పరిణామక్రమ వీరులకు రసాయనశాస్త్రంలో 2018 నోబెల్

డార్విన్‌ సూత్రాలతో కొత్త ఎంజైమ్‌ల అభివృద్ధి
అమెరికా శాస్త్రవేత్తలు ఫ్రాన్సిస్‌ ఆర్నాల్డ్‌, జార్జ్‌ స్మిత్‌, బ్రిటన్‌ పరిశోధకుడు గ్రెగరీ వింటర్‌లకు రసాయనశాస్త్రంలో పురస్కారం
              జీవ పరిణామక్రమ సూత్రాల ఆధారంగా సరికొత్త ఎంజైమ్‌లను అభివృద్ధిచేసిన అమెరికా పరిశోధకురాలు ఫ్రాన్సిస్‌ ఆర్నాల్డ్‌, పరిశోధకుడు జార్జ్‌ పీ స్మిత్‌, బ్రిటన్‌ శాస్త్రవేత్త గ్రెగరీ వింటర్‌లను రసాయన శాస్త్రంలో 2018 నోబెల్‌ వరించింది. ఈ ఎంజైమ్‌లతో జీవ ఇంధనాలు మొదలుకొని ఔషధాల వరకూ అన్నింటినీ తయారుచేసేందుకు వీలుపడుతోంది. ‘‘2018 రసాయన నోబెల్‌ విజేతలు డార్విన్‌ పరిణామక్రమ సూత్రాలపై పట్టుసాధించారు. మానవాళికి అద్భుత ప్రయోజనాలు చేకూర్చేందుకు దీన్ని వారు ఉపయోగించారు’’అని స్వీడిష్‌ రాయల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌  ప్రకటించింది. ముగ్గురు పరిశోధకులూ పరిణామక్రమానికి సంబంధించి ఒకే సూత్రాల (జన్యు మార్పులు, జన్యువుల ఎంపిక) సాయంతో భిన్న రంగాల్లో ఉపయోగపడే ప్రొటీన్లను అభివృద్ధిచేశారు.

 
 
పునఃసృష్టి
         ‘‘డార్విన్‌ సూత్రాలపై పరీక్షనాళికల్లో ఈ పరిశోధక త్రయం ప్రయోగాలు చేపట్టింది. పరిణామక్రమంపై మనకున్న అవగాహనను దీనికి జోడించి.. ఈ క్రమాన్ని పునఃసృష్టించింది’’అని నోబెల్‌ రసాయన విభాగం కమిటీ అధిపతి క్లాయిస్‌ గుస్టాఫ్సన్‌ తెలిపారు. ‘‘పరిణామక్రమాన్ని కొన్ని వేల రెట్ల వేగంతో వారు పరుగులు పెట్టించారు. కొత్త ప్రొటీన్ల ఉత్పత్తి దిశగా దాన్ని నడిపించారు’’అని ఆయన వివరించారు. కాలిఫోర్నియా సాంకేతిక విద్యా సంస్థలో 62ఏళ్ల ఆర్నాల్డ్‌ రసాయన ఇంజినీరింగ్‌ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. డీఎన్‌ఏ సవరణలకు ఆమె అనుసరించిన విధానంతో కొన్ని విషపూరిత శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలు దొరికాయి. కావాల్సిన ధర్మాలతో కొత్త ప్రొటీన్లను ఉత్పత్తి చేసేందుకు ఆమె విధానం ఉపయోగపడింది. చెరకు పిప్పి లాంటి పునర్వినియోగ ఇంధన వనరులతో జీవ ఇంధనాల తయారీ, పర్యావరణహిత రసాయనాల ఉత్పత్తికీ ఇది బాటలు పరిచింది. అత్యల్ప ఉష్ణోగ్రతల్లోనూ గిన్నెలు తోముకునే, వస్త్రాలు ఉతుక్కునే సబ్బులు సమర్థంగా పనిచేసేందుకూ ఈ విధానం సాయపడుతోంది. రసాయన శాస్త్రంలో నోబెల్‌ దక్కించుకున్న ఐదో మహిళగా ఆర్నాల్డ్‌ చరిత్ర సృష్టించారు. పురస్కారం కింద అందే రూ.7.40 కోట్లలో (1.01 మిలియన్ల డాలర్లు) సగం ఆమెకు, మిగతా సగం స్మిత్‌, వింటర్‌లకు పంచుతారు.

కొత్త యాంటీబాడీలు
         మిస్సౌరీ వర్సిటీలో స్మిత్‌, కేంబ్రిడ్జ్‌ వర్సిటీలో వింటర్‌ పరిశోధకులుగా కొనసాగుతున్నారు. వీరు ‘‘ఫేజ్‌ డిస్‌ప్లే’’గా పిలిచే సరికొత్త విధానాన్ని అభివృద్ధిచేశారు. దీనిలో బ్యాక్టీరియాకు సోకే వైరస్‌లను కొత్త ప్రొటీన్ల ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు. దీర్ఘకాలంపాటు వేధించే కీళ్లవాతం, సొరియాసిస్‌ , పేగువాపు లాంటి రుగ్మతలకు కొత్త ఔషధాల తయారీకి వీరి పరిశోధన తోడ్పడుతోంది. శరీరంలోని విషపూరిత పదార్థాలను నిర్వీర్యం చేయడం, వ్యాధి నిరోధక కణాల అసాధారణ స్పందనలను నియంత్రించడం, శరీరం మొత్తం వ్యాపించకుండా క్యాన్సర్‌ కణాలను నియంత్రించడం లాంటి చర్యలకు ఉపయోగపడే యాంటీబాడీల ఉత్పత్తికీ బాటలు పరుస్తోంది. ‘‘స్మిత్‌, వింటర్‌ల పరిశోధనలు తక్కువ దుష్ప్రభావాలతో మెరుగ్గాపనిచేసే యాంటీబయోటిక్స్‌ అభివృద్ధికి బాటలుపరిచాయి’’అని అకాడమీ పేర్కొంది.

శక్తిమంతమైన విధానమిదీ: ఆర్నాల్డ్‌
           ‘‘అత్యంత అద్భుతమైన, క్లిష్టమైన, భిన్నంగా పనిచేసే పదార్థాలు, జీవులకు పరిణామక్రమం జన్మనిచ్చింది. దీన్ని ఉపయోగించి ఇప్పటివరకూ ఏ మనిషికీ తెలియని కొత్త ప్రొటీన్లు, పదార్థాలను సృష్టించొచ్చు. పరిణామక్రమం అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఇంజినీరింగ్‌ విధానం. మనల్ని వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాల ఉత్పత్తికి నేలలోని చమురు తెగ తోడేయకుండా మొక్కల్లో దాగున్న సౌరశక్తిని ఉపయోగించుకునేందుకూ ఇది సాయపడుతుంది’’అని ఆర్నాల్డ్‌ తెలిపారు.

 

No comments:

Post a Comment