ఆర్థిక సర్వే 2020-21

  ఆర్థిక సర్వే 2020-21


     కరోనా కారణంగా అల్లకల్లోలమైన ఆర్థిక వ్యవస్థ లాక్‌డౌన్‌ సడలింపులతో క్రమంగా వృద్ధి పథంలో పయనిస్తుంది. ఇలాంటి కల్లోలం శతాబ్దానికి ఒకసారి వస్తుందని, దీని ప్రభావానికి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లాడిపోయాయని ఆర్థ్ధిక సర్వే పేర్కొన్నది. ఆర్థ్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటదని ఆర్థ్ధిక సర్వే విశ్వాసం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి సంక్షోభం తరువాత వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021-22) దేశీయ ఆర్థిక వ్యవస్థ రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. తొలి ఆర్థిక సర్వేను 1950-51లో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ సమావేశంలో భాగంగా 2020-21 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో జనవరి 29న ప్రవేశపెట్టారు. ప్రతి ఏడాది వార్షిక బడ్జెట్‌కు ముందు ఆర్థిక  సర్వేను లోక్‌సభలో ప్రవేశ పెట్టడం ఆనవాయితీ. ఈ ఏడాది ఆర్థిక సర్వేను ప్రధాని ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం నేతృత్వంలోని బృందం రూపొందించింది. కరోనాను నియంత్రణలో ఉంచి మరణాల రేటును తగ్గించి ప్రపంచానికి టీకా అందించామని ఈ ఆర్థిక సర్వే కరోనా వారియర్స్‌కు అంకితమని  పేర్కొన్నారు. గతేడాది పలు రంగాల ఆర్థిక స్థితులను వివరించారు.

     లాక్‌డౌన్‌, ఇతర కారణాలతో 2020-21 మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. తొలి వృద్ధి రేటు మైనస్‌ 23.9 శాతానికి పడిపోయింది. జూలై నుంచి పరిస్థితులు మెరుగుపడటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశీయ జీడీపీ 7.7% క్షీణించనుంది. కానీ తిరోగమనంలో కూడా ఆశావీచికలు కనిపిస్తున్నాయి. గతంలో 1979-80 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ మైనస్‌ 5.2% క్షీణతను చూపించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో  షేప్‌ రికవరీ (పడిపోయిన తీరులోనే వేగంగా పురోగమించడం) సాధిస్తుందని సర్వే పేర్కొంది. 2021-22లో దేశీయ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 11 శాతం వృద్ధి రేటు నమోదవుతదని ఆర్థిక సర్వే పేర్కొంది. నామినల్‌ జీడీపీ 15.4 శాతం ఉంటుందని తెలిపింది.  


.

.

ముఖ్యాంశాలు

     శతాబ్దానికి ఒకసారి ఎదురయ్యే కరోనా లాంటి సంక్షోభ సమయంలో దేశ ఆర్థికస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ పరిస్థితిని వందేండ్లకోసారి వచ్చే సంక్షోభమని సర్వే వివరించింది.  

 

వ్యవసాయం తప్ప అన్ని రంగాల్లో వైఫల్యం

     మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ వినియోగం పెరగాలి. ఇవి ఎగుమతుల వృద్ధికి మరింత మద్దతుగా నిలుస్తాయి. 2020-21 ద్వితీయార్థంలో ఎగుమతులు 5.8 శాతం, దిగుమతులు 11.3 శాతం తగ్గొచ్చని అంచనా వేసింది.  

 

అందుబాటులోకి కరోనా వ్యాక్సిన్లు 

     17 ఏండ్ల విరామం తరవాత వర్తమాన ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో 3.1 శాతం కరెంట్‌ ఖాతా మిగులు నమోదైంది. 2020-21లో కరెంట్‌ ఖాతాలో 2 శాతం మిగులు, జీడీపీలో 2 శాతానికి చేరవచ్చు. రైల్వే రంగంలో పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం అనుమతించింది. తద్వారా రూ.30 వేల కోట్లు రానున్నాయి. కొద్ది నెలలుగా విద్యుత్‌ వినియోగం, రైల్వే రవాణా, ఈ-వేబిల్స్‌, జీఎస్టీ వసూళ్లు, ఉక్కు వినియోగం తారాస్థాయికి చేరుకున్నాయి. వీటిని బట్టి చూస్తుంటే రెండంకెల వృద్ధిరేటు పెరగవచ్చని తెలుస్తుంది.  

     2014-15లో ప్రతి రోజు 12 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం కొనసాగగా.. అది 2018-19 నాటికి 30 కిలోమీటర్ల నిర్మాణం జరిగింది. 2020-21లో రోడ్ల నిర్మాణం కరోనా కారణంగా 22 కిలోమీటర్లకు పడిపోయింది. విదేశీ పెట్టుబడులకు భారత్‌ ఇప్పటికి స్వర్గధామం. 2020 నవంబర్‌లో విదేశీ పెట్టుబడులు రికార్డ్‌ స్థాయిలో 9.8 బిలియన్‌ డాలర్లు నమోదయ్యాయి. వర్ధమాన దేశాల్లో ఎఫ్‌పీఐలను భారతదేశం మాత్రమే ఆకర్షించింది. 2019 జూలై నుంచి 2020 అక్టోబర్‌ మధ్య రూ.8,461 కోట్లతో 37 సాగరమాల ప్రాజెక్టులను పూర్తిచేసింది. 

     9-12 తరగతులకు దశలవారీగా ఒకేషనల్‌ కోర్సులు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం.. ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన (పీఎంజేఏవై)ను అమలు చేస్తున్న రాష్ర్టాలు, అమలు చేయని రాష్ర్టాలతో పోల్చితే ఆరోగ్య ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. బీమా వ్యాప్తి పెరిగి శిశు మరణాల రేటు తగ్గేందుకు దోహదపడుతుంది. దేశ సార్వభౌమ రుణపరపతి రేటింగ్‌ విషయంలో విదేశీ రేటింగ్‌ ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహరించాలి. లాక్‌డౌన్‌ కారణంగా 37 లక్షల కేసులు తగ్గించగలిగాం. లక్ష ప్రాణాలు కాపాడగలిగామని సర్వే పేర్కొన్నది. 500 కేసులు కూడా నమోదు కాకుండానే లాక్‌డౌన్‌ ప్రకటించిన తొలిదేశం భారతదేశమని పేర్కొన్నది.

 

నూతన వ్యవసాయచట్టం

     కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను ఆర్థిక సర్వే సమర్థించింది. ఈ చట్టాల వల్ల దీర్ఘకాలంలో చిన్నతరహా, మధ్యతరహా రైతులకు ఆదాయాలు పెరగడంతో పాటు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉండటం వల్ల తమ పంటలకు అధిక ధర పొందవచ్చని తెలిపింది.  

 

ప్రధాన రంగాలు

వ్యవసాయం: కరోనా సంక్షోభంలో వ్యవసాయ వృద్ధి రేటు 3.4 శాతం నమోదైంది. వ్యవసాయం అనుబంధ రంగాల దేశ గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌ (జీవీఏ) ప్రస్తుతం 17.8 శాతంగా ఉంది. జీవీఏకి సంబంధించిన గ్రాస్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ (జీసీఎఫ్‌)  2013-14లో 17.7 శాతం నుంచి 2018-19 నాటికి 16.4 శాతానికి చేరింది. అయితే 2015-16 నాటికి 14.7 శాతానికి తగ్గింది. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. 5.5 కోట్ల మంది రైతులకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం వర్తించింది. డిసెంబర్‌ 2020 నాటికి పీఎం కిసాన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు జమచేశారు. ఇటీవల కేంద్రప్రభుత్వం చేసిన నూతన వ్యవసాయ చట్టం మొత్తం రైతుల్లో 85 శాతంగా ఉన్న చిన్న, మధ్యతరహా రైతులకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుతుందని సర్వే పేర్కొన్నది.  

సామాజిక సేవారంగాలు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సామాజిక సేవారంగంలో ఉమ్మడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.17.16 లక్షల కోట్లు వ్యయం చేశాయి. గతేడాదితో పోల్చితే 12 శాతం అదనంగా పెరిగింది. విద్య, క్రీడలు, కళలు, సంస్కృతి, వైద్యం, ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, కార్మిక సంక్షేమ రంగాలు ఇందులో ఉన్నాయి. పాఠశాలలు మూతపడటంతో ఆన్‌లైన్‌ విద్యకు ప్రాచుర్యం పెరిగింది. ప్రైవేట్‌ సెక్టార్‌లోనూ వర్క్‌ ఫ్రం హోం విధానం జోరందుకుంది.   

పీఎంజేఏవై: 2018లో ప్రారంభించిన ప్రధానమంత్రి జనారోగ్య యోజన (పీఎంజేఏవై) స్వల్పకాలంలోనే వైద్యరంగంలో సానుకూల ఫలితాలను తెచ్చింది. దీనికింద రూ.10.74 కోట్ల పేద ఆవాసాల్లోని 50 కోట్ల మందికి లాభం చేకూరింది. ఈ పథకం 32 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమల్లో ఉన్నది. ఈ పథకం అమలుపరిచిన రాష్ర్టాల్లో శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 

ఆరోగ్య సంరక్షణ: జాతీయ ఆరోగ్య విధానం కింద ఈ రంగంపై పెట్టుబడులు జీడీపీలో 1 శాతం నుంచి 2.5-3 శాతానికి పెంచడం వల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఆరోగ్య సౌకర్యాల అందుబాటులో మన దేశం ప్రపంచంలో 145వ స్థానం (మొత్తం 180 దేశాలకుగాను) భవిష్యత్తులో రానున్న ప్రాణాంతక మహమ్మారులను సమర్థవంతంగా నిలువరించే స్థాయిలో ప్రభుత్వ పెట్టుబడులు ఉండాలి. 

.

.

జీడీపీ వృద్ధిరేటు  

స్థిరమైన ధరలు (శాతంలో)

2017-18    7.0

2018-19        6.1

2019-20        4.2

2020-21      7.7

2021-22        11.0 (అంచనా)

 

పారిశ్రామిక వృద్ధి రేటు 

ప్రాథమిక ధరల వద్ద జీవీఏ వృద్ధిరేటు 

(శాతంలో)

2017-18        6.3

2018-19        4.9

2019-20        0.9

2020-21      9.6

 

వ్యవసాయం, అనుబంధరంగాలు 

ప్రాథమిక ధరల వద్ద జీవీఏ వృద్ధిరేటు 

(శాతంలో)

2017-18        5.9

2018-19 2.4

2019-20        4.0 

 

 సేవారంగం వాటా 

2020-21      3.4 (అంచనా)

 

ద్రవ్యలోటు (జీడీపీలో శాతం)

2017-18 3.5

2018-19        3.4

2019-20        4.6

2020-21 3.5

 

కరెంట్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ 

(జీడీపీలో శాతం)

2017-18      1.8

2018-19        2.1

2019-20        0.9

2020-21        3.1

 

ఫారెన్‌ ఎక్చ్సేంజ్‌ రిజర్వ్‌లు (డాలర్లలో) ఏడాది చివరికి

2017-18      424.4

2018-19      411.9

2019-20      475.6

2020-21      586.1

.

.

     లాక్‌డౌన్‌ సమయంలో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు అప్పులు తెచ్చి ప్రజలను ఆదుకున్నాయి. పేదలకు ఉచితంగా రేషన్‌ అందించడం, ఖర్చుల కోసం ఖాతాల్లో డబ్బు జమ చేయడం, కూలీలను వారి స్వస్థలాలకు పంపించడం, కంపెనీలకు ఉద్దీపన ప్యాకేజీలు అందించడం వంటి చర్యలు తీసుకోవడం వల్ల అప్పులు పెరిగాయి. అభివృద్ధి చెందిన దేశాల అప్పులు వాటి జీడీపీ పరిశీలిస్తే నాలుగు రెట్లకు పైగా ఉన్నాయి. భారత్‌లో జీడీపీ కన్నా అప్పులు కాస్త తక్కువగా ఉన్నాయి. 

 

దేశ జీడీపీలో అప్పుల వాటా శాతం

జపాన్‌            444.7

కెనడా              356.1

ఫ్రాన్స్‌              351.4

అమెరికా            318.7

బ్రిటన్‌              310.8

జర్మనీ              215.8

భారత్‌              122.9    

 

ప్రధాన రంగాలు

     మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం కోసం టెలిమెడిసన్‌ విధానాన్ని మరింత బలోపతం చేయాలని సర్వే సూచించింది. 

పీడీఎస్‌ ఆహార ధాన్యాల రేటు పెంచాలి: జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా అత్యధిక సబ్సిడీ ధరలకే బియ్యం (కిలో రూ.3), గోధుమలు (కిలో రూ.2), కాయధాన్యాలు (కిలో రూ.1) ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇందుకు ఆహారధాన్యాల ధరను సవరించాలి. పీడీఎస్‌ ద్వారా ఆహారోత్పత్తులపై సబ్సిడీ కోసం 2020-21 వార్షిక బడ్జెట్‌లో కేంద్రం రూ.1,15,569 కోట్లు కేటాయించడం గమనార్హం.

ఆన్‌లైన్‌ విద్యకు ఊతం: కరోనా వల్ల గతేడాది నుంచి పాఠశాలలు మూతపడటంతో ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గత రెండేండ్లలో 36 నుంచి 61 శాతానికి పెరిగింది. 

దివాలా చట్టం: దివాలా చట్టం అమల్లోకి తెచ్చి బ్యాంకుల రుణగ్రహీతల బంధాన్ని పునర్‌నిర్మించింది. 2020 డిసెంబర్‌ నాటికి పరిష్కార ప్రక్రియ ద్వారా 308 మంది కార్పొరేట్‌ రుణగ్రహీతలు దివాలాకు వెళ్లకుండా కాపాడటం జరిగింది. వారి రుణ బకాయిల విలువ రూ.4.99 లక్షల కోట్లు. ఈ చట్టం కింద చర్యలతో బ్యాంకులు రూ.1.99 లక్షల కోట్ల రుణాలు వసూలు చేయగలిగింది. 

నవ్య ఆవిష్కరణలో 48వ స్థానం: నూతన ఆవిష్కరణ సూచీలో భారత్‌కు 48వ స్థానం దక్కింది. 2015లో 81వ ర్యాంకులో ఉంది. ప్రైవేటు రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలి.

బ్రాడ్‌ బ్యాండ్‌ విస్తరణతో తగ్గిన చార్జీలు: ఇంటర్నెట్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ విస్తరణతో చార్జీలు తగ్గి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి వినియోగదారుడి వైర్‌లెస్‌ డాటా వినియోగం 2019 మార్చిలో సగటున 9.1 జీబీ ఉండగా, 2020 జూన్‌లో అది 12.2 జీబీకి పెరిగింది. 





కేంద్ర బడ్జెట్‌2021-22

కేంద్ర బడ్జెట్‌2021-22

     దేశచరిత్రలో మొట్టమొదటిసారి పేపర్‌లెస్‌ బడ్జెట్‌ (ఈ-బడ్జెట్‌)ను ప్రవేశపెట్టారు. కరోనా నేపథ్యంలో ‘ఈ-బడ్జెట్‌'ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. దీని కోసం బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌ను ప్రారంభించారు. గత బడ్జెట్‌ ప్రసంగాలకు భిన్నంగా ఈసారి లోక్‌సభలో రెండో వరుసలో నిలబడి ప్రసంగించారు.110 నిమిషాలు మాట్లాడారు.

బడ్జెట్‌లో ఏది పెరిగింది, ఏది తగ్గింది, రూపాయి రాక ఎంత, పోక ఎంత, ఎవరికి లాభం, ఎవరికి నష్టం వంటి వాటి గురించి పోటీపరీక్షల్లో ప్రశ్నలు వస్తుంటాయి. 2021-22 కేంద్ర వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రూ.34.8 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం బడ్జెట్‌ను  అందిస్తున్నాం.

1. బడ్జెట్‌ పదం ఫ్రెంచ్‌లోని బౌగెట్టే నుంచి వచ్చింది. బౌగెట్టే అంటే చిన్న తోలు సంచి.

2. భారత్‌లో మొట్టమొదటి కేంద్ర బడ్జెట్‌ను 1860 ఏప్రిల్‌ 7న అప్పటి ఈస్ట్‌ ఇండియా కంపెనీ బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.

3. స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్‌ను 1947 నవంబర్‌ 26న ప్రవేశపెట్టారు.

4. కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ. 1970-71 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టారు.

5. 2017 సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపేశారు. అదే సంవత్సరం నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతున్నారు. అంతకుముందు ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెట్టేవారు.

6. 2014 బడ్జెట్‌ ప్రసంగం దేశ  చరిత్రలోనే అత్యంత ఎక్కువ సేపు సాగింది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం 2.5 గంటల పాటు ప్రసంగించారు.  

7. బడ్జెట్‌ను తోలు సంచిలో కాకుండా 2019 నుంచి ఎర్రటి వస్త్రంలో చుట్టిన ఖాతా పుస్తకంతో ప్రవేశపెడుతున్నారు.


.
.

హైలైట్స్‌ 

  • ఆదాయపు పన్ను చెల్లింపుల విధానం యథాతథం. గతంలో మాదిరిగానే పన్ను శ్లాబులు.
  • 75 ఏండ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు ఊరట. పింఛన్‌, వడ్డీతో జీవించేవారికి ఐటీ రిటర్న్‌ దాఖలు నుంచి మినహాయింపు
  • పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధింపు. అలాగే బంగారం, వెండి, మద్యంపైనా అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌
  • బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు. రూ.2,23,846 కోట్ల కేటాయించారు. మునుపటి బడ్జెట్‌ కంటే ఇది 137% అధికం.కరోనా వ్యాక్సినేషన్‌ కోసం రూ.35,000 కోట్లు
  • మూలధన సాయం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.20 వేల కోట్లు
  • ఈ ఏడాదే ఎల్‌ఐసీ ఐపీవో
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల నిర్వహణకు బ్యాడ్‌ బ్యాంక్‌ పథకం
  • ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యం. గతేడాది  ఈ లక్ష్యం రూ.2.1 లక్షల కోట్లు
  • బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% పెంపు
  • 12 లక్షల కోట్ల రుణాలు తీసుకునేందుకు ప్రతిపాదన
  • ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం మరో ఏడాది పొడిగింపు
  • మరో కోటి మందికి ఉజ్వల పథకం కింద ఉచితంగా వంట గ్యాస్‌
  • డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఏర్పాటు. వచ్చే మూడేండ్లలో 5 లక్షల కోట్ల రుణాల లక్ష్యం
  • మొబైల్‌ ఫోన్లు, బ్యాటరీ చార్జర్ల విడిభాగాలపై 2.5 శాతం దిగుమతి సుంకం విధింపు
  • 8,500 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి. పశ్చిమబెంగాల్‌లో 25వేల కోట్లతో రహదారుల నిర్మాణం
  • మూడేండ్లలో ఏడు మెగా టెక్స్‌టైల్‌ పార్కుల ఏర్పాటు
  • ఆర్థిక సంవత్సరంలో 16.5 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించాలని లక్ష్యం
  • కాలం చెల్లిన వాహనాలు తుక్కుకే. వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏండ్లు. వాణిజ్య వాహనాల జీవితకాలం 15 ఏండ్లుగా నిర్ణయం
  • విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, దాదాపు 3 లక్షల కోట్లతో డిస్కమ్‌లకు సాయం

 

ఆరోగ్య రంగం

  • వైద్యారోగ్యానికి 2.23 లక్షల కోట్లు
  • గతేడాది కంటే 137 శాతం అధికం
  • కరోనా వ్యాక్సినేషన్‌కు రూ.35 వేల కోట్లు

     ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో కేంద్రం పెద్ద పీట వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,23,846 కోట్లు కేటాయించింది. గతేడాది (రూ.94,452 కోట్లు) కంటే ఇది 137 శాతం అధికం. కరోనా వ్యాక్సినేషన్‌ కోసం రూ. 35 వేల కోట్లు కేటాయించగా... అవసరమైతే దీన్ని మరింత పెంచుతామని కేంద్రం ప్రకటించింది.  ప్రధానమంత్రి ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌ యోజన పేరుతో కొత్త పథకం ప్రారంభం కానున్నది. దీనికి ఆరేండ్లలో రూ.64,180 కోట్లు వెచ్చించనున్నట్టు వివరించారు. దీని ద్వారా ప్రస్తుతమున్న, భవిష్యత్తులో సంభవించే వ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రాథమిక, ద్వితీయ, ప్రాంతీయ వైద్య వ్యవస్థలు, జాతీయ సంస్థలను బలోపేతం చేయనున్నారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌కు ఇది అదనం. ఈ పథకంలో భాగంగా రూరల్‌, అర్బన్‌ హెల్త్‌, వెల్‌నెస్‌ సెంటర్లకు చేయూత అందించడంతోపాటు అన్ని జిల్లాల్లో పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌లు, 11 రాష్ర్టాల్లో 3,382 బ్లాక్‌ పబ్లిక్‌హెల్త్‌ యూనిట్లు, 602 జిల్లాల్లో క్రిటికల్‌ కేర్‌ హాస్పిటల్‌ బ్లాక్‌ల ఏర్పాటు. దీంతోపాటు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ)ని బలోపేతం చేస్తారు. 15 హెల్త్‌ ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్లు, 2 మొబైల్‌ హాస్పిటల్స్‌, జాతీయ స్థాయిలో వ్యాధి నివారణ కేంద్రం, 9 బయోసేఫ్టీ లెవల్‌-3 ల్యాబొరేటరీలు, 4 వైరాలజీ ల్యాబ్‌లు ఏర్పాటుచేయనున్నారు. వైద్య పరిశోధనల విభాగానికి 2663 కోట్లు, ఆయుష్‌ మంత్రిత్వ శాఖకు రూ.2970.30 కోట్లు కేటాయించారు. 

 

ఎలక్ట్రిక్‌ దిగుమతులపై సుంకం పెంపు

     విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రిక్‌ వస్తువులు, ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాలపై దిగుమతి సుంకం పెంచింది. ఫలితంగా మధ్యతరగతి ఎక్కువగా వాడుతున్న పలు ఎలక్ట్రానిక్స్‌ వస్తువులపై ధరలు పెరుగనున్నాయి. ఉక్కు, సంబంధిత ఉత్పత్తులపై కస్టమ్స్‌ డ్యూటీని బాగా తగ్గించారు. పెరిగిన ధరలతో చితికిపోతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఉక్కుపై కస్టమ్స్‌ డ్యూటీని 7.5 శాతానికి కుదించింది. ఇది ఏడాదిపాటు అమల్లో ఉంటుంది.

 

విద్యారంగం

  • మొత్తం- రూ.93,224 కోట్లు 
  • (గతేడాది రూ. 86,089 కోట్లు) 

     నూతన విద్యా విధానానికి (ఎన్‌ఈపీ) అనుగుణంగా దేశవ్యాప్తంగా 15 వేలకుపైగా పాఠశాలలను కేంద్రం తీర్చిదిద్దనుంది. ఎన్‌ఈపీలో పేర్కొన్న లక్ష్యాలను సాధించడానికి ఇవి ఆయాప్రాంతాల్లో ఆదర్శ పాఠశాలలుగా నిలువనున్నాయి. ‘బోర్డు పరీక్షలను సులభతరం చేయటం, సిలబస్‌ను ముఖ్యాంశాల మేరకు తగ్గించటం,  విద్యావిధానాన్ని 10+2 బదులుగా 5+3+3+4గా మార్చటం, ఐదో తరగతి వరకు మాతృభాషలో బోధించడం వంటి ఎన్‌ఈపీ సిఫారసులకు అనుగుణంగా 15 వేలకుపైగా పాఠశాలలను తీర్చిదిద్దడం. దీంతోపాటు స్వచ్ఛందసంస్థలు, ప్రైవేటు స్కూళ్లు, రాష్ట్రప్రభుత్వాల సహకారంతో కొత్తగా 100 సైనిక్‌ స్కూళ్లను ఏర్పాటుకు ప్రకటన. ఉన్నతవిద్య కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి కొత్త చట్టం. 

 

1.1 లక్షల కోట్లతో రైల్వే బడ్జెట్‌

     రైల్వే రంగానికి 1.1 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో 1.07 లక్షల కోట్లను రైల్వే మూలధన వ్యయం కోసం కేటాయించారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైల్వే సర్వీసులు కొన్ని నెలలపాటు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పదేండ్ల రోడ్‌మ్యాప్‌ను ప్రవేశపెట్టారు. ఇందుకు ‘జాతీయ రైల్వే ప్లాన్‌ 2030’ని ప్రకటించారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌'ను ప్రోత్సహించడంలో భాగంగా దేశీయ పరిశ్రమలకు లాజిస్టిక్స్‌ ఖర్చులను తగ్గించారు. 2022 జూన్‌ నాటికి ఈస్టర్న్‌, వెస్టర్న్‌ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ల అభివృద్ధిలో భాగంగా కొన్నింటిని పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యంతో (పీపీఈ) నిర్మించనున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ సరుకు రవాణా కారిడార్‌ను ఖరగ్‌పూర్‌-విజయవాడ మధ్య, ఈస్ట్‌-వెస్ట్‌ సరుకు రవాణా కారిడార్‌ను భుసవాల్‌-ఖరగ్‌పూర్‌-ధన్‌కుని మధ్య, నార్త్‌-సౌత్‌ సరుకు రవాణా కారిడార్‌ను ఇటార్సీ-విజయవాడ మధ్య నిర్మించనున్నారు. ఈస్టర్న్‌ సరుకు రవాణా కారిడార్‌ కింద సోమ్‌ నగర్‌-గోమో మధ్య అదనంగా 263 కిలోమీటర్ల మేర రైల్వే లైను నిర్మాణం, గోమో-దన్కుని మధ్య 274 కిలోమీటర్ల మేర మరో ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారు. 2023 డిసెంబర్‌ నాటికి బ్రాడ్‌ గేజ్‌ రైల్వే ట్రాక్‌లలో 100 శాతం విద్యుదీకరణ లక్ష్యం పెట్టుకున్నట్లు కేంద్రం వివరించింది. ప్రయాణికుల సౌకర్యం కోసం పర్యాటక రూట్లలో తిరిగే రైళ్లలో విస్టాడోమ్‌ కోచ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఎక్కువ రద్దీ ఉన్న రూట్లలో ప్రమాదా లు జరగకుండా దేశీయంగా తయారు చేసిన ఆటోమేటిక్‌ ట్రైన్‌ ప్రొటెక్షన్‌ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

 

అసంఘటిత కార్మికుల గుర్తింపునకు ‘పోర్టల్‌'

     అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజిక భద్రత కల్పన గురించి ప్రస్తావించారు. ఇందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను తీసుకురానున్నట్టు తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ పోర్టల్‌లో పేర్లను నమోదు చేసుకున్న కార్మికులకు వైద్యం, బీమా, నైపుణ్యాల శిక్షణ వంటి సౌకర్యాలను కల్పిస్తారు. తొలిసారిగా ఈఎస్‌ఐసీ సౌకర్యాలను కూడా వర్తింపజేస్తారు. కార్మికులకు కనీస వేతనాన్ని చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రిటర్నులు దాఖలు చేసే సమయంలో గుత్తేదారులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు సింగిల్‌ రిజిస్ట్రేషన్‌, సింగిల్‌ లైసెన్స్‌ ఫెసిలిటీ వంటి విధానాల్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 

  • రూ. 20,000 కోట్లు బ్యాంకులకు కేటాయింపులు
  • ద్రవ్యలోటు 6.8
  • వార్షిక ప్రీమియం రూ.2.5లక్షలు దాటితే యూనిట్‌ లింక్డ్‌  ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ (యులిప్స్‌)కు పన్ను మినహాయింపులుండవు. ఫిబ్రవరి 1 నుంచే ఇది వర్తించనుంది. అయితే పాలసీదారు చనిపోతే మాత్రం పన్ను లాభాలు అలాగే ఉండనున్నాయి. 

 

కొత్తగా మిషన్‌ పోషణ్‌ 2.0

బడ్జెట్‌లో కొత్త పోషకాహార పథకాన్ని ప్రకటించారు. పోషణ్‌ అభియాన్‌ను కలిపి మిషన్‌ పోషణ్‌ 2.0గా అమలుచేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే ఈ పథకం పరిధిలోకి మన  రాష్ర్టానికి చెందిన మూడు జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి (ములుగుతోసహా) వస్తాయి.

 

ఐటీ చెల్లింపులో..

ఐటీ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.  ఉద్యోగ భవిష్య నిధి (పీఎఫ్‌) చందాదారులకు వచ్చే వడ్డీకి పన్ను విధించనున్నారు. ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో పీఎఫ్‌ చందాలు చెల్లించేవారికి వచ్చే వడ్డీపై పన్ను విధించాలని ప్రతిపాదించారు. అధికాదాయ ఉద్యోగులకు ఆదాయ పన్నులో ఇచ్చే మినహాయింపును హేతుబద్ధం చేసేందుకు ఈ ప్రతిపాదన చేసినట్లు పేర్కొన్నారు. ఇది ఏప్రిల్‌ 1న లేదా ఆ తర్వాత ఉద్యోగులు చెల్లించే చందాలకు మాత్రమే వర్తిస్తుందని, యాజమాన్యాలు చెల్లించే చందాలకు ఈ నిబంధన వర్తించబోదని వివరించింది. దీంతో నెలకు రూ.20,833 కంటే ఎక్కువ పీఎఫ్‌ చందా చెల్లించే ఉద్యోగులకు పన్ను విధిస్తారు.

 

ఓడల రీసైక్లింగ్‌ సామర్థ్యం రెట్టింపు

ఓడల రీసైక్లింగ్‌ సామర్థ్యాన్ని 2024 నాటికి రెట్టింపు చేయాలని కేంద్రం సంకల్పించింది. ప్రస్తుత సామర్థ్యం 4.5 ఎల్‌డీటీగా ఉండగా.. దీన్ని రెట్టింపు చేయడం ద్వారా యువతకు అదనంగా 1.5 లక్షల ఉద్యోగాలను కల్పించవచ్చని పేర్కొంది. పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఏడు ఓడరేవులు నిర్వహించనున్నారు.

 

వృద్ధులకు ఊరట

కేవలం పెన్షన్‌, వడ్డీపై వచ్చే ఆదాయంతో జీవిస్తున్న 75 ఏండ్లు దాటిన వృద్ధులు ఇకపై ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. పొందే పెన్షన్‌కు లేదా వడ్డీ ఆదాయానికి పన్నులేమైనా వర్తిస్తే నేరుగా బ్యాంకులే వాటిని మినహాయించుకుంటాయని, పన్నుల విషయంలో వృద్ధులకు వేధింపులు ఎదురవకుండా చూసేందుకు ఈ వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా ఆదాయ పన్ను మదింపు కేసులను తిరిగి తెరిచేందుకు (రీఓపెనింగ్‌కు) నిర్దేశించిన కాలపరిమితిని 6 నుంచి 3 ఏండ్లకు తగ్గిస్తున్నట్లు  వెల్లడించింది. ఏడాదిలో రూ.50 లక్షల కంటే ఎక్కువ పన్ను ఎగవేతకు సంబంధించిన కేసుల రీఓపెనింగ్‌కు 10 ఏండ్ల పరిమితి ఉంటుందన్నారు.


.
.

ధరలు పెరిగేవి                                 

  • రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, ఎల్‌ఈడీ లైట్లు
  • వంటనూనెలు, మొబైల్‌ ఫోన్లు, చార్జర్లు.
  • సోలార్‌ ఇన్వర్టర్లు (దిగుమతి సుంకాన్ని 
  • 5 శాతం నుంచి 20 శాతానికి పెంచారు)
  • సోలార్‌ లాంతర్లు 
  • (5 శాతం నుంచి 15 శాతానికి పెంపు)
  • వాహనాల విడిభాగాలు (15 శాతం పెంపు)
  • ముడి పట్టు (10 శాతం నుంచి 
  • 15 శాతానికి పెంపు)
  • ప్రింటర్‌లో వాడే ఇంక్‌ కార్ట్రిడ్జ్‌లు
  • తోలు వస్తువులు

 

ధరలు తగ్గేవి  

  • రాగి వస్తువులు 
  • (దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి
  • 2.5 శాతానికి తగ్గించారు)
  • ఇనుము, ఉక్కు  (10 శాతం నుంచి 
  • 7.5 శాతానికి తగ్గించారు)
  • బంగారం, వెండి, ప్లాటినం, 
  • పల్లాడియం  (10 శాతం తగ్గింపు)
  • వైద్య పరికరాలు,
  • నైలాన్‌ దుస్తులు

 

రక్షణ

     గతేడాది రూ.4.71 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.4.78 లక్షల కోట్లు ప్రతిపాదించారు. ఇందులో పెన్షన్ల చెల్లింపులు (దాదాపు రూ.1.15 లక్షల కోట్లు) కూడా ఉన్నాయి. అంటే సైనిక దళాల కోసం రూ.3.62 లక్షల కోట్లు కేటాయించినట్లు తేలింది. ఇందులోనూ రూ.1.35 లక్షల కోట్లను మూలధన వ్యయంగా చూపించారు. ఈ వ్యయంతో కొత్త ఆయుధాలు, యుద్ధ విమానాలు, సైనికులకు సంబంధించిన సామగ్రిని కొనుగోలు చేయనున్నారు. గతేడాది మూలధన వ్యయం రూ.1.13 లక్షల కోట్లు కాగా.. ఈ సారి దాదాపు 19 శాతం కేటాయింపులు పెరిగాయి. మరోవైపు సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌లకు (బీఎస్‌ఎఫ్‌, సీఆర్పీఎఫ్‌, ఐటీబీపీ) రూ.1,03,802.52 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే దాదాపు 7.1 శాతం కేటాయింపులు పెరిగాయి. ఇంకోవైపు ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులకు భద్రత కల్పించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ)నకు రూ.429.05 కోట్లు కేటాయించారు. గతేడాది రూ.592.55 కోట్లు కేటాయించగా.. తర్వాత రూ.429.05 కోట్లకు సవరించారు. గతేడాదితో పోల్చితే తాజాగా రూ.2.78 కోట్లు అదనంగా కేటాయించారు.

 

స్టార్టప్‌లకు పన్ను ప్రోత్సాహకం

     స్టార్టప్‌లకు కేంద్ర ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలను కొనసాగించింది. ఆ సంస్థలకు పెట్టుబడులు వచ్చే మార్గాన్ని సులభతరం చేసింది. స్టార్టప్‌లు ట్యాక్స్‌ హాలిడేను పొందేందుకు అర్హత గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. స్టార్టప్‌లలో పెట్టే పెట్టుబడికి క్యాపిటల్‌ గెయిన్‌ మినహాయింపు కూడా వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉంటుందని తెలిపింది. 

 

స్మార్ట్‌సిటీ మిషన్‌కు రూ.6,450 కోట్లు

     స్మార్ట్‌ సిటీ మిషన్‌కు రూ.6,450 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.3,400 కోట్లు వెచ్చించారు. నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు రూ.4,472 కోట్లు, అటల్‌ మిషన్‌ ఫర్‌ రెజువనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ (అమృత్‌) పథకానికి రూ.7,300 కోట్లు కేటాయించారు

     కేంద్రప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో 53 పైసలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారానే సమకూరుతున్నది. అప్పుల ద్వారా 36 పైసలు వస్తుండగా, పన్నేతర ఆదాయం, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 6 పైసలు వస్తున్నాయి. రాష్ర్టాలకు ఇచ్చిన అప్పులు, అడ్వాన్సుల వసూళ్లతో సమకూరుతున్న ఆదాయం 5 పైసలు. కేంద్ర ప్రభుత్వం ఆదాయంలో జీఎస్టీ వాటా 15 శాతం ఉన్నది. ఇక ఖర్చుల్లో సింహభాగం వడ్డీ చెల్లింపులకే పోతున్నది. ప్రతి రూపాయిలో 20 పైసలు వడ్డీ చెల్లిస్తున్నారు. 


.
.

బడ్జెట్‌ నిపుణులు

  • బడ్జెట్‌ను రూపొందించాలంటే తగిన సిబ్బంది చాలా అవసరం. ఇందుకు నిపుణులు, సమర్థులు, అనుభవజ్ఞులు తప్పనిసరిగా ఉండాలి. బడ్జెట్‌ రూపకల్పనలో పాల్గొన్న నిపుణులు.
  • తరుణ్‌ బజాజ్‌: 1988 బ్యాచ్‌ హర్యానా కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
  • తుహిన్‌ కాంత పాండే: 1987 బ్యాచ్‌ ఒడిశా కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
  • అజయ్‌ భూషణ్‌ పాండే: 1984 బ్యాచ్‌ మహారాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ఆర్థిక శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
  • టీవీ సోమనాథన్‌: 1987 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. వ్యయనిర్వహణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  • కృష్ణమూర్తి సుబ్రమణియన్‌: ఆర్థిక విధానాలు, బ్యాంకింగ్‌ అండ్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో నిపుణులు. ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్నారు.
  • దేబాశిష్‌ పాండా: 1987 బ్యాచ్‌ ఉత్తరప్రదేశ్‌ ఐఏఎస్‌ అధికారి. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

 

సాగు కోసం పన్ను

     వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, బంగారం, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై అగ్రికల్చరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ (ఏఐడీసీ)ని విధించింది. పెట్రోల్‌పై రూ.2.50, డీజిల్‌పై రూ.4 సెస్‌ విధిస్తున్నట్టు ప్రకటించారు. వ్యవసాయరంగంలో మౌలిక వసతులను పెంచేందుకే ఈ సెస్‌ విధిస్తున్నట్టు వివరించారు. మద్యం ఉత్పత్తులపై 100 శాతం, ముడిపామాయిల్‌పై 17.5, సోయాబీన్‌, పొద్దు తిరుగుడు ముడి నూనె 20, యాపిల్‌ 35, బంగారం, వెండి 2.5, బఠానీ 40, కాబూలీ శనగలు 30, శనగలు 50, పత్తి 5, ఎరువులు 5, బెంగాల్‌ గ్రామ్‌ 50, బొగ్గు, పీట్‌, లిగ్నైట్‌లపై 1.5 శాతం చొప్పున  అగ్రి ఇన్‌ఫ్రా సెస్‌ విధిస్తున్నట్టు వెల్లడించారు. వినియోగదారులపై భారం పడకుండా యాపిల్‌పై 15 శాతం, మద్యం ఉత్పత్తులు 50, వంటనూనె 15, బొగ్గు, పీట్‌, లిగ్నైట్‌ 1, అమ్మోనియం నైట్రేట్‌ 2.5 శాతం, బఠానీలు, కాబూలీ శనగలపై 10 శాతం చొప్పున బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని తగ్గిస్తున్నట్టు చెప్పారు. 

 

ఆర్థికవృద్ధికి మూలస్తంభాలు

     కరోనా దెబ్బకు కకావికలమైన దేశ ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టేందుకు ఆరు మూల స్తంభాలను ప్రకటించారు. అవి.. 

1) ఆరోగ్యం, సంక్షేమం: ఆరోగ్యరంగానికి  రూ.2,23,843 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే 137 శాతం అధికం. కరోనా వ్యాక్సిన్‌ కోసమే రూ.35 వేల కోట్లు కేటాయించారు.   

2) భౌతిక, ఆర్థిక మూలధనం: టెక్స్‌టైల్స్‌ వంటి ఉత్పత్తి రంగానికి ఊతానికి, మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే ఐదేండ్లలో రూ.1.97 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. రోడ్డు రవాణా, జాతీయ రహదారులకు రూ.1.18 లక్షల కోట్లు, విద్యుత్‌ పంపిణీ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు కేటాయించారు.

3) సమ్మిళిత అభివృద్ధి: దీనిలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, రైతు సంక్షేమం, గ్రామీణ భారతం, వలస కార్మికులు, కార్మిక రంగాన్ని చేర్చారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ.16.5 లక్షల కోట్లకు పెంచారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కేటాయింపులను రూ.30వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు పెంచనున్నారు.  

4) మానవ వనరుల మూలధనం పెంపు: 15వేల స్కూళ్లను గుణాత్మకంగా బలోపేతం చేయనున్నారు. కొత్తగా 100 సైనిక్‌ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఏకలవ్య మోడల్‌ పాఠశాలలను నెలకొల్పనున్నారు. 

5) ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి: రూ.1500 కోట్లతో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రాచుర్యంలోకి తేవడంతోపాటు జాతీయ భాషానువాద మిషన్‌ (ఎన్టీఎల్‌ఎం) విధానాన్ని తీసుకురానున్నారు. బ్రెజిల్‌తోపాటు భారత ఉపగ్రహాలను మోసుకెళ్లే ‘న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌' చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీఎస్‌51 ప్రయోగం చేపట్టనున్నారు. 

6) కనిష్ట పాలన, గరిష్ట పర్యవేక్షణ: సత్వర న్యాయం అందించేందుకు ట్రిబ్యునల్స్‌లో సంస్కరణలు తెచ్చేందుకు, వాటి పనితీరును హేతుబద్ధం చేసేందుకు పలు చర్యలు తీసుకోనున్నారు. 

ఇలా పలు రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, తమ బడ్జెట్‌కు ఇవే మూలస్తంభాలని మంత్రి పేర్కొన్నారు.

 

వ్యవసాయ శాఖకు పెరిగిన కేటాయింపులు

     వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు రూ.1,31,531 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 5.63 శాతం ఎక్కువ. 2020-21లో రూ.1,24,519 కోట్లు కేటాయించారు. తాజా కేటాయింపుల్లోని మొత్తం నిధుల్లో రూ.8,513.62 కోట్లు వ్యవసాయ విద్య, పరిశోధనపై ఖర్చు చేయనున్నారు.  ప్రధానమంత్రి-కిసాన్‌ సమ్మాన్‌ నిధికి అత్యధికంగా రూ.65 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.

 

బ్రీఫ్‌కేస్‌ సంప్రదాయం

  • బడ్జెట్‌ పేపర్లను బ్రీఫ్‌కేస్‌లో తీసుకొచ్చే సంప్రదాయాన్ని బ్రిటన్‌ నుంచి తీసుకున్నాం. బ్రిటన్‌లో ఈ బ్రీఫ్‌కేస్‌ను ‘గ్లాడ్‌స్టోన్‌ బాక్స్‌' అంటారు. 
  • 1860లో అప్పటి బ్రిటిష్‌ ఆర్థిక మంత్రి విలియం ఈ గ్లాడ్‌స్టోన్‌ తొలిసారిగా బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్‌ పేపర్లను పార్లమెంటుకు తీసుకువచ్చారు. అందుకే దీనికి ఆయన పేరుతోనే గ్లాడ్‌స్టోన్‌ బాక్స్‌ అని పేరువచ్చింది. 
  • భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముగం చెట్టి 1947లో బడ్జెట్‌ ప్రతులను తోలు సంచిలో తీసుకొచ్చి పార్లమెంటులో ప్రవేశపెట్టారు. తర్వాత బ్రీఫ్‌కేస్‌ల వినియోగం 1970 నుంచి మొదలైంది.

 

కరెంట్‌ కనెక్షన్‌ మన ఇష్టం

     దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో డిస్కంలు ఉన్నాయి. వీటి మధ్య పోటీని ప్రోత్సహించడం ద్వారా తమకిష్టమైన విద్యుత్‌ పంపిణీ సంస్థను ఎంచుకొనే అవకాశం వినియోగదారులకు కల్పించనున్నారు. టెలికం రంగంలో తమకిష్టమైన సర్వీస్‌ ప్రొవైడర్‌ (పోర్టబిలిటీ)ను వినియోగదారులు ఎంచుకొన్నట్టే విద్యుత్‌ రంగంలోనూ అటువంటి అవకాశం కల్పించనున్నారు. వచ్చే ఐదేండ్లలో విద్యుత్‌ పంపిణీ విభాగంలో రూ.3,05,982 కోట్లు కేటాయించారు. దీని ద్వారా డిస్కంలకు మౌలిక సదుపాయాల సృష్టికి, ‘ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటరింగ్‌', ఫీడర్ల విభజన, యంత్రాల ఉన్నతీకరణకు సహకారం లభిస్తుంది. 

 

స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్‌ విధానం 

     కాలంచెల్లిన వాహనాలను తొలగించేందుకు ‘స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్‌ విధానా’న్ని ప్రకటించారు. దీని కింద వ్యక్తిగత వాహనాలు 20 ఏండ్లు, వాణిజ్య వాహనాలు 15 ఏండ్లు పూర్తయ్యాక ఆటోమేటెడ్‌ కేంద్రాల్లో ఫిట్‌నెస్‌ పరీక్ష చేయించాలి. ఇతర వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. దేశంలోని కోటి వాహనాలు దీని పరిధిలోకి వస్తాయి. 

 

తెలంగాణకు కేటాయింపులు

     గతేడాది కేంద్ర పనుల్లో రాష్ర్టాల వాటా 42 శాతం ఉండగా.. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా 41 శాతానికి తగ్గింది. దీంతో రాష్ర్టానికి రావాల్సిన కేంద్ర పన్నుల వాటా 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గింది. అంటే రూ.18వేల కోట్లు వరకు ఉన్న పన్నుల వాటా అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.16,760 కోట్లకు కుదించారు. కానీ కరోనా కారణంగా ఆ వాటా రూ.12వేల కోట్లకు పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఇప్పటివరకు రూ.11,731 కోట్లు మాత్రమే రాష్ర్టానికి విడుదలయ్యాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ర్టానికి వచ్చే పన్నుల వాటాను 2.102గా ఖరారు చేశారు. దీని ప్రకారం రూ.13,390కోట్లు మాత్రమే ఉండవచ్చని బడ్జెట్‌ అంచనా వేసింది.

 

ఐదేండ్లలో వచ్చే నిధులు

     గ్రాంట్లు, పన్నుల రూపంలో మొత్తంగా దాదాపు రూ.1,09,786 కోట్లు. కేంద్ర పన్నుల్లో వాటా రూ.88,806 కోట్లు, స్థానిక సంస్థలకు రూ.13,111, ఆరోగ్యరంగానికి రూ.624 కోట్లు, పీఎంజీవై రోడ్లకు రూ.255కోట్లు, న్యాయవ్యవస్థకు రూ.245కోట్లు, ఉన్నత విద్యకు రూ.189కోట్లు, వ్యవసాయానికి రూ.1665 కోట్లు, రాష్ర్టానికి ప్రత్యేకంగా రూ.2362కోట్లు, విపత్తు నిర్వహణకు రూ.2483 కోట్లు సమకూరుతాయని అంచనా.








Related Posts Plugin for WordPress, Blogger...