నాడీవ్యవస్థ

 

       జంతు సామ్రాజ్యంలో మొదటిసారిగా నాడీవ్యవస్థను కలిగిన జీవులు - సిలేంటరేటా/ నిడేరియన్లు. నిడేరియన్లలో నాడీవ్యవస్థ 'ప్రాథమికమైన వ్యాపిత నాడీ వల' రూపంలో ఉంటుంది. జంతువులన్నింటిలో మానవుల నాడీమండలం అతిక్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. శరీరంలోని అవయవాలన్నింటినీ సమన్వయపరిచే వ్యవస్థ - నాడీవ్యవస్థ.

నాడీవ్యవస్థ పరిసరాల్లోని సమాచారాన్ని 'గ్రాహకాలు' అనే ప్రత్యేక కణాల ద్వారా గ్రహిస్తుంది.
* ఈ గ్రాహకాలు సమాచారాన్ని తక్కువస్థాయి విద్యుత్ ప్రచోదనాలుగా మార్చి మెదడు/ వెన్నుపాముకు చేరవేస్తాయి.
* నాడీవ్యవస్థ శరీరానికి వెలుపల, లోపల జరిగే మార్పులకు ప్రతిచర్యలను చూపుతుంది.
* ఈ వ్యవస్థ 'నాడీ ప్రచోదనాల' ద్వారా సమన్వయాన్ని సాధిస్తుంది.

నాడీమండలం - భాగాలు

     నాడీ మండలం/ వ్యవస్థలో 3 భాగాలు ఉంటాయి. అవి: మెదడు, వెన్నుపాము, నాడులు.
మెదడు: ఇది సమాచారాన్ని గ్రహించి, విశ్లేషించి సమన్వయపరిచే ముఖ్యకేంద్రం. నాడీవ్యవస్థలో ప్రతిచర్యలను ఉత్పత్తి చేసే ముఖ్యభాగం.
వెన్నుపాము/ కశేరు నాడీదండం: వెన్నుపాము టెలిఫోన్ ఎక్స్ఛేంజ్/ రిలే కేంద్రంగా పనిచేసి వార్తలను మెదడు, శరీర అవయవాల మధ్య రవాణా చేస్తుంది. అసంకల్పిత ప్రతీకార చర్యల్లో మాత్రం వార్తలను విశ్లేషించి, ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తుంది.
నాడులు: వీటిని టెలిఫోన్ వైర్లతో పోల్చవచ్చు. నాడీవ్యవస్థలో సమాచారాన్ని విశ్లేషించి అర్థం చేసుకోలేని, ప్రతిచర్యలను ఉత్పత్తి చేయలేని నిర్మాణాలు - నాడులు.
* ఇవి సమాచారాన్ని శరీర అవయవాలు, మెదడు, వెన్నుపాముల మధ్య రవాణా చేయడంలో తోడ్పడతాయి.

నాడీమండలం నిర్మాణం - కణాలు 

నాడీమండల నిర్మాణంలో 2 రకాల కణాలు ఉంటాయి.
    1) నాడీ కణాలు/ న్యూరాన్స్       2) గ్లియల్ కణాలు
నాడీ కణాలు/ న్యూరాన్స్: ఇవి నాడీమండలంలో ముఖ్యమైన లేదా ప్రధానమైన కణాలు. ఇవి నాడీవ్యవస్థకు చెందిన 'నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు'. ఇవి వార్తలను గ్రహించి, విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తాయి. వీటికి 'విభజన శక్తి' లేదు (కానీ పిండదశలో మాత్రం సమవిభజనలు చూపుతాయి). అందుకే దెబ్బతిన్న, నశించిన న్యూరాన్‌ల స్థానంలో కొత్తవి ఏర్పడవు. న్యూరాన్ నిర్మాణంలో 3 భాగాలు ఉన్నాయి.
అవి:  1) కణదేహం      2) డెండ్రైట్స్     3) ఆక్సాన్
కణదేహం: దీన్ని పెరికార్య/ సైటాన్ అని కూడా అంటారు. సైటాన్ జీవపదార్థంలో ఉన్న పెద్ద రేణువులను నిస్సల్స్ కణికలు/ నిస్సల్స్ పదార్థం అంటారు. నిస్సల్స్ కణికలను కలిగి ఉండటం సైటాన్ ప్రత్యేక/ ముఖ్య లక్షణం.
* నిస్సల్స్ రేణువులు 'RNA, ప్రోటీన్‌లతో ఏర్పడిన రైబోసోమ్‌ల సమూహాలు'.
* నాడీకణంలో జరిగే అన్ని 'సంశ్లేషణ చర్యలు' కణదేహంలో జరుగుతాయి. కణదేహ జీవపదార్థంలో కేంద్రకం, మైటోకాండ్రియా, గాల్జి సంక్లిష్టం, లైసోజోమ్‌లు లాంటి కణాంగాలు ఉంటాయి.
డెండ్రైట్స్ లేదా కేశికలు: కణదేహం నుంచి ఏర్పడే 'పొట్టిగా ఉన్న, శాఖాయుతమైన చెట్టు రూపాన్ని కలిగిన జీవపదార్థ నిర్మాణాలే డెండ్రైట్స్'. కణదేహం నుంచి 1 నుంచి అనేక వేల డెండ్రైట్స్ ఏర్పడతాయి. ఇవి ఇతర నాడీకణాల నుంచి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందజేస్తాయి.
* డెండ్రైట్‌ల సంఖ్య ఆధారంగా నాడీకణాలు 3 రకాలు.
      1) ఏకధృవ న్యూరాన్‌లు - ఒకే డెండ్రైట్ ఉంటుంది
      2) ద్విధృవ న్యూరాన్‌లు - రెండు డెండ్రైట్స్ ఉంటాయి
      3) బహుధృవ న్యూరాన్‌లు - అనేక సంఖ్యలో డెండ్రైట్స్ ఉంటాయి
ఆక్సాన్: దీన్ని 'తంత్రికాక్షం/ నాడీ అక్షం/ నాడీ పోగు' అని కూడా అంటారు.
* ప్రతి నాడీకణంలో ఒకే ఆక్సాన్ ఉంటుంది.
* ఇది కణదేహం నుంచి ఏర్పడే చాలా పొడవైన, శాఖారహిత నిర్మాణం. ఆక్సాన్ 'నాడీ అంత్యాల'తో అంతమవుతుంది.
* నాడీకణాల్లోని ఆక్సాన్‌ను ఆవరించి కొవ్వులు లేదా లిపిడ్స్‌తో నిర్మితమైన 'మైలిన్ తొడుగు' ఉంటుంది.
* మైలిన్ తొడుగు ఉంటే 'మైలిన్ సహిత', లేకుంటే 'మైలిన్ రహిత' నాడీకణాలు అంటారు.
* మైలిన్ తొడుగును 'అచ్ఛాదనం' అని కూడా అంటారు.
* రణ్‌వీర్ కణుపులు: మైలిన్ తొడుగులో అక్కడక్కడ ఉండే ఖాళీ ప్రదేశాలు లేదా 'ఆక్సాన్‌లోని అనాచ్ఛాదిత ప్రదేశాలు'.
* మైలిన్ తొడుగు విద్యుత్ ప్రచోదనాలు బయటకు వెళ్లకుండా అతివేగంగా ప్రయాణించడానికి తోడ్పడుతుంది.
సినాప్స్/ సైనాప్స్: ఆక్సాన్‌లు, నిర్వాహక అంగాలతో సంబంధం కలిగి ఉండే భాగాన్ని 'సినాప్స్' అంటారు.
* సినాప్స్ వద్ద నాడీ అంత్యాల త్వచాలు, నిర్వాహక అంగాల కణాలు ఒకదానితో మరొకటి వేరుగా ఉంటాయి.
* ఈ ప్రదేశాల వద్ద నాడీ సమాచారం/ ప్రచోదనాలు 'న్యూరో ట్రాన్స్‌మీట‌ర్‌‌'లు అనే ప్రత్యేక రసాయనాలతో రవాణా అవుతాయి.
ఉదా: అసిటైల్ కొలీన్, డోపమైన్, సెరటోనిన్ మొదలైనవి.
నాడీ ప్రచోదనం/ క్రియాత్మక కరెంట్: నాడీకణం ఉద్దీపనలకు లోనైనప్పుడు కణదేహానికి, ఆక్సాన్‌కి మధ్య ఉత్పత్తయ్యే కరెంట్.
* క్రియాత్మక కరెంట్ సుమారుగా 55 మిల్లీ వోల్టులు లేదా 0.055 వోల్టులుగా ఉంటుంది.
నాడి: అనేక ఆక్సాన్‌లు తంతు కణజాలపు పొర/ తొడుగుతో కప్పబడి ఏర్పరిచే నిర్మాణాన్ని 'నాడి' అంటారు.

నాడులు - రకాలు 

క్రియాపరంగా నాడులు 3 రకాలు.
1. జ్ఞాననాడులు లేదా అభివాహి నాడులు: ఇవి శరీర భాగాల నుంచి జ్ఞాన సమాచారాన్ని మెదడు/ వెన్నుపాముకు చేరవేస్తాయి.
2. చాలక నాడులు లేదా అపవాహి నాడులు: ఇవి చాలక సమాచారాన్ని మెదడు లేదా వెన్నుపాము నుంచి శరీరభాగాలకు చేరవేస్తాయి.
* వీటివల్ల కండరాల్లో కదలికలు ఏర్పడతాయి. పోలియో వ్యాధి సోకినప్పుడు 'ఎంటిరో వైరస్' కారణంగా ఈ నాడీకణాలు నశిస్తాయి.
3. మిశ్రమ నాడులు: ఇవి 'జ్ఞాన, చాలక నాడీ తంతువుల' కలయికతో ఏర్పడతాయి. కశేరు నాడులన్నీ 'మిశ్రమ నాడులు' (31 జతలు).

మెదడు 

     మానవ శరీరంలో అత్యంత క్లిష్ట నిర్మాణం. మెదడుకు రక్షణనిచ్చే అస్థినిర్మిత పెట్టెను 'కపాలం/ క్రేనియం' అంటారు.
* మెనింజెస్/ మెదడు త్వచాలు: మెదడు, వెన్నుపామును కప్పుతూ ఉండి రక్షణ కల్పించే త్వచాలు మూడు. ఇవి: 1) వెలుపలి/ బయటి త్వచం - వరాసిక
        2) మధ్య త్వచం - లౌతికళ
        3) లోపలి త్వచం - మృద్వి
* లోపలి, మధ్య త్వచాల మధ్య 'మస్తిష్క మేరుద్రవం' ఉంటుంది. ఈ ద్రవం మెదడు, వెన్నుపాముకు రక్షణ కల్పించడమే కాక వాటిలోని కణాలకు పోషక పదార్థాలను అందించడానికి, వాటిలోని జీవక్రియ వ్యర్థాలు, విషపదార్థాలను తొలగించడంలో తోడ్పడుతుంది.
* మానవ మెదడు బరువు సుమారుగా 1350 గ్రాములు.
* మానవ శరీరం బరువులో మెదడు బరువు సుమారుగా 2%.
* శరీరం తీసుకునే మొత్తం ఆక్సిజన్‌లో మెదడు 20% వినియోగించుకుంటుంది.
* మానవ మెదడు నిర్మాణంలో 10 బిలియన్ల నాడీకణాలు పాల్గొంటాయి.
* మెదడులో ఉన్న ఖాళీ ప్రదేశాలను 'కోష్టకాలు/ కుహరాలు' అంటారు.
* '1990 నుంచి 2000' మధ్య కాలాన్ని మెదడు దశాబ్దంగా పేర్కొంటారు.
* మెదడు శక్తి కోసం పూర్తిగా 'గ్లూకోజ్' పైన ఆధారపడి ఉంటుంది.
* మెదడులో మూడు ముఖ్య భాగాలు ఉన్నాయి.
     1) ముందు మెదడు        2) మధ్య మెదడు       3) వెనుక మెదడు
ముందు మెదడు: ఘ్రాణ లంబికలు, మస్తిష్కం, ద్వారగోర్థం
ఘ్రాణ లంబికలు: ఘ్రాణ ఉపకళ నుంచి వాసనకు సంబంధించిన ప్రచోదనాలను గ్రహిస్తాయి.
మస్తిష్కం: మెదడులో అతిపెద్ద భాగం. దీన్ని 'సెరెబ్రం లేదా పెద్ద మెదడు' అని కూడా అంటారు. దీని బరువు సుమారుగా 995 gm. ఇది ఒక లోతైన నిలువు గాడి (ఆయత విదరం)తో 'కుడి, ఎడమ మస్తిష్కార్ధ గోళాలుగా' విభజితమవుతుంది.

No comments:

Post a Comment