లింగ అసమానత
పెరుగుతోంది. దీనికి లౌకికత్వ తిరోగమనం ప్రధాన కారణం. ఈ వివక్ష తగ్గడానికి
వందేండ్లు పడుతుందని విశ్వ విత్త వేదిక నివేదించింది. లింగ సమానత లౌకికత్వ
నిత్య శాశ్వత సూత్రం.
మతం, లౌకికత్వం: దేవుళ్ళను, మానవాతీత శక్తిని నమ్మడం, ఆరాధించడం మతం. ఇది ఇహానికి, భౌతికత్వానికీ కాక పరలోకానికి, ఊహాకల్పితాలకూ ప్రాధాన్యతనిస్తుంది. మతాలన్నీ మగాళ్ళు
సృష్టించిన చీకటి గుహలే. మత గ్రంథాలు పురుష పక్షపాత,
వనితావివక్షల మగాళ్ళ మాయమాటలే. మతంలోనే మనిషి
బానిసత్వముందని మాక్సిమ్ గోర్కీ అన్నారు. మతాధిపత్యంలో మగాళ్ళు మగువలను బానిసలను
చేసుకున్నారు. పడతులు బానిసల్లో బానిసలు. మతం అలౌకికం, అశాస్త్రీయం, అమానవీయం, (లింగ) అసమానతల పుట్టినిల్లు. రాజ్యం, మతం పరస్పరం జోక్యం లేకుండా స్పష్టమైన విభజనరేఖతో మెలగడమే లౌకికత్వం. మత విశ్వాసాలతో,
విశ్వాసరాహిత్యంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ
గౌరవమర్యాదలు, హక్కులు, సౌకర్యాలు
లభించాలి. అలౌకికత్వంలో రాజకీయాలు, మతం, జనజీవితాలు కలిసిపోతాయి. మతమౌఢ్య సమాజంలో మహిళాసమానత కలలోని మాట,
నీటి మూట. లౌకికత్వం మహిళా హక్కులకు భంగమన్న పాశ్చాత్య విద్యావేత్తల వాదన పసలేనిదని, మత
నియంతృత్వంలో మహిళా హక్కుల కోసం పోరాడుతున్న మహిళలకు అవమానమని రచయిత, లౌకికవాది మేగన్ మాన్సన్ అన్నారు.
వివిధ దేశాలలో అలౌకికత్వం: 1979 లో ఏర్పడ్డ ఇరాన్ ఇస్లామిక్
ప్రభుత్వం స్త్రీలు నకాబు (తలగుడ్డ),
బురఖాల దుస్తులు ధరించాలని కట్టడి చేసింది.
మహిళలు ప్రతిఘటించారు. ఆ ఏటి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో లక్ష మంది స్త్రీలు
సమ్మె చేశారు. అలౌకిక ఇరాన్ లో లంచగొండితనం, నిరుద్యోగం, పేదరికం, ధనిక పేద తేడాలు
పెరిగాయి. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు వీటికి వ్యతిరేకంగా 80 నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో వేల సంఖ్యలో నిరసన
తెలిపారు. 22 మంది నిరసనకారులు చనిపోయారు. 1,000 మందిని నిర్బంధించారు. 27.12.2017 న రాజధాని తెహ్రాన్ లో క్రిక్కిరిసిన వీధిలో ఒక మహిళ బురఖా తీసి
కర్రకు తగిలించి గాలిలో ఊపుతూ మహిళల హక్కులపై మాట్లాడడానికి వేదిక ఎక్కారు.
విధేయతా చట్టాలను ధిక్కరించిందని ఆమెను నిర్బంధించారు. వందల అరెస్టుల్లో ఇదీ ఒకటి. 2009 లోనూ 30 ప్రాణాలు పోయాయి. అయినా తమ హక్కులను కాలరాస్తున్న ఇస్లాం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్త్రీలు ప్రాణాలొడ్డి పోరాడుతున్నారు. పాశ్చాత్య సంస్కృతిని
ఆపాలని ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్లం నిషేధించారు. ఈజిప్ట్,
లెబనాన్, మొరాకో, పాలస్తీనా ముస్లిం దేశాల సర్వేలలో పురుషుల్లో
వనితావ్యతిరేకత ఎక్కువని, స్త్రీలు గృహహింసను సహిస్తున్నారని
తేలింది. 60% మగాళ్ళు మహిళల గౌరవ
హత్యలను సమర్థించారు. ఆడువారి వస్త్రధారణ, ప్రవర్తనలు
గౌరవాన్ని పెంచుతాయని 90% అభిప్రాయపడ్డారు.
ఈజిప్ట్ లో 70% మహిళలు గృహహింస, మానభంగ వ్యతిరేక చట్టాలుండాలన్నారు. 43% మగాళ్ళు కుమారుల బహుభార్యాత్వాన్ని సమర్థించారు. 9.5% మాత్రమే పెళ్ళైన మగళ్ళతో కుమార్తెల పెళ్ళికి అంగీకరించారు. యువకుల్లో 6.6%, యువతుల్లో 2.3% మతాంతర వివాహాలకు సుముఖులు. స్త్రీలు రాజకీయ పాత్ర పోషించవచ్చని 39%, వోటు వేయవచ్చని
93% మగాళ్ళు అభిప్రాయపడ్డారు. మానభంగం చేసినవాన్ని
మహిళ పెళ్ళాడాలని 60% మొరాకన్ మగాళ్ళన్నారు. కుటుంబ ఐక్యత కోసం ఆడువారు గృహహింస సహించాలని
62% పురుషులన్నారు. 38% మగాళ్ళు, స్త్రీలు తన్నులు తినాలన్నారు. ఆశ్చర్యకరంగా 20% మహిళలు దేహశుద్ధిని సమర్థించారు. గతంలో మొగుడు
ముఖం వాచేలా, వళ్ళు కమిలేలా కొట్టేవాడని ఇప్పుడు
బాదడం తగ్గిందని ఒక కైరో యువతి చెప్పారు. ఈ 4 దేశాల పురుషులు అసమానతలు, సంప్రదాయ ప్రవర్తనలకు మద్దతిచ్చారు. తక్కువ మంది మహిళా సమానత్వాన్ని
సమర్థించారు. ఇంగ్లండ్ ముస్లిం స్త్రీలు పెళ్ళితో హక్కులు కోల్పోతున్నారు. పాక్,
బంగ్లాదేశ్ అతివలు అలౌకికంతో హింసకు
గురవుతున్నారు.
యునైటెడ్
నేషన్స్ ఎజుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ లింగ సమానత తన ప్రాముఖ్యతల్లో
ఒకటని ప్రకటించింది. కానీ లింగ వివక్షను పోషించే మత క్షేత్రాలకు ప్రపంచ వారసత్వ
స్థాయినిచ్చి స్త్రీ ద్వేష ధోరణులను రక్షిస్తున్నది. మహిళా ప్రవేశాన్ని నిషేధించిన
గ్రీస్ లోని మౌంట్ ఆథోస్ మొనాస్టరి లో ఆడ జంతువులు, పక్షులు, కీటకాలూ నిషేధమే. జపాన్ లో మౌంట్ ఒమైన్
షుజెండొ మతాలయంలో స్త్రీలను నిషేధించారు. 2017 జులై లో ఒకినొషిమా కు ప్రపంచ వారసత్వ స్థాయిని ప్రసాదించారు.
స్త్రీల పన్నులతో ఈ ఆలయాలను సంరక్షించడం విడ్డూరం. ప్రపంచ రాజకీయ నాయకులలో
23 శాతమే స్త్రీలు. నేడు భారత్, టర్కీ, మధ్య ఐరోపా, రష్యా, అమెరికాలలో సంప్రదాయవాద, మత నమ్మకాల, జనాకర్షక ఉద్యమాలు లౌకికత్వాన్ని
తిరస్కరిస్తున్నాయి. ఫలితంగా ఈ దేశాలలో లింగ అసమానత హద్దులు దాటింది. ఆధునిక
పాశ్చాత్య దేశాలు లింగ అసమానతను పెంచాయి. ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియాలలో
మగవారి కంటే మహిళల జీతభత్యాలు తక్కువ. బ్రిటిష్ వైమానిక సంస్థ ఈజీ జెట్, ఆస్ట్రేలియా
ఆర్థిక సేవల సంస్థ వర్జిన్ మనీ లలో ఈ వ్యత్యాసాలు మరీ ఎక్కువ. ప్రపంచవ్యాపితంగా హింసకు వ్యతిరేకంగా మాట్లాడేవారి గొంతులు
నొక్కుతున్నారు. మహిళా హక్కుల ప్రచారకర్త అని బీసెంట్, జాతీయ లౌకిక సంఘ వ్యవస్థాపకుడు చార్లెస్ బ్రాడ్లాఫ్ లను 19 వ శతాబ్దం చివర జైల్లో కుక్కారు. మహిళలకు వోటు హక్కు, మత ప్రమేయం లేకుండా వారికి శిశుజన్మ నియంత్రణ అవకాశం, లైంగిక విద్య కావాలని పోరాడటం వీరి నేరాలు. నేటి భారత పాలకులు
హైందవాచార్యులు. ప్రజల తిండి, గుడ్డ, గూడు, గుడి, దేవుడు, మతం, పెండ్లి, చదువు, భాష, సంస్కృతి, జాతీయ జంతు గ్రంథాలు హిందుత్వమవ్వాలన్నారు. మంత్రులే
రాజ్యాంగం నుండి లౌకిక
పదాన్ని తొలగిస్తామన్నారు. లౌకికత్వాన్ని
గురించి మాట్లాడేవారు నీచ
సంతానమన్నారు. మనిషి కంటే ఆవు విలువ పెరిగింది.
హిందుత్వ శక్తులు ముస్లింలు, దళితులపై దాడులు చేస్తున్నాయి. కులాలతో రెచ్చగొట్టి ప్రజలను
హిందుత్వం వైపుకు నెడుతున్నాయి. ముస్లింల తరఫున మాట్లాడేవారు దేశద్రోహులు అంటున్నాయి.
లౌకికత్వంలో లింగసమానత: సమసమాజంలో
లౌకికత్వం, లౌకికంలో సమానత్వం అంతర్భాగాలు. లౌకిక దేశాలలో లింగ సమానత అధికం. ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, స్వీడెన్, న్యూజీలాండ్, జెర్మనీలు ఇందుకు తార్కాణం. విప్లవాలతో
ఉద్భవించిన ఫ్రాంస్, సోవియట్ యూనియన్, నిన్నటి తూర్పు ఐరోపా సామ్యవాద దేశాలు, నేటి క్యూబా లాంటి సమసమాజ దేశాలలో లౌకికత్వం లింగ సమానతకు బాటలు వేసింది. ఐస్లాండ్ మహిళలకు అత్యుత్తమ స్థానం. 19,
20 శతాబ్దాల ప్రపంచ ప్రగతిశీల మహిళలు తమ
ప్రగతికి, ఉన్నతికి లౌకికత్వమే కారణమన్నారు.
సామ్యవాద దేశాలలో ఇది రుజువైంది. రాజకీయాలలో మత ప్రమేయం మీద బ్రిటన్ లో
ఇటీవల అభిప్రాయం సేకరించారు. 62% మంది, మతాధికారులు రాజకీయాల్లో
కొనసాగరాదన్నారు, 8% కొనసాగాలన్నారు. 65% మంది, పాలక నిర్ణయాలలో మతభావనలు పనికిరావన్నారు. 14% మంది తద్భిన్నంగా జవాబిచ్చారు. బ్రిటన్ మతాతీత దేశాలలో ఒకటి.
సామాజిక మార్పు: సమాజ సృజనాత్మక నిర్మాణానికి, ప్రగతికి మూలమైన
అర్ధాంగం అధోగతి పాలైంది. సమసమాజం లౌకికత్వం, సమానత సాధ్యమా? లింగ సమానత్వం, ప్రతి పౌరునికి న్యాయం
లభించాలంటే పాలకులు మతాతీత నిర్ణయాలతో చట్టాలు చేయాలి. వనితలకు
విద్యావకాశం కల్పించాలి. విద్య పౌరజ్ఞానం, ప్రజాస్వామ్యం,
సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికత్వం,
మానవత్వాలను బోధించాలి. పుణ్యపాపాలను, స్వర్గనరకాలను, పూర్వపునర్జన్మలను ప్రస్తావించరాదు. మగాళ్ళు మనువులు కారాదు, మానవులు కావాలి.
ఇదే సామాజిక మార్పుకు ప్రణాళిక.
18.01.2018 నాటి 'నవ తెలంగాణ' లో ప్రచురించబడింది.
19.01.2018 నాటి 'విశాలాంధ్ర' లోనూ ప్రచురించబడింది.
No comments:
Post a Comment