప్ మోర్ క్రాప్ (బొట్టు బొట్టుకీ మరింత పంట)
* హర్ ఖేత్ కో పానీ (ప్రతి పొలానికీ నీరు)
తెలంగాణలో ప్రాజెక్టులకు ఇలా...
* ప్రాజెక్టులకు ప్రత్యేకంగా కేటాయింపులేమీలేవు.
* ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు నాబార్డుకు రూ.6 వేల కోట్ల కేటాయింపు.
* ఏఐబీపీ కింద రూ.2,600 కేటాయింపు.
* పీఎంకేఎస్వై కింద దేశవ్యాప్తంగా సాయం అందించే 99 ప్రాజెక్టుల్లో తెలంగాణలో 11 ప్రాజెక్టులున్నాయి.
* ఇందులో 5 ప్రాజెక్టులకు 201718 ఆర్థిక సంవత్సరంలో రూ.510 కోట్లు రావాల్సి ఉంది.1234
స్వచ్ఛ భారత్కు రూ.17,843 కోట్లు
  • ఇందులో గ్రామీణ ప్రాంతాలకు: రూ.15,343 కోట్లు
  • పట్టణ/నగర ప్రాంతాలకు: రూ.2,500 కోట్లు (పట్టణ ప్రాంతాలకు రూ.200 కోట్ల బడ్జెట్ పెరిగింది)
  • 2017-18 బడ్జెట్ కేటాయింపు: 19,248 కోట్లు. లక్ష్యం: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం
  • బహిరంగ మల విసర్జన 20% నుంచి 10% తగ్గింపు
  • గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు గోబర్-ధాన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రీసోర్స్స్ ధాన్) ప్రాజెక్టును తెస్తున్నారు. పశువుల పేడ, ఘన వ్యర్థాలను కంపోస్ట్, ఎరువు, బయో సీఎన్జీగా మార్చేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.
  • భారత్లో తయారీకి(మేక్ ఇన్ ఇండియా) ఊతమిచ్చేందుకు గాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ సుంకం 15శాతం నుంచి 20 శాతానికి పెంపు. ఆ ఫోన్ల కొన్ని విడిభాగాలు, ఉపకరణాలపై కూడా 15శాతానికి పెంపు.
  • కొన్ని టీవీ విడిభాగాలపై 15 శాతం కస్టమ్స్ సుంకం విధింపు.
ఉద్యోగ కల్పన:
  • ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఉద్యోగావకాశాల సృష్టి, ఉద్యోగితా కల్పనకు కీలక ప్రాధాన్యం.
  • ఒక సర్వే ప్రకారం.. ఈఏడాది సంఘటిత రంగంలో 70లక్షల ఉద్యోగాల కల్పన.
  • దేశంలో ఉద్యోగ కల్పన కోసం గత మూడేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన ఎన్నో కార్యక్రమాల ఫలితంగా పెరిగిన ఉద్యోగితా ఊపును కొనసాగించేందుకు.. అన్ని రంగాల్లోని కొత్త ఉద్యోగుల వేతనాల్లో 12 శాతం ఈపీఎఫ్ చందాను వచ్చే మూడేళ్లు ప్రభుత్వం భరిస్తుంది.
  • స్థిరకాల ఉద్యోగిత సౌకర్యం అన్ని రంగాలకూ వర్తింపు.
  • సంఘటిత రంగంలో మహిళా ఉద్యోగుల్ని ప్రోత్సహించేందుకు, వారి చేతికందే వేతనం మొత్తం పెంచేందుకు.. తొలి మూడేళ్లలో వారి ఈపీఎఫ్ చందాను ప్రస్తుతమున్న 12 లేదా 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించేలా ఈపీఎఫ్ చట్టంలో మార్పులకు ప్రతిపాదన.
  • ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, జాతీయ ఆరోగ్య సురక్ష పథకం వంటి కార్యక్రమాలతో లక్షల ఉద్యోగాల సృష్టి.
  • గ్రామీణ, మౌలికవృద్ధి రంగాలకు భారీ కేటాయింపులతో పెద్దసంఖ్యలో ఉద్యోగ సృష్టి.
  • చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేటాయింపులు, కార్పొరేట్ పన్నుల తగ్గింపు ప్రతిపాదన, ప్రధానమంత్రి ముద్ర యోజన, జాతీయ వెదురు మిషన్, జీవనోపాధి మిషన్లకు తగినన్ని కేటాయింపుల ద్వారా ఉద్యోగ కల్పన.
  • ‘‘ఉద్యోగిత సృష్టి, వృద్ధికి తోడ్పడేందుకు 2018-19లో మౌలిక రంగంలో ప్రభుత్వ బడ్జెటరీ, అదనపు బడ్జెటరీ వ్యయాలు పెంపు.. 2018-19లో గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి, మౌలిక సదుపాయాల కల్పనతో వ్యవసాయ కార్యకలాపాల ద్వారా ఉద్యోగ అవకాశాలు, స్వయంఉపాధి మాత్రమే కాకుండా, 321 కోట్ల పనిదినాల ఉద్యోగితా సృష్టి జరుగనుంది’ ’ - అరుణ్జైట్లీ
  • ‘ప్రధాన మంత్రి కౌశల్ కేంద్ర’ కార్యక్రమం కింద ప్రతి జిల్లాలోనూ ఆదర్శ నైపుణ్య కేంద్రాల ఏర్పాటు.
ప్రత్యేకహోదా రాష్ట్రాలు
  • దేశంలో ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల్లోని పారిశ్రామిక యూనిట్లకు 2018-19 బడ్జెట్లో పన్ను, ఇతరత్రా ప్రోత్సాహకాల కింద రూ.2,573 కోట్ల ప్రయోజనం కలుగనుంది. ప్రత్యేకహోదా ఉన్న జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వడ్డీరాయితీ కింద రూ.145 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కలిపి రూ.100 కోట్లు ఇచ్చారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు జీఎస్టీ రీఫండ్ కింద రూ.1,500 కోట్లు ప్రయోజనం కలుగనుంది. ఈశాన్యరాష్ట్రాల పారిశ్రామిక, పెట్టుబడి ప్రోత్సాహక విధానం కింద రూ.528 కోట్లు, సరుకు రవాణా సబ్సిడీ కింద రూ.400 కోట్లు దక్కనుంది. ఇవే అంశాల కింద 2017-18 బడ్జెట్లో ఈ రాష్ట్రాలకు రూ.2,937 కోట్ల ప్రయోజనం దక్కింది.
మహాత్ముడి జయంతి వేడుకల సన్నాహాలకు రూ.150 కోట్లు
  • మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను ఏడాదిపాటు (2019 అక్టోబరు 2 నుంచి 2020 అక్టోబరు 2 వరకు) ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకుగాను ప్రధాని మోదీ అధ్యక్షతన జాతీయ కమిటీ ఏర్పాటైంది. ఈ వేడుకల కోసం తాజా బడ్జెట్లో రూ.150 కోట్లు కేటాయించింది.

గృహవసతి
  • అందరికీ 2022 కల్లా గృహవసతి కల్పించాలనే లక్ష్యంలో భాగంగా పలు ప్రత్యేక చర్యలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ సారి గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలను బడ్జెట్లో వెల్లడించింది.
  • జాతీయ హౌసింగ్ బ్యాంకులో అందుబాటు ధరల గృహాల నిధి(ఏహెచ్ఎఫ్) ఏర్పాటు. ప్రభుత్వ అధీకృత బాండ్లు, ఇతర మార్గాల ద్వారా దీనికి నిధులు సమీకరిస్తారు.
  • ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో 2018-19లో 51 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇప్పటికే 2017-18లో 51 లక్షల ఇళ్ల కేటాయింపు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కోటికిపైగా ఇళ్ల నిర్మాణానికి అవకాశం ఏర్పడుతుంది.
  • పట్టణ ప్రాంతాల్లో 37 లక్షల గృహాల నిర్మాణానికి సాయం.

నదుల అనుసంధానం

  • నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రం పదే పదే ప్రకటిస్తున్నా ఆ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. ఎప్పట్లాగే ఈ కార్యక్రమంపై అధ్యయనానికి, సమగ్ర ప్రాజెక్టు నివేదికల(డీపీఆర్) తయారీకే నిధులు కేటాయించిన కేంద్రం..అనుసంధానానికి 2018-19కి కేవలం రూ.కోటి కేటాయించింది.
  • గత ఒకటిన్నర దశాబ్దకాలంగా నదుల అనుసంధానంపై చర్చ జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీనిపై ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రతి రెండు నెలలకోసారి రాష్ట్రాల అధికారులతో చర్చలు జరుపుతోంది. కేంద్ర జలవనరులశాఖ గత మంత్రి ఉమాభారతి, ప్రస్తుత మంత్రి గడ్కరీ తరచూ నిపుణులతో సమావేశమవుతూ వస్తున్నారు.
  • నదుల అనుసంధానాల్లో మొదటిది కెన్-బెట్వా ప్రాజెక్టు. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ల మధ్య ఉండే ఈ నదుల అనుసంధానికి అనుమతులు వచ్చాయి. గత ఆర్నెల్లుగా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అనుమతి కోసం ఎదురుచూస్తోంది. దీని పనులను ప్రారంభించబోతున్నామంటూ కేంద్రం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. ఇక ఒడిశాతోపాటు..దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి తొమ్మిది అనుసంధాన ప్రాజెక్టులు ప్రతిపాదిత దశలో ఉన్నాయి. మహానది నుంచి నీటిని మళ్లించడానికి ఒడిశా అంగీకరించకపోవడంతో తెలంగాణలో గోదావరి నుంచి కృష్ణా-పెన్నా-కావేరి నదులను మొదట అనుసంధానించాలని నిర్ణయించిన కేంద్రం ఇందుకు సంబంధించి నివేదిక కూడా సిద్ధం చేసింది. ధవళేశ్వరం నుంచి గోదావరి-పెన్నా నదులను అనుసంధానం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముందుకొచ్చింది. కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్ ఇప్పటికే డీపీఆర్ సిద్ధంచేసింది. ఈ కార్యక్రమానికి ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా.. బడ్జెట్లో రూ.కోటి కేటాయించడం గమనార్హం.
  • ప్రస్తుత బడ్జెట్లో గత రెండేళ్ల తరహాలోనే అధ్యయనానికి, నివేదికల తయారీకిగానూ జాతీయ జల అభివృద్ధి సంస్థకు రూ.225 కోట్లు కేటాయించారు. ఈ సంస్థ డీపీఆర్ల తయారీకే పరిమితం. పనులతో దానికి సంబంధం లేదు. కేటాయింపుల ఆధారంగా చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అధ్యయనాలకే పరిమితమవబోతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విద్యుత్
  • నాలుగు కోట్ల గ్రామీణ, పట్టణ పేదల ఇళ్లకు ఉచిత విద్యుత్ పంపిణీయే లక్ష్యంగా ప్రవేశపెట్టిన సౌభాగ్య యోజనకు కేంద్రం రూ.16,000 కోట్లు కేటాయించింది.
  • గ్రామీణ విద్యుదీకరణకు ప్రవేశపెట్టిన దీన్దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామజ్యోతి యోజన (డీయూజీజేవై)కు రూ.3,800 కోట్లు ప్రకటించింది.
  • పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థకు ఊపిరిలూదే సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం (ఐపీడీఎస్)కూ రూ.4,900 కోట్లు కేటాయించింది.
  • మరోవైపు పవన, సౌర, హరిత ఇంధన నడవా ప్రాజెక్టుకూ రూ.4,200 కోట్లు ప్రకటించింది.
  • సౌరశక్తి కార్పొరేషన్కూ ప్రస్తుతం కేటాయింపులు తగ్గాయి. 2017-18లో ఇవి రూ.250.42 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.217.43 కోట్లకు తగ్గిపోయాయి.
టెలికాం
         దేశంలోకి దిగుమతి అయ్యే సెల్ఫోన్లపై కస్టమ్స్ సుంకాన్ని 15 నుంచి 20 శాతానికి పెంచారు. దేశీయంగా తయారీ-బిగింపు (అసెంబ్లింగ్)ను ప్రోత్సహించేందుకే ఈ చర్య తీసుకున్నారు. ఇందువల్ల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. స్మార్ట్వాచీలు, ఇతర ఉపకరణాలపైనా కస్టమ్స్ను 10 నుంచి 20 శాతానికి పెంచారు. మొబైల్ ఫోన్ల విడిభాగాలపై 7.5-10 శాతంగా ఉన్న కస్టమ్స్ను 15 శాతం చేశారు.

సంఘటిత సమాజ నిర్మాణం - 115 జిల్లాలు
         సంఘటిత సమాజ నిర్మాణం కోసం వివిధ రంగాల్లో అభివృద్ధి సూచికలుగా రూపొందించడానికి దేశవ్యాప్తంగా 115 జిల్లాలను గుర్తించి వాటిపై కేంద్రం దృష్టి పెట్టనుంది. ఈ జిల్లాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి సామాజికాంశాలైన వైద్యం, విద్య, నైపుణ్య అభివృద్ధి, ఆర్థిక చేయాతతోపాటు మౌలికరంగాలైన నీటిపారుదల, గ్రామీణ విద్యుదీకరణ, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల సదుపాయాల కల్పనకు కాలపరిమితితో కూడిన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అభివృద్ధికి నమూనాగా ఈ జిల్లాలు నిలుస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

యువతకు ప్రోత్సాహకాలు

  • యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. కొత్తగా చేరే ఉద్యోగులు ‘ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్)’కి చెల్లించే 12శాతం మొత్తాన్ని మూడేళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది. ఇది అన్ని రంగాల్లో పనిచేసే వారికీ వర్తిస్తుంది. ఇప్పటికే ‘ప్రధాన మంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన(పీఎంఆర్పీవై)' పథకంలో భాగంగా కొత్తగా చేరే ఉద్యోగులకు మూడేళ్ల పాటు 8.33శాతం మొత్తం ఈపీఎఫ్కు చెల్లిస్తున్నారు. ఈ శాతాన్ని పెంచి తాజాగా అన్ని రంగాలకు విస్తరించారు.
  • ఇ.ఎం.ఆర్.ఎస్. పథకం: 2008లోనే తెరపైకి వచ్చినా అత్యధిక రాష్ట్రాలు ఆసక్తి చూపలేదు. 25 శాతం కంటే ఎక్కువ ఎస్టీల జనాభా ఉన్న 163 జిల్లాలను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ 2017 మార్చి నాటికి గుర్తించింది.
  • పాఠశాలల నిర్మాణం: వచ్చే ఐదేళ్లలో 672 మండలాల్లో పాఠశాలలు నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. ఇప్పటికే 112 జిల్లాల్లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసింది. ఆరు నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.
తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు
        కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ విద్యా సంస్థలు, కేంద్ర సంస్థలకు కేటాయింపులు చేశారు.

ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు ఇలా..

* విశాఖ పోర్టుకు రూ.108కోట్లు.
* ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీకి రూ.32కోట్లు.
* కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.
* ఎన్ఐటీకి రూ.54కోట్లు.
* ఐఐటీకి రూ.50కోట్లు.
* ట్రిపుల్ ఐటీకి రూ.30కోట్లు.
* ఐఐఎంకు రూ.42కోట్లు,
* ఐఐఎస్సీఆర్కు రూ.49కోట్లు,
* డ్రెడ్జింగ్ కార్పోరేషన్కు రూ.19.62కోట్లు.
* విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టుకు రూ.200 కోట్లు.
* ఆంధ్రప్రదేశ్ గ్రామీణ హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ప్రాజెక్టుకు- రూ.150 కోట్లు.
* ఆంధ్ర-తెలంగాణ రోడ్డు సెక్టార్ ప్రాజెక్టుకు - రూ.100 కోట్లు.
* ఆంధ్రప్రదేశ్లో 24 గంటల విద్యుత్ సరఫరా ప్రాజెక్టుకు- రూ.100 కోట్లు.
* ఏపీ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టుకు - రూ.300 కోట్లు.
తెలంగాణకు కేటాయింపులు ఇలా..
* హైదరాబాద్ ఐఐటీకి రూ.75కోట్లు.
* గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.10కోట్లు.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2018-19 హైలైట్స్........


ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగం 2018-19





ఏపీ సోసియో ఎకనామిక్ సర్వే 2017-18

 


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...