‘దృష్టిప్రదాత’లకు 2018 భౌతికశాస్త్రంలో నోబెల్



లేజర్‌ రంగ దిగ్గజాలకు భౌతికశాస్త్రంలో పురస్కారం
ఆర్థర్‌ ఆష్కిన్‌, గెరార్డ్‌ మౌరూ, డోనా స్ట్రిక్‌ల్యాండ్‌లకు దక్కిన గౌరవం

             లేజర్‌ రంగంలో అద్భుత ఆవిష్కరణలు చేసిన ముగ్గురు విశిష్ఠ పరిశోధకులకు  భౌతికశాస్త్రంలో నోబెల్‌ 2018 పురస్కారం దక్కింది. వీరి పరిశోధనల ఫలితంగా దృష్టి లోపాలను సరిదిద్దే శస్త్రచికిత్సల కోసం అధునాతన సాధనాల రూపకల్పనకు వీలు కలిగింది. పారిశ్రామిక రంగంలోనూ పురోగతికి దోహదపడింది.
 

          అమెరికాకు చెందిన ఆర్థర్‌ ఆష్కిన్‌ (96), ఫ్రాన్స్‌ పరిశోధకుడు గెరార్డ్‌ మౌరూ (74), కెనడా శాస్త్రవేత్త డోనా స్ట్రిక్‌ల్యాండ్‌ (55) ఈ అవార్డులకు ఎంపికయ్యారు. నోబెల్‌ పురస్కారాల చరిత్రలో భౌతికశాస్త్ర విభాగం కింద అవార్డుకు ఎంపికైన మూడో మహిళగా డోనా ఘనత సాధించారు. అలాగే ఈ పురస్కారాన్ని పొందిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆర్థర్‌ ఆష్కిన్‌ నిలిచారు. ఇప్పటివరకూ లియోనిడ్‌ హుర్విజ్‌ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించారు. 2007లో ఆర్థిక శాస్త్రంలో పురస్కారాన్ని అందుకునేనాటికి లియోనిడ్‌ వయసు 90 ఏళ్లు.

           పురస్కారం కింద అందే రూ.7.35 కోట్లలో సగం సొమ్ము ఆర్థర్‌కు, మిగతా మొత్తాన్ని గెరార్డ్‌, డోనాలకు పంచుతున్నట్లు నోబెల్‌ ఎంపిక కమిటీ ‘రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ పేర్కొంది.
            లేజర్‌ పుంజ ‘వేళ్ల’తో రేణువులు, పరమాణువులు, వైరస్‌లు ఇతర సజీవ కణాలను ఒడిసిపట్టుకోగలిగే ఆప్టికల్‌ ట్వీజర్లను ఆవిష్కరించినందుకు ఆష్కిన్‌కు ఈ గౌరవం దక్కింది. కాంతిలోని రేడియో పీడనాన్ని ఉపయోగించుకొని వస్తువులను కదిలించడం దీని ప్రత్యేకత. ఇది సైన్స్‌ కాల్పనిక సాహిత్యంలో ఉండేదని, దీన్ని ఆచరణలోకి తీసుకురావాలన్నది ఎప్పటినుంచో ఉన్న కల అని నోబెల్‌ ఎంపిక కమిటీ పేర్కొంది. 1987లో ఆష్కిన్‌ ఈ ఆవిష్కారాన్ని చేశారు. నాడు ఆయన తన ట్వీజర్ల సాయంతో సజీవ బ్యాక్టీరియాను ఒడిసిపట్టారు. ఈ క్రమంలో ఆ జీవులకు ఎలాంటి హాని కలగకపోవడం విశేషం.
             మరోవైపు అత్యంత స్వల్పస్థాయి ఆప్టికల్‌ ప్రకంపనలను సృష్టించే ఒక విధానాన్ని అభివృద్ధి చేసినందుకు గెరార్డ్‌, మౌరూలను ఈ అవార్డు వరించింది. మానవులు సృష్టించిన వాటిలో అత్యంత స్వల్పస్థాయితో ఎక్కువ తీవ్రత కలిగిన లేజర్‌ ప్రకంపనలు ఇవే. ఈ విధానాన్ని కంటిచూపులో లోపాన్ని సరిదిద్దేందుకు ఉపయోగిస్తున్నారు. అసాధారణ కాంతి మౌలికవసతుల (ఈఎల్‌ఐ) ప్రాజెక్టు నిర్మాణంలోనూ మౌరు కృషి చేశారు. దీనిని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన లేజర్లలో ఒకటిగా చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇది అణు వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు, క్యాన్సర్‌ చికిత్సకు, అంతరిక్ష వ్యర్థాలను శుభ్రం చేయడానికి అక్కరకొస్తాయని భావిస్తున్నారు.
 
మహిళామణి
                మహిళలకు అరుదైన భౌతికశాస్త్ర నోబెల్‌ను దక్కించుకోవడం తనకు ఆనందంగా ఉందని డోనా చెప్పారు. మహిళా భౌతికశాస్త్రవేత్తల్లో తానూ ఒకరిగా ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆమెకు ముందు మేరీ క్యూరీ (1903), జియోపెర్ట్‌ మేయర్‌ (1963)లకు భౌతికశాస్త్రంలో పురస్కారాల దక్కాయి. క్యూరీకి (1911) రసాయన శాస్త్రంలోనూ నోబెల్‌ దక్కడం విశేషం. తద్వారా రెండుసార్లు ఈ విశిష్ఠ పురస్కారాన్ని సాధించిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఆమె భర్త, కుమార్తెలిద్దరికీ వివిధ విభాగాల్లో నోబెల్‌ పురస్కారాలు దక్కాయి. దీంతో క్యూరీ కుటుంబానికి ఐదు నోబెల్స్‌ లభించినట్లయింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...