దశాబ్దాలుగా నిష్క్రియాపరత్వం
పాక్‌తో అంతర్దేశీయ నదీజలాల వినియోగం
ఇటీవల ఉగ్రవాద దాడి జరిగిన తరవాత మన భూభాగం నుంచి పాకిస్థాన్‌కు నీళ్లు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ప్రకటించారు. ఇలా ప్రకటించడం కొత్తేమీ కాదు. 2016లో జమ్మూకశ్మీర్ ఉరి వద్ద ఉగ్రదాడిలో సైనికులు మరణించిన వెంటనే మన భూభాగం నుంచి పాకిస్థాన్‌కు నదుల ద్వారా పారే నీటిని పూర్తిగా వినియోగించుకోవడంపై చర్చ జరిగింది. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పడానికి ఈ చర్య అవసరమని కేంద్రంలో కీలక మంత్రులుగా ఉన్నవారు ప్రకటనలు చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించవంటూ ఆ సమయంలో ప్రధాని మోదీ సైతం స్పందించారు. అందుకు అనుగుణంగా అడుగు ముందుకుపడటం లేదు. ఒప్పందం ప్రకారం మన హక్కుగా ఉన్న జలాలను వినియోగించుకునేందుకు ప్రాజెక్టులకు చేపట్టడం గురించి కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రకటనలు చేయడం, కమిటీలతో కాలయాపన చేయడం రివాజుగా మారింది.
.
.
- ఒప్పందం ప్రకారం భారత్ వినియోగించుకోవాల్సిన నీటికి ఏ దేశం నుంచీ అడ్డంకులు లేవు. ఈ ప్రాజెక్టులను నిర్మించాల్సింది, హక్కుగా ఉన్న మన వాటాను వాడుకునేలా చూడాల్సింది మన ప్రభుత్వమే.
- ఆరేడు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే మన వాటా జలాలను ఒడిసిపట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలు సైతం సూచించాయి. నివేదికలు నిష్ప్రయోజనం అవుతుండగా, కార్యాచరణ ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉందన్న సామెతను తలపిస్తోంది. నిజానికి ఎన్నడో చేపట్టిన ప్రాజెక్టులూ దశాబ్దాలుగా నత్తనడకను తలపిస్తున్నాయి.
- 2016లో జమ్మూకశ్మీర్‌లోని ఉరిలో ఉగ్రవాద దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం, పాకిస్థాన్ భూభాగంలోకి తరలిపోతున్న మన జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ఏం చేయాలన్నదానిపై అధ్యయనం చేయించింది.
- పంజాబ్-కశ్మీర్ సరిహద్దులో కతువా జిల్లాలోని ఉజ్ వద్ద డ్యాం నిర్మిస్తే పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోవచ్చని జలవనరుల మంత్రిత్వశాఖ స్పష్టీకరించింది. దీనివల్ల కశ్మీర్‌లో 31,380 హెక్టార్ల మేర ఆయకట్టుకు నీరు అందడంతోపాటు 186 మెగావాట్ల విద్యుదుత్పత్తికీ అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం సాంకేతిక అనుమతి సైతం లభించింది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సుమారు నాలుగు వేల హెక్టార్ల సాగుభూమి ముంపు బారిన పడుతుంది. ఎనిమిది వేల మంది నిర్వాసితులవుతారు. దీనిపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పునఃపరిశీలన అవసరమైంది.
- ఈసారి 110 మీటర్ల డ్యాం ఎత్తును 100 మీటర్లకు తగ్గించడంతో నిర్వాసితుల సంఖ్య మూడు వేలకు దిగివచ్చింది. రూ.5,800 కోట్లు వ్యయమయ్యే ఈ పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటివరకు టెండర్లూ ఖరారు కాలేదు. పరిస్థితులు ఇలాగే మందకొడిగా సాగుతుంటే ప్రాజెక్టు చేపట్టి పూర్తి చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు.
- ఇంతటి ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు కోసం ఆరేడు వేలకోట్ల రూపాయలు ఖర్చుచేసి మూడు నాలుగేళ్లలో పూర్తి చేయడం కేంద్ర ప్రభుత్వానికి అసలు సమస్యే కాదు. కావలసింది చిత్తశుద్ధి. అదే కొరవడుతోంది.
- దాడులు జరిగిన ప్రతిసారీ నీటిని ఆపేస్తామంటూ వట్టి ప్రకటనలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
- ఒప్పందం ప్రకారం ఈ నీటిపై పాకిస్థాన్‌కు ఎలాంటి హక్కు లేదు. హక్కు ఉండీ దశాబ్దాలుగా ఆ జలాలను వాడుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. ఈ పరిస్థితులను అధిగమించడానికి స్పష్టమైన కార్యాచరణ వ్యూహంతో కేంద్రమే ముందడుగు వేయాలి.పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోవడానికి ఏం చేయాలన్నదానిపై కమిటీలు ఏర్పాటు చేసి కాలయాపన చేయడం తప్ప- వాటి సిఫార్సులు కార్యరూపం దాల్చడం లేదు. కమిటీల మీద కమిటీలు వేసి నివేదికలు రాబట్టడం, మళ్ళీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే నీటి గురించి మాట్లాడటం కేంద్ర సర్కారుకు అలవాటుగా మారింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా సాగుతున్న తంతు ఇదే.
కమిటీలతో కాలయాపన
.
- ఎవరివాటా ఎంత?
- సింధు జల ఒప్పందం (1960) ప్రకారం సింధు వ్యవస్థలోని తూర్పు నదుల్లో (రావి, బియాస్, సట్లెజ్) లభించే మొత్తం నీటిని ఎలాంటి నియంత్రణా లేకుండా భారతదేశం వినియోగించుకోవచ్చు. రావి, బియాస్ నీటిని పంజాబ్, రాజస్థాన్, పటియాలా, తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్, జమ్మూకశ్మీర్ మధ్య పంపిణీ చేస్తూ 1955లో ఒప్పందం జరిగింది. దీనికి కొనసాగింపుగా 1981 డిసెంబరు 31న భారత ప్రధాని సమక్షంలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్ ముఖ్యమంత్రుల మధ్య మరో ఒప్పందం కుదిరింది.
- 1921-60 సంవత్సరాల మధ్య నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని రావి బియాస్ నీరు 896.4 శతకోటి ఘనపుటడుగులు (శ.కో.ఘ.- టీఎమ్‌సీలు)గా లెక్కగట్టారు. ఇందులో అప్పటికే ఉన్న వినియోగం, ప్రవాహంలో ఆవిరయ్యే నీటిని మినహాయిస్తే 748.6 శ.కో.ఘ.లు అందుబాటులో ఉన్నట్లు తేల్చారు. ఇందులో పంజాబ్‌కు 184 శ.కో.ఘ.లు, హరియాణాకు 152.5 శ.కో.ఘ.లు, రాజస్థాన్‌కు 375 శ.కో.ఘ.లు, దిల్లీ తాగునీటి సరఫరాకు 8.7 శ.కో.ఘ.లు, జమ్మూకశ్మీర్‌కు 28.339 శ.కో.ఘ.లుగా నిర్ణయించారు.
- ఏదైనా సంవత్సరం నీటిలభ్యత తక్కువగా ఉంటే ఆ మేరకు రాష్ట్రాల నీటి వాటా తగ్గుతుంది. అయితే జమ్మూకశ్మీర్ వాటా మాత్రం 1955లో జరిగిన ఒప్పందం ప్రకారం 28.339శ.కో.ఘ.లుగానే ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పూ ఉండదు. దిల్లీ తాగునీటి సరఫరాలోనూ మార్పు ఉండదు.
- ఈ ఒప్పందాన్ని అమలు చేసే బాధ్యతను ఒప్పందం ప్రకారం భాక్రా-బియాస్ యాజమాన్య బోర్డుకు అప్పగించారు. దీని ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నీటిని జమ్మూకశ్మీర్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీ రాష్ట్రాలు ప్రాజెక్టుల నిర్మాణం, అనుసంధాన పనులను చేపట్టాలని నిర్ణయించాయి.
- రావి నదిపై రంజిత్ సాగర్ డ్యాం, మధోపూర్ హెడ్‌వర్క్స్; బియాస్‌పై పాంగ్, పండో డ్యాములు, భాక్రానంగల్ ప్రాజెక్టు; సట్లెజ్‌పై హరికే బ్యారేజి, ఫిరోజ్‌పూర్ హెడ్‌వర్క్స్‌తోపాటు మధోపూర్ బియాస్ లింకు కాలువ, బియాస్-సట్లెజ్ లింకు కాలువలను అసుసంధానం ద్వారా చేపడితే పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకోవచ్చని భావించారు.
- తూర్పు నదుల్లో లభించే నీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి చేపట్టాల్సిన చర్యల సిఫార్సుకు 2003లో కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ ఓ కమిటీని నియమించింది. తరవాత అంతర్జాతీయ సరిహద్దు వరకు అంటే పాకిస్థాన్ వరకు ప్రవహించే నీటిని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి 2008 నవంబరులో మరో సంఘాన్ని నియమించారు. పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక తయారీ ఈ కమిటీ లక్ష్యం. రెండో రావి-బియాస్ అనుసంధానాన్ని అధ్యయనం తరవాత ఈ కమిటీయే ప్రతిపాదించింది. 75 శాతం నీటి లభ్యత కింద ధరంకోట్ వద్ద 115 శ.కో.ఘ.ల నీటిలభ్యత ఉంటుందని కమిటీ నిర్ధారించింది. బియాస్ నది హరికే బ్యారేజి ఎగువన సట్లెజ్ నదిలో కలుస్తోంది. సట్లెజ్‌నది హరికే బ్యారేజి దిగువన అంతర్జాతీయ సరిహద్దును(పాకిస్థాన్‌ను) దాటి మళ్ళీ భారత్‌లోకి ప్రవేశిస్తుంది. చివరకు సట్లెజ్ ఫిరోజ్‌పూర్ హెడ్‌వర్క్స్ దిగువన పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. వాస్తవానికి ఫిరోజ్‌పూర్ వద్ద వరదల సమయంలో, గేట్లకు లీకేజి ఉన్నప్పుడు తప్ప ఎలాంటి ప్రవాహం ఉండదు. సట్లెజ్, బియాస్ నీటిని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకొంటుంది. గేట్ల వద్ద ఎక్కువగా లీకవుతున్న నీరు తప్ప అదనంగా ఎలాంటి నీరూ పాకిస్థాన్‌లోకి వెళ్లడంలేదు. రావి నదిపై నిర్మించిన వాటిలో రంజిత్‌సాగర్ డ్యాం అన్నింటికన్నా పెద్దది. 2001లో ఈ డ్యాం నిర్మాణం పూర్తయ్యింది. దీనికింద 3.48 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగవుతుంది. 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తవుతోంది. ఈ డ్యాముకు 11 కి.మీ. దిగువన షాపూర్‌ఖండి డ్యాం నిర్మాణాన్ని 1999లో జాతీయ ప్రాజెక్టుగా చేపట్టారు. కానీ నిధుల సమస్య వల్ల 2003లో అది నిలిచిపోయింది. 2006లో పునఃప్రారంభమైనా నత్తనడకనే సాగింది.
.
- పడుతూ లేస్తూ పనులు
- జమ్మూకశ్మీర్ ప్రభుత్వం లేవనెత్తిన కొన్ని అభ్యంతరాలతో 2014లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాతే- నిర్మాణ పనులు ఆగిపోయాయి.
- ఉరి ఉగ్రదాడి సంఘటన అనంతరం ఈ డ్యాం నిర్మాణాన్ని కొనసాగించడంపై భాగస్వామ్య రాష్ట్రాలైన పంజాబ్, కశ్మీర్‌లతో కేంద్రం చర్చించింది. రావి నది నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు పనులు వేగం పుంజుకోలేదు. దీనికి ఎనిమిది కిలోమీటర్ల దిగువన మధోపూర్ హెడ్‌వర్స్స్ ఉంది. ఇక్కడ నీటి నిల్వ చాలా తక్కువ. గేట్లకు లీకేజీలతోపాటు పూడిక వల్ల సామర్థ్యం తగ్గిపోయింది.
- దీని నుంచి దిగువకు వెళ్లే నీరంతా పాకిస్థాన్‌కే చేరుతుంది. వర్షకాలంలో మధోపూర్ హెడ్‌వర్క్స్ దిగువన లభ్యమయ్యే నీటిని పాకిస్థాన్‌లోకి వెళ్లకుండా ఆపడానికి అవకాశాలు అంతగా లేవు.
- షాపూర్‌ఖండి డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారానే మనకు ఉన్న నీటి కేటాయింపును పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. కానీ ఈ ప్రాజెక్టు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది.
- ఉజ్ నది రావి నదిలో కలిసిన తరవాత మకోరపఠాన్ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల కింద ఈ నది పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తోంది. ఇక్కడి నుంచి సుమారు 35 శ.కో.ఘ.ల నీరు దిగువకు ప్రవహిస్తోంది. మనకు ఉన్న నీటిని వాడుకోవాలంటే ఉజ్ వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందే. ఇక్కడ డ్యాం కట్టకపోతే ఈ నీరు రావి నదిలో కలిసి పాకిస్థాన్‌లోకి వెళ్తుంది.
- అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఈ నీటిని భారత్ వాడుకోవడానికి హక్కు ఉంది. అందుకు అవసరమైన పనులు చేపట్టి పూర్తి చేయాలి.
.
.
No comments:
Post a Comment