భారతరత్న
అనేది భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం. దీన్ని 1954 జనవరి 2న ఏర్పాటు చేశారు.
గతంలో ఈ పురస్కారాన్ని కళలు, సాహిత్యం, శాస్త్ర, ప్రజాసేవా రంగాల్లో అత్యున్నత
ప్రతిభ కనబరిచినవారికి అందజేసేవారు. కేంద్ర ప్రభుత్వం 2011 డిసెంబర్‌లో ఏ
రంగంలోనైనా అసమాన సేవలు అందించినవారికి, అద్వితీయ ప్రతిభావంతులకు ఈ అవార్డు
ఇచ్చేలా మార్పులు చేసింది. ఒక సంవత్సరంలో భారతరత్న పురస్కారాన్ని ముగ్గురు
వ్యక్తులకు మించి ఇవ్వకూడదు. ఇప్పటి వరకూ ఈ అవార్డును 45 మందికి ప్రదానం చేశారు.
గ్రహీతలు ఈ అవార్డును వారి పేరుకు ముందుగానీ, వెనుకగానీ ఉపయోగించకూడదు.
మొదటిసారిగా భారతరత్న అందుకున్న ముగ్గురు వ్యక్తులు -
సి. రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి. రామన్. వీరికి 1954లో ఈ పురస్కారాన్ని
ప్రదానం చేశారు. 1966లో మరణానంతరం ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి లాల్‌బహదూర్
శాస్త్రి. ఇప్పటి వరకు 12 మందికి మరణానంతరం ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు
అందుకున్న తొలి మహిళ ఇందిరా గాంధీ. ఈమెకు 1971లో దీన్ని ప్రకటించారు. 2013లో
భారతరత్నను ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావు, క్రికెటర్ సచిన్
టెండూల్కర్‌కు ప్రకటించారు. ఈ అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు సచిన్.
అంతేకాకుండా 40 ఏళ్ల వయసులో భారతదేశ అత్యున్నత పురస్కారాన్ని పొందిన పిన్న
వయస్కుడు కూడా సచినే కావడం గమనార్హం. 2014 డిసెంబర్ 24న పండిట్ మదన్‌మోహన్ మాలవ్య
(మరణానంతరం), భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి భారతరత్న ప్రకటించారు.
ఈ అవార్డును ఇద్దరు విదేశీయులకు కూడా ప్రదానం చేశారు.
1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (పాకిస్తాన్), 1990లో నెల్సన్ మండేలాకు భారతరత్న
అందజేశారు. ఇప్పటి వరకు ఐదుగురు మహిళలకు ఈ పురస్కారం లభించింది. భారతరత్నతో పాటు
నోబెల్ బహుమతిని అందుకున్నవారు సి.వి. రామన్, మదర్ థెరిసా, అమర్త్యసేన్.
భారతరత్న పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి సంతకంతో
కూడిన సర్టిఫికేట్, రాగి ఆకు ప్రతిమను బహూకరిస్తారు. నగదు బహుమతి ఉండదు. 1977
జూలైలో జనతా ప్రభుత్వం ఈ అవార్డును రద్దు చేసింది. 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం
పునరుద్ధరించింది.
భారతరత్న అవార్డు గ్రహీతలు
-
సి. రాజగోపాలాచారి - 1954
స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ చివరి గవర్నర్ జనరల్. -
సర్వేపల్లి రాధాకృష్ణన్ - 1954
ప్రముఖ విద్యావేత్త, భారత తొలి ఉప రాష్ట్రపతిగా రెండు పర్యాయాలు పనిచేశారు (1952-62). ఆ తర్వాత 1962 నుంచి 1967 వరకు భారత రెండో రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తారు. -
సి.వి. రామన్ - 1954
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త. 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. -
భగవాన్ దాస్ - 1955
స్వాతంత్య్ర సమరయోధుడు. 1921లో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విద్యా పీఠ్‌ను స్థాపించారు. ఈ సంస్థనే 1995లో మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌గా పేరుమార్చారు. -
మోక్షగుండం విశ్వేశ్వరయ్య - 1955
విఖ్యాత సివిల్ ఇంజనీర్ -
జవహర్‌లాల్ నెహ్రూ - 1955
1947 నుంచి 1964 వరకు తొలి భారత ప్రధానిగా పనిచేశారు. -
గోవింద్ వల్లభ్ పంత్ - 1957
స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి (1950-54)గా పనిచేశారు. -
థొండో కేశవ్ కర్వే - 1958
ప్రముఖ సంఘ సంస్కర్త. మహర్షి కర్వేగా విఖ్యాతి చెందారు. మహిళల అభివృద్ధికి పాటుపడ్డారు. 1958లో తన నూరో ఏట భారతరత్న అందుకున్నారు. 1962లో మరణించారు. -
బిధాన్ చంద్ర రాయ్ - 1961
ప్రముఖ వైద్యుడు. ఆయన పుట్టినరోజైన జూలై 1వ తేదీని ‘డాక్టర్స్ డే’గా పాటిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి. -
పురుషోత్తమ్ దాస్ టండన్ - 1961
స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, హిందీభాషకు అధికారిక హోదా కల్పించడానికి విశేష కృషి చేశారు. -
బాబూ రాజేంద్రప్రసాద్ - 1962
స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ న్యాయవాది, భారత తొలి రాష్ట్రపతి. రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి. -
జాకీర్ హుస్సేన్ - 1963
రెండో ఉప రాష్ట్రపతి (1962-67), మూడో రాష్ట్రపతి (1967-69) -
పాండురంగ్ వామన్ కనే - 1963
ప్రఖ్యాత సంస్కృత పండితుడు. -
లాల్‌బహదూర్ శాస్త్రి - 1966
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత రెండో ప్రధాని (1964-66). మరణానంతరం భారతరత్న పొందిన తొలి వ్యక్తి. -
ఇందిరాగాంధీ - 1971
1966 - 77, 1980 - 84ల మధ్య భారత ప్రధానిగా పనిచేశారు. ఈ అవార్డు అందుకొన్న తొలి మహిళ. -
వి.వి. గిరి - 1975
భారత నాలుగో రాష్ట్రపతి (1969-1974) -
కె. కామరాజ్ - 1976
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. మరణానంతరం భారతరత్న లభించింది. -
మదర్ థెరీసా - 1980
మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను 1950లో ప్రారంభించారు. 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. -
వినోబా భావే - 1983
సంఘ సంస్కర్త, భూదాన్ ఉద్యమాన్ని 1951లో ప్రారంభించారు. 1958లో రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు. భారతరత్న మరణానంతరం లభించింది. -
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ - 1987
ఈయనను ‘సరిహద్దు గాంధీ’గా పేర్కొంటారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1929లో ఖుదాయి కిద్మత్ గార్ ఉద్యమాన్ని ప్రారంభించారు. భారతరత్న అందుకున్న తొలి విదేశీయుడు. -
ఎం.జి. రామచంద్రన్ - 1988
ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. మరణానంతరం భారతరత్న లభించింది. -
బి.ఆర్. అంబేద్కర్ - 1990
భారత రాజ్యాంగ రూపకర్త, సంఘ సంస్కర్త, తొలి న్యాయశాఖ మంత్రి. ఈ అవార్డు మరణానంతరం లభించింది. -
నెల్సన్ మండేలా - 1990
దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తొలి నల్లజాతీయుడు. 1993లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. ఈ అవార్డు పొందిన రెండో విదేశీయుడు. -
రాజీవ్ గాంధీ - 1991
1984 నుంచి 1989 వరకు ప్రధానిగా పనిచేశారు. మరణానంతరం లభించింది. -
వల్లభాయ్ పటేల్ - 1991
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత తొలి హోం శాఖ మంత్రి. మరణానంతరం ఈ అవార్డు లభించింది. -
మొరార్జీ దేశాయ్ - 1991
1977 నుంచి 1979 వరకు భారత ప్రధానిగా పని చేశారు. తొలి కాంగ్రేసేతర ప్రధాని. -
మౌలానా అబుల్ కలాం ఆజాద్ - 1992
స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి విద్యాశాఖ మంత్రి. మరణానంతరం భారతరత్న లభించింది. -
జె.ఆర్.డి. టాటా - 1992
టాటా గ్రూప్ చైర్మన్‌గా పనిచేసిన ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. టీసీఎస్, టాటా మోటార్స్, ఎయిర్ ఇండియా సంస్థలను స్థాపించారు. -
సత్యజిత్ రే - 1992
ప్రఖ్యాత సినీ దర్శకుడు. 1992లో ఆస్కార్ అవార్డు కూడా లభించింది. -
గుల్జారీలాల్ నందా - 1997
రెండుసార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు. -
అరుణా అసఫ్ అలీ - 1997
స్వాతంత్య్ర సమర యోధురాలు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మరణానంతరం భారతరత్న లభించింది. -
ఎ.పి.జె. అబ్దుల్ కలాం - 1997
విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త. 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా పనిచేశారు. -
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి - 1998
ప్రముఖ గాయని, సంగీత విద్వాంసురాలు. 1974లో రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. -
సి. సుబ్రమణియమ్ - 1998
కేంద్రంలో వ్యవసాయ, ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. -
జయప్రకాశ్ నారాయణ్ - 1999
ఈయన స్వాతంత్య్ర సమరయోధుడు. ‘లోక్ నాయక్’గా పేర్కొంటారు. జె.పి. అని పిలుస్తారు. 1965లో రామన్ మెగసెసే అవార్డు అభించింది. భారతరత్న మరణానంతరం లభించింది. -
అమర్త్యసేన్ - 1999
1998లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. -
గోపీనాథ్ బర్డోలీ - 1999
అసోం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. ‘లోక ప్రియ’ అనే బిరుదు ఉంది. భారతరత్న మరణానంతరం లభించింది. -
పండిట్ రవిశంకర్ - 1999
విఖ్యాత సితార్ విద్వాంసుడు. 1992లో రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. -
లతా మంగేష్కర్ - 2001
ప్రముఖ నేపథ్యగాయని. -
బిస్మిల్లా ఖాన్ - 2001
ప్రముఖ షెహనాయి విద్వాంసుడు. -
భీమ్‌సేన్ జోషి - 2009
ప్రముఖ హిందూస్థానీ గాయకుడు. -
సి.ఎన్.ఆర్. రావు - 2014
ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహా మండలి అధ్యక్షులు. సి.వి. రామన్, అబ్దుల్ కలాం తర్వాత భారతరత్న అందుకున్న మూడో శాస్త్రవేత్త. -
సచిన్ టెండూల్కర్ - 2014
క్రికెట్ దిగ్గజం. సచిన్ టెండూల్కర్ ఆటకు వీడ్కోలు చెప్పిన రోజునే (2013 నవంబర్ 16) భారతరత్న ప్రకటించారు. ఈ పురస్కారం లభించిన తొలి క్రీడాకారుడు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. -
మదన్ మోహన్ మాలవ్య - 2015
ప్రముఖ విద్యావేత్త, స్వాతంత్య్ర సమర యోధుడు. 1916లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ‘లీడర్’ అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. భారతరత్న మరణానంతరం లభించింది. -
అటల్ బిహారి వాజ్‌పేయి - 2015
1996లో భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో తొలి సంకీర్ణ ప్రభుత్వాన్ని 13 రోజుల పాటు నడిపారు. 1998లో రెండోసారి ప్రధానమంత్రి పదవిని అధిష్టించి 13 నెలలు అధికారంలో ఉన్నారు. ఈయన హయాంలో 1998లోనే రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. 1999లో భారత ప్రధానిగా మూడోసారి ఎన్నికై 2004 వరకు కొనసాగారు. 1999 ఫిబ్రవరిలో లాహోర్ బస్సుయాత్ర చేపట్టి పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషిచేశారు. అయితే దురాక్రమణకు పాల్పడ్డ పాకిస్తాన్‌ను 1999లో కార్గిల్ యుద్ధంలో భారత్ ఓడించింది. నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ ‘స్వర్ణ చతుర్భుజి’ పేరుతో రహదారులను నిర్మించారు. ఈయన హయాంలోనే 2000లో మూడు కొత్త రాష్ట్రాలు (ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్) ఏర్పడ్డాయి. ఈయన పుట్టిన రోజైన డిసెంబర్ 25వ తేదీని కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ సుపరిపాలన దినోత్సవం’గా ప్రకటించింది.
No comments:
Post a Comment