జాతీయాదాయ వృద్ధిరేటు

   ఒక దేశ అభివృద్ధి గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరిగినప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంటుంది. అదే ఆ దేశ జాతీయాదాయ వృద్ధిరేటు. దీని గురించి అవగాహన ఉంటే ఆర్థికాభివృద్ధిలోని ఎత్తుపల్లాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు.
         ఒక దేశ ప్రగతిని ఆ దేశ స్థూల జాతీయాదాయం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల జాతీయాదాయం (Gross National Income) అంటారు. దేశ సరిహద్దు లోపల ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తాన్ని స్థూల దేశీయ ఆదాయం (Gross Domestic Income) అంటారు. ఎక్కువ దేశాలు జీడీపీని దేశ అభివృద్ధికి కొలమానంగా ఉపయోగిస్తున్నాయి. 

GNP=GDP + విదేశీ ఆదాయం

    అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తయిన మొత్తం వస్తుసేవల విలువల నుంచి మాధ్యమిక వస్తువుల విలువను తీసివేయగా మిగిలిన అంతిమ వస్తుసేవల విలువలను కూడితే జాతీయాదాయం వస్తుంది. మాధ్యమిక వస్తువుల విలువ కూడా అంతిమ వస్తువు విలువలో కలిసి ఉంటుంది. కాబట్టి మాధ్యమిక వస్తువుల విలువ తీసివేయకపోతే జాతీయాదాయం అధికంగా, అవాస్తవంగా లెక్కించబడుతుంది. 
ఉదా: సెల్‌ఫోన్‌ తయారీలో దాని విడిభాగాలు మాధ్యమిక వస్తువులు అవుతాయి. వాటన్నింటి విలువలు కలిసి సెల్‌ఫోన్‌ విలువ అవుతుంది. కాబట్టి విడిభాగాల విలువలు విడిగా లెక్కించనవసరం లేదు.

లభించే మార్గాలు
ఒక దేశానికి జాతీయాదాయం ప్రధానంగా నాలుగు మార్గాల ద్వారా లభిస్తుంది.
ప్రజలు ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో ప్రవేశించి కింది విధులు నిర్వర్తించడం ద్వారా జాతీయాదాయం లభిస్తుంది.  
ప్రజల వినియోగం(Consumpion): కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకోవడానికి అనేక రకాల వస్తు సేవలపై వ్యయం చేస్తుంటారు. అలా ఖర్చు చేసే ప్రతి రూపాయి అమ్మకందారుడికి ఆదాయం అవుతుంది. ఆ ఆదాయం మరో కొత్త వస్తుసేవలకు డిమాండ్‌ను సృష్టిస్తుంది. అలా ఆర్థిక వ్యవస్థలో ఆదాయం చక్రంలా ఒకరి నుంచి మరొకరికి ప్రయాణించి జాతీయాదాయాన్ని పెంచుతుంది.
పెట్టుబడి వ్యయం(Investment): వ్యాపార సంస్థలు ప్రజల డిమాండ్‌ ఆధారంగా వస్తువులను తయారుచేసి సప్లయ్‌ చేయడానికి పెట్టుబడులు పెడతాయి. ఇది కొత్త ఉద్యోగాలను కల్పిస్తుంది. వారి జీతాలు పెరిగి, కొనుగోలు శక్తిని పెంచుతుంది. యజమానుల లాభాలు పెరిగితే మూలధన సంచయనం జరిగి కొత్త సంస్థలు, వస్తువులు, ఉద్యోగాల ద్వారా జాతీయాదాయం పెరుగుతుంది.
ప్రభుత్వ వ్యయం(Governament ependiture): ఇది మరో ప్రధాన సూత్రధారి. ప్రజల అవసరాలు, అవస్థాపన సౌకర్యాలు కల్పించడానికి, శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఏటా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఈ వ్యయం ప్రజల ఉపాధిని, ఆదాయాలను, కొనుగోలుశక్తిని, జీవన ప్రమాణాలను పెంచుతుంది. సంస్థలకు అనుకూల పెట్టుబడి వాతావరణాన్ని కల్పిస్తుంది.
విదేశీ ఆర్థిక వ్యవహారాలు(foreign economic transactions): ఒక దేశం వివిధ ప్రపంచ దేశాలతో వస్తుసేవల వ్యాపారం చేస్తుంది. దాంతో పెట్టుబడులు వివిధ దేశాల మధ్య ప్రవహిస్తాయి. దీనివల్ల ఇతర దేశాలకు చెల్లింపులు జరిగి వాటి నుంచి ఆదాయాలు వస్తాయి. చెల్లింపుల కంటే ఆదాయాలు ఎక్కువగా ఉంటే ఆ దేశ ఆదాయానికి కలుపుతాం. తక్కువగా ఉంటే దేశ ఆదాయం నుంచి తీసివేస్తాం. 
        ప్రస్తుతం ప్రపంచీకరణ కాలంలో మన దేశంతో పాటు అనేక దేశాలు అంతర్జాతీయ వ్యాపారంలో భాగమయ్యాయి. ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థల పనితీరు ప్రభావం మన ఆదాయవృద్ధిపై పడుతుంది.
GNP= C + I + G + (X - M) + (R - P)
C = వినియోగం,  I  = పెట్టుబడులు,
G = ప్రభుత్వ వ్యయం
X - M = విదేశీ వ్యాపార శేషం, 
R - P = విదేశీ చెల్లింపుల శేషం
లెక్కింపు 
   జాతీయాదాయం లెక్కింపు పద్ధతి వీలైనంత సమగ్రంగా, శాస్త్రీయంగా ఉంటే ఒక దేశ అభివృద్ధి తాలూకు దశదిశలను సులభంగా అంచనా వేయవచ్చు.
    జాతీయాదాయం విలువ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 
   1) వస్తు సేవల పరిమాణంలో మార్పు
    2) వాటి ధరల్లో మార్పు
    ఈ రెండింటలో కలిసి లేదా ఏ ఒక్కదానిలోనైనా మార్పు వచ్చినప్పుడు జాతీయాదాయం విలువ మారుతుంది. వస్తుసేవల పరిమాణం పెరగడమే నిజమైన అభివృద్ధి. అయితే ఒక్కోసారి వస్తుసేవల సంఖ్య పెరగకుండానే కేవలం వాటి ధరలు పెరగడం వల్ల జాతీయాదాయం పెరిగినట్లుగా కనిపిస్తుంది. కానీ అది వాంఛనీయ అభివృద్ధి కాదు. 
    మన దేశంలో జీడీపీ డిఫ్లేటర్‌ను కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు శాఖ నిర్ణయిస్తుంది. జీడీపీని త్రైమాసికానికి ఒకసారి చొప్పున ప్రతి ఏడాది కేంద్ర గణాంక సంస్థ లెక్కిస్తుంది. మన దేశంలో గత 7 త్రైమాసికాలుగా జీడీపీ వృద్ధిరేటు క్షీణిస్తూ వస్తుంది. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం 2019-20 ఏప్రిల్‌ - డిసెంబరు మధ్య కాలంలో కేవలం 5.1%  వృద్ధి రేటు నమోదైంది. 
2012 - 13లో నమోదైన 4.3% తర్వాత ఇదే అతి తక్కువ వృద్ధిరేటు. మన దేశ వృద్ధిరేటు పడిపోయి ప్రపంచ అత్యధిక వృద్ధిరేటు కలిగిన దేశంగా చైనా నిలిచింది. పైన పేర్కొన్న ప్రజల వినియోగం, పెట్టుబడులు, విదేశీ ఎగుమతుల్లో (ప్రైవేటు రంగం) క్షీణత కనిపిస్తుంది. డిమాండ్‌ కొరత వల్ల వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.
    ప్రధానంగా కీలక పరిశ్రమల వృద్ధి బాగా తగ్గింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ ప్రభావం ప్రపంచ ప్రగతిపై పడి మన దేశ వృద్ధిరేటు తగ్గుదలకు కారణమైంది.
    2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్‌టీ అమలుచేయడం వల్ల స్వదేశీ మార్కెట్‌లో కొంత అనిశ్చితి ఏర్పడింది. దీనివల్ల ముఖ్యంగా గ్రామీణ ఆదాయాలు తగ్గి, డిమాండ్‌ తగ్గింది. వ్యాపారాల్లో మార్పు సంధి దశలో అనుమానాలు, భయాలు కూడా కొంతమేర అమ్మకాలు పడిపోవడానికి కారణమయ్యాయని నిపుణుల అంచనా.
    నమోదైన వృద్ధిరేటుకు ప్రధాన చోధకం ప్రభుత్వ వ్యయం. ఇప్పటికే ప్రభుత్వం విత్తలోటుకు సమానంగా నిధులు అప్పులుగా తెచ్చి వివిధ కార్యక్రమాలపై వెచ్చిస్తుంది. మన ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటురంగం సుమారు 87% కలిగి ఉన్నా, గత తొమ్మిది నెలల్లో కేవలం 4.01% వృద్ధి నమోదు కావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతోంది. అయితే ప్రభుత్వ వ్యయం అంచనాలకు మించి 15.64% పెరిగింది. ఆర్థిక మందగమన కాలంలో ప్రైవేటురంగం వెనకడుగు వేసినప్పుడు ప్రభుత్వ రంగం కీలకపాత్ర పోషించాల్సి వస్తుందని ఇది రుజువు చేస్తుంది.
మార్పులు - గణన
జాతీయాదాయంలో మార్పులను రెండు రకాల మార్కెట్‌ ధరల సహాయంతో గణిస్తారు.
ఆధార సంవత్సర ధరల్లో.. 
(GNP at base year or constant priece)

    ప్రజలకు అవసరమైన వస్తుసేవలు పెరగడమే నిజమైన అభివృద్ధి. కాబట్టి ధరలతో ప్రమేయం లేకుండా వస్తుసేవల పరిమాణంలో మార్పులు లెక్కించాలి. దీనికి గణాంక శాస్త్రవేత్తలు ఆధార సంవత్సరాన్ని సూచించారు. ఒడిదొడుకులు లేని  సాధారణ పరిస్థితులు కలిగిన సంవత్సరాన్ని ఎన్నుకుంటారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధి తర్వాత ఈ ఆధార సంవత్సరాన్ని మారుస్తుంటారు. ఆధార సంవత్సర ధరల్లో తర్వాతి సంవత్సరాల వస్తుసేవల ఉత్పత్తి విలువను లెక్కిస్తారు. దీనివల్ల ధరలు మారకుండా కేవలం వస్తుసేవల పరిమాణం మార్పులను తెలుపుతుంది. ధరలు మారవు కాబట్టి దీన్ని స్థిర ధరల్లో జాతీయాదాయం లేదా వాస్తవిక ఆదాయం అని పిలుస్తారు. మన దేశంలో ఇప్పుడు  ఆధార సంవత్సరంగా 2011 - 12ను ఉపయోగిస్తున్నారు. త్వరలో 2017 - 18కి మారాలని గణాంక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తుంది. పట్టికలోని చక్కెర, పాలు, టీ పొడి విలువలను 2011 - 12 నాటి ధరల్లో 2018, 2019 నాటి ఉత్పత్తులను లెక్కిస్తారు. అప్పుడు ధరల్లో మార్పు ఉండకుండా వాస్తవ ఆదాయంలో మార్పులను సులభంగా తెలుసుకోవచ్చు. 
    సాధారణంగా వాస్తవ ఆదాయం కంటే ద్రవ్యోల్బణం సమయంలో ధరలు పెరుగుతుండటం వల్ల నామమాత్ర ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మాంద్యకాలంలో వాస్తవ ఆదాయం కంటే నామమాత్రపు ఆదాయం తక్కువగా ఉంటుంది. వాస్తవ ఆదాయ విలువను కింది సూత్రం ఆధారంగా లెక్కిస్తారు.
 
    డిఫ్లేటర్‌ అంటే ప్రస్తుత సంవత్సర ధరలకు, ఆధార సంవత్సర ధరలకు మధ్య ఉన్న నిష్పత్తి. ఇది వినియోగదారుల సూచిక మాదిరి (దిశిఖి) ధరల స్థాయిని తెలియజేస్తుంది.

ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం(GNP at current prices)
    ఏ సంవత్సరంలో ఉత్పత్తయిన వస్తుసేవల విలువలను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తే దాన్ని నామమాత్రపు జాతీయాదాయం అంటారు. 2018లో ఒక లక్ష కార్లు తయారైతే వాటి విలువను అదే సంవత్సర ధరల్లో లెక్కిస్తాం. ఇక్కడ ధరల మార్పు జాతీయాదాయ విలువపై పడుతుంది. వస్తువుల సంఖ్య పెరిగినా, తగ్గినా, స్థిరంగా ఉన్నా వాటి ధరల్లో పెరుగుదల ఉంటే జాతీయాదాయం పెరుగుతుంది. ధరలు తగ్గితే జాతీయాదాయం తగ్గుతుంది. ఇది ద్రవ్యోల్బణం వల్ల  పెరిగినట్లు కనిపిస్తుంది. అసలైన అభివృద్ధిని తెలుపదు.

    పట్టికలో చూపినట్లుగా ధరల్లో మార్పు వచ్చినప్పుడు వస్తువు విలువలో మార్పు కనిపిస్తుంది. కానీ, ప్రజలకు కావాల్సిన వస్తుసేవల పరిమాణంలో మార్పులను ఇది తెలపడం లేదు.

వృద్ధి - అభివృద్ధి

         ఏ ఆర్థిక వ్యవస్థ అయినా నిదాన, సత్వర వృద్ధిని సాధించాలంటే తప్పకుండా ఆర్థికాభివృద్ధిని చేరుకోవాల్సిందే. 'వృద్ధి'ని పరిగణించే సమయంలో ఒకే ఒక అంశాన్ని (ఆదాయం) పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని ఏకముఖ వ్యూహం అంటారు. 

         ఆర్థికాభివృద్ధిలో అనేక అంశాలు (బహుముఖ వ్యూహం) ఉంటాయి. కాబట్టి వృద్ధి కంటే ఆర్థికాభివృద్ధి సమస్యాత్మకమైంది. 

          వర్ధమాన దేశాలన్నీ ఆర్థికాభివృద్ధిలోనే ఉన్నాయి. 

          కిండ్లే బర్గర్ ప్రకారం వృద్ధిని మనిషి శారీరక పెరుగుదలతో పోలిస్తే... ఆర్థికాభివృద్ధిని మనిషి శారీరక, మానసిక అంశాలతో పోల్చవచ్చు. అనేకమంది ఆర్థికవేత్తలు వృద్ధి, ఆర్థికాభివృద్ధికి మధ్య తేడా లేదని భావించారు. షుంపీటర్, ఉర్సుల హిక్స్ ప్రకారం రెండింటి మధ్య తేడా ఉంది. చమురు దేశాలు ఆర్థికాభివృద్ధిని సాధించకుండానే వృద్ధిని చేరుకున్నాయి.
 

ఆర్థికవృద్ధి (Growth)
* దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల.
* ఇది పరిమాణాత్మక మార్పును తెలుపుతుంది.
ఉదా: దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల.
* దీర్ఘకాలంలో తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదల.
* జాతీయోత్పత్తి పెరుగుదల వ్యాపార చక్రాల వల్ల తాత్కాలికంగా పెరగవచ్చు కానీ, అసలైన వృద్ధి కాదు. జాతీయోత్పత్తి పెరుగుదల దీర్ఘకాలంగా కొనసాగాలి.

ఆర్థికాభివృద్ధి (Development)
* దేశంలో ఉత్పత్తి పెరుగుదలతోపాటు వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పు ఆర్థికాభివృద్ధి.
* ఆర్థికాభివృద్ధి = ఆర్థికవృద్ధి + ఉత్పాదక పెరుగుదల = ఆర్థికవృద్ధి + పేదవారికి అనుకూలంగా వనరుల పంపిణీ = వృద్ధి + సంక్షేమం

ఆర్థికాభివృద్ధి నిర్వచనాలు
1. గున్నార్ మిర్డాల్: మొత్తం సాంఘిక వ్యవస్థ ప్రగతి పథంలో ముందుకు సాగడమే ఆర్థికాభివృద్ధి.
2. జాన్ రాబిన్ సన్: దేశం ఆర్థికాభివృద్ధి దాటి వృద్ధిని చేరుకుంటే అది స్వర్ణయుగం.
3. గెరాల్డ్ మేయర్: దీర్ఘకాలంలో తలసరి ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థికాభివృద్ధి అంటారు.
4. హేగెన్: ఆర్థికాభివృద్ధి అంతులేకుండా నిత్యం జరిగే ప్రక్రియ.
5. కొలిన్ క్లార్క్: వ్యవసాయ రంగంలోని ప్రజలు పారిశ్రామిక, సేవల రంగానికి నిరంతరంగా తరలిపోవడం ఆర్థికాభివృద్ధి.
6. సి.ఇ. బ్లాక్: అనేక ఆధునికీకరణ ఆదర్శాలను సాధించడమే ఆర్థికాభివృద్ధి.
7. ఆచార్య మైఖేల్, పి. తోడారో: ఆర్థికాభివృద్ధి ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ.
8. జె.ఇ. మేయర్, జె.ఇ. రాచ్: తలసరి జాతీయాదాయం దీర్ఘకాల పెరుగుదలే ఆర్థికాభివృద్ధి.
9. డడ్లీ శీర్స్: పేదరికాన్ని, అసమానతలను, నిరుద్యోగితను వాటి అధిక స్థాయిల నుంచి తగ్గిస్తే దాన్ని అభివృద్ధి కాలం అంటారు.

 

ఆర్థికాభివృద్ధిలో ఇమిడి ఉన్న అంశాలు
1. తలసరి వాస్తవిక జాతీయాదాయం పెరుగుదల.
2. ఆర్థిక వ్యవస్థలో ఆభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక మార్పులు రావడం.
3. పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గి ఉపాధి పెరగడం.
4. సంస్థాగత సాంకేతిక మార్పులు రావడం.
5. పైవన్నీ దీర్ఘకాలంలో కొనసాగడం.
ఉదా: లాటిన్ అమెరికాలోని లైబీరియాలో అరటిపండ్ల ఎగుమతి ద్వారా, అరబ్ దేశాల్లో పెట్రోలియం ఎగుమతి ద్వారా జాతీయాదాయం, తలసరి ఆదాయం పెరిగినప్పటికీ అవి స్వయంసమృద్ధి సాధించలేదు.
* రాబర్ట్ క్లేవర్ ''Growth without Development'' అనే గ్రంథంలో లైబీరియా దేశంలో అభివృద్ధి లేకుండా వృద్ధి ఎలా జరుగుతుందో చెప్పారు. దీనివల్ల ఆ దేశ ప్రతిఫలాలు కొద్దిమందికే అందుతున్నాయి. సామాన్య ప్రజానీకం పేదరికంలో మగ్గుతున్నారు.

ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలు
* ప్రారంభంలో ఈ పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగించేవారు.
* హిక్స్, షుంపీటర్ ఈ పదాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని సూచించారు.
* వృద్ధి, అభివృద్ధి అనే పదాలు 1960లో ప్రాచుర్యంలోకి వచ్చాయి.

       ఆర్థికవృద్ధి                   ఆర్థికాభివృద్థి
 1. ఉత్పత్తి పెరుగుదలలో మార్పులు.  1. ఉత్పత్తి పెరుగుదలతో పాటు సంస్థాగత, సాంకేతిక, అవస్థాపక,
వ్యవస్థాపక మార్పులను సూచిస్తుంది.
 2. ఇది పరిమాణాత్మకమైంది.  2. ఇది గుణాత్మకమైంది.
 3. దీన్ని కొలవచ్చు.  3. దీన్ని కొలవలేం.
 4. ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు.  4. ప్రభుత్వ ప్రమేయం అవసరం.
 5. ఇది దృగ్విషమైంది/ఏకమైంది.  5. ఇది బహుముఖమైంది.
 6. ఇది సంకుచితమైంది/ఇది సూక్ష్మ (micro) స్వభావం ఉన్నది.  6. విస్తృతమైంది/ఇది స్థూల (macro) స్వభావం ఉంది.
 7. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు (OECD) వర్తిస్తుంది.  7. అభివృద్ధి చెందుతున్న (వర్ధమాన) దేశాలకు వర్తిస్తుంది.
8. సంస్థాగత మార్పులు లేకుండా పెరుగుదలను సూచిస్తుంది. 8. సంస్థాగత, సాంకేతిక మార్పులను సూచిస్తుంది.
9. కిండల్ బర్గర్ ప్రకారం వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పును తెలిపేది. 9. శారీరక పెరుగుదలతోపాటు మానసిక పరిపక్వతను కూడా సూచించేది.
10. ఇది స్వల్ప కాలానికి సంబంధించింది. 10. ఇది దీర్ఘకాలానికి సంబంధించింది.
11. పంపిణీని సూచించదు. 11. పంపిణీని సూచిస్తుంది.
12. ఆదాయం, సంపద లాంటి వాటి పంపిణీని తెలపదు. 12. ఆదాయం, సంపద లాంటివాటి పంపిణీని ఆర్థికాభివృద్ధి తెలియజేస్తుంది.
13. ప్రభుత్వ జోక్యం లేకుండా సహజంగా ఏర్పడే పెరుగుదలను ఆర్థికవృద్ధి అంటారు. 13. ప్రభుత్వ విధానాల ద్వారా ఉద్దేశపూర్వకంగా వివిధ మార్పులు చేసి
సాధించే దాన్నే ఆర్థికాభివృద్ధిగా వర్ణించవచ్చు.
14. ఆర్థికవృద్ధిని ఆదాయం లేదా సంపదతో అంచనా వేస్తారు. 14. ఆర్థికాభివృద్ధిని గుణాత్మక అంశాలైన నిరుద్యోగం, పేదరికం, మానవ వనరుల అభివృద్ధి,
జీవన ప్రమాణం స్థాయి లాంటి వాటిలో వచ్చిన మార్పులు ఆధారంగా అంచనా వేస్తారు.
15. ఆర్థికవృద్ధితో ఆర్థిక మార్పులను సాధించవచ్చు. కానీ సామాజిక మార్పులను సూచించదు. 15. ఆర్థికాభివృద్ధితో ఆర్థిక మార్పులతో పాటు సామాజిక మార్పులు సాధించవచ్చు.

అల్పాభివృద్ధి దేశాల లక్షణాలు (Characteristics of Under Development Countries)

1. మూలధనం కొరత: అల్పాభివృద్ధి /అభివృద్ధి చెందుతున్న/ వెనుకబడిన దేశాల్లో తలసరి ఆదాయం తక్కువ కాబట్టి పొదుపు సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఫలితంగా మూలధనం కొరత ఏర్పడుతుంది.
షుంపీటర్: ఆర్థికాభివృద్ధికి అవసరమైన చొరవతో ముందుకు వచ్చే వ్యవస్థాపకుల కొరత వల్ల కూడా పెట్టుబడి తక్కువ స్థాయిలో ఉంటుంది.
* కొద్దిమంది ధనవంతులకు వడ్డీలు, భాటకం రూపంలో ఆదాయం వచ్చినప్పటికీ వారు ఆడంబర వినియోగంపై ఖర్చు చేస్తారు. కానీ పొదుపు చేసి పెట్టుబడులు పెట్టరు.
* భారతదేశంలో తక్కువ (తలసరి) ఆదాయం, అధిక వినియోగ వ్యయం వల్ల పొదుపుస్థాయి తక్కువగా ఉంది.
* మనదేశంలో తలసరి మూలధన లభ్యత తక్కువగా ఉంది.
* మూలధన కల్పన రేటు కూడా తక్కువగా ఉంది.
* ఈ మధ్యలో కాలంలో మూలధన కల్పన రేటు పెరిగింది. ఇది కోరదగిన మంచి పరిణామంగా చెప్పవచ్చు.
* 1950 - 51లో GDPలో పొదుపు శాతం 8.6%గా ఉండేది.
* 2007 - 08లో GDPలో పొదుపు శాతం గరిష్ఠంగా 36.8%కు పెరిగింది.
* 2012 - 13లో GDPలో పొదుపు శాతం 31.8%కు చేరింది.
* స్థూల దేశీయ పొదుపునకు ప్రభుత్వ, కార్పొరేటు, గృహ రంగాల నుంచి పొదుపుల వనరులు లభ్యమవుతున్నాయి. వీటిలో ఎక్కువ గృహ రంగం నుంచి లభిస్తోంది.
* 2013 - 14లో స్థూల దేశీయ పొదుపు 30.6% కాగా ఇందులో మొదటి స్థానం గృహ రంగానిది 18.2%గా ఉంది. 10.9% కార్పొరేట్ రంగానిది 2వ స్థానం.
* స్థిర మూలధన కల్పన పెట్టుబడి కూడా పెరుగుతూ వస్తోంది.
* 2013 - 14 నుంచి పెట్టుబడిలో అత్యధిక వాటా కార్పొరేట్ రంగానిదే (12.6%). తర్వాత స్థానం గృహ రంగానిది (10.7%).

   
1) సహజవనరులు - అల్పవినియోగం                    1) కులతత్వం

2) మానవ వనరులు - నైపుణ్యం కొరత                   2) మతతత్వం

3) మూలధనం కొరత                                         3) సాంఘిక ఆచార వ్యవహారాలు

4) పేదరిక విషవలయాలు                                   4) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ

5) అల్ప సాంకేతిక పరిజ్ఞానం                                5) సుస్థిర ప్రభుత్వాలు లేకపోవడం

6) మార్కెట్ అసంపూర్ణతలు
ఎ) శ్రమ విభజన లేకపోవడం
బి) ఉత్పత్తి కారకాల గమన శీలత లేకపోవడం
సి) ఏకస్వామ్య ధోరణులు
డి) ధరల దృఢత్వం ఉండటం
ఇ) మార్కెట్ సమాచారం అందుబాటులో లేకపోవడం

 

2. విదేశీ కారకాలు
   1) గతంలో వలసవాదానికి గురై ఉండటం
   2) ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయడం
   3) అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం

 

ఆర్థికాభివృద్ధికి ఆధారాలు

విదేశీ వ్యాపారం
* సాధారణంగా అల్పాభివృద్ధి దేశాలు ముడిసరకులు, ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేసి, వినియోగ/ మూలధన వస్తువులను దిగుమతి చేసుకుంటాయి. దీనివల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతింటాయి.
* మనదేశం ముడిసరకులు ఎగుమతి చేసే స్థాయి నుంచి ఇంజినీరింగ్ వస్తువులు ఎగుమతి చేసే స్థాయికి చేరింది.
* భారత ఆర్థిక వ్యవస్థలో అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఉన్నప్పటికీ, ప్రణాళికలు అమలుపరచి అభివృద్ధి దిశగా పయనించడం వల్ల పరిమాణాత్మక, వ్యవస్థాపూర్వక మార్పులు వచ్చాయి. అందువల్ల మనదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలవొచ్చు.

ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు
1) అభివృద్ధి చెందిన దేశాలు
    ఉదా: యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్
2) అభివృద్ధి చెందుతున్న దేశాలు
    ఉదా: భారతదేశం, దక్షిణాఫ్రికా, బ్రెజిల్
3) తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు
    ఉదా: భూటాన్, నేపాల్, ఆఫ్ఘానిస్థాన్, సబ్-సహారా దేశాలు, సూడాన్, చాద్

 

ప్రపంచ బ్యాంకు వర్గీకరణ
* ప్రపంచ బ్యాంకు ప్రపంచ అభివృద్ధి నివేదిక (WDR)ను 2016, జులై 1న విడుదల చేసింది.
* తలసరి జీడీపీ ఆధారంగా వర్గీకరణ
* ప్రపంచ అభివృద్ధి నివేదిక సారాంశం - డిజిటల్ డివిడెంట్ (ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వృద్ధి, ఉద్యోగిత, సేవలు)
* ప్రపంచ బ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడు - జిమ్ యాంగ్ కిమ్.
* ప్రపంచ బ్యాంకు GNI, PCIలను ఆధారంగా చేసుకుని ప్రపంచ దేశాలను వర్గీకరిస్తుంది.
* GNI తలసరి ఆదాయాన్ని గణించడానికి ప్రపంచ బ్యాంకు 'వరల్డ్ అట్లాస్ మెథడ్‌'ను ఉపయోగిస్తుంది.

1. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు (Upper Income Countries)

* 12,476 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు
    ఉదా: యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, ఓఈసీడీ దేశాలు, రష్యా, సింగపూర్, జపాన్

2. మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు (Middle Income Countries)
* 1,025 డాలర్ల నుంచి 12,475 డాలర్లు
ఎ) ఎగువ మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు
* 4,036 డాలర్ల నుంచి 12,475 డాలర్లు
ఉదా: మాల్దీవులు, చైనా, మెక్సికో, బ్రెజిల్
బి) దిగువ మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు
* 1,025 డాలర్ల నుంచి 4,035 డాలర్లు
ఉదా: భూటాన్, బంగ్లాదేశ్, భారతదేశం, పాకిస్థాన్, శ్రీలంక

3. తక్కువ ఆదాయం ఉన్న దేశాలు
* 1025 లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు
ఉదా: ఆఫ్గానిస్థాన్, నేపాల్, సబ్ సహారా దేశాలు
* భారతదేశం ప్రపంచ జనాభాలో 17.6%, ప్రపంచ స్థూల జాతీయాదాయంలో 2.5% వాటాను కలిగి ఉంది. చైనా ప్రపంచ జనాభాలో 19%, స్థూల జాతీయ ఆదాయంలో 12% వాటా కలిగి ఉంది.
* వేగవంతంగా ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణం చెందే దేశాలను ఎమర్జింగ్ మార్కెట్ అంటారు.
    ఉదా: భారతదేశం, చైనా

ఐక్యరాజ్యసమితి వర్గీకరణ
1. మొదటి ప్రపంచ దేశాలు:
* పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లేదా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలను మొదటి ప్రపంచ దేశాలుగా పిలుస్తారు.
ఉదా: యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా

2. రెండో ప్రపంచ దేశాలు:
* సామ్యవాద లేదా కమ్యూనిస్టు దేశాలైన పూర్వ రష్యా, క్యూబా, చైనా దేశాలను రెండో ప్రపంచ దేశాలుగా పిలుస్తారు.

3. మూడో ప్రపంచ దేశాలు:
* అభివృద్ధి చెందుతున్న, అలీన దేశాలు.
ఉదా: భారతదేశం, ఇండోనేషియా, ఈజిప్ట్

4. నాలుగో ప్రపంచ దేశాలు:
* అల్ప అభివృద్ధి చెందిన దేశాలు లేదా అభివృద్ధి చెందని దేశాలు.
ఉదా: నేపాల్, భూటాన్, సబ్-సహారా దేశాలు, సూడాన్, చాద్.

5. అయిదో ప్రపంచ దేశాలు:
* వివిధ దేశాల్లోని గిరిజన తెగల ప్రజలను అయిదో ప్రపంచం అంటారు.

వృద్ధిరేటు
* వార్షిక జాతీయ ఆదాయ వృద్ధిరేటు ఆధారంగా ఆర్థిక వృద్ధిని లెక్కిస్తారు.
వృద్ధి రేటును లెక్కించే పద్ధతి:
 

దీనిలో Qt = ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి (Current year)
Q(t - 1) = గత సంవత్సరం ఉత్పత్తి (previous year)
ఉదా: 2006లో జాతీయాదాయం 1150 కోట్లు, 2005లో జాతీయాదాయం 1100 కోట్లు భావిస్తే
వృద్ధి రేటు = 4.8%గా ఉంది.

స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి ప్రణాళికలు - ప్రణాళికా కాలంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి, ప్రణాళికల్లో కేటాయింపులు


 లభ్యమవుతున్న వనరులను ఎంత సామర్థ్యంతో వీలైతే అంత సామర్థ్యంతో ఉపయోగించుకుని స్పష్టమైన లక్ష్యాలను సాధించాలని ఉద్దేశ పూర్వకంగా, జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ప్రభుత్వం తీసుకునే చొరవే ప్రణాళిక అని ప్రణాళికా సంఘం నిర్వచించింది.
* ఆడంస్మిత్ లాంటి సంప్రదాయవాదులు ఆర్థిక వ్యవస్థను అదృశ్య హస్తం నడిపిస్తుందని అంటారు. అదృశ్య హస్తం అంటే డిమాండు, సప్లయి లాంటి మార్కెటు శక్తులు. వీటినే ధరల యంత్రాంగం అని కూడా అంటారు.
జె.బి. సే ప్రకారం సప్లయి తనకు తాను డిమాండ్‌ను సృష్టించుకుంటుంది. అంటే ఉత్పత్తి జరుగుతున్న క్రమంలో ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలను చెల్లించడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాలు తాము పొందిన ప్రతిఫలంతో ఉత్పత్తి అయిన వస్తువులను డిమాండు చేస్తాయి. ఆ విధంగా సప్లయి, డిమాండులు సమానం అవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదు. అని సంప్రదాయ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.
* 1929 - 33 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ఆర్థిక మాంద్యం కాలంలో సంప్రదాయవాదుల సిద్ధాంతం పని చేయలేదు.
* ఆర్థికమాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అనేది జె.ఎం. కీన్స్ అభిప్రాయం.
* 1929 - 33 మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఏర్పడింది. ఫలితంగా మాంద్యం ప్రభావం అన్ని దేశాలపై పడింది. అయితే ఈ ఆర్థిక మాంద్యం ప్రణాళికలను అమలు చేస్తూ ప్రణాళికా బద్ధమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న రష్యా (సోవియట్ యూనియన్)ను ప్రభావితం చేయలేదు. కొన్ని వందల సంవత్సరాల్లో అమెరికా సాధించిన వృద్ధిని రష్యా కేవలం కొన్నేళ్లలోనే సాధించింది. ఫలితంగా ప్రణాళికా భావన ప్రపంచ దేశాలను, ఆర్థిక వేత్తలను ప్రభావితం చేసింది. భారత్ కూడా రష్యాను స్ఫూర్తిగా తీసుకుని ప్రణాళికలను ప్రారంభించింది.
     ప్రణాళికలు - పరిణామ క్రమం

స్వాతంత్య్రానికి ముందు
   

* స్వాతంత్య్రానికి ముందు మనదేశానికి ఒక ప్రణాళిక అవసరమని చెప్పిన నాయకుడు సుభాష్ చంద్రబోస్.
* 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్‌డ్ ఎకానమీ ఫర్ ఇండియా (Planned Economy for India) అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో భారతదేశానికి 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించారు.
* భారత జాతీయ కాంగ్రెస్ (INC) 1938లో జాతీయ ప్రణాళికా కమిటీని జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన వేసింది.
1943లో బాంబేకి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు A Plan of economic development for India అనే పేరుతో 15 సంవత్సరాల కాలానికి ఒక ప్రణాళికను రూపొందించారు. దీన్ని బాంబే ప్లాన్ అంటారు. వీరు ఇనుము, ఉక్కు, సిమెంట్, రసాయనాలు లాంటి భారీ పరిశ్రమల అభివృద్ధిని కాంక్షించారు.
* 1944లో ఎం.ఎన్. రాయ్ ప్రజాప్రణాళికలను (People's plan) రూపొందించారు. ఈయన వ్యవసాయ రంగానికి, వినియోగ వస్తువులకు ప్రాధాన్యం ఇచ్చారు.
* బాంబే ప్రణాళికను పారిశ్రామికవేత్తలు రూపొందించడం వల్ల అది పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉండగా, ప్రజాప్రణాళిక సామ్యవాద భావాలను కలిగి ఉంది.
బాంబే ప్లాన్ భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వగా, పీపుల్స్ ప్లాన్ చిన్న పరిశ్రమలకు, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చింది.
* 1944లో శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూపొందించి, వికేంద్రీకృత ప్రణాళికను సూచించారు. గాంధీ ప్రణాళికను క్రోడికరించి ఆర్థిక ప్రణాళికను రూపొందించారు. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు.
* శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూ.3,500 కోట్ల వ్యయ అంచనాలతో రూపొందించారు.
* 1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం ప్రణాళికల అభివృద్ధి సమస్యలను పరిష్కరించడానికి High level advisory planning board ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో స్థిరప్రాతిపదికన ఒక ప్రణాళికా సంఘం ఉండాలని సలహా ఇచ్చింది.

 

స్వాతంత్య్రానంతరం
* రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రం పొందిన వెనుకబడిన దేశాలు రష్యా దేశాన్ని మార్గదర్శకంగా తీసుకుని ఆర్థిక ప్రణాళికలను అమలు చేశాయి. ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను అమలు చేయడం, నిర్ణీత కాలవ్యవధిలో, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నియంత్రించడాన్ని ఆర్థిక ప్రణాళికా విధానం అంటారు.
* కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ఉపయోగిత ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగించి నిర్ణీత కాలంలో గరిష్ఠ వృద్ధిరేటు సాధించడానికి ఆర్థిక ప్రణాళికలు తోడ్పడతాయి.
* 1950లో జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ ప్రణాళికను రూపొందించారు.
* భారతదేశానికి ఒక ప్రణాళికా సంఘం అవసరమని అప్పటి ఆర్థికశాఖ మంత్రి షణ్ముగం శెట్టి పేర్కొంటూ ప్రణాళికా సంఘం స్వరూప, స్వభావాలను వివరించారు. దీనికి అనుగుణంగా 1950, మార్చి 15న కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ప్రణాళికా సంఘం ఏర్పడింది.

 

ప్రణాళికా సంఘం
  కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు 1950, మార్చి 15న ఇది ఏర్పడింది.
* ఇది రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధం కాని సంస్థ.
* ఇది కేవలం కేంద్ర మంత్రిమండలి తీర్మానం మేరకు ఏర్పడిన సలహాసంఘం మాత్రమే.
* ఈ ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా లేదా ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా దేశ ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
* ఈ ప్రణాళికా సంఘానికి క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్య నిర్వాహకుడు ఒకరు ఉంటారు. అతడే ఉపాధ్యక్షుడు అయితే అతడి పదవీకాలం, నియామకం, తొలగింపు లాంటి అన్ని అంశాలు ప్రభుత్వం విచక్షణ మేరకు జరుగుతాయి.
* ఆదేశిక సూత్రాల్లోని 39వ అధికరణ ప్రకారం స్త్రీ, పురుషులు సమాన జీవన ప్రమాణాలను పొందాలని, దేశంలోని సహజ వనరులు సమానంగా పంపిణీ కావాలనీ, ఆర్థికశక్తి కొద్దిమంది వద్దే కేంద్రీకృతం కాకుండా చూడాలనీ తెలుపుతుంది.
భారత రాజ్యాంగంలోని 39వ అధికరణను అనుసరించి ప్రణాళికా సంఘం ఏర్పాటైంది.
* ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు సంబంధించినవి. అందువల్ల ప్రణాళికలకు సంబంధించి కేంద్రం, రాష్ట్రం రెండూ కూడా ప్రణాళికలను రూపొందించుకుంటాయి.

 

ప్రణాళిక సంఘం మొదటి అధ్యకుడు: జవహర్‌లాల్ నెహ్రూ.
ప్రణాళికా సంఘం మొదటి ఉపాధ్యక్షుడు: గుల్జారీలాల్ నందా.
ప్రణాళికా సంఘం చివరి అధ్యక్షుడు: నరేంద్రమోదీ.
ప్రణాళికా సంఘం చివరి ఉపాధ్యక్షుడు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా.

 

జాతీయ అభివృద్ధి మండలి (National Development Council - NDC)
* ఇది 1952, ఆగస్టు 6న ఏర్పడింది.
* ఇది రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధం కాని సంస్థ.
* ఇది కూడా ప్రణాళికా సంఘం మాదిరి కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ఏర్పడింది.
* ప్రణాళికా సంఘంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. అందువల్ల ప్రణాళికల అమలులో రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు.
* ఇది రాష్ట్రాలకు, ప్రణాళికా సంఘానికి మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. ప్రణాళికల నిర్మాణంలో రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
* మనదేశంలో ప్రణాళికలను తయారు చేసేది ప్రణాళిక సంఘం. వాటిని ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి. ఇది ఆమోదించిన తర్వాతే ప్రణాళికలు అమల్లోకి వస్తాయి.
* జాతీయ అభివృద్ధి మండలికి ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* ప్రణాళికా సంఘం కార్యదర్శి జాతీయ అభివృద్ధి మండలి (NDC)కి కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
* NDC సభ్యుల్లో ప్రతి ఒక్కరూ ఎక్స్ అఫీషియో సభ్యులే. NDCలో పనిచేయడానికి పూర్తికాల సభ్యులు ఒక్కరూ కూడా లేరు.
* 1967లో పరిపాలనా సంఘం చేసిన సూచనల మేరకు జాతీయ అభివృద్ధి మండలి సభ్యత్వాన్ని విస్తరించారు. దీనిలోని సభ్యులు
    1) రాష్ట్ర ముఖ్యమంత్రులు.
    2) కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లు.
    3) ప్రణాళికా సంఘం సభ్యులు.
    4) కేంద్ర కేబినెట్ మంత్రులు.
* ప్రణాళిక సంఘం రూపొంచిందించిన ప్రణాళికలను చివరగా జాతీయ అభివృద్ధి మండలి ఆమోదిస్తేనే అవి అమల్లోకి వస్తాయి.
* అదేవిధంగా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రణాళికా బోర్డు (State Planning Board) ఉంటుంది. ముఖ్యమంత్రి దీనికి అధ్యక్షుడిగా ఉంటారు.
జిల్లాల్లో కూడా జిల్లా ప్లానింగ్ బోర్డు (District Planning Board) ఉంటుంది. జిల్లా కలెక్టరు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదేవిధంగా జిల్లా ప్లానింగ్ కమిటీ (District Planning Committee) కి ఛైర్మన్‌గా జిల్లాపరిషత్ ఛైర్మన్ వ్యవహరిస్తారు.

 

ప్రణాళికలు - వ్యూహాలు: ప్రణాళికా వ్యూహానికి మూడు అంశాలు ఆధారం.
   1) ఆర్థిక వ్యవస్థలో కనుక్కున్న వనరుల సమగ్ర అంచనా.
   2) దేశ సమస్యల తీవ్రత ఆధారంగా నిర్ణీతకాలంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించడం.
   3) నిర్ణయించిన లక్ష్యాల సాధనకు పటిష్ట వ్యూహరచన.

 

ప్రణాళికలు - రకాలు:
 

ప్రభుత్వ పాత్రను బట్టి ప్రణాళికలు రెండు రకాలు.

    1) ఆదేశాత్మక ప్రణాళిక
    2) సూచనాత్మక ప్రణాళిక.

 

1) ఆదేశాత్మక ప్రణాళిక/ నిర్దేశాత్మక ప్రణాళిక
* ఇందులో ప్రణాళిక రచన, అమలు లాంటి వ్యవహారాలను సర్వాధికారాలున్న ఒక కేంద్ర సంస్థ నిర్వహిస్తుంది. దీనిలో ప్రజలకు, రాష్ట్రాలకు, వినియోగదారులకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండవు.
* ఆర్థిక వ్యవస్థలోని వనరులు, ఆర్థిక కార్యకలాపాలన్నీ కేంద్ర సంస్థ దిశానిర్దేశం మేరకు జరుగుతాయి.
* సాధారణంగా ఇలాంటి ప్రణాళికలు రష్యా లాంటి సామ్యవాద దేశాల్లో అమలవుతాయి.

 

2) సూచనాత్మక ప్రణాళిక:
* దీనిలో ప్రభుత్వ స్థూల అంశాలను నిర్దేశించి, వాటిని సాధించడం కోసం ప్రైవేట్ రంగానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. కానీ దిశానిర్దేశం చేయదు.
* ఇలాంటి ప్రణాళికలను మొదటిసారిగా 1947 - 50లో ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేసింది.
* ఈ ప్రణాళికను మార్కెట్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
* ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుంది.
* మనదేశంలో ఈ ప్రణాళికను 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి అమలు చేస్తున్నారు.

 

ప్రజల భాగస్వామ్యం ఆధారంగా .......
    1) కేంద్రీకృత ప్రణాళిక
    2) వికేంద్రీకృత ప్రణాళిక

 

1) కేంద్రీకృత ప్రణాళిక:
* ప్రణాళిక రచన, అమలుకు సంబంధించిన వ్యవహారాలను సర్వాధికారాలు ఉన్న ఒక కేంద్ర సంస్థ చూస్తుంది.
 

2) వికేంద్రీకృత ప్రణాళిక:
* కిందిస్థాయి నుంచి (గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో) ప్రణాళికలను తయారుచేసి, వాటి ఆధారంగా కేంద్ర ప్రణాళికలను తయారు చేయడాన్ని వికేంద్రీకృత ప్రణాళిక అంటారు.
 

వనరుల కేటాయింపుల ఆధారంగా.........
    1) భౌతిక ప్రణాళిక
     2) విత్త ప్రణాళిక

 

1) భౌతిక ప్రణాళిక:
* సహజ వనరులు, మానవ వనరులు, ముడిపదార్థాలు లాంటి వాస్తవిక అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించే ప్రణాళికను భౌతిక ప్రణాళిక అంటారు.
 

2) విత్త ప్రణాళిక:
* నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ద్రవ్యం రూపంలో వనరులను అంచనావేస్తే దాన్ని విత్త ప్రణాళిక అంటారు.
 

కాలం ఆధారంగా ప్రణాళికలు..........
    1) స్వల్పకాలిక ప్రణాళిక
    2) మధ్యకాలిక ప్రణాళిక
    3) దీర్ఘకాలిక ప్రణాళిక

 

1. స్వల్పకాలిక ప్రణాళిక:
* ఒక సంవత్సర కాలానికి రూపొందించే ప్రణాళికలను స్వల్పకాలిక ప్రణాళికలు అంటారు.
 

2. మధ్యకాలిక ప్రణాళిక:
* 4, 5, 6 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను తయారుచేస్తే వాటిని మధ్యకాలిక ప్రణాళికలు అంటారు.
 

3. దీర్ఘకాలిక ప్రణాళిక:
* 15 నుంచి 20 సంవత్సరాల కాలానికి తయారుచేసే ప్రణాళికలను దీర్ఘకాలిక ప్రణాళికలు అంటారు.
 

సరళత్వం ఆధారంగా...........
      1) నిర్దిష్ట/స్థిర ప్రణాళిక
      2) నిరంతర ప్రణాళిక

 

1. నిర్దిష్ట/స్థిర ప్రణాళిక:
* కొన్ని సంవత్సరాల కాలాన్ని స్థిరంగా నిర్ణయించి ప్రణాళికను రూపొందిస్తే దాన్ని స్థిర/నిర్దిష్ట ప్రణాళిక అంటారు.
 

2. నిరంతర ప్రణాళిక:
* కొత్తగా, అనూహ్యంగా ఎదురయ్యే సమస్యలను బట్టి ప్రణాళిక లక్ష్యాలను కూడా నిరంతరం మార్చుకోవడానికి అవకాశం ఉండే ప్రణాళికను నిరంతర ప్రణాళిక అంటారు.
* ఈ నిరంతర ప్రణాళికను ప్రపంచంలో మొదటిసారిగా తయారుచేసింది గున్నార్ మిర్డాల్. ఈయన స్వీడన్ దేశస్థుడు.
* ఈ ప్రణాళికను మొదటిసారిగా నెదర్లాండ్స్‌లో అమలు చేశారు.
* ఇండియాలో ఈ నిరంతర ప్రణాళికా నమూనాను డాక్టర్ లక్‌డావాలా తయారుచేశారు.

వ్యవస్థ స్వరూపం ఆధారంగా ..........
     1) నిర్మాణాత్మక ప్రణాళికలు
     2) కార్యాత్మక ప్రణాళికలు

 

ప్రాంతాన్ని బట్టి..........
   1) ప్రాంతీయ ప్రణాళిక
   2) జాతీయ ప్రణాళిక
   3) అంతర్జాతీయ ప్రణాళిక

 

* ప్రణాళికలను పాక్షిక ప్రణాళిక, సాధారణ ప్రణాళిక, వార్షిక ప్రణాళికలుగా కూడా వర్గీకరించవచ్చు.
వార్షిక ప్రణాళికలు: ఒక సంవత్సర కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తయారుచేసే ప్రణాళికను వార్షిక ప్రణాళిక అని పిలుస్తారు. దీన్ని పిగ్మీ ప్రణాళిక అంటారు.
భారత్‌లో వార్షిక ప్రణాళికల కాలం: 1966 - 69 (3 సంవత్సరాలు), 1990 - 92 (2 సంవత్సరాలు)

* ప్రణాళికలను వేరొక విధంగా కూడా పేర్కొనవచ్చు. అవి:
1. నియంతృత్వ ప్రణాళిక:
* ఒక నియంతృత్వ వ్యక్తి లేదా ప్రభుత్వం చేతిలో ప్రణాళిక నియంత్రణ ఉంటే అది నియంతృత్వ ప్రణాళిక.
 

2. ప్రజాస్వామ్య ప్రణాళిక:
* ఈ ప్రణాళికలో లక్ష్యాలు, వనరుల కేటాయింపులను ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు.
* ఈ ప్రణాళికలో ఉత్పత్తి, ఆర్థిక కార్యకలాపాలను ప్రభుత్వం నిర్ణయించదు.
* ప్రణాళికా సంఘం తయారు చేసిన ప్రణాళికలను మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

 

3. శాశ్వత ప్రణాళిక:
* ఒకసారి ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలను రూపొందిస్తే అవి దీర్ఘకాలంలో కూడా అమలు అవుతాయి. వాటిని మధ్యలో ఆపివేయడం లాంటిది జరగదు.
 

4. అత్యవసర ప్రణాళిక:
* ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్యాలు ఏర్పడినప్పుడు, వాటిని తొలగించడానికి తాత్కాలికంగా ప్రవేశపెట్టేదే అత్యవసర ప్రణాళిక. అత్యవసర పరిస్థితులు తొలిగిపోయిన తర్వాత ఈ ప్రణాళికను రద్దు చేస్తారు.
 

5. సాధారణ ప్రణాళిక:
* ఇందులో స్థూల సమస్యలనే ప్రస్తావిస్తారు. స్థూల మార్గదర్శకాలు మాత్రమే ఉంటాయి.
 

6. వివరణాత్మక ప్రణాళిక:
* స్థూల మార్గదర్శకాలే కాకుండా వాటిని సాధించడానికి పూర్తి వివరాలు కూడా ఉంటాయి.
 

7. కరెక్టివ్ ప్లాన్: (Corrective plan)
* బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తరచూ వ్యాపార చక్రాలు సంభవిస్తూ ఉంటాయి. ఆ వ్యాపార చక్రాల నియంత్రణకు తయారు చేసే ప్రణాళికను Anticyclical planning లేదా Corrective plan అని అంటారు.
 

8. డెవలప్‌మెంట్ ప్లాన్:
* ఆర్థికాభివృద్ధి సాధన కోసం వెనుకబడిన దేశాల్లో అవలంబించే ప్రణాళిక. ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితను పెంచడమే దీని లక్ష్యం. ఇది కరెక్టివ్ ప్లాన్ కంటే కూడా విస్తృతమైంది.
 

9. మిశ్రమ ఆర్థిక ప్రణాళిక:
* ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి ఉండే ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. అందుకు తగిన ప్రణాళికే mixed economy planning.
* మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రయివేటు రంగానికి స్వేచ్ఛ ఉంటుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉన్నంత స్వేచ్ఛ ఉండదు.

 

ప్రణాళికా విరామం (plan holiday):
* ఒక planకి మరొక planకి మధ్య వచ్చిన విరామాన్నే ప్రణాళికా విరామం (plan holiday) అంటారు.
* భారత్‌లో 1966 - 69 మధ్య 3 సంవత్సరాలు, 1990 - 92 మధ్య 2 సంవత్సరాలు ప్రణాళికా విరామం వచ్చింది.

 

భారత పంచవర్ష ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యాలు:
   1. జాతీయ, తలసరి ఆదాయం పెంచడానికి గరిష్ఠ ఉత్పత్తి సాధించడం.
   2. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి.
   3. పారిశ్రామిక ప్రగతి.
   4. సంపూర్ణ ఉద్యోగిత సాధించడం.
   5. ఆదాయ సంపదల అసమానతలు తగ్గించడం.
   6. సాంఘిక న్యాయం చేకూర్చడం.
   7. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
   8. జననాణ్యత మెరుగుపరచడానికి సాంఘిక రంగ అభివృద్ధి.

 

భారత ప్రణాళికల లక్షణాలు:
* ఇవి సూచనాత్మక ప్రణాళికలు
* సమగ్ర ప్రణాళికలు
* భౌతిక, విత్తప్రణాళికలు
ప్రజాస్వామ్య వికేంద్రీకృత ప్రణాళికలు
* దీర్ఘకాలిక స్వభావాన్ని కూడా కలిగి ఉన్నాయి.

 

ప్రణాళికా వనరులు:
   1. దేశీయ వనరులు
   2. విదేశీయ వనరులు
   3. లోటు విత్తం

 

1. దేశీయ వనరులు:
* ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు
* మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు
* చిన్న మొత్తాల పొదుపులు, PFలు
* ప్రభుత్వ సంస్థల ఉత్పత్తులు, ధరలు పెంచడం, అదనపు పన్ను విధించడం
* కరెంటు రెవెన్యూ నుంచి మిగులు

 

పంచవర్ష ప్రణాళికలు - వనరుల సేకరణ, కేటాయింపులు
* ప్రణాళికా పెట్టుబడులకు ద్రవ్య వనరులను మూడు రకాలుగా సేకరిస్తారు. అవి
      1. దేశీయ బడ్జెటు వనరులు
      2. విదేశీ సహాయం
      3. లోటు ద్రవ్యం

 

1. దేశీయ బడ్జెటు వనరులు: దేశీయ బడ్జెట్ వనరులు అంతర్గతంగా దేశ ప్రజలు, సంస్థల నుంచి ప్రభుత్వం సేకరిస్తుంది. ప్రణాళికా వ్యయానికి అవసరమైన విత్త వనరుల్లో అత్యధిక భాగం దేశీయ వనరులే. అవి:
ప్రస్తుత రాబడి మిగులు: ప్రస్తుతరాబడిలో వ్యయంపోగా మిగిలేది
* పబ్లిక్ రంగ సంస్థల వాటా

సేకరించిన అంతర్గత ప్రైవేటు పొదుపు: మార్కెటు రుణాలు, చిన్న పొదుపు మొత్తాలు, ప్రావిడెంట్ పన్ను లాంటివి.
* పన్నులు, సుంకాల ద్వారా అదనంగా వసూలైన ఆదాయం.

 

2. విదేశీ సహాయం/వనరులు
* విదేశాల నుంచి అందిన గ్రాంట్లు, రుణాలు.
* అంతర్జాతీయ ద్రవ్యసంస్థలైన IDBI, IMF, IDA, ADB ప్రపంచ బ్యాంకు నుంచి స్వీకరించిన రుణాలను విదేశీ సహాయంగా వ్యవహరిస్తారు.

 

3. లోటు ద్రవ్యం: దేశీయ బడ్జెట్ వనరులు, విదేశీ సహాయం వల్ల సేకరించిన ద్రవ్య వనరులు అభివృద్ధి పథకాల అమలుకు సరిపోవు. ప్రణాళికల వివిధ పథకాల అమలుకు ఏర్పడిన రాబడి లోటును ప్రభుత్వం లోటు ద్రవ్య విధానం ద్వారా సమకూర్చుకుంటుంది.
* ప్రణాళికల అమలుకు సేకరించే విత్త వనరుల్లో దేశీయ బడ్జెట్ వనరులు ఎంతో ముఖ్యమైనవి. దేశ పౌరులు, సంస్థల ప్రస్తుత రాబడి (current revenue) నుంచి సమకూరే దేశీయ వనరులను ప్రస్తుత వ్యయానికి ఉపయోగిస్తారు. ప్రస్తుత పబ్లిక్ వ్యయాన్ని తగ్గించి ప్రస్తుత రాబడి మిగులును ఆర్థికాభివృద్ధికి తప్పనిసరిగా ఉపయోగించాల్సిందని సూచించిన మొదటి Taxation enquiry commission ఛైర్మన్ వి.టి. కృష్ణమాచారి ప్రతిపాదనను ప్రణాళికా సంఘం 1950 - 51లో ఆమోదించింది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత రాబడిలో మిగులు చూపించలేకపోతున్నాయి.
* వివిధ ప్రణాళికల్లో వ్యయానికి అవసరమైన ద్రవ్య వనరుల సేకరణ వివరాలు కింది పట్టికలో చూడొచ్చు.

 

మొదటి ప్రణాళిక నుంచి 8వ ప్రణాళిక వరకు వివిధ వ్యయాలకు ద్రవ్య వనరుల సేకరణ:

   
 

* పంచవర్ష ప్రణాళికల వనరులు అనేక రంగాల మధ్య కేటాయిస్తారు. అందులో ముఖ్యమైనవి.
1. వ్యవసాయం
2. ఇంధనం, నీటిపారుదల
3. పరిశ్రమలు
4. రవాణా, సమాచారం
5. సాంఘిక సేవలు
* దేశీయ వనరులు సరిపోకపోతే విదేశీ సహాయం తీసుకుంటారు. విదేశీ సహాయం గ్రాంట్ల రూపంలో లభిస్తుంది.

ప్రణాళికల్లో వృద్ధి నమూనాలు
* మన పంచవర్ష ప్రణాళికలకు రెండు వృద్ధి నమూనాలు ఆధారం అవి:
 

2 నుంచి 7వ ప్రణాళిక వరకు నెహ్రూ మహలనోబిస్ నమూనా:
  1956లో అమలు చేసిన రెండో పంచవర్ష ప్రణాళికను భారీ పెట్టుబడుల వ్యూహం ఆధారంగా రూపొందించారు. ఆర్థికాభివృద్ధికి అవసరమైన కీలక రంగాలు భారీ, మూలధన పరిశ్రమలు; అవస్థాపన, పబ్లిక్‌రంగ పెట్టుబడులతో జరగాలని, పబ్లిక్ రంగంలో ఈ రెండు రంగాలు అభివృద్ధి చెందితే ప్రైవేటు రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించారు. 7వ పంచవర్ష ప్రణాళిక వరకు ఈ వృద్ధి నమూనా ఆధారంగా ప్రణాళికల రూపకల్పన జరిగింది. ఈ వృద్ధి నమూనాను 2వ పంచవర్ష ప్రణాళికలో చర్చించారు.

Related Posts Plugin for WordPress, Blogger...