జాతీయాదాయం - గణనలో సమస్యలు

       భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ. సంఘటిత రంగంకన్నా అసంఘటిత రంగంలోనే ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. ఆర్థికవ్యవస్థలో తగినంత సమాచారం, గణాంకాలు లభ్యమయ్యే జాతీయాదాయం లెక్కించడంలో అంత కష్టం ఎదురుకాదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక కార్యకలాపాల గురించి సరైన గణాంకాలు, వృత్తి ప్రత్యేకీకరణ ఉండటం వల్ల ఆయా దేశాల్లో జాతీయాదాయం గణించడంలో సమస్యలు ఎదురుకావడంలేదు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా రంగాల్లో ఎంత వ్యయం చేసేదీ గణాంకాలు లభ్యంకావడంలేదు. అందువల్ల జాతీయాదాయం గణించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. 
 
1. మనదేశంలో ఎక్కువ మంది ప్రజలకు వ్యవసాయం జీవనాధారం. గ్రామీణప్రాంత ప్రజలు పండించిన పంటలో ఎక్కువ శాతం సొంత వినియోగానికే ఉపయోగించుకుంటారు. మిగిలిన పంటలో కొంతభాగం వస్తుమార్పిడి విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనే విక్రయించుకుంటారు. ముఖ్యంగా ఆహార పంటల విషయంలో ఈ విధానం గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతోంది. అందువల్ల వ్యవసాయ రంగంలో పండిన మొత్తం పంట విలువ జాతీయాదాయాల్లో ప్రతిబింబించడం లేదు. 
 
2. జాతీయాదాయానికి సంబంధించిన ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లోని ఉత్పత్తుల విలువకు సంబంధించి సమాచారం అవసరం. కానీ ప్రాథమిక రంగంలో వాస్తవిక ఉత్పత్తిని అంచనా వేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. రైతుల్లో ఎక్కువమంది నిరక్షరాస్యులు కావడంవల్ల తమ ఉత్పత్తులకు సంబంధించి సరైన వాస్తవమైన సమాచారం అందించడంలో విఫలమవుతున్నారు. 
         మనదేశంలో చిన్నతరహా పరిశ్రమలు ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. జాతీయాదాయంలో ఎక్కువ భాగాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ పరిశ్రమలను నిర్వహించేవారు ఎక్కువగా నిరక్షరాస్యులే. అకౌంట్లు రూపొందించాల్సిన అవసరంగానీ, ప్రయోజనాలుగానీ వీరు గుర్తించరు. అకౌంట్ల నిర్వహణపై అవగాహన లేకపోవడంవల్ల సరైన సమాచారం లభ్యమవ్వడంలేదు. అందువల్ల జాతీయాదాయం వాస్తవ విలువకన్నా తగ్గుతుంది.
          గ్రామీణ ప్రాంతాల్లో సేవారంగంపై ఆధారపడినటువంటి ప్రజల నుంచి సరైన సమాచారం పొందడంలో గణాంకులు విఫలమవుతున్నారు.
 
3. కొన్ని వస్తుసేవలను ద్రవ్యరూపంలో లెక్కించము. మన దేశంలో ద్రవ్యరూపంలో లెక్కించగలిగిన వస్తుసేవలను మాత్రమే జాతీయాదాయ అంచనాల్లో తీసుకుంటున్నారు. వంటపని, ఇంటిపని, పిల్లల సంరక్షణ, తోటపని, పిల్లలకు పాఠాలు బోధించడం వంటి కొన్ని సేవలను ద్రవ్య రూపంలో వ్యక్తపరచలేము. ఈ విధంగా ద్రవ్యరూపంలో వ్యక్తపరచలేని సేవలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల జాతీయాదాయ విలువ తగ్గుతుంది.
 
4. జాతీయాదాయ గణనలో అంతిమ వస్తుసేవలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే ఒక వస్తువు మధ్యంతర వస్తువా లేదా అంతిమ వస్తూత్పత్తి అనేది విచక్షణ చూపడం కష్టతరమైన అంశం. అంతేగాక వస్తు ఉత్పత్తిలో అన్ని విధాలుగా సహకరించిన సహజవనరులను, సహజవనరులకు జరిగిన నష్టాన్నీ జాతీయాదాయం లెక్కల్లో పరిగణించరు.
 
5. దేశంలో వృత్తుల పరమైన వర్గీకరణ అసంపూర్తిగా వుంది. ఒకవ్యక్తి యొక్క ఆర్థిక కార్యకలాపాలు పెరిగినపుడు అతని ఆదాయాలూ అనేక రకాలుగా ఉంటాయి. వ్యవసాయదారులు, వ్యవసాయకూలీలు, వ్యవసాయ సంబంధిత పనులు లేని సమయాల్లో వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో నిమగమవుతారు. జీవనోపాధిని పొందుతారు. అయితే వారు ఏదో ఒక పనిలో వచ్చే ఆదాయాన్ని మాత్రమే వ్యక్తపరచడం వల్ల జాతీయాదాయ అంచనాల్లో కచ్ఛితత్వం లోపిస్తుంది.
         ప్రపంచీకరణ నేపథ్యంలో దేశంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. ప్రయివేటు రంగానికి ఎనలేని ప్రాధాన్యత పెరిగినందువల్ల ఆర్థిక స్తోమత కేంద్రీకరణకు అవకాశం ఏర్పడి ప్రభుత్వానికి వారి ఆదాయం గురించి సరైన సమాచారం లభించకపోయే అవకాశం ఏర్పడుతుంది. ఒకవ్యక్తి తనకు వివిధ రకాలుగా లభిస్తున్న ఆదాయాన్ని ప్రభుత్వానికి లెక్కలో చూపించనందువల్ల జాతీయాదాయం అల్ప అంచనాలకు గురయ్యే అవకాశం ఏర్పడుతుంది.
 
6. దేశంలో చట్టవ్యతిరేక ద్రవ్యం ఎక్కువగా ఉండటం వల్ల సమాంతర ఆర్థికవ్యవస్థ నడుస్తుంది. ప్రభుత్వానికి చూపించనటువంటి నల్లధనం జాతీయాదాయంలో సుమారు 30% వరకూ ఉంటుందని అంచనాలు వ్యక్తపరుస్తున్నాయి. ఈ నల్లధనాన్ని కూడబెట్టిన ధనికులు వేర్వేరు కార్యకలాపాల ద్వారా నల్లధనాన్ని వినియోగంలోకి తీసుకురావడం వల్ల ద్రవ్య సప్లయి పెరిగి ద్రవ్యోల్భణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో వివిధ ఉత్పత్తుల మార్కెట్‌ ధరలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ ధరల వద్ద లెక్కించిన జాతీయాదాయం అధిక అంచనాలకు గురవుతుంది.
 
7. ప్రభుత్వం అందించే సేవలు జాతీయదాయానికి ఎంతమేరకు దోహదపడతాయో గుర్తించడం కష్టం. శాంతిభద్రతలు, రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన సేవల విలువను జాతీయాదాయ లెక్కల్లో చేర్చాలా వద్దా అనే సమస్య ఏర్పడుతుంది.
 
8. జాతీయాదాయం లెక్కింపులో ముఖ్య సమస్య ఒక వస్తువు యొక్క విలువను ఒక్కసారి కంటే ఎక్కువ లెక్కించడం. వ్యవసాయ ఉత్పత్తుల విలువను లెక్కించేటప్పుడు పారిశ్రామిక రంగంలో ముడిసరుకులుగా వినియోగించే ప్రత్తి, జౌళివంటి ఉత్పత్తులను వ్యవసాయోత్పత్తుల విలువగా లెక్కింపులోకి తీసుకోవడం జరుగుతుంది. మరలా పారిశ్రామిక ఉత్పత్తుల విలువను లెక్కించేటప్పుడు ముడి సరుకుల రూపంలో వీటిని మరలా తిరిగి లెక్కించే అవకాశం ఏర్పడుతుంది. దీనినే డబుల్‌ కౌంటింగ్‌ అంటారు. ఈ సమస్యను నివారించడానికి జాతీయాదాయ లెక్కింపులో అంతిమ వస్తుసేవల విలువను మాత్రమే తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో వీటిని గుర్తించడంలో ఇబ్బంది ఎదురవ్వడం వల్ల ఒకే వస్తువును రెండుసార్లు లెక్కించడంవల్ల జాతీయాదాయం ఉన్నదానికన్నా ఎక్కువ కనిపించే అవకాశం ఉంది.
 
9. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నూతన వస్తూత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఆధార సంవత్సరంలో లేని వస్తువును తర్వాత కాలంలో నూతనంగా ఉత్పత్తి చేస్తే దాన్ని ఆధార సంవత్సర ధర ఆధారంగా అంచనా వేయలేరు.
 
10. జాతీయ మరియు ఆదాయ గణాంకాలు సేకరించే గణాంకాలకు సమర్థవంతమైన శిక్షణ లేకపోవడంవల్ల వారు సేకరించే గణాంకాల వల్ల జాతీయాదాయ అంచనాలు అల్ప, అధిక అంచనాలకు గురయ్యే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...