ఖనిజ లవణాలు


         ఇవి సూక్ష్మ పోషక పదార్థాలు. మనకు తక్కువ మోతాదులో అవసరం. మన శరీరంలో వివిధ జీవక్రియలు జరగడానికి, ఎముకలు, దంతాలు వంటివి ఏర్పడానికి ఖనిజ లవణాలు చాలా అవసరం. మన శరీరంలో ముఖ్యంగా సోడియం, పొటాషియం, క్లోరిన్, కాల్షియం, ఫాస్ఫరస్, సల్ఫర్, రాగి, ఇనుము, జింక్, అయోడిన్, ఫ్లోరిన్ లాంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో కొన్నింటిని తప్పనిసరిగా ఆహారం ద్వారా తీసుకోవాలి. లేకపోతే వీటిలోపం వల్ల అనేక వ్యాధులు కలుగుతాయి. ఇవే కాకుండా మన శరీరంలో క్రోమియం, మాంగనీస్, సెలీనియం, కోబాల్ట్, మెలిబ్డినం, నికెల్, టిన్, సిలికాన్, వెనడియం లాంటి ఖనిజాలు అతి తక్కువ మోతాదులో ఉంటాయి.

-------------------------------------------------------------------------------------

సోడియం
          కణబాహ్య ద్రవ్యమైన ప్లాస్మా, ఇతర ద్రవాల్లో ఉండే ముఖ్య ధనావేశ అయాన్. ఇది రక్తం పీహెచ్ స్థాయిని క్రమపరచడానికి, నాడీ ప్రచోదనాలకు అవసరం. ఎర్ర రక్తకణాల్లో ఆక్సిజన్, కార్బన్‌డైఆక్సైడ్ రవాణాకు, శరీరంలో నీటిని క్రమపరచడానికి ఉపయోగపడుతుంది. ఒక ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. ఆహారం ద్వారా దీన్ని ఎక్కువగా తీసుకున్నప్పుడు సాధారణంగా మూత్రం ద్వారా విసర్జితమవుతుంది.

లభించే పదార్థాలు
          ఇది దాదాపుగా అన్ని కూరగాయలు, పండ్లలో ఉంటుంది. పాలు, గుడ్డు, మాంసం నుంచి లభిస్తుంది. మనం రోజూ ఆహార పదార్థాల్లో వాడే సోడియంక్లోరైడ్ (ఉప్పు) ద్వారా మనకు సోడియం లభిస్తుంది.

లోపిస్తే..?
          రక్తంలో సోడియం లోపం వల్ల కలిగే స్థితిని హైపోనేట్రిమియా అంటారు.
-------------------------------------------------------------------------------------

పొటాషియం
        మన దేహంలోని కణాంతస్థ ద్రవాల్లో (ఇంట్రా సెల్యూలార్ ఫ్లూయిడ్స్) ఉండే ముఖ్యమైన ధనావేశ అయాన్ పొటాషియం. మన శరీరంలో జరిగే అనేక జీవరసాయన చర్యలకు ఇది అవసరం. శరీరంలో ఆమ్ల, క్షార, నీటి క్రమతలకు కూడా ఇది ముఖ్యం. నాడీ ప్రచోదనాలు సరిగా జరగడానికి, శరీరంలో వాయువుల రవాణాకు, శ్వాసక్రియలో ఉండే గ్త్లెకాలిసిస్‌లోని అనేక ఎంజైములకు అవసరమవుతుంది.

లోపిస్తే..?
          పోటాషియం లోపం వల్ల కలిగే స్థితిని హైపోకలీమియా అంటారు. కండరాలు బలహీనపడటం, పక్షవాత లక్షణాలు, మానసిక తత్తరపాటు లాంటివి కలుగుతాయి.

లభించే పదార్థాలు
          సాధారణంగా ఇది పండ్లు, కూరగాయల నుంచి లభిస్తుంది. అరటి, స్ట్రాబెరీస్, బంగాళాదుంప, ఆకుకూరలు, చేపలు లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది.
-------------------------------------------------------------------------------------

క్లోరిన్
          కణబాహ్య ద్రవమైన (ఎక్స్‌ట్రా సెల్యూలార్ ఫ్లూయిడ్) ప్లాస్మా, ఇతర ద్రవాల్లో క్లోరిన్ ప్రధాన రుణావేశ అయాన్‌గా ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రోలైట్‌గా ఉంటూ ద్రవాభిసరణను క్రమపరచడానికి, నాడీ ప్రచోదనాలకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఆమ్ల-క్షార క్రమతకు, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం తయారుకావడానికి అవసరం. దేహంలోని అధిక క్లోరిన్ మూత్రం, చెమట ద్వారా బయటకు వెళుతుంది.
* ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప దాదాపుగా క్లోరిన్ లోపం ఉండదు. ఒకవేళ ఉంటే పైన పేర్కొన్న క్రియలకు విఘాతం ఏర్పడుతుంది. క్లోరిన్ అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు లాంటి వాటిలో ఉంటుంది.
-------------------------------------------------------------------------------------

కాల్షియం
          మన దేహంలో కాల్షియం ఎక్కువగా ఎముకల్లో ఉంటుంది. దంతాల్లోని డెంటైన్‌లో కొద్ది పరిమాణంలో ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్‌తో కలిసి కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఎముకలు, దంతాలు ఏర్పడటానికి అవసరమవుతుంది. రక్తంలో కాల్షియం స్థాయిని నియంత్రించే హార్మోన్లు కాల్సిటోనిన్, పారాథార్మోన్. కాల్షియం అధికంగా లభ్యమవుతున్నప్పుడు రక్తం నుంచి ఎముకలకు చేరి వాటిలో నిల్వ ఉంటుంది. రక్తంలో దీని పరిమాణం తగ్గినప్పుడు తిరిగి ఎముకల నుంచి రక్తంలోకి చేరుతుంది.

దోహదపడుతుందిలా.

  • ఎముకలు, దంతాలు సక్రమంగా ఏర్పడటానికి.
  • కండర సంకోచానికి, నాడీ ప్రచోదనాలకు..
  • రక్తం గడ్డకట్టే ప్రక్రియకు..
  • కండరాలకు గాయాలైనప్పుడు వాటిని మరమ్మతు చేయడానికి..


లోపిస్తే ఏమవుతుందంటే..
          ఎముకలకు సంబంధించిన ఆస్టియోమలాసియా, ఆస్టియోపోరోసిస్ (వృద్ధుల్లో) వ్యాధులు వస్తాయి.

ఏయే ఆహార పదార్థాల్లో..
          పాలు, గుడ్లు, పాల పదార్థాలు, చేపలు, ఆకుకూరలు, బెల్లం లాంటి వాటిలో కాల్షియం ఉంటుంది. మనకు రోజూ కావాల్సిన కాల్షియం పాలు, పాలపదార్థాల ద్వారా లభిస్తుంది. ధాన్యాల్లో ముఖ్యంగా రాగుల్లో కాల్షియం ఎక్కువ.
-------------------------------------------------------------------------------------

ఫాస్ఫరస్
          ఇది కాల్షియంతో కలిసి ఎముకలు, దంతాలను ఏర్పరుస్తుంది. కేంద్రకామ్లాల(డీఎన్ఏ, ఆర్ఎన్ఏ)లో ఇది ఫాస్ఫారిక్ ఆమ్ల రూపంలో ఉంటుంది. సాధారణంగా దీని లోపం ఏర్పడదు.

దోహదపడుతుందిలా..

  • ఏటీపీ (అడినోసైన్ ట్రై ఫాస్ఫేట్) తయారీకి ఇది అవసరం.
  • జీవక్రియలు సక్రమంగా జరగడానికి, ఎంజైమ్‌ల ఉత్తేజానికి..


ఏయే ఆహార పదార్థాల్లో..
                   ఫాస్ఫరస్ ఎక్కువగా వేరుశనగ, బాదం, చిక్కుడు జాతి విత్తనాలు, వెన్న, ధాన్యాలు, కోడి మాంసం లాంటి వాటిలో ఉంటుంది.
-------------------------------------------------------------------------------------

సల్ఫర్
                   సిస్టీన్, మిథియోనైన్ అనే అమైనో ఆమ్లాల్లో సల్ఫర్ ఉంటుంది. ఇన్సులిన్‌లో కూడా ఉంటుంది. థయామిన్ (విటమిన్ బి1)లో సల్ఫర్ ఉంటుంది.

దోహదపడుతుందిలా..
                   జీవ రసాయన చర్యల్లో అనేక ముఖ్య ధాతువులు ఏర్పడటానికి..
ఏయే ఆహార పదార్థాల్లో..
                   బఠాణీలు, మాంసం, గుడ్లు, ఉల్లి, వెల్లుల్లి, ధాన్యాల్లో సల్ఫర్ ఉంటుంది.
-------------------------------------------------------------------------------------

జింక్
                   జింక్ మన శరీరంలో ఉండే అనేక ఎంజైమ్‌ల్లో కో-ఫ్యాక్టరుగా ఉండి వాటిని ఉత్తేజితం చేస్తుంది. వాణిజ్యపరంగా తయారుచేసే ఇన్సులిన్‌లో జింక్ ఉంటుంది.
దోహదపడుతుందిలా..

  • దేహం పెరుగుదలకు..
  • ప్రత్యుత్పత్తికి.. 
  • గాయాలు మానడానికి సహాయకారిగా..


లోపిస్తే ఏమవుతుందంటే..

  • వెంట్రుకలు రాలిపోతాయి
  • చర్మ వ్యాధులు
  • విరేచనాలు
    ఆకలి తగ్గడం
  • మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవడం
  • స్త్రీలలో రుతుక్రమం దెబ్బతినడం


ఏయే ఆహార పదార్థాల్లో..
          కాలేయం, పాలు, ధాన్యాలు, మాంసం, పాలకూర, గుడ్లు, పప్పుధాన్యాలు లాంటి వాటి ద్వారా జింక్ లభ్యమవుతుంది.
-------------------------------------------------------------------------------------

మాంగనీస్
          శరీరంలో అనేక ఎంజైమ్‌ల ఉత్తేజానికి మాంగనీస్ అవసరం. బయోటిన్, థయామిన్, ఆస్కార్బిక్ ఆమ్లం లాంటి విటమిన్ల జీవక్రియలకు కూడా ఇది చాలా అవసరం.

దోహదపడుతుందిలా..

  • ఎముకల పెరుగుదల, నిర్వహణకు..
  • కొవ్వు ఆమ్లాల తయారీకి..
  • థైరాక్సిన్ సంశ్లేషణలో జ్ఞాపకశక్తి క్షీణించకుండా ఉండటానికి..


లోపిస్తే ఏమవుతుందంటే..

  • ఎముకలు సరిగా అభివృద్ధి చెందవు.
  • గోళ్లు, వెంట్రుకల పెరుగుదల మందగించడం
  • కండరాల మధ్య సమన్వయ లోపం


ఏయే ఆహార పదార్థాల్లో..
          ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, వేరుశనగ, బాదంపప్పు.
-------------------------------------------------------------------------------------

కోబాల్ట్
          ఇది అనేక ఎంజైమ్‌ల్లో కో-ఫ్యాక్టర్‌గా ఉంటుంది. విటమిన్-బి12లో కోబాల్ట్ భాగంగా ఉంటుంది.
దోహదపడుతుందిలా..
          ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి..
లోపిస్తే ఏమవుతుందంటే..
          రక్తహీనత, నాడీ సంబంధ సమస్యలు
ఏయే ఆహార పదార్థాల్లో..
          ఆకుకూరలు, కాలేయం నుంచి లభిస్తుంది.
-------------------------------------------------------------------------------------

మాలిబ్డినమ్
రాగిని మన శరీరం వినియోగించుకోవడానికి ఈ మూలకం అవసరం. ఇది అనేక ఎంజైమ్‌లలో అంతర్భాగంగా ఉంటూ వాటిని ఉత్తేజపరుస్తుంది. మాలిబ్డినమ్ శరీరంలో ఎక్కువైతే 'మాలిబ్డినోసిస్' అనే వ్యాధి వస్తుంది.

ఏయే ఆహార పదార్థాల్లో..
ధాన్యాలు, విత్తనాలు, క్యాబేజి, క్యారెట్, బంగాళాదుంప, చిక్కుడు జాతి విత్తనాల్లో ఉంటుంది.
-------------------------------------------------------------------------------------

ఇనుము
ఇనుము ఒక ముఖ్యమైన మూలకం. మన శరీరంలో ఇది 2-6 గ్రాముల వరకు ఉంటుంది. దీనిలో ఎక్కువభాగం హిమోగ్లోబిన్ రూపంలో ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఉండే ఇనుము శోషణను టీ, కాఫీలలో ఉండే టానిన్లు అడ్డగిస్తాయి. కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత వీటిని సేవించడం శ్రేయస్కరం కాదు. ఆహారంలో ఆస్కార్బిక్ ఆమ్లం, చక్కెర లాంటివి ఉన్నప్పుడు ఇనుము శోషణం ఎక్కువగా జరుగుతుంది. మన శరీరంలో ఉన్న ఇనుము మలం, మూత్రం, స్వేదం లాంటి ప్రక్రియల ద్వారా బయటకు వెళుతుంది. స్త్రీలలో రుతుచక్రం సమయంలో, గర్భాధారణ సమయంలో, శిశువుకు పాలిచ్చే తల్లుల్లో ఇనుము శరీరం నుంచి బయటకు వెళుతుంది. కాబట్టి ఇలాంటి వారు ఆహారం ద్వారా ఇనుమును తప్పనిసరిగా తీసుకోవాలి.

దోహదపడుతుందిలా..

  • ఆక్సిజన్ రవాణాలో ప్రముఖపాత్ర.
  • ఎలక్ట్రాన్-రవాణా ప్రక్రియలో ప్రధాన పాత్ర..
  • డీఎన్ఏ తయారీకి..


లోపిస్తే ఏమవుతుందంటే..
రక్తహీనత ఏర్పడుతుంది. దీన్నే ఇనుము లోపం వల్ల కలిగే రక్తహీనత (ఐరన్ డెఫిషియన్సీ అనీమియా) అంటారు. రక్తహీనత రకాల్లో ఇనుము సంబంధ రక్తహీనత సర్వసాధారణం. రక్తహీనత వల్ల అలసట, తలనొప్పి, గుండెదడ, బలహీనంగా ఉండటం లాంటి లక్షణాలు కలుగుతాయి.

ఏయే ఆహార పదార్థాల్లో..
మాంసం, చేపలు, కాలేయం, రాగులు, తోటకూర, కాలిఫ్లవర్, బెల్లం, కొత్తిమీర, ఆవాలు లాంటి వాటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. వృక్షసంబంధ పదార్థాల కంటే జంతు సంబంధ ఆహార పదార్థాల్లోని ఇనుమునే మన శరీరం ఎక్కువగా శోషించుకుంటుంది.
-------------------------------------------------------------------------------------

రాగి
          హిమోగ్లోబిన్ తయారీకి రాగి అవసరం. మన శరీరంలో ఫాస్ఫోలిపిడ్‌లు, మెలనిన్, కొల్లాజన్ తయారీకి కూడా ఇది అవసరం. రాగి టైరోసినేజ్, సైటోక్రోమ్ ఆక్సిడేజ్ లాంటి అనేక ఎంజైమ్‌ల్లో భాగంగా ఉంటుంది. ఎర్రరక్త కణాల్లో ఉండే ఎరిథ్రోక్యుప్రిన్ ప్రొటీన్, మెదడులో ఉండే సెరిబ్రోక్యుప్రిన్ ప్రొటీన్, కాలేయంలో ఉండే హెపటోక్యుప్రిన్ ప్రొటీన్‌లలో రాగి ఉంటుంది. సాధారణంగా రాగి లోపం ఏర్పడటం అరుదు.

దోహదపడుతుందిలా..

  • హిమోగ్లోబిన్ తయారీలో..
  • ఎముక ఏర్పడటానికి సహాయకారిగా..


లోపిస్తే ఏమవుతుందంటే..
రాగి లోపం ఉన్నట్లయితే రక్తహీనత కలుగుతుంది. చర్మవ్యాధులు కూడా వస్తాయి.

ఏయే ఆహార పదార్థాల్లో..
కాలేయం, చేపలు, ఎండిన చిక్కుళ్లు, జీడిపప్పు లాంటి వాటిలో ఇది ఉంటుంది.
-------------------------------------------------------------------------------------

అయోడిన్
మానవుడికి తప్పనిసరిగా అవసరమయ్యే మూలకాల్లో అయోడిన్ ఒకటి. అయోడిన్ థైరాయిడ్ గ్రంథి స్రవంచే థైరాక్సిన్ హార్మోన్‌లో భాగంగా ఉంటుంది.

దోహదపడుతుందిలా..
శరీరంలో జీవక్రియలు జరగడానికి (పరోక్షంగా)..

లోపిస్తే ఏమవుతుందంటే..
అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథికి సరిగా అయోడిన్ అందక విపరీతంగా ఉబ్బుతుంది. దీన్నే సరళ గాయిటర్ వ్యాధి అంటారు. సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాలు, ఎత్తయిన ప్రాంతాల్లో అయోడిన్ లోపం వల్ల అక్కడ ఉండే ప్రజల్లో సర్వసాధారణంగా గాయిటర్ వ్యాధి కనిపిస్తుంది. దీన్నే ఎండమిక్ గాయిటర్ అంటారు. అయోడిన్ లోపం వల్ల పిల్లలు మందకొడిగా ఉంటారు, వారిలో పెరుగుదల లోపిస్తుంది.

ఏయే ఆహార పదార్థాల్లో..
అయోడిన్ నేల లోపలిభాగంలో ఉంటుంది. కాబట్టి లోతైన బావుల్లోని నీరు తాగేవారికి అయోడిన్ తగినంతగా లభిస్తుంది. ఇది మనం రోజు తినే పండ్లు, కూరగాయల్లో ఉంటుంది. సముద్ర ఉత్పత్తులైన చేపలు, పీతలు, రొయ్యలు, సముద్రపు శైవలాల్లో అయోడిన్ తగినంతగా ఉంటుంది. వీటిని తగినంతగా తీసుకునేవారికి అయోడిన్ లోపం తక్కువ. ప్రస్తుతం మనం అయోడిన్ కలిపిన ఉప్పును ఉపయోగిస్తున్నాం. దీని ద్వారా మనకు అయోడిన్ లభిస్తుంది.
-------------------------------------------------------------------------------------

మెగ్నీషియం
కార్బోహైడ్రేట్‌లు, లిపిడ్‌లు, ప్రొటీన్‌ల సంశ్లేషణలో పాల్గొనే ఎంజైమ్‌ల జీవక్రియలకు మెగ్నీషియం అవసరం.

దోహదపడుతుందిలా..

  • కండరాలు పనిచేయడానికి..
  • నాడీ ప్రచోదనాలకు..


లోపిస్తే ఏమవుతుందంటే..
కండరాల పనితీరులో మార్పు వస్తుంది. కండరాలకు తగినంతగా సమాచారం అందదు.

ఏయే ఆహార పదార్థాల్లో..
పండ్లు, కూరగాయల నుంచి ఇది మనకు లభిస్తుంది.
-------------------------------------------------------------------------------------

సిలికాన్
ఇది మన శరీరంలో చాలా తక్కువగా ఉంటుంది. కాల్షియం లవణాలను ఎముకలోకి చేరవేయడానికి ఇది అవసరం.

దోహదపడుతుందిలా..

  • ఎముకలను పటిష్టంగా ఉంచడానికి..
  • కొల్లాజన్ అనే ప్రొటీను తయారీకి..
  • రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండటానికి..
  •  చర్మాన్ని మృదువుగా ఉంచడానికి..


ఏయే ఆహార పదార్థాల్లో..
వరి, గోధుమ, సజ్జ, జొన్న లాంటి ధాన్యాలు, నిమ్మజాతి ఫలాల్లో ఉంటుంది.
-------------------------------------------------------------------------------------

క్రోమియం
క్రోమియంను ఒక గ్లూకోజ్ టోలరెన్స్ ఫ్యాక్టర్ అంటారు. ఈ మూలకం స్థూలపోషక పదార్థాలైన కార్బోహైడ్రేట్, ప్రొటీన్, లిపిడ్‌ల జీవక్రియలకు అవసరం.

దోహదపడుతుందిలా..
ఇన్సులిన్ హార్మోనుకు సహాయం చేసి, గ్లూకోజ్ కణంలోకి వెళ్లడానికి తోడ్పడుతుంది.

ఏయే ఆహార పదార్థాల్లో..
ధాన్యాలు, మాంసం, పాలు, కాలేయం, ఆపిల్, బంగాళదుంపలు, కోడిగుడ్డులో ఉంటుంది.
-------------------------------------------------------------------------------------

సెలీనియం
మైటోకాండ్రియాలో ఏటీపీ సంశ్లేషణకు సెలీనియం అవసరం. సాధారణంగా దీని వినియోగం అత్యల్పం. దీని లోపం వల్ల ప్రత్యేకంగా ఏ వ్యాధి రాదు. రంగులు, పింగాణి, గాజు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారుచేసే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కాలుష్యం వల్ల దేహంలో సెలీనియం మోతాదుకు మించి ఉండి విషప్రభావాన్ని కలగజేస్తుంది.

దోహదపడుతుందిలా..

  • యాంటీ ఆక్సిడెంట్‌గా..
  • వ్యాధినిరోధక శక్తి సరిగా పనిచేయడానికి..
  • శుక్రకణాల కదలికకు..
  • థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో..


ఏయే ఆహార పదార్థాల్లో..
మాంసం, ధాన్యాలు, పాల ఉత్పత్తులు, సముద్ర ఆహార ఉత్పత్తుల నుంచి ఇది లభ్యమవుతుంది.
-------------------------------------------------------------------------------------

ఫ్లోరిన్

ఇది మనకు తాగునీటి ద్వారా ఎక్కువగా లభ్యమవుతుంది. దీని లోపం చాలా అరుదు. తాగేనీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఫ్లోరిన్ దంతాల్లో పేరుకుపోయి వాటిపై మచ్చలను ఏర్పరుస్తుంది. దీన్నే డెంటల్ ఫ్లోరోసిన్ అంటారు. మన శరీరంలోకి చేరే ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ఎముకల్లో కాల్షియం స్థానంలో చేరిపోతుంది. దీనివల్ల ఎముకలు మెత్తగా తయారై వంకరగా తయారవుతాయి లేదా కాల్షియం తగ్గిపోయి పెళుసుగా మారి సులభంగా విరిగిపోతాయి. కీళ్ల మధ్య ఫ్లోరిన్ చేరడం వల్ల కీళ్ల కదలిక తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని స్కెలిటల్ ఫ్లోరోసిస్ అంటారు. ఫ్లోరిన్ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరల్లో పేరుకుపోవడం వల్ల అవి గట్టిపడిపోతాయి. దీనివల్ల వెన్నుపాము ఒత్తిడికి గురవుతుంది. ఈ పరిస్థితిని నాడీసంబంధ ఫ్లోరోసిస్ అంటారు.
భూగర్భ జలాలను లేదా లోతయిన గొట్టపు బావుల నీటిని తాగునీటిగా వినియోగించే వారికి 'ఫ్లోరోసిస్' వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి తాగేనీటిలో ఫ్లోరిన్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

దోహదపడుతుందిలా..

  • దంతాలపై ఉండే ఎనామిల్ తయారు కావడానికి ఫ్లోరిన్ అవసరం.
  • దంతాలు, ఎముకలు ఏర్పడటానికి ఇది కొద్దిమొత్తంలో అవసరం.


 లోపిస్తే ఏమవుతుందంటే..
ఫ్లోరిన్ పూర్తిగా లభ్యం కాకపోతే ఎముకల సంబంధ సమస్యలు వస్తాయి.


-------------------------------------------------------------------------------------




FOR PDF:  CLICK HERE

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...