చరితపై చెరగని సంతకం నీదే మహాత్మా!






మనిషిని మనిషే నడిరోడ్డున అడ్డంగా నరుక్కుంటున్న ఈ రోజుల్లో.. 
అహింస గురించీ..

పోరాటమంటే ఆవేశంతో విధ్వంస రచనకు దిగటమేనని భాష్యం చెప్పుకొంటున్న ఈ రోజుల్లో.. 
సత్యాగ్రహం గురించీ.. 

స్వరాజ్యమంటే స్వాహా రాజ్యమేనని నిర్వచనాలు మార్చేసుకుంటున్న ఈ రోజుల్లో.. 
నైతిక వ్యక్తినిష్ఠ గురించీ..

నాయకుడంటే అపరిమిత అధికారంతో జనం నెత్తిన స్వారీ చేసేవాడేనని భావిస్తున్న రోజుల్లో..
జననేత గురించీ.. 

మతమంటే మనదేనని విర్రవీగుతూ విషం చిమ్ముకుంటున్న ఈ రోజుల్లో.. 
సర్వమత సహనం గురించీ.. 

ప్రేమించటమంటే ప్రతీకారానికీ సంసిద్ధపడటమేనని నమ్మాల్సి వస్తున్న ఈ రోజుల్లో.. 
కరుణ గురించీ..

నాగరికత అంటే మనల్ని వస్తువ్యామోహంలోకి నెట్టుకుపోయేదేనని నమ్ముతున్న ఈ రోజుల్లో.. 
నిరాడంబరత గురించీ..

ప్రకృతి వరప్రసాదాలను సొంత సొత్తులా కొల్లగొట్టుకుంటున్న ఈ రోజుల్లో.. 
సతత హరిత జీవితం గురించీ..


మళ్లీ ఎలుగెత్తి చాటి చెప్పేందుకు.. 
కరడుగట్టిన హృదయాలను కదిలించేందుకు.. 
ఆవిరవుతున్న జీవితాల్లో ఆర్ద్రత నింపేందుకు.. 
మళ్లీ జన సామాన్యాన్ని కదిలించి.. మానవ చరిత్రలో మరో మహోన్నత విలువల ఉద్యమాన్ని నిర్మించేందుకు..
నీ భావనలు మాకు వెలుగు చుక్కలు ఓ మహాత్మా..    నీ ఆచరణలు మాకు మేలు బాటలు ఓ మహర్షీ..!!
ప్రపంచ చరిత్రలో ఒక క్రీస్తు.. ఒక బుద్ధుడిలా మహోన్నత విలువలతో మానవులను నడిపించేందుకు నడుం కట్టటమే కాదు..
తన జీవితాన్ని ఏ దాపరికమూ లేని అద్దంలా అందరి ముందూ ఉంచి.. 
ఒక నాయకుడిగా మొదలై, ఒక యోధుడిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక తాత్వికుడిగా, ఒక ప్రవక్తలా... 
అన్నింటినీ మించి సామాన్యుల్లో ఒక అతి సామాన్యుడిగా ఈ నేల మీద నడయాడుతూ.. 
జనసంద్రాన్ని కదిలించిన 
మహాత్ముడి 150వ జయంతి 
వేడుకల ఆరంభం ఇది.
యన పోరాటం బ్రిటీషు పాలనపైనే కాదు.. 
ఆయన తిరగబడింది సామ్రాజ్యవాద 
కుతంత్రాలపైనే కాదు..
ఆ క్రమంలో ఆయన అంతర్‌-బహిర్‌ లోకాల్లో విస్తరించిన సకల రూప చెడుగులపైనా సమరం సాగించారు. అందుకే విశ్వమానవాళి హృదయాలను గెలుచుకున్నారు.
ఎన్ని వాదవివాదాలున్నా ఆయన ఆలోచనలు సార్వజనీనం. 
ఇంకా చెప్పాలంటే ఆయన నమ్మిన విలువల ఆవశ్యకత నాటికన్నా నేడే ఎక్కువగా కనబడుతోంది. అందుకే గాంధీజీ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆ మహాత్ముడి విస్తృత ఆలోచనా ధార, ఆచరణ పరంపరపై నేటి ఈనాడు ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇవి మనల్ని సరికొత్త సంకల్పానికి సంసిద్ధులను చేస్తాయని ఆశిస్తున్నాం!



కాలాన్ని కదం తొక్కించిన సత్య శోధకుడు

పాలకులకు అతడు సింహస్వప్నం..
హేతువాదులకా అతనో ఛాదస్తుడు..
ఇక ఆర్థికవేత్తలకంటారా పెద్ద అవివేకి..
భౌతికవాదులకేమో వట్టి వెర్రిబాగుల కలల బేహారి..
కమ్యూనిస్టులకు అభివృద్ధి నిరోధకుడు..
అంతేకాదు..
ముస్లిం నాయకులకు ఆయన మతతత్వ హిందూ.
మరి హిందూ అతివాదులకు.. ముస్లింలను దువ్వే మూర్ఖమనిషి.
‘అంటరాని’వారికేమో.. అగ్రవర్ణ పక్షపాతి.
అగ్రవర్ణాలకేమో..
ఏదో చేసేసెయ్యాలని గందరగోళం సృష్టించే అగమ్య సంస్కర్త.
ఒకే మనిషిని ఇన్ని వర్గాల వాళ్లు.. భిన్న కోణాల్లో ఈసడించుకుంటూ ఉండొచ్చు గాక. ఆయన ఆలోచనలతో ప్రపంచ మేధావులెందరో విభేదిస్తూ ఉండొచ్చు గాక.
కానీ....
ఒక నాయకుడు తన పటిమతో జనాన్ని నడిపిస్తాడు. ఒక మేధావి తన ఆలోచనలతో జనాన్ని కదిలిస్తాడు.
సాధారణంగా ఈ రెండు పాత్రలూ వేర్వేరుగానే ఉంటాయి. కానీ ఏకకాలంలో- ఒక మేధావిగా సార్వజనీన తాత్విక ఆలోచనా ధోరణిని కనబరుస్తూ, మరోవైపు ప్రజానేతగా జన సముద్రాన్ని కదిలించటం మామూలు మనుషుల వల్ల కాదు.. కేవలం మహాత్ములకే సాధ్యం!
మందబలాన్ని ఆత్మబలంతో ఎదిరించాలన్నది 
గాంధీజీ బోధనల సారం!

మొదట్లో వాళ్లు మిమ్మల్ని పట్టించుకోరు. 
తర్వాత మిమ్మల్ని చూసి నవ్వుతారు. 
ఇక లాభం లేదని మీతో యుద్ధం ఆరంభిస్తారు.
అంతిమంగా.. 
        మీరు విజయం సాధిస్తారు
        వాళ్లు మిమ్మల్ని అనుసరిస్తారు.

- కడుసామాన్యుడు సైతం 
కాకలు తీరిన బ్రిటీషు సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలబడేలా చేసిన మహాత్ముడి బోధన ఇది!
మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ కేవలం స్వాతంత్య్ర సమర యోధుడే అయ్యుంటే బ్రిటీషు దాస్యశృంఖలాలు వీడిపోవటంతోనే ఆయన పాత్ర పూర్తయిపోయి ఉండేది. ఆ పేరు చరిత్రపుటలకే పరిమితమైపోయేది. కానీ ఆయన ఒక సంస్కర్తగా మానవ జీవన స్వరూప, స్వభావాలను ఆకళింపు చేసుకుని.. మనిషిలో మార్పు కోసం, అభ్యుదయం కోసం సత్యనిష్ఠతో అంతర్‌-బహిర్‌ లోకాల్లో అన్వేషిస్తూ బలమైన తాత్విక చింతన చేశారు గాంధీజీ. అందుకే ఆయనను భరతఖండమే కాదు.. చింతనాపరుడిగా, చీకటిలో దారి చూపించే క్రాంతదిగ్దర్శిగా, మానవాళి మధ్య నడయాడిన మహాత్ముడిగా యావత్‌ ప్రపంచం ఇప్పటికీ స్మరించుకుంటోంది. బుద్ధుడి తర్వాత ఇంతగా ప్రపంచ ప్రజల హృదయాలను తాకి, గణనీయ ప్రభావం చూపించిన మరో భారతీయుడు మరెవరూ లేరు. ఆయనను బుద్ధుడు, క్రీస్తు వంటి అజరామర ప్రవక్తల సరసన, సోక్రటీస్‌ వంటి తత్వవేత్తల చెంతన చేర్చి చూస్తుండటం కూడా ఇందుకే! ఎందరు ఆయనను ‘సత్తెకాలపు సత్తెయ్య’గా కొట్టిపారేస్తున్నా, ఆచరణకు అసాధ్యమైన ‘ఆదర్శాల పుట్ట’గా ఈసడించుకుంటున్నా.. గాంధేయ విలువలకు, గాంధీ ఆలోచనలకు ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ విషయాన్ని ఆధునిక సమాజం ఇప్పుడు మరింతగా గుర్తిస్తోంది. గాంధీ మహాత్ముడి 150వ జయంతి వేడుకల సందర్భంగా జీవిత పర్యంతం ఆయన ప్రవచించిన సార్వజనీన విలువలను మననం చేసుకోవటం.. మనకు అవసరం!!
ఆయన రాకతో...
అంతకముందు బ్రిటీషు పాలనను ధిక్కరిస్తూ స్వరాజ్యం కోసం ప్రాణాలర్పించిన ధీరులెందరో ఉన్నారు. బెంగాల్లో, మహారాష్ట్రలో, పంజాబ్‌లో.. ఇలా దేశమంతటా చిన్నచిన్న తిరుగుబాట్లు తీసుకువచ్చి.. ప్రాణాలను బలిపెట్టిన ఆదివాసులు, పంటకాపులు, విప్లవ వీరులెందరో. కానీ 1921కి పూర్వం ప్రజలు ఒక జన సంద్రంగా కదిలివచ్చి రాజకీయంగా పెను ప్రకంపనలు తెచ్చిన ఉద్యమం లేనేలేదు. ఈ పరిస్థితుల్లో పెనుమార్పు తెచ్చినవారు గాంధీజీ. బ్రిటీషు పాలకులపై పోరాటం జయప్రదం కావాలంటే ముందు ప్రజల్లో ఆత్మస్థైర్యం నూరిపోయాలి. ఆత్మాభిమానాన్ని రగిలించాలి. లోటుపాట్లు ఎన్ని ఉన్నా సొంత సంస్కృతిపై మమకారాన్ని పెంచాలి. వివిధ మతాల ప్రజల మధ్య స్నేహవారధులు నిర్మించాలి. అందుకే గాంధీజీ ముందుగా ఈ పనికి ఉద్యుక్తులయ్యారు. ‘సత్యాగ్రహం’, ‘సహాయ నిరాకరణ’ లను అస్త్రాల్లా ప్రయోగించారు. తొలినాళ్లలో అవేమంత పెద్దగా ఆకట్టుకోలేదు. నాగరకత ఎంతగానో విస్తరిస్తున్న రోజుల్లో ఒక పెద్దాయన ముందుకొచ్చి ‘రాట్నం తిప్పటం’, ‘నూలు వడకటం’ వంటి పాతకాలం పద్ధతులను పైకి తెస్తుంటే ప్రజలు వింతగా చూశారు. కానీ సామ్రాజ్యశక్తిని ధిక్కరిస్తూ ఆయన సవాళ్లు విసురుతున్న తీరు, ఆయన మాటల్లోని అసమాన ధీరత్వం అందరినీ చిత్రంగా ఆకర్షించింది. పట్టణాలను దాటి.. మధ్యతరగతిని మించి.. గ్రామగ్రామాన్నీ ఆయన మేల్కొల్పుతున్న తీరు ప్రజలను కట్టిపడేసింది.  బ్రిటీషు వ్యాపారాన్ని దెబ్బకొట్టటం కన్నా ప్రజలు స్వయంశక్తిని గుర్తించేలా చేయటమే ఆయన లక్ష్యం. పల్లె నుంచి పట్టణం వరకూ అంతా అత్యంత సులభంగా ఆచరించగలిగిన ఈ విధానాలు ప్రజలను ఉవ్వెత్తున కదిలించాయి. యావద్దేశాన్నీ ఒక్క ఉద్యమ తాటి మీదకు తెచ్చాయి. తన ప్రణాళిక ఏదైనా సరే.. వీలైనంత మంది ప్రజలను దానిలో భాగస్వాములను చేయటమే ఆయన పద్ధతి! అదే జన నాయకుడిగా ఆయన విజయరహస్యం.
తన ప్రణాళిక ఏదైనా సరే.. వీలైనంత మంది ప్రజలను దానిలో భాగస్వాములను చేయటమే ఆయన పద్ధతి! అదే జన నాయకుడిగా ఆయన విజయరహస్యం.
సామాన్యుల్లో అతి సామాన్యుడిగా..
బ్రిటీషు అనుకరణతో నాయకుడంటే సూటుబూటు, డాబుదర్పం ఉండాలని అంతా నమ్ముతున్న రోజుల్లో గాంధీజీ తన జీవనశైలిని మార్చుకున్నారు. దక్షిణ భారత యాత్రలో తమిళనాట తాను చూసిన నిరుపేదల ఆహార్యం ఆయనను కదలించింది. వెంటనే పేదల్లో ఒక పేదగా కొల్లాయి కట్టుకు మారిపోయారు. తమ ఆత్మను, ఆకాంక్షలను ప్రతిబింబించే వ్యక్తినే ప్రజలు తమ నేతగా స్వీకరించి, అక్కునజేర్చుకుంటారనటానికి గాంధీ మహాత్ముడే తొలినిదర్శనం! ‘పేదల దగ్గరకు పేదల హృదయంతో వెళ్లు’ అన్న గాంధీజీ మాటలు ఆయన నాయకత్వ సారాన్ని పట్టిచూపుతాయి. అందుకే ఆయన పరిమిత ఆహారానికి మారారు. హరిజన వాడల్లోకి వెళ్లి పారిశుధ్యపనులు చేశారు. అంటరానివారుగా వందలాది సంవత్సరాలుగా వివక్షను ఎదుర్కొంటున్న కష్టజీవులను.. సాటిమనుషులుగా చూసే పరిస్థితులు తెచ్చేందుకు ఉద్యమం చేశారు. సమాజంలో నిరంతరం సంఘర్షించే వర్గాల మధ్య సంయమనంతో సయోధ్య తేవాలని ప్రయత్నించారు. అందుకే ఆయన నాయత్వంపై ప్రజల్లో విశ్వాసం బలపడింది. జనవాహిని కదిలింది.
ప్రవక్తల సరసన...
ఆగ్రహావేశాలూ, విద్వేషాగ్నులు మనిషిలోని వివేకం, వివేచనలను హరించేస్తాయి. అందుకే గాంధీజీ మనిషిలో మార్పు తేవాలని పరితపించారు. ఆ మనిషి శత్రువు కావచ్చు, మిత్రుడు కావొచ్చు. మన విధానం మాత్రం మారదు, మారకూడదు. ఆగ్రహావేశాలు ఆవశ్యకమైనవే అయినా అవి వివేచన, విజ్ఞతల అదుపాజ్ఞల్లోనే ఉండాలన్నారు. అందుకే అహింస, సత్యశోధనలకు గాంధేయ విలువల్లో అగ్రాసనం వేశారు! సంప్రదాయ, సనాతనవాదిగా కనిపించినా ఆధునిక దృక్పథం మీదే ఎక్కువ ఆధారపడ్డారు. టాల్‌స్టాయ్‌, థోరోల ఆలోచనలు ఆయనపై బలమైన ముద్రవేశాయి. వ్యక్తిగత క్రమశిక్షణకు టాల్‌స్టాయ్‌ ‘అహింస’ను ప్రతిపాదిస్తే గాంధీజీ దాన్నే మరింత విస్తరించి.. సామాజిక, రాజకీయ రంగాల్లో పెను విప్లవాలు తేవటానికి సమర్థంగా వినియోగించి.. భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రత్యక్షంగా నిరూపించి చూపించి.. ప్రపంచానికి రక్తపాత రహిత, అత్యాధునిక ఆయుధాన్ని అందించారు. వ్యాపార సంస్కృతిలో పడి కొట్టుకుపోతూ వస్తువ్యామోహాన్ని పెంచుకోవటమే నాగరకత అనుకోరాదని నొక్కి చెబుతూ.. నిరాడంబరతలోనే దైవత్వం ఉంటుందని ప్రతిపాదించారు. నవీన భావాలను కూడా సంప్రదాయ సూత్రాల్లా.. సార్వజనీన విలువల్లా.. తేనె గుళికల్లా చేసి చూపటం.. ఆయనను ప్రవక్తల సరసకు తీసుకువెళ్లింది! కోరుకుంటే స్వతంత్ర భారతంలో గాంధీకి దక్కని పదవి ఉండేది కాదు. కానీ త్యాగాన్ని నమ్మిన గాంధీజీ పదవులను ఎన్నడూ ఆశించలేదు. తాను ఆచరించని సూత్రాన్ని ఆయన ఎన్నడూ ఇతరులకు చెప్పలేదు. సామరస్యమే సర్వమత సారమని నమ్మిన గాంధీజీ.. దేశవిభజన సమయంలో మతకలహాలు రేగుతుంటే తట్టుకోలేకపోయారు. మతోన్మాదమే గాడ్సే రూపంలో ఆయనకు భౌతిక రూపం లేకుండా చేసి ఉండొచ్చుగానీ.. సత్యం, శాంతి, అహింస, కరుణ, ప్రేమ అంటూ ఆయన చేసిన క్రాంత దర్శనం.. విలువల వెలుగులు.. మానవాళిని నడిపించే మహోన్నత దీపాల్లా దేదీప్యమానంగానే ఉన్నాయి! చీకటిని నిందించటం ఆపి.. ఆ దిక్కు చూడటం ఇప్పటి మన అవసరం!!!


వైద్య విద్య చదువుదామనుకుని..
సముద్రయానానికి సంప్రదాయాలు అంగీకరించకున్నా, విదేశీ నివాసానికి తల్లి ససేమిరా అన్నా కూడా లండన్‌ మహానగరాన్ని చూడాలన్న మోజుతో ఓడ ఎక్కారు గాంధీ. ఆయన అసలు చదవాలనుకున్నది వైద్యం. కానీ పెద్దన్నయ్య ప్రోద్బలంతో మనసు మార్చుకుని బారిస్టరు చదువు మొదలెట్టారు. తీరా అక్కడి విస్తృత సమాజాన్ని చూసిన తర్వాత న్యాయశాస్త్రం, రాజకీయాల కంటే ఆయనను మతం, తాత్వికమైన ప్రశ్నలే ఎక్కువగా ముప్పిరిగొన్నాయి.
10నిమిషాలు ఆలస్యంగా...గాంధీజీ
గడియారం ఎంతో ప్రత్యేకం. ఆయన నిరంతరం దాన్ని అనుసరిస్తూనే ఉండేవారు. ఏ కార్యక్రమమైనా కచ్చితంగా వేళలు పాటించేవారు. తాను హత్యకు గురికావడానికి ముందు... 1948, జనవరి 30న ప్రార్థనా సమయానికి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. సమయానికి రాలేకపోయానే అంటూ ఎంతో బాధపడిపోయారు.
4 ఖండాలు.. 12 దేశాల్లో..
పౌర హక్కుల ఉద్యమాలకు, స్వాతంత్య్ర సంగ్రామాలకు గాంధీజీనే స్ఫూర్తి!


బరాక్‌ ఒబామా

‘‘పూర్వీకులు, ప్రస్తుతమున్న వారు వీరిలో ఎవరితోనైనా సరే నేను విందారగించాల్సి వస్తే.. అది గాంధీతోనే కావొచ్చు. ఎందుకంటే ఆయనే నా నిజమైన హీరో’’- 
2009లో అమెరికాలోని వేక్‌ఫీల్డ్‌ హైస్కూల్‌ విద్యార్థి అడిగిన ప్రశ్నకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చెప్పిన సమాధానం. ప్రస్తుతం జీవించిఉన్న లేదా పూర్వీకులెవరితోనైనా మీరు విందారగించాల్సి వస్తే ఎవరితో చేస్తారు? అని ఆ విద్యార్థి అడిగినపుడు ఒబామా పై విధంగా స్పందించారు.
ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌

గాంధీ ప్రారంభించిన అహింసాయుత ఆందోళనలు సరిహద్దు గాంధీగా పేరొందిన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌పై విపరీత ప్రభావం చూపాయి. అందుకే ఆయన సైతం గాంధీ బాటలో నడిచారు. వీరిద్దరూ మంచి మిత్రులు. బ్రిటిషర్లపై పోరాటంలో 1947 వరకూ ఒకరినొకరు కలిసి పనిచేశారు. 
యు థాంట్‌

‘‘కోపగించుకోవడం, ఇతరుల్ని కించపరచడం లాంటివి చేయొద్దని బుద్ధుడు తన శిష్యులకు చెప్పారు. అహింసాయుత పద్ధతుల్ని గాంధీజీ విశ్వసించారు. బలంతో సాధించేదాని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైన ఫలితాల్ని ఆయన సాధించారు’’- ఐక్యరాజ్యసమితి మూడో ప్రధాన కార్యదర్శి యు థాంట్‌ వ్యక్తంచేసిన అభిప్రాయమిది. బర్మాకు చెందిన యు థాంట్‌కు గాంధీజీ అంటే ఎనలేని గౌరవం. మహాత్ముడి సిద్ధాంతాలనేకం విశ్వవ్యాప్తంగా అనుసరణీయమైనవి, చిరకాలం నిలిచిపోయేవని ఆయన కొనియాడారు. 
రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

‘‘భారతదేశంలోని లక్షల మంది అనాథ]ల ఆశాదీపంగా మహాత్మాగాంధీ నిలిచారు. ఆయన రక్తమాంసాలు భారతీయుడి ఆత్మ అయి నిలిచాయి. సత్యం మరో సత్యాన్ని జాగృతం చేసింది’’- అనేక విషయాల్లో గాంధీతో తీవ్ర విభేదాలున్నప్పటికీ.. మహాత్ముడి గురించి విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వ్యక్తంచేసిన అభిప్రాయాలివి. 
ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌

‘‘భావితరాలకు గాంధీ ఓ రోల్‌మోడల్‌. మహాత్ముడి అభిప్రాయాలు సమకాలీన రాజకీయ నాయకుల్ని జాగృత పరుస్తాయని నమ్ముతున్నా’’- ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌ చేసిన వ్యాఖ్యలివి. గాంధీ, ఐన్‌స్టీన్‌లు ఒకరికొకరు ఆదర్శప్రాయులు. తరచూ ఉత్తరాలు రాసుకునే వారు. గాంధీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందని మహాత్ముడు మరణించినపుడు ఐన్‌స్టీన్‌ రాశారు.
కెన్నెత్‌ కౌండా

‘‘గాంధీజీకి మరణం లేదు. గాంధీజీ ఆలోచనలు, మాటలు, చర్యలు ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది స్వేచ్ఛను పొందేలా ప్రభావితం చేశాయి’’- జాంబియా మొదటి అధ్యక్షుడు కెన్నెత్‌ కౌండా చేసిన వ్యాఖ్య ఇది. ఆయన స్థాపించిన యునైటెడ్‌ నేషనల్‌ ఇండిపెండెన్స్‌ పార్టీ అహింసాయుత ఆందోళనల ద్వారా 1964లో మొట్టమొదటిసారిగా గద్దెనెక్కింది. తనతో పాటు జాంబియాకే చెందిన నోబెల్‌ బహుమతి గ్రహీత చీఫ్‌ లుథౌలీలు గాంధీని ఆరాధిస్తామని కెన్నెత్‌ కౌండా చెప్పారు. 
హోచిమిన్‌

‘‘నేను, నా అనుచరులం విప్లవయోధులమే కావొచ్చు. కానీ మేం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మహాత్మాగాంధీని ఆరాధించేవాళ్లం’’-  గాంధీ గురించి వియత్నాం కమ్యూనిస్టు నేత హోచిమిన్‌ చేసిన వ్యాఖ్యలు
జార్జి బెర్నార్డ్‌ షా

‘‘గాంధీపై అభిప్రాయం చెప్పమంటారా? హిమాలయాల గురించి అభిప్రాయం చెప్పండి అన్నట్లుంది’’- 
సుప్రసిద్ధ ఐరిష్‌ రచయిత, నోబెల్‌ బహుమతి గ్రహీత జార్జి బెర్నార్డ్‌ షా ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య.









No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...