ప్రకృతి సంతులనం
అదుపు తప్పింది. ప్రపంచ వాతావరణం వేడెక్కుతోంది. భూతాపం పెరిగింది. వర్షపాతం
తగ్గింది. స్వలాభం, స్వార్థం, సొంత అభివృద్ధి కోసం అమెరికా, పాశ్చాత్య దేశాలు చేపట్టిన
కార్యక్రమాలు ఈ వాతావరణ మార్పుకు కారణం. అయితే ఆ దేశాలు తమ బాధ్యతను అంగీకరించ
లేదు. అంతర్జాతీయ వేదికలలో ఆమోదించిన కర్తవ్యాల నుండి కూడా తప్పుకున్నాయి.
ఫలితంగా పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు కష్టనష్టాల బారిన పడుతున్నాయి. మన
దేశంలో కరువులు, వరదలు, పంట నష్టాలు, రైతుల ఇక్కట్లకు కారణమిదే.
"రైతులోకం" 2018 ఏప్రిల్ సంచికలో ప్రచురించబడింది.
'రైతు పథం' తెలంగాణ మాసపత్రిక మే, 2018 సంచికలో ప్రచురించబడింది.
వ్యవసాయంపై వాతావరణ ప్రభావం: మనుషులు, జంతువులు, వృక్షాలు మొదలగు ప్రాణులు మనుగడ సాగిస్తూ, జీవించే
పరిసరాలను, పరిస్థితులను పర్యావరణం అంటారు. ఒక భౌగోళిక ప్రాంతంలో మానవ
కార్యక్రమాల వలన సహజ ప్రకృతి,
పర్యావరణం ప్రభావితమవుతాయి. వాతావరణ విధ్వంసక
చర్యల వలన ప్రకృతి సమతుల్యత దెబ్బతిని, శీతోష్ణపరిస్థితులు తారుమారై
వాతావరణంలో నష్టదాయక మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు ప్రాణుల పుట్టుక, పెరుగుదల, మనుగడలపై విపరీత
తిరోగమన ప్రభావాలను కలిగిస్తాయి. ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తాయి. పైరులు, పంటలు కూడా ఈ
ప్రభావాలతో దెబ్బతింటాయి. భారత రైతులు ఎదుర్కొంటున్న ప్రమాదాలలో వాతావరణ మార్పు అతి
ప్రధానమైనది. తీవ్ర వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత,
వరదలు, తక్కువ వర్షపాతం
కనీసం 20 - 25 శాతం రైతుల ఆదాయాన్ని దెబ్బ
తీస్తున్నాయి. దేశ ఆర్థికరంగంలో వ్యవసాయం ప్రధానమైంది. దేశ ఉపాధిలో 50%, స్థూల జాతీయ
ఉత్పత్తిలో 18% వాటా వ్యవసాయరంగానిదే. 80% రైతులు 5 ఎకరాల లోపు భూమి గల చిన్న, సన్నకారు
రైతులే. వీరు ప్రధానంగా గోధుమ,
వరి, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు, అపరాలు, చెరుకు, నూనె గింజలు
పండిస్తారు. రైతులు అనేక విధాల నష్టపోతున్నారు. వరదలు, కరువులు, మార్కెట్ల
ఒడిదుడుకులు, గిట్టుబాటు కాని ధరలు,
మధ్యవర్తుల మోసం, దళారుల దోపిడీ, ప్రభుత్వాల
పట్టనితనం ఈ కష్టాలకు ప్రధాన కారణాలు. ప్రపంచ ఆకలిలో 25% భారత్ లోనే ఉంది. ఐదేళ్ళ
లోపు పిల్లలలో 38.4%, సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళలలో 51.4% పోషకాహార లోపంతో
బాధపడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు,
బలవన్మరణాలు భయంకరంగా కొనసాగుతూనే ఉన్నాయి. దేశ
జనాభాలో ఎక్కువగానున్న పేదలపై వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం
అత్యంత ప్రభావం చూపుతున్నాయి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతలు ఈ
నష్టాలను కొంతమేరకు అరికట్ట గలవు. అయితే ప్రభుత్వం వ్యవసాయ
పరిశోధనల నిధులలో కోతపెడుతోంది.
సగటు
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, వర్షపాతం తగ్గిపోతోందని వాతావరణ శాఖ నివేదికలు తెలుపుతున్నాయి. అధిక
ఉష్ణోగ్రతల కాల వ్యవధి పెరిగింది. శీతాకాలం తగ్గింది. సగటున ఉష్ణోగ్రత పెరుగుదల
వల్ల 4.7%, వర్షపాతం తగ్గడం వల్ల 12.8% వ్యవసాయ దిగుబడులు తగ్గుతాయి. సాగునీటి
సదుపాయం ఉన్న ప్రాంతాల కంటే సాగునీరు లేని ప్రాంతాలలో శీతోష్ణస్థితుల ఎగుడు దిగుళ్ళ ప్రభావం ఇంకా తీవ్రంగా ఉంటోంది. పెరిగిన ఉష్ణోగ్రతలతో 7.6%, తగ్గిన వర్హపాతంతో 14.7% ఉత్పత్తి తగ్గిపోతోంది. దిగుబడి
తగ్గిందంటే రైతుల ఆదాయం తగ్గినట్లే. వాతావరణం అధికంగా వేడెక్కినప్పుడు రైతుల ఆదాయం
4.3% తగ్గుతుంది. అధిక వర్షాలతో 13.7% తగ్గుతుంది. ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ సెల్సియస్ పెరిగితే 6.2% ఆదాయం తగ్గుతుంది. సంవత్సర సగటు
వర్షపాతంలో 100 మిల్లి మీటర్లు వర్షపాతం తగ్గితే 15% ఆదాయం తగ్గుతుంది. ఈ శతాబ్ది చివరికి
భారత్ లో ఉష్ణోగ్రతలు 3 నుండి 4 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయని అంచనా. అనగా రైతుల ఆదాయం 20 నుండి 25% తగ్గుతుంది.
సాగునీరు లేని పొలాలలో ఈ ఆదాయ నష్టం ఇంకా ఎక్కువ. ఈ ఆదాయ తగ్గుదలను తగ్గించడానికి
ప్రభుత్వాలు ఐదు ప్రధాన చర్యలు చేపట్టవచ్చు.
1. నీటి పొదుపు సేద్యం: భారత దేశంలో
భూగర్భజలాలు అంతరించి పోతున్నాయి. వర్షపాతం బాగా తగ్గిపోయింది. వ్యవసాయ భూమిలో
సాగునీటి వసతి గల భూమి 50% కంటే కూడా చాల తక్కువ. సాగు, తాగు నీటి కొరత
అపాయకరమైన స్థితికి చేరింది. ఈ పరిస్థితుల్లో తగిన సాగునీటి పద్దతులను పాటించడం
ప్రధాన అవసరం. కర్ణాటక, మహా రాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో సాగునీటి వసతులు చాలా తక్కువ. అందువలన వాతావరణ
మార్పులు ఈ రాష్ట్రాలలో తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. బిందు సేద్యం, నీటి జల్లు (వాటర్
స్ప్రింకిల్) పద్దతులు, నీటి పొదుపు, సమర్థ నీటి నిర్వహణ మొదలగు పద్దతులను అమలుచేయాలి. ఈ విధానాలను
ప్రభుత్వాలు ప్రాధాన్యతతో ప్రోత్సహించాలి.
2. పంట కోతల తర్వాతి నష్టాలు: ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులలో ఏడాదికి పంట
కోతల తర్వాతి నష్టం రూ. 92,651 కోట్లుగా అంచనా
వేయబడింది. ఈ పంట వ్యర్థాలు 2015 - 16 ఆర్థిక
సంవత్సరంలో రూ. 26,000 కోట్లు, 2016 - 17 లో రూ. 35,984 కోట్లు. 2015 లో దాదాపు 16% పండ్లు, కూరగాయాల నష్టం జరిగింది. వీటి విలువ రూ. 39,000 కోట్లు. పండ్లు, కూరగాయలు
తొందరగా కుళ్ళిపోతాయి, పాడవుతాయి. అయితే 2.2% పండ్లు, కూరగాయలు మాత్రమే దేశవాళీ వినియోగానికి
కేటాయించబడుతున్నాయి. 97.8% విదేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. వీటిలోనే ఎక్కువగా
చెడిపోతున్నాయి. దీనికి విరుద్ధంగా అమెరికా, చైనాలు
అత్యధికంగా పండ్లు, కూరగాయలను సంరక్షించుకుంటున్నాయి. ఇందులో
కూడా మన దేశంలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే
నష్టపోతున్నారు. వాళ్ళు తమ ఫలసాయాన్ని దేశంలో వివిధ ప్రాంతాలకు, లేదా విదేశీ ఎగుమతుల కోసం రవాణా చేసుకోలేరు.
వ్యక్తిగతంగా ఆ ఖర్చులు భరించలేరు. వారికి స్థానికంగా ఉత్పత్తులను మెరుగు
పరుచుకునే ప్రక్రియలు, నిలువ ఉంచుకొని భద్రపరుచుకునే సౌకర్యాలు
చాలా తక్కువ. రహదారులు సరిగ్గా లేనందువలన రవాణా సమయం, ఖర్చు పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు, శీతలీకరణ
సౌకర్యాలు కూడా తక్కువే. ఫలితంగా వారి పంటల ఉత్పత్తులు ఎక్కువగా పాడయి పోతాయి. వ్యర్థమవుతాయి. తమ ఉత్పత్తులు
అమ్మడానికి వీళ్ళు ఎక్కువగా దళారుల పై
ఆధారపడతారు. ఈ వ్యవస్థలో మోసాల వల్ల అనేక సందర్భాలలో రైతులు ఉత్పత్తి ఖర్చుల కంటే
తక్కువ ధరలకే తమ పంటలను అమ్ముకోవలసి వస్తోంది. కావున చిన్న రైతులను చిక్కులలో
పడేస్తున్న స్థానిక ఉత్పత్తి మెరుగుదల, విధానాల
కల్పన, నిలువ మౌలిక సౌకర్యాలు, శీతలీకరణ పద్దతులు, రవాణా సౌకర్యాలు
వంటి ఆధునికతల మీద దృష్టి కేంద్రీకరించవలసిన అవసరముంది. ఈ పనులు ప్రభుత్వాలే
చేయాలి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఈ సౌకర్యకల్పనను ఉంచితే మోసాలు, నష్టాలు పెరగడం తప్ప ప్రయోజనం ఉండదు. కాఫీ, ప్రత్తి, పసుపు వంటి వాణిజ్య పంటలతో సహా భారత దేశం 80% వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తుంది. ఈ
వ్యర్థాలను అరికడితే మనిషికి రూ. 50 ల చొప్పున 5 కోట్ల జనాభాకు
ఏడాది పాటు తిండి పెట్టవచ్చు.
3. గొలుసు సరఫరా నిర్వహణ: అందుబాటులోనున్న వ్యవసాయరంగ సమాచారాన్ని
నిరంతరాయంగా ఉపయోగించుకొని ఆహార ఉత్పత్తుల గొలుసు సరఫరాను కొనసాగించవచ్చు. నమోదు
పరికరాలు, భౌగోళిక సూచనా వ్యవస్థ, ఉపగ్రహ చిత్రాలు మొదలగు అత్యాధునిక సాంకేతిక పరికరాల, పద్దతుల
వినియోగంతో భారత వ్యవసాయ వ్యవస్థను బాగా సుస్థిరం చేయవచ్చు. వీటి వలన గొలుసు
సరఫరా వ్యవస్థలో వాతావరణ మార్పుల వివిధ దశలను గమనించి అధిగమించడానికి వీలు
కలుగుతుంది. పంటల ఉత్పత్తి,
నిలువ, వితరణ, రవాణాలలో
వ్యర్థాలను అరికట్టడానికి ఈ పద్దతులను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
4. రైతు సంక్షేమ పంటల బీమా: వాతావరణ మార్పులతో జరిగే పంట నష్టాల నుండి
రైతులను రక్షించాలి. ఈ అనిశ్చిత పంటల దిగుబడి నష్టాల నుండి రైతులను కాపాడటానికి
సమర్థవంతమైన పంటల బీమా పథకాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు అమలులోనున్న బీమా పథకాలు బీమా
సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టేవే గాని రైతులకు మేలు చేయవు. వీటి వలన రైతులకు ఏ
మాత్రం ఉపయోగం లేదు. వీటిని తక్కువ కంతులు, దీర్ఘకాల ప్రయోజనాలతో చిన్న, సన్నకారు రైతులకు ఉపయుక్తంగా మార్చాలి.
5. రైతు ప్రయోజన పరిశోధనలు: వ్యవసాయ పరిశోధనలు పంటల దిగుబడిని
పెంచేవిగా ఉండాలి. వాతావరణ మార్పులను, ఇతర సమస్యలను
పరిష్కరించే పద్దతులతో సుస్థిర వ్యవసాయానికి తోడ్పడాలి. వేడి, వరదలు, కరువు, తెగుళ్ళు, పురుగులు, పంటల రోగాలు మొదలగు రుగ్మతలను ఎదుర్కొనాలి, నివారించాలి. వాతావరణ మార్పుల ప్రభావానికి
సులభంగా లోనయ్యే అపరాలు,
చిరుధాన్యాలు, సోయాబీన్ వంటి పంటలను దృష్టిలో పెట్టుకొని, నష్టాల నివారణను సూచించే, పంటల
దిగుబడిని పెంచే పరిశోధనలు సాగాలి. నేటి పరిస్థితులలో, సమాజానికి సంప్రదాయ పంటల కంటే పోషకాహారాన్ని
అందించే వీటి అవసరం ఎక్కువ. ఇవి
తక్కువ నీటితో పండుతాయి. అధిక దిగుబడితో రైతు ఆదాయాన్ని పెంచుతాయి. తక్కువ ఖర్చుతో
ప్రజల ఆహారపు అవసరాలను తీర్చుతాయి. చిన్న రైతులను ఛిన్నాభిన్నమైన వ్యవసాయ అనుబంధ
చిరు పరిశ్రమలను అనుసంధానం చేస్తాయి. నీటి నిర్వహణా పద్దతులను మెరుగు పరుస్తాయి.
వ్యవసాయరంగ సామర్థ్యాన్ని పెంచుతాయి. వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రిస్తాయి.
కొసరు మాట: గొడ్డు చాకిరీ కి కొంత తెలివి తేటలు
జోడించాలి. గతంలో సేద్యమంతా సేంద్రీయమే. అమెరికా పాశ్చాత్య దేశాలు వ్యవసాయంలో
జొరబడ్డాయి. అందులో వ్యాపారం చేశాయి. రైతు బతుకుతో, జన జీవితాలతో ఆడుకున్నాయి. వ్యవసాయంలో
సేంద్రీయాన్ని రసాయనం ఆక్రమించింది. ఆ దేశాలు లాభాలు పొందాయి. మన రైతుల
కొంపముంచాయి. రసాయనాలను పక్కకునెట్టి పాత పద్దతుల్లో పంటలు పండించడమే సేంద్రీయ
వ్యవసాయం. మరొక్క మాట. ఒకే ప్రాంతంలో ఒకే రకమైన మేత మేస్తున్న, నీళ్ళు తాగుతున్న గోవుల, గేదెల పేడాపంచితాల్లో తేడాలుండవు. ఆవు మాట
మనోభావాలను రెచ్చగొట్టడానికే. గేదెల మలమూత్రాలతోనూ సేంద్రీయ సేద్యం చేయవచ్చు.
వ్యవసాయంలో కొంత వ్యాపారీకరణ ఉండాలి. వ్యవసాయోత్పత్తులను శుభ్రపరిచి, మెరుగుపరిచే అదనపు విలువల ప్రక్రియలు
చేపట్టాలి. భారీ స్థాయి పథకాలకు ప్రభుత్వ సాయం అవసరం. చిన్న తరహా శుద్ధి పనులు, మెరుగు కార్యక్రమాలు మనమే చేసుకోవచ్చు. మన చుట్టూ
ఉన్న శ్రమజీవులతో ఇంటిపట్టునే కూరగాయలను, పండ్లను, పంటలను, గింజలను శుద్ధి చేయించి, అదనపు విలువను జోడించి మార్కెట్లకు చేర్చవచ్చు.
లేదా సహకారపద్దతిలో చిన్న రైతులంతా కలిసి వంతులవారీగా రోజుకొకరు సంతలో, పట్టణ ప్రజలు గుమికూడే ప్రాంతాల్లో
అమ్ముకోవచ్చు. రైతుకూలీల, రైతుల ఆదాయాలను పెంచుకోవచ్చు.
(లండన్ లోని బ్రూనెల్ విశ్వవిద్యాలయ వరిష్ట
ఉపన్యాసకులు మనోజ్ దొర వ్యాసం ఆధారంగా)
"రైతులోకం" 2018 ఏప్రిల్ సంచికలో ప్రచురించబడింది.
'రైతు పథం' తెలంగాణ మాసపత్రిక మే, 2018 సంచికలో ప్రచురించబడింది.
No comments:
Post a Comment