కరుణానిధి - తమిళుల్లో ఎందుకింత ఉద్వేగం? ఎక్కడిదీ అభిమానం?


ఈనాడు ప్ర‌త్యేక క‌థ‌నం


 

ద్రవిడ సూర్యుడు మేరునగధీరుడు
14 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి
1967లో మంత్రిగా..1969లో తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం
ఐదుసార్లు సీఎంగా బాధ్యతలు
పలు రికార్డులు నెలకొల్పిన కరుణ
అపర చాణక్యుడిగా ఖ్యాతి
ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా... వివాహ వేడుకలో పెళ్లికొడుకు వంటివాడు కరుణానిధి!
- ప్రముఖ కవి, కరుణానిధి సహచరుడు కన్నమదాసు ఒక సందర్భంలో కరుణానిధి గురించి చెప్పిన మాట ఇది. దీన్ని తమిళనాడు రాజకీయాలకు, ద్రవిడ ఉద్యమానికి అన్వయించుకుంటే కరుణానిధి గొప్పతనం తెలుస్తుంది. బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా కుల రహిత, అంటరానితనం లేని, హేతుబద్ధ సమాజం కోసం యాభై ఏళ్ల క్రితం తమిళనాడులో ఎలుగెత్తిన ప్రజా చైతన్యమే ద్రవిడ ఉద్యమం. దీన్ని ప్రారంభించింది జస్టిస్‌ పార్టీ, ద్రవిడార్‌ కజగమ్‌ నేతలైన టీఎం నాయర్‌, త్యాగరాయ చెట్టి, పెరియార్‌ రామస్వామి అయితే విస్తృతంగా  ప్రజల్లోకి తీసుకువెళ్లిన ఘనత కరుణానిధికి దక్కుతుంది.    ద్రవిడ ఉద్యమానికి తొమ్మిది పదుల వయస్సులోనూ నిలువెత్తు నిదర్శనంగా నిలిచారాయన.
కరుణానిధికి పెద్దగా చదువు లేదు. కానీ ఆయనలో అద్భుతమైన రచయిత ఉన్నాడు. మాటల్లో దృశ్యాన్ని ఆవిష్కరించగలరు. ఆ కళే చిత్రపరిశ్రమకు దగ్గర చేసింది. అద్భుతమైన  స్క్రీన్‌ప్లే రచయితగా పేరు తెచ్చుకున్నారు. తన హేతువాద భావాలను బలంగా పలికించటం ద్వారా ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చారు. రాజకీయాల పట్ల చిన్నతనం నుంచి ఆయనకు ఆసక్తి ఉండేది.
జస్టిస్‌ పార్టీ నుంచి ద్రవిడార్‌ కజగమ్‌ వరకూ...
జస్టిస్‌ పార్టీని 1917లో టీఎం నాయర్‌, పి. త్యాగరాయ చెట్టి ప్రారంభించారు. బ్రాహ్మణ వాదానికి  వ్యతిరేకంగా, సమాజంలో అందరూ సమానమే అనే భావన దీనికి పునాది. 1937లో పెరియార్‌ రామస్వామి జస్టిస్‌ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రవిడ ఉద్యమం జోరందుకుంది. ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించటానికి పెరియార్‌ రామస్వామి, ద్రవిడార్‌ కజగమ్‌ను ఏర్పాటు చేశారు. దళితులకు దేవాలయాల్లో ప్రవేశం కల్పించటం, పురోహితులు సంస్కృతంలో కాకుండా, తమిళంలో శ్లోకాలు చదవటం, హిందీ వ్యతిరేక ఉద్యమం... తదితర కార్యక్రమాలు తమిళనాడును ఉర్రూతలూగించాయి. కానీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన పెరియార్‌కు లేదు. ఆయన అనుచరులు కొందరు ఎన్నికల్లో పోటీచేసినా, రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించాలని ఒత్తిడి చేసినా పెరియార్‌ ఒప్పుకోలేదు. దానివల్ల ద్రవిడ ఉద్యమం బలహీనపడుతుందని ఆందోళన చెందారు. కానీ ఆయన అనుచరులు విడిపోయి 1949లో సిఎన్‌ అన్నాదురై సారధ్యంలో ద్రవిడ మున్నేట్ర కజగమ్‌ (డీఎంకే)ను స్థాపించారు. తమిళనాడు రాజకీయాల్లో  కీలకమైన అధ్యాయానికి అదే శ్రీకారం.
బాల్యంలోనే బావుటా
14 ఏళ్లు
కరుణానిధి పాఠశాల స్థాయినుంచే నాటకం, కవిత్వంపై ఆసక్తి చూపించారు. అప్పట్లో జస్టిస్‌ పార్టీనేత అళగిరిస్వామి నుంచి స్ఫూర్తి పొంది 14 ఏళ్ల వయస్సులోనే ఆ పార్టీలో చేరి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1937లో ప్రభుత్వ పాఠశాలల్లో హిందీని అప్పటి రాజాజీ ప్రభుత్వం తప్పనిసరి చేయగా, దానిని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షమైన జస్టిస్‌ పార్టీ ఉద్యమించింది. బాల్యంలోనే పాఠశాల మిత్రులతో కలిసి ‘ఇళైజ్ఞర్‌ మరుమలర్చి అమైప్పు’ అనే ఉద్యమాన్ని కరుణానిధి ప్రారంభించారు. హిందీ వ్యతిరేక ర్యాలీలోనూ పాల్గొన్నారు. విద్యార్థులను సంఘటితపరిచేందుకు పిన్న వయసులోనే ‘మాణవ నేసన్‌’ అనే చేతిరాత కరపత్రికను నడిపించారు. ఇదే తమిళనాడులో పురుడుపోసుకున్న తొలి విద్యార్థుల ఉద్యమం. కరుణానిధి, ఆయన మిత్రులు పూరిగుడిసెలకు సైతం వెళ్లి సామాజిక చైతన్యానికి కృషి చేశారు. 17 ఏళ్లు
17 ఏళ్లకు కరుణానిధి తమిళనాడు విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉత్తర భారతం నుంచి వచ్చిన వ్యాపారులు కల్లగుడిలో దాల్మియా సిమెంట్‌ ఏర్పాటుచేసి ఆ ప్రాంతాన్ని దాల్మియాపురంగా మార్చారు. దీని పేరును కల్లకూడిగా మార్చాలంటూ కరుణానిధి నేతృత్వంలో తొలి పోరాటం సాగింది. ఇందులో ఇద్దరు పోలీసులు మృతిచెందడంతో కరుణానిధి అరెస్టయ్యారు.
కరుణ శకం 33 ఏళ్లు
కరుణానిధికి 33 ఏళ్ల వయస్సులో డీఎంకే పార్టీ నుంచి 1957లో కుళితలైను శాసనసభ్యుడిగా తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ విజయం సాధించి ఓటమి ఎరుగుని నేతగా రికార్డు సృష్టించారు. 1961 నాటికి డీఎంకే కోశాధికారిగా, ఆ తర్వాత శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎదిగారు. 1967లో డీఎంకే అధికారంలోకి రాగా, కరుణానిధి ప్రజాపనుల శాఖ మంత్రి అయ్యారు. అన్నాదొరై 1969లో చనిపోవటంతో కరుణానిధికి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం దక్కింది. తమిళ భాషకు అగ్రప్రాధాన్యం, పేదలకు సబ్సిడీపై బియ్యం పంపిణీ... వంటి విప్లవాత్మకమైన పధకాలకు శ్రీకారం చుట్టటం ఆయన హయాంలో జరిగాయి. 1971లో డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించింది. కరుణానిధి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కొద్ది కాలానికే కరుణానిధితో ఏర్పడిన విభేదాలు కారణంగా డీఎంకే నుంచి ఎంజీఆర్‌ బయటకు వచ్చేసి 1972లో అన్నాడీఎంకేను ప్రారంభించారు. తమిళరాజకీయాల్లో ఇది మరో అధ్యాయానికి ఆరంభం అయ్యింది. నిజానికి తొలినాళ్లలో కరుణానిధి, ఎంజీఆర్‌ల స్నేహం, ఆతర్వాత  తలెత్తిన రాజకీయ వైరుధ్యం.. రెండూ తమిళ రాజకీయాలను కీలక మలుపులు తిప్పినవే!
భిన్న ధ్రువాలు.. ఎంజీఆర్‌, కరుణ
కరుణానిధి, ఎంజీఆర్‌లు విభిన్న ధ్రువాలుగా..రాజకీయ తెరపై ప్రత్యర్థులుగా అందరూ భావిస్తారు. నిజానికి వారిద్దరూ ఒకే పార్టీలో కలిసి నడిచిన వ్యక్తులే. మొదట కాంగ్రెస్‌లో చేరిన ఎంజీఆర్‌ తర్వాత అన్నాదురై ప్రసంగాలకు ఆకర్షితుడై డీఎంకేలో చేరారు. పార్టీ నిధుల కోసం ఎంజీఆర్‌ తన నాటక కంపెనీ తరఫున నాటకాలు ప్రదర్శించారు. అప్పుడే ఎంజీఆర్‌, కరుణానిధి మధ్య స్నేహం బలపడింది. అన్నాదురైకు వీరిద్దరు కుడి, ఎడమ భుజాలుగా ఉండేవారు. అందుకే ఇద్దరూ వేదికపై ఉండగా ‘వీరిద్దరూ నా తమ్ముళ్లు’ అంటూ తరచూ అన్నాదురై చెప్పేవారు. 1969లో అన్నాదురై మరణానంతరం కరుణానిధి డీఎంకే అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడంలోనూ ఎంజీఆర్‌ కీలక పాత్ర పోషించారు. తర్వాత కొద్ది కాలానికే వారిమధ్య విభేదాలు తలెత్తాయి. 1971 ఎన్నికల్లో కోశాధికారిగా ఉన్న తనకు తెలియకుండా అభ్యర్థులకు అధిష్ఠానం డబ్బులు పంపిణీ చేశారన్న కారణంతో ఎంజీఆర్‌ మనస్తాపానికి గురయ్యారు. ఆ పరిణామం తర్వాత ఇద్దరి మధ్య దూరం పెంచింది. 1972 అక్టోబరు 8న తిరుకళుకుండ్రం, ట్రిప్లికేన్‌లో జరిగిన డీఎంకే బహిరంగ సభల్లో ఎంజీఆర్‌ మాట్లాడుతూ...‘డీఎంకే అధ్యక్షుడి నుంచి కార్యదర్శుల వరకు తమతమ వ్యక్తిగత ఆస్తుల వివరాలు వెల్లడించాలంటూ’ పిలుపునిచ్చారు. ఇది జరిగిన రెండో రోజే ఎలాంటి వివరణ కోరకుండానే ఎంజీఆర్‌ను పార్టీ నుంచి కరుణానిధి తొలగించారు. తర్వాత ఎంజీఆర్‌ అన్నాడీఎంకేను స్థాపించారు. రెండు పార్టీల మధ్య రాజకీయ పోరు కొనసాగుతూ వస్తోంది. ఎంజీఆర్‌ సినీ ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం కరుణానిధి తన తనయుడు ముత్తును సినీ హీరో చేశారనే ప్రచారమూ ఉంది. కాంగ్రెస్‌ను ఎదుర్కొన్న ఒకే ఒక్కడు!
డీఎంకే తొలిసారిగా 1957లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పుడు పోటీ చేసేందుకు తన సొంత జిల్లా తంజావూరులో కరుణానిధికి నియోజకవర్గం లభించలేదు. చివరికి కుళితలైను కేటాయించారు. అప్పట్లో ఆ నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో మాత్రమే డీఎంకేకు శాఖలు ఉండేవి. కరుణానిధి రోజూ తెల్లవారుజామున 5.30 నుంచి రాత్రి ఒంటి గంట వరకు పనిచేస్తూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. పార్టీ కిందిస్థాయి వ్యవస్థను ఎలా నిర్మించాలనే అవగాహన తనకు అప్పుడు లభించినట్లు ఆయన చెప్పుకునే వారు. ఆ ఎన్నికల్లో కరుణానిధి సహా డీఎంకే తరఫున 13 మంది మాత్రమే గెలిచారు. 1962 ఎన్నికల్లో డీఎంకే 143 స్థానాల్లో పోటీచేయగా..వారందరినీ ఓడించడానికి కాంగ్రెస్‌ నేత కామరాజర్‌ వ్యూహరచన చేశారు. ఆ వ్యూహం నుంచి కరుణానిధి మాత్రమే తప్పించుకుని ఎన్నికల్లో గెలిచారు.
సడలని ధైర్యం ఆయన సొంతం
కరుణానిధి విజయాల వెనుక రాజకీయ చతురతతోపాటు మొక్కవోని ధైర్యం కూడా ఉంది. ఎమర్జెన్సీ కాలంలో స్టాలిన్‌, మురసొలి మారన్‌లను జైలులో పెట్టినా తన పోరాటాన్ని మాత్రం కరుణానిధి ఆపలేదు. అప్పట్లో ఆయన్ను  పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరిచే ఉత్కంఠ పరిస్థితుల్లో ఓ విలేకరి ‘ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే రాయండి’ అంటూ ఓ కాగితం ముక్కను ఆయనకు ఇవ్వగా..‘అన్యాయం పతనమవుతోంది... ధర్మం జయిస్తుంది’ అంటూ రాశారు. వీధి పక్కనే నివసించిన అరుదైన నేతల్లో కరుణానిధి ఒకరు. అలాంటి ఇళ్లలో ఉండటం ప్రముఖులకు సురక్షితం కాదని పలువురు చెప్పినప్పటికీ వాటిని ఆయన ఖాతరు చేయలేదు.
ఆదివారమూ.. పనివారమే
కరుణానిధి అధికారంలో ఉంటే ఆదివారం కూడా సచివాలయానికి వెళ్లే వారు. అందుకే పలువురు ఉన్నతాధికారులూ ఆదివారం సచివాలయానికి చేరుకునేవారు. 1999లో పుళల్‌ జలాశయం గట్టు తెగే పరిస్థితి ఉన్నట్టు అప్పటి సీఎం కరుణానిధికి సమాచారం అందింది. వెంటనే ఉన్నతాధికారులను సచివాలయానికి రమ్మని కబురు పెట్టి ఆయనా బయలుదేరారు. దీని గురించి అప్పట్లో  ఓ ఆంగ్ల దినపత్రిక ‘వేకువజామున కరుణానిధి సచివాలయానికి వెళ్లగా లిఫ్ట్‌ ఆపరేటరు లేడు.లిఫ్టూ కింది అంతస్తులో లేదు. వెంటనే ముఖ్యమంత్రి మెట్ల దారిన తన ఛాంబర్‌కు వెళ్లారు. తొందరలో ముఖ్యమంత్రి కాళ్లు రెండేసి మెట్లను దాటాయి’ అంటూ వార్త ప్రచురించింది. ఇది ఆయన పని సంస్కృతికి.. నిబద్ధతకు నిదర్శనమే.
వ్యూహ ప్రతివ్యూహ చతురుడు
దేశ స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనను దగ్గరి నుంచి చూసిన నేతగా కరుణానిధి జాతీయ ఖ్యాతి గడించారు. కాంగ్రెస్‌తో జతకట్టినా, భాజపాతో కలిసి నడిచినా పరిస్థితులకు అనుగుణంగా మంచి నిర్ణయమే తీసుకున్నారన్న అభిప్రాయాన్ని అటు ప్రజల్లో.. ఇటు కార్యకర్తల్లో కలిగించేవారు. అత్యవసర పరిస్థితుల్లో తొలుత కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండి తర్వాత అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా గళమెత్తి ప్రజలను మెప్పించారు. అత్యయిక స్థితి.. అత్యంత నాటకీయత
1967 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చింది. రెండేళ్లకే అన్నాదురై మరణించడంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేసే డీఎంకే వైఖరిని మార్చుకుంది. ‘బంధానికి చేయి అందిద్దాం, హక్కు కోసం నినదిద్దాం’ అంటూ పంథా మార్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సత్సంబంధాల గురించి అధ్యయనం చేసేందుకు రాజమన్నార్‌ కమిటీని కరుణానిధి నియమించారు. కాంగ్రెస్‌లో చీలికలు వచ్చి ఇందిర ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినప్పుడు ఆ ప్రభుత్వానికి బయటి నుంచి  మద్దతిచ్చారు. 1971 ఎన్నికల్లో డీఎంకే, ఇందిరా కాంగ్రెస్‌ కూటమి గెలిచింది. అప్పట్లో డీఎంకే 183 స్థానాల్లో విజయం సాధించింది. కానీ రాష్ట్ర స్వయంప్రతిపత్తి గురించి కరుణానిధి గళం విప్పడం.. ఇందిరాగాంధీతో స్నేహానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఎమర్జెన్సీతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డీఎంకే ప్రభుత్వం తీర్మానం ఆమోదించింది. అటు తర్వాత 356వ ఆర్టికల్‌ కింద కరుణానిధి ప్రభుత్వం రద్దయింది. దాంతో పాటు కరుణానిధి సహా పలువురిపై సర్కారియా నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించింది. అలా ఎమర్జెన్సీ సమయంలో డీఎంకే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాతి ఎన్నికల్లో డీఎంకేకు వరుస పరాజయాలు ఎదురై ఎంజీఆర్‌ నాయకత్వంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. ఎంజీఆర్‌ మరణించే వరకు సీఎం పీఠం కరుణానిధికి కలగానే మిగిలింది. అయినా కరుణ బలమైన ప్రతిపక్ష నేత పాత్రను పోషించారు.
మళ్లీ ఇందిరకు.. స్నేహ హస్తం
ఎంజీఆర్‌పై పైచేయి సాధించడం కోసం అప్పట్లో కరుణానిధి అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ చేదు అనుభవాలు సైతం దిగమింగి 1980 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీతో కలిసి ఎన్నికల కూటమి ఏర్పాటు చేశారు. ‘నెహ్రూ కుమార్తెకు స్వాగతం, సుస్థిర పాలన అందించాలి’ అనే నినాదాన్ని వినిపించారు. ఆ ఎన్నికల్లో ఆ కూటమి ఘన విజయం సాధించడంతో.. ఎంజీఆర్‌పై కరుణానిధి చేపైయి సాధించారు. తర్వాతే సర్కారియా కమిషన్‌ నివేదిక ఆధారంగా కరుణానిధిపై పెట్టిన కేసులను కేంద్రం వెనక్కు తీసుకుంది. అనంతర శాసనసభ ఎన్నికల్లో కరుణ - ఇందిరల కూటమి పరాజయం పొందింది. భాజపా, కాంగ్రెస్‌ మధ్య దోబూచులాట
1999లో భాజపాతో కరుణానిధి ఎన్నికల కూటమి ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. ఎన్నికల పరంగా ఆ ప్రయత్నం ఫలించినప్పటికీ సెక్యులర్‌ పార్టీగా పేరున్న డీఎంకే విమర్శలను ఎదుర్కొంది. ఐదేళ్లు భాజపాతో కలిసి ప్రయాణించిన డీఎంకే.. అటు తర్వాత కాంగ్రెస్‌ వైపు చేరి యూపీఏలో భాగస్వామిగా మారింది. 2006 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమి గెలిచి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. మెజారిటీ లేకపోయినా కాంగ్రెస్‌, పీఎంకే, వామపక్షాల మద్దతుతో ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపారు. శ్రీలంకలో ఈళం తమిళుల ఊచకోతకు కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కారణమనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆ కూటమి నుంచి డీఎంకే బయటకు వచ్చేసింది.
-ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే- చెన్నై

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...