ప్ర‌ధాన‌మంత్రి

             రాజ్యాంగంలోని పార్లమెంటరీ తరహా పద్ధతి ప్రకారం రాష్ట్రపతి నామమాత్ర కార్య నిర్వాహణాధికారిగా, ప్రధాని వాస్తవ కార్యనిర్వాహణాధికారిగా ఉంటారు. అనగా రాష్ట్రపతి రాజ్యాధినేతగా, ప్రధాని ప్రభుత్వాధినేతగా ఉంటారు.

 

ప్రధాన మంత్రి నియామకం

      ప్రధాని ఎంపిక, నియామకం గురించి రాజ్యాంగం ఎలాంటి ప్రక్రియనూ ప్రస్తావించలేదు. ప్రధాని రాష్ట్రపతిచే నియమింపబడతాడు అని 75వ ఆర్టిక‌ల్‌ పేర్కొంటుంది. దీని అర్థం రాష్ట్రపతి తన ఇష్టానుసారం ఎవరినైనా ప్రధాని నియమించవచ్చ‌ని కాదు. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలోని సాంప్రదాయాలను అనుసరించి రాష్ట్రపతి లోక్ సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానిగా నియమించాలి. 

        లోక్ సభలో ఏ పార్టీకీ మెజారిటీరాకుంటే రాష్ట్రపతి ప్రధాని ఎంపికలో, నియామకంలో తన వ్యక్తిగత విచక్షణను చూపవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా రాష్ట్రపతి లోక్ సభలో అతి పెద్ద మెజారిటీ పార్టీ నాయకుడిని లేదా సంకీర్ణ పార్టీల నాయకుడిని ప్రధాని నియమించి, అతన్ని నెల రోజుల్లో సభలో విశ్వాసాన్ని కోరుతాడు. 1979లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయినప్పుడు నీలం సంజీవరెడ్డి (ఆనాటి రాష్ట్రపతి) సంకీర్ణ పార్టీల నాయకుడైన చరణ్ సింగ్ ని ప్రధానిగా నియమించి నెల రోజులలో సభా విశ్వాసాన్ని పొందమని కోరారు. ఈ విధంగా తన విచక్షణాధికారాన్ని రాష్ట్రపతి తొలిసారి వినియోగించారు.

        అధికారంలో ఉన్న ప్రధాని మరణిస్తే తక్షణం ఆ పదవికి మ‌రో వ్య‌క్తి దొర‌క్క‌పోతే రాష్ట్రపతి ప్రధాని నియామకంలో స్వయంగా నిర్ణయం తీసుకున్న సందర్భం కూడా ఉంది. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ఆనాటి రాష్ట్రపతి జైల్ సింగ్.. రాజీవ్ గాంధీని ప్రధానిగా నియమిం చారు. ఈ సందర్భంలో ఆయన తాత్కాలిక ప్రధాన మంత్రిని నియమించే పాత‌ సాంప్రదాయాన్ని విస్మరించారు.త‌ర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ రాజీవ్ గాంధీని తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రధాని మరణాంతరం అధికార పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటే రాష్ట్రపతి అతడిని ప్రధానిగా నియమించాల్సి వ‌స్తుంది.

         1980లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక వ్యక్తి ప్రధాని నియామకానికి ముందే తన మెజారిటీని నిరూపించుకునే అవసరం లేదు. రాష్ట్రపతి మొదట అతనిని ప్రధానిగా నియమించవచ్చు. అతనికి గడువునిచ్చి లోక్ సభలో మెజారిటీని నిరూపించుకోమని కోరవచ్చును. ఉదాహరణకు చరణ్ సింగ్ (1979), వీపీ సింగ్ (1989), చంద్రశేఖర్ (1990), దేవగౌడ (1996), ఐకే గుజ్రాల్ (1997) మరియు తిరిగి ఏబీ వాజ్ పేయి (1998) ఈ విధంగానే నియమింపబడ్డారు.

           1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయం ప్రకారం పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తిని ప్రధానిగా నియమించవచ్చు. కాని 6 నెలల్లో పార్లమెంటులో ఏదైనా ఒక సభకు అతడు సభ్యుడు కావాలి. రాజ్యాంగపరంగా ప్రధాని పార్లమెంటులో ఏదైనా ఒక సభకు అతడు సభ్యుడు కావాలి. లేకుంటే పదవిని కోల్పోతాడు.

          రాజ్యాంగపరంగా ప్రధాని పార్లమెంటులో ఏ సభలోనైనా సభ్యుడు కావొచ్చు. ఇందిరాగాంధీ (1966), దేవగౌడ (1966), మన్మోహన్ సింగ్ (2004) వారి నియామక సమయంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. కాని బ్రిటన్‌లో ప్రధానమంత్రి పార్లమెంటులోని దిగువ సభ (House of Commans)లో తప్పక సభ్యుడై ఉండాలి.

 

ప్రమాణం, పదవీకాలం, జీతం

         పదవిలో ప్రవేశించటానికి ముందు ప్రధానమంత్రి, రాష్ట్రపతి సమక్షంలో పదవీ ప్రమాణం మరియు రహస్య గోపన ప్రమాణం (oath of office and oath of secrecy) చేస్తారు. పదవీ ప్రయాణంలో ప్రధాని తాను

  • భారత రాజ్యాంగం పట్ల యధార్ధమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉంటానని,
  • భారతదేశ సౌర్యభౌమత్యాన్ని, అఖండతను సమర్ధిస్తానని,
  • తన కర్తవ్యాలని శ్రద్ధాపూర్వకంగా , మనస్సాక్షి పూర్వకంగా నిర్వహిస్తానని, మరియు
  • భయం, పక్షపాతం, ద్వేషం, లేకుండా రాజ్యాంగానికి, శాసనానికి అనుగుణంగా ప్రజలందరికి న్యాయం చేకూర్చదునని ప్రతిజ్ఞ చేస్తారు.

        రహస్య గోపన ప్రమాణంలో ప్రధానమంత్రి తన దృష్టికి తేబడిన లేదా తనకు తెలియ వచ్చిన ఏ విషయమునైన కేంద్ర మంత్రిగా తన కర్తవ్యాలను ఆవశ్యక మయితే తప్ప ఎవిరికి ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ వెల్లడించను అని ప్రమాణం చేస్తారు.

          ప్రధానమంత్రి పదవీకాలం (term) నిర్ణయింపబడలేదు. అతడు రాష్ట్రపతి ఇష్టమున్నంత కాలం పదవిలో ఉంటాడు. అయితే రాష్ట్రపతి ప్రధానిని ఎప్పుడంటే అప్పుడు తొలగించలేడు. లోక్ సభలో ప్రధానికి మెజారిటీ ఉన్నంతకాలం రాష్ట్రపతి అతన్ని తొలగించలేదు. లోక్ సభలో విశ్వాసం కోల్పోతే ప్రధాని రాజీనామా చేయాలి. లేకుంటే రాష్ట్రపతి అతన్ని తొలగించవచ్చు.

           ప్రధాని జీతభత్యాలను పార్లమెంట్ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. పార్లమెంట్ సభ్యుడు పొందే జీతభత్యాలను ప్రధాని పొందుతాడు. దీనితో పాటు అతనికి సత్కార భత్యం (sumptuary allowance), ఉచిత నివాసం, ప్రయాణ భత్యం, వైద్య సౌకర్యాలు ఉంటాయి.

ప్రధానమంత్రి అధికారాలు మరియు విధులు

మంత్రి మండలితో సంబంధం

కేంద్రమంత్రి మండలి అధ్యక్షుడుగా ప్రధానమంత్రికి ఈ అధికారాలు ఉంటాయి.

  • రాష్ట్రపతి మంత్రులను నియమించడానికి ఆయన వ్యక్తులను సిఫార్సు చేస్తాడు. ప్రధాని సిపార్సు చేసిన వారినే రాష్ట్రపతి మంత్రులుగా నియమిస్తారు.
  • మంత్రిమండలి సభ్యులకు శాఖల కేటాయింపు, శాఖల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలను ఆయన ప్రభావితం చేస్తారు.
  • ఆయన ఏ మంత్రినైనా రాజీనామా చేయమని అడగవచ్చు. లేదా అభిప్రాయ భేదాలు ఏర్పడితే ఆ మంత్రిని తొలగించమని రాష్ట్రపతికి సలహా ఇవ్వవచ్చును.
  • మంత్రిమండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. మంత్రిమండలి నిర్ణయాలపై అతడి ప్రభావం ఉంటుంది.
  • మంత్రుల కార్యకలాపాలకి ఆయన మార్గదర్శాన్ని ఆదేశాన్ని, నియంత్రణని సమన్వయాన్ని అందిస్తారు.
  • తాను రాజీనామా ఇస్తే మొత్తం మంత్రిమండలి పడిపోతుంది.

              మంత్రిమండలికి ప్రధాని అధినేత కాబట్టి ప్రధాని రాజీనామా ఇచ్చినా లేక మరణించినా ఇతర మంత్రులు అధికార నిర్వ‌హణ చేయలేరు. పదవిలో ఉన్న ప్రధాని రాజీనామా లేదా మరణం ద్వారా ప్రస్తుత మంత్రి మండలి రద్దయినట్లే. తద్వారా శూన్యత ఏర్పడుతుంది. ఏ ఇతర మంత్రి రాజీనామా లేదా మరణం వలన ఖాళీ మాత్రమే ఏర్పడుతుంది. ప్రధాని తనకు ఇష్టముంటే ఆ ఖాళీని భర్తీ చేయవచ్చు. లేదంటే చేయకపోవచ్చు.

రాష్ట్రపతితో సంబంధం

  • రాష్ట్రపతికి, మంత్రి మండలికి ముఖ్యమైన సంధానకర్త, కేంద్ర మంత్రి మండలి కార్యకలాపాలని, నిర్ణయాలని రాష్ట్రపతికి తెలియజేయడం ప్రధాని బాధ్యత. ప్రధానికి క్రింది బాధ్యతలుంటాయి.
    • కేంద్ర వ్యవహారాలలో పరిపాలనకు సంబంధించిన మంత్రి మండలి తీర్మానాలను, శాసన నిర్మాణ, ప్రతిపాదనలను రాష్ట్రపతికి తెలపడం.
    • రాష్ట్రపతి తనంతటతాను కోరే కేంద్ర వ్యవహారాల పరిపాలనకు శాసన నిర్మాణ ప్రతిపాదనల సమాచారాలని ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి తెలియజేయడం.
    • ఏదైనా విషయాన్ని ఒక మంత్రి నిర్ణయించి, మంత్రి మండలి పరిశీలించక‌పోతే మంత్రి మండలి పరిశీలనకు సమర్పించమని రాష్ట్రపతి కోరితే ఆ విషయాన్ని మంత్రి మండలికి సమర్పించటం.
  • రాష్ట్రపతికి ప్రముఖ అధికారులను నియ మించమని సలహా ఇస్తారు. ఉదా: భారత అటార్నీ జనరల్, భారత కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు దాని సభ్యులు, ఎలక్షన్ కమీషనర్లు, ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ మరియు దాని సభ్యులు మొదలగు వారు.

పార్లమెంట్‌తో సంబంధం

ప్రధాని దిగువ సభ నాయకుడు. ఈ హెదాలో ఆయనకు ఈ అధికారాలు ఉంటాయి.

  • పార్లమెంట్‌ను సమావేశపరచడం, సమాపనం చేయటం వంటి పార్లమెంట్ వ్యవహారాల విషయంలో రాష్ట్రపతికి ప్రధాని సలహాలు ఇస్తారు.
  • లోక్ సభను రద్దు చేయమని రాష్ట్రపతికి ఆయ‌న‌ ఎప్పుడైనా సిఫార్సు చేయవచ్చు.
  • సభలో ప్రభుత్వ విధానాలను ప్రకటించవచ్చు.

ఇతర అధికారాలు, విధులు

  • జాతీయ ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ సమగ్రతా మండలి, అంతర్ రాష్ట్ర మండలి మరియు, జాతీయ జల వనరుల మండలికి ప్ర‌ధాని అధ్యక్షుడుగా ఉంటారు.
  • విదేశాంగ విధాన రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహిస్తారు.
  • ఆయన కేంద్ర ప్రభుత్వ ముఖ్య వాచక ప్రతినిధి.
  • అత్యవసర పరిస్థితులలో ఆపదలను తొలగించడానికి కృషి చేస్తారు.
  • జాతీయ నాయకుడుగా అనేక రాష్ట్రాలలోని ప్రజలను కలుసుకొని వారి సమస్యల గురించి విజ్ఞాపనలు అందుకుంటారు.
  • అధికార పార్టీ నాయకుడు.
  • సేవలను అందించటానికి రాజకీయ అధినేతగా వ్యవహరిస్తారు.

ఈ విధంగా దేశ వ్యవస్థలోని రాజకీయ పరిపాలన రంగాల్లో ప్రధాని ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తారు. బి.ఆర్.అంబేద్కర్ ఇలా అన్నారు.. మన రాజ్యాంగంలో ఎవ‌రినైనా అమెరికా అధ్య‌క్షుడితో పోల్చ‌వ‌లిసి వ‌స్తే అతడు ప్రధానే కానీ రాష్ట్రపతి కాడు అన్నారు.

రాష్ట్రపతితో బాంధవ్యము

ఈ క్రింది రాజ్యాంగ అంశాలు రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి గల బాంధవ్యాన్ని తెలియపరుస్తాయి.

  • 74వ ప్రకరణ – రాష్ట్రపతికి సహాయ పడటానికి, స‌లహా ఇవ్వడానికి ప్రధాని అధ్యక్షతన మంత్రి మండలి ఉండాలి. రాష్ట్రపతి దాని సలహాలని అనుసరించి విధులను నిర్వర్తించాలి. మంత్రిమండ‌లి సలహాలను పున:పరిశీలించాల‌ని రాష్ట్ర‌ప‌తి కోరవచ్చు. రాష్ట్రపతి సూచన మేరకు మంత్రిమండలి పున: పరిశీలించాక పంపిన స‌ల‌హాల‌ను రాష్ట్రపతి ఆమోదించి తీరాలి.
  • 75వ ప్రకరణ – (a). ప్రధానిని రాష్ట్రపతి నియ మిస్తారు. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ఇతర మంత్రులను నియమిస్తారు. రాష్ట్రపతికి ఇష్టమున్నంత కాలం మంత్రులు తమ పదవులను కలిగి ఉంటారు. కేంద్ర మంత్రి మండలి లోక్ సభకు సమిష్టి బాధ్యత వహించాలి.
  • 78వ ప్రకరణ – ప్రధాన మంత్రి కర్తవ్యాలు ఏమంటే
    • కేంద్రం వ్యవహారాల్లో పరిపాలనకు సంబంధించిన మంత్రి మండలి తీర్మానాలను, శాసన నిర్మాణ ప్రతిపాదనలను రాష్ట్రపతికి తెలపడం
    • రాష్ట్రపతి తనంతటతాను కోరే కేంద్ర వ్యవహారాల పరిపాలనకు, శాసన నిర్మాణ ప్రతిపాదనకు సంబంధించిన సమాచారాలని ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి తెల‌ప‌డం
    • ఏదైనా విషయాన్ని ఒక మంత్రి నిర్ణయించి మంత్రి మండలి పరిశీలించక‌పోతే మంత్రి మండలి పరి శీలనకు సమర్పించవలసిందిగా రాష్ట్రపతి కోరిన‌ప్పుడు ఆ విష‌యాన్నిమంత్రి మండలికి సమర్పించ‌డం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...