పర్యావరణ కాలుష్యం - ఘన వ్యర్థాల నిర్వహణ

FOR PDF CLICK HERE
నాగరికత ప్రారంభమైన తొలినాళ్లలో మానవులు తమ ఆహారం కోసం వధించిన జంతువుల ఎముకలు, ఇతర భాగాలు, గృహ నిర్మాణం కోసం వాడిన కలప, ఇతర వస్తువుల వ్యర్థాలను సృష్టించారు. నాగరికత పెరిగిన కొద్దీ వ్యర్థాలు పెరిగిపోయి ప్రకృతికే సవాలుగా మారాయి. పారిశ్రామికీకరణ మానవ జీవితంపై విపరీత ప్రభావం చూపింది. దీంతో మార్కెట్‌లో ప్రజలకు అనేక రకాల వస్తువులు, సేవలు అందుబాటులోకి వచ్చాయి. అదే స్థాయిలో కాలుష్య కారక వ్యర్థాలు పెరిగాయి. ఈ కాలుష్య కార కాలతో నీరు, గాలి, నేల కలుషితం అవడంతో పాటు భూతాపం(గ్లోబల్ వార్మింగ్) కూడా పెరిగిపోయింది.
దేశంలో విస్తృతంగా జరుగుతున్న పట్టణీకరణ.. వ్యర్థాల కాలుష్యాన్ని ప్రభావితం చేస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశంలో 1947లో ఘన వ్యర్థాల ఉత్పత్తి 6 మిలియన్ టన్నులు కాగా, 2001 నాటికి పట్టణ ప్రాంతాల్లో సుమారు 91 మిలియన్ టన్నులకు చేరింది. వ్యర్థాల వృద్ధికి జనాభా పెరుగుదల మరో ప్రధాన కారణం. వ్యర్థాలతో పాటు కర్బన ఉద్గారాలు కూడా పెరిగాయి. మన దేశంలో మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణకు సంబంధించి సమర్థ యాజమాన్యం లేకపోవడం, వ్యర్థాల సేకరణ, శుద్ధి మెళకువలు తెలియకపోవడం కూడా మరో కారణం. వ్యర్థాల యాజమాన్యాన్ని ప్రభావితం చేసే మరో అంశం పౌరచైతన్యం లేకపోవడం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 51(ఎ) (ప్రాథమిక బాధ్యతలు) ప్రకారం పౌరులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

వ్యర్థాల యాజమాన్య అంశాలు
1.   వ్యర్థాల సేకరణ
2.  వ్యర్థాలను గుర్తించడం, పునరుత్పాదన
3.  రవాణా
4.  వేరు చేయడం, పరిష్కరించడం
పై నాలుగింటిలో వ్యర్థాలను వేరుచేయడమే అత్యంత ముఖ్యమైంది. వ్యర్థాల నిర్మూలనను ప్రణాళిక ప్రకారం చేయడంలో కీలకమైన అంశాలు..
1.   కాలుష్యం, భూతాపం పరిణామాలను తగ్గించడం
2.  నగరాలు, పట్టణాల్లో జనావాసాలను శుభ్రంగా, పచ్చగా ఉంచడం
3.  తిరిగి ఉపయోగించే వస్తువుల రీ సైక్లింగ్ వనరులను గుర్తించడం
4.  వ్యర్థాలను వేరుచేసి అవసరమైన ఇంధన వనరులుగా మార్చడం
వ్యర్థాల యాజమాన్యం ప్రతి ప్రాంతానికి (పట్టణాలు, గ్రామాలు, పారిశ్రామిక ప్రాంతాలు) వేర్వేరుగా ఉంటుంది. ఆయా ప్రాంతాలకు అనుగుణమైన యాజమాన్య పద్ధతుల ద్వారా సుస్థిర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి వ్యర్థాలను వేరు చేయడమే కీలకాంశం. ప్రమాదకరం కాని, సంప్రదాయ వ్యర్థాల నిర్వహణ బాధ్యత స్థానిక సంస్థలదే. ప్రమాదకర, పారిశ్రామిక వ్యర్థాల బాధ్యతను మాత్రం వాటి కారకులే చేపట్టాలి.

భారతదేశంలో ఘన వ్యర్థాలు
మున్సిపల్ ఘన వ్యర్థం: మున్సిపల్ ఘన వ్యర్థాలంటే చెడిపోయిన ఆహారం, కూరగాయ వ్యర్థాలు (వండినవి), మట్టిలో కలిసిపోని లోహాలు (అల్యూమినియం, స్టీలు తదితరాలు), గ్లాసులు (రంగులవి, రంగు లేనివి), కాగితం (న్యూస్‌పేపర్లు, అట్టపెట్టెలు) సహజమైన పాలిమర్లు (తోలు, గడ్డి, ఆకులు), సింథటిక్ పాలిమర్లు (రబ్బరు, పాలిథిన్ కవర్లు)

ఇంటి ఘన వ్యర్థాలు: వంట, రిపేర్లకు సంబంధించినవి, ఇంటి అలంకరణకు వాడిన వస్తువులు, పగిలిన గ్లాసులు, ప్లాస్టిక్ వస్తువులు, పాత దుస్తులు, పాత పుస్తకాలు, న్యూస్ పేపర్లు, పాత కుర్చీలు తదితరాలు.

వాణిజ్య వ్యర్థాలు: కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్లు, మార్కెట్లు (మాంసం, చేపలు, కూరగాయలు) నుంచి వచ్చేవి.

సంస్థల వ్యర్థాలు: స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, పరిశోధనా సంస్థల నుంచి వచ్చే కాగితం, అట్టపెట్టెలు.

మున్సిపల్ వ్యర్థాలు: మున్సిపల్ సేవల్లో భాగంగా వీధుల్లోంచి వచ్చే చెత్తా చెదారం, జంతు కళేబరాలు, మార్కెట్ నుంచి వచ్చే వ్యర్థాలు, తుప్పు పట్టిన వాహనాలు, వాటి విడిభాగాలు.

బల్క్ వ్యర్థాలు: గృహోపకరణాలు, పాత కుక్కర్లు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్లు, ఫర్నిచర్, వాహన విడిభాగాలు, వైర్లు మొదలైనవి. సాధారణంగా వీటిలో చాలా వరకు పాత సామాన్ల కింద అమ్మేస్తారు. కానీ కొంత వరకు శానిటరీ భాగాలు వస్తాయి.

నిర్మాణాలు, కూల్చివేతల వ్యర్థాలు: నిర్మాణాలకు వాడే సిమెంట్, ఇటుకలు, ఇనుము, రాళ్లు, కర్రలు, ప్లాస్టిక్ పైపుల లాంటివి. కూల్చివేత వ్యర్థాల్లో 70 శాతం వరకు రీసైక్లింగ్ టెక్నిక్‌లు భారతదేశంలో లేవు.

పారిశ్రామిక వ్యర్థాలు: పారిశ్రామిక కార్యకలాపాలు, తయారీ రంగం నుంచి వచ్చే ఘన వ్యర్థాలు అంతగా ప్రమాదకరమైనవి కావు. వీటిని మున్సిపల్ వ్యర్థాలుగా పరిగణించకూడదు. అయితే చిన్న తరహా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు మున్సిపల్ వ్యర్థాలు.

మెడికల్ వ్యర్థాలు: వైద్య పరిశోధన కేంద్రాలు, లేబొరేటరీలు, పశువైద్య శాలలు, రక్త నిధి కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నుంచి వ్యర్థాలు వస్తుంటా యి. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్మూలించకపోతే ప్రజారోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. నాలుగు కిలోల మెడికల్ వ్యర్థాల్లో కిలో వరకు హానికారకాలుంటాయని అంచనా.

ప్రమాదకర వ్యర్థాలు: పర్యావరణానికి, ప్రజారోగ్యానికి అత్యంత హానికరమైన ఈ వ్యర్థాలు ద్రవ, ఘన, వాయు రూపంలో ఉంటాయి. పారిశుద్ధ్యానికి వాడే ద్రవాలు, క్రిమిసంహారకాలు, తయారీ సమయంలో వచ్చే ఉప ఉత్పన్నాలను పడేయడం వల్ల అవి ప్రమాదకరంగా మారతాయి.

ఈ- వ్యర్థాలు: కాలం చెల్లిన ఎలక్ట్రానిక్ వస్తువులు, సమాచార పరికరాలు ఈ కోవకు చెందుతాయి. ఉదాహరణకు పాడైన కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టీవీలు, డీవీడీ ప్లేయర్లు, మొబైల్ ఫోన్లు తదితరాలు. మున్సిపల్ ఘన వ్యర్థాల్లో వీటి పరిమాణం ఎక్కువవుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ-వ్యర్థాల పరిమాణం 2010 నాటికి 1 శాతం నుంచి 2 శాతానికి చేరుకుంది. ఈ- వ్యర్థాలను అరికట్టడానికి రీసైక్లింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే ఇవి ప్రమాదకర స్థాయికి చేరుకోవచ్చు.

ఘన వ్యర్థాల ప్రభావాలు
ఘన వ్యర్థాల నిర్వహణ సరిగా లేకుంటే పర్యావరణం, ప్రజారోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. డంపింగ్ యార్డుల్లో పడవేసే వ్యర్థాల నుంచి హానికారక మీథేన్ వాయువు వెలువడి గ్రీన్ హౌజ్ వాయువుగా మారుతుంది. ఘన పదార్థాల నుంచి వచ్చే లీచింగ్.. మట్టిలో కలిసిపోయి భూగర్భ జలాలను కలుషితం చేస్తుంది. పాదరసం, సీసం లాంటి భారీ లోహాలు ఆయా ప్రాంతాల్లో పండే వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా మనిషి శరీరంలోకి చేరి క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయి.

వ్యర్థాల రీ సైక్లింగ్, పునర్వినియోగం
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యర్థాలు రాకుండా జీవించడం అసాధ్యం. అయితే రీసైక్లింగ్ పద్ధతులతో వ్యర్థాలను కనిష్ట స్థాయికి తీసుకురావచ్చు. వ్యర్థాలను అరికట్టే వ్యూహాల్లో కీలకమైనవి పునర్వినియోగం, రీసైక్లింగ్. వ్యర్థాల రీసైక్లింగ్ ఆర్థికంగా లాభదాయకమే కాకుండా ఇందులో నిర్వహణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. లోహాల వాడకం కూడా తగ్గుతుంది. దీంతో కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధనం ఆదా అవుతుంది. ఫలితంగా ప్రపంచ వాతావరణ మార్పులను తగ్గించి జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. ఆయా వస్తువులను తిరిగి వాడుకోవడం వల్ల వ్యర్థాల సేకరణే తగ్గిపోతుంది. రీ సైక్లింగ్ ఖర్చు అదా అయి ల్యాండ్ ఫిల్లింగ్ వ్యయాలు తగ్గుతాయి.

మున్సిపల్ వ్యర్థాల నిర్వహణలో కొత్త టెక్నాలజీ
వ్యర్థాల నుంచి ఇంధనం:
మున్సిపల్ వ్యర్థాల నుంచి విద్యుత్, గ్యాస్‌లను పొందొచ్చు. సంప్రదాయ ఇంధనమైన బొగ్గు వాడకానికి ఇది ప్రత్యామ్నాయం. వీటివల్ల కాలుష్యం, భూతాపం కూడా తగ్గుతాయి. చాలా తేలికైన టెక్నాలజీతో వ్యర్థాల నుంచి ఇంధనం పొందొచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. వ్యర్థాల నుంచి శుద్ధమైన ఇంధనం పొందడం వల్ల ప్రమాదకర వాయువులను నిర్మూలించొచ్చు. వ్యర్థాల నుంచి ఇంధనం పొందడం ఆధారపడదగిన అంశంగా అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ గుర్తించింది.

వ్యర్థాల నుంచి ఇంధనం పొందే టెక్నాలజీతో పర్యావరణంపై ప్రభావాలు
వ్యర్థాల నుంచి ఇంధనం తీసే ప్లాంట్లను పర్యావరణం, మానవాళి రక్షణ కోసం రూపొందించిన చట్టాలకు లోబడే ఏర్పాటు చేసినా ఇవి పర్యావరణంపై విస్తృత ప్రభావం చూపగలవు.

గాలిలో కాలుష్య కారకాల ప్రభావం: మున్సిపల్ ఘన వ్యర్థాలను కాల్చడంతో నైట్రోజన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్‌తో పాటు పాదరసం లాంటి కాలుష్య కారకాలు బయటకు వస్తాయి. అయితే ఈ పవర్ ప్లాంట్లు హానికారక గ్రీన్‌హౌజ్ వాయువులను చాలా వరకు తగ్గిస్తాయి. ఆయా పవర్ ప్లాంట్లలో కాల్చే వ్యర్థ రకాలను బట్టి వెలువడే కాలుష్య కారకాల ప్రభావం ఉంటుంది. వైర్లు, బ్యాటరీలలాంటివి కాల్చడం వల్ల ఎక్కువ ప్రమాదకర వాయువులు వెలువడతాయి.

జల కాలుష్య ప్రభావం: సంప్రదాయ పవర్ ప్లాంట్లకు అవసరమైనంత నీరు మున్సిపల్ వ్యర్థాల పవర్ ప్లాంట్లకు అవసరముండదు. తక్కువ నీటి వినియోగంతో జనజీవనంపై ఎక్కువ ప్రభావం ఉండదు.

ఘన వ్యర్థాల ప్రభావం: మున్సిపల్ ఘన వ్యర్థాల నుంచి ఇంధనం సృష్టించడం వల్ల కూడా ఫ్లై యాష్ వంటి వ్యర్థాలు వస్తాయి. అయితే ఇవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఫ్లై యాష్‌లో ఉండే హానికారకాలను పరిశీలించి అవి భూగర్భంలోకి చేరకుండా నిరోధించి కాలుష్యాన్ని తగ్గించొచ్చు.

No comments:

Post a Comment